CINEMATelugu Cinema

గెలుపోటములను సమంగా స్వీకరించే గొప్ప మనసున్న హీరో.. సూపర్ స్టార్ కృష్ణ..

కోటలోని చిన్నదాన వేటకు వచ్చాలే” అంటూ కత్తి తిప్పితే ఎన్టీఆర్ మాత్రమే తిప్పాలి. “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్” గ్లాసు పట్టుకుంటే అక్కినేనే పట్టుకోవాలి. చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు అనదగిన వారు వాళ్ళు. కానీ కాలం అలా ఎల్లకాలం ఉండదే. గన్ లు వచ్చాయి, రివాల్వర్ లు వచ్చాయి. వాటిని తెరమీద ఢాం అని పేల్చే కత్తిలాంటి కుర్రాడు హీరోగా కావాలి. ఇప్పుడు సాహాసం చేయగలిగిన వాడు కావాలి. తెనాలి సమీపాన బుర్రిపాలెం నుంచి అలాంటి సాహాసం ఒకటి ఎర్రగా, బుర్రగా, అందంగా, అణకువగా మద్రాసు చేరింది. తెలుగు తెరకు కృష్ణ రూపంలో మూడో కన్ను దొరికింది. అసలు కృష్ణ సినీ పుట్టుకే ఒక సాహాసం అని చెప్పాలి.

పెద్ద హీరోలతో సినిమాలు చేస్తేనే డబ్బులొస్తాయని, పెద్ద హీరోలతో సినిమాలు చేస్తేనే అవి విజయవంతం అవుతాయని అనుకునే ఆ రోజుల్లో ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని పూనుకోవడం ఒక సాహసం. అందులోనూ దానిని రంగులలో తీయాలనుకోవడం మరో సాహాసం, ఇంకా అందులో కృష్ణను ఒక హీరోగా తీసుకోవాలనుకోవడం ఇంకా పెద్ద సాహాసం. సినిమా పెద్దలు కళ్ళన్నీ వీరిపైనే. వారంతా అనుమానంగా చూశారు. కానీ రాబోయే కాలంలో చాలా సాహసవంతమైన హీరో ఒకరు, సాహసవంతమైన ప్రయత్నంలోంచి పుట్టబోతున్నాడని వారికి ఏం తెలుసు?

“తేనెమనసులు” సినిమా విడుదలైంది. అద్భుతమైన విజయం సాధించింది. జనం చప్పట్లు కొట్టారు. కృష్ణకు కాదు. ఆంధ్ర దేవానందులా ఉన్న రామ్మోహన్ కు. అందులో నటించడం రామ్మోహన్ దే భవిష్యత్తు అని అంతా అనుకున్నారు. కానీ ఆ సన్నివేశం చిత్రీకరణను ఆసక్తిగా తిలకిస్తున్న డూండీ అనే నిర్మాత కళ్ళు మాత్రం సినిమాలో వేగంగా స్కూటర్ నడుపుతూ మరో వాహనంలోకి ధైర్యంగా దూకిన కృష్ణ సాహసాన్ని గమనించారు. వెండితెరపై గన్ ను పేల్చే శక్తి అతనికే ఉందని కనిపెట్టారు. గన్ పేలుస్తావా అని కృష్ణ ను అడిగితే పేల్చేద్దాం అని అన్నారు కృష్ణ. అలా “గూడాచారి 116” లో గన్ పేల్చేశాడు. వెండితెరపై గన్ పేల్చే శివరామకృష్ణ తెలుగు వాళ్లకు దొరికాడు. ఆంధ్రులకు జేమ్స్ బాండ్ కృష్ణ రూపంలో దొరికాడు.

“సినిమాలో ఏ పాత్ర తనకు ఇచ్చినా, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను” అనే మాటలు కృష్ణ నోటివెంట వినిపించవు. అది కృష్ణ ప్రత్యేకత. తనకిచ్చిన ప్రతీ పాత్రను తనదైన రీతిలో అవలీలగా నటించేవారు కృష్ణ. అందుకే అన్ని రకాల పాత్రలు ఆయన చేయగలిగారు. దేవదాసు పాత్ర చేసినప్పుడు గానీ, ఏసుక్రీస్తు పాత్ర ధరించినప్పుడు గానీ, అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించినప్పుడు కానీ ఆయన బెదరలేదు. వెన్ను చూపించలేదు. నిజ జీవితంలో, నటజీవితంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న నటులు కృష్ణ.

కొత్త రకం మాస్ చిత్రాలకు “మోసగాళ్లకు మోసగాడు” తో శ్రీకారం చుట్టారాయన. ఎక్కడో ఆంగ్ల సినిమాలలో మాత్రమే కనిపించే “కౌబాయ్” ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆయనే. అలాగే మామూలు కుటుంబ కథా చిత్రాల స్థాయి ఎంతో ఎత్తుగా ఉండేలా “పండంటి కాపురం” చిత్ర నిర్మాణం జరగడం, కృష్ణ ఆలోచన ఫలితమే సినిమా కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. సామాజిక నేరపరిశోధక సినిమాను కుటుంబ సినిమా అనే భావన “దేవుడు చేసిన మనుషులు” చిత్రంతో కలిగించారు. ఈ సినిమాతో నటుడుగా, నిర్మాతగా కృష్ణ స్థాయి ఎంతో పెరిగింది.

వెండితెరకు సినిమా స్కోప్ ను పరిచయం చేసిన కృష్ణ…

తెలుగులో మొట్టమొదటి సాంఘిక రంగుల చిత్రం “తేనెమనసులు”. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చిన తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా గూఢచారి 116, తెలుగులో వచ్చిన క్రైం థ్రిల్లర్ల జాబితాలో మొదటి క్రైమ్ సినిమా (రంగుల సినిమా) “అవేకళ్ళు”, మొట్టమొదటి కౌబాయ్ సినిమా “మోసగాళ్లకు మోసగాడు”, మొట్టమొదటి సినిమాస్కోప్ చారిత్రాత్మక సినిమా “అల్లూరి సీతారామరాజు”, మొట్టమొదటి సినిమా స్కోప్ సాంఘిక చిత్రం “దేవదాసు”, మొట్టమొదటి సినిమా స్కోప్ పౌరాణిక చిత్రం “కురుక్షేత్రం”, మొట్టమొదటి సినిమా స్కోప్ “జేమ్స్ బాండ్” చిత్రం “ఏజెంట్ గోపి”, మొట్టమొదటి కౌబోయ్ సినిమా స్కోప్ చిత్రం “దొంగల దోపిడీ”, మొట్టమొదటి 70 యం.యం. చిత్రం “సింహాసనం” ఇలా తెలుగు చలనచిత్ర చరిత్రలో అన్ని మొట్టమొదటివి సూపర్ స్టార్ కృష్ణయే కావడం విశేషం.

1974లో అల్లూరి సీతారామరాజు విడుదలకు ముందు ఎంత ధైర్యవంతుడైన హీరో అయినా, ధైర్యవంతుడైన నిర్మాత అయినా ఇంత సాహసం చేశారంటే మెచ్చుకోకుండా ఉండలేము. 35 యం.యం చిత్రాలకు ఎన్నో సంవత్సరాలుగా అలవాటు పడిన ప్రేక్షకులు ఒక్కసారిగా సినిమా స్కోప్ సాంకేతికతకు అలవాటు పడకపోతే సినిమా ఎంత బాగున్నా కూడా కృష్ణ చాలా ప్రమాదంలో పడిపోతారు. ఒక విధంగా ఇది కృష్ణ సినీ ప్రస్థానానికి ప్రమాదం అయ్యే పరిస్థితి వచ్చింది అని చాలా మంది బాహాటంగానే వ్యాఖ్యనే చేశారు. కానీ కృష్ణ ధైర్యంగా సినిమాస్కోప్ సాంకేతికతను ప్రేక్షకులకు పరిచయం చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. 1974 లో అల్లూరి సీతారామరాజు, దేవదాసు చిత్రాలు మాత్రమే సినిమాస్కోప్ చిత్రాలు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ సినిమాస్కోప్ చిత్రాలే. అలా సినిమాస్కోప్ కు శ్రీకారం చుట్టిన ఘనత ఘట్టమనేని కృష్ణ కే దక్కిందని చెప్పాలి.

గోల్డెన్ జూబ్లీ “పండంటి కాపురం”…

కథానాయకుడిగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు, ఎక్కువ విజయాలు సాధించిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణదే. 1972 వ సంవత్సరంలో కథానాయకుడిగా ఏకంగా 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. ఆ 18 సినిమాల్లో 365 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి, అప్పటికి ఆల్ టైం రికార్డ్ సృష్టించిన కుటుంబ కథా చిత్రం “పండంటి కాపురం”. అలాగే 175 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడిన చిత్రం “ఇల్లు ఇల్లాలు” కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు అనేక కేంద్రాలలో మహిళ ప్రేక్షకులకోసం ప్రత్యేక ఆటలు ప్రదర్శించారు. అంతటి ప్రజాదరణ పొందిన సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ కథా చిత్రంలో కూడా అంతటి అసాధారణ విజయాన్ని సాధించడం విశేషం.

అబ్బాయిగారు అమ్మాయి గారు నిరాశపరిచినా కూడా, “మొనగాడొస్తున్నాడు జాగ్రత్త”, “రాజమహల్”, “మా ఊరి మొనగాళ్లు”, “హంతకులు దేవాంతకులు”, “కత్తుల రత్తయ్య” “భలే మోసగాడు”, “నిజం నిరూపిస్తా” వంటి యాక్షన్ హిట్స్ ఒకవైపు, “ఇన్స్పెక్టర్ భార్య”, “అంతా మనమంచికే”, “కోడలు పిల్ల”, “మేనకోడలు”, “మా ఇంటి వెలుగు”, “మరుపురాని తల్లి” వంటి కుటుంబ చిత్రాల విజయాలు మరోవైపు. అంతేకాకుండా “ప్రజానాయకుడు” వంటి విప్లవ చిత్ర విజయం, “గూడుపుఠాణి” వంటి అజరామర సంగీతం ప్రాధాన్య విజయాలు రావడం సూపర్ స్టార్ కృష్ణ ను విజయపథం వైపు నడిపించింది. ఎక్కువ సినిమాలు చేయడమే కాకుండా, నిర్మాతలు పంపిణీదారులు, ప్రేక్షకులు, అభిమానులు కూడా ఈ తరహా చిత్రాలతో సంతోషంగా ఉండటం అరుదైన విషయం. అది కేవలం కృష్ణకే సాధ్యమైంది.

11 విజయాలను మింగిన అల్లూరి సీతారామరాజు సినిమా…

కృష్ణ 1973 లో 15 చిత్రాలలో నటించగా “దేవుడు చేసిన మనుషులు”, “నేరము శిక్ష”, “పుట్టినిల్లు మెట్టినిల్లు”, “మాయదారి మల్లిగాడు”, “గంగ-మంగ”, “మీనా” వంటి అత్యద్భుతమైన విజయాలతో పాటు “మల్లమ్మ కథ”, “నిండు కుటుంబం”, “తల్లి కొడుకులు”, “శ్రీవారు మావారు”  “స్నేహబంధం”, “పసి హృదయాలు” వంటి విజయాలతో కృష్ణ తన సత్తా చాటారు. నటశేఖర కృష్ణ ఆ సంవత్సరం చేసిన 15 సినిమాలలో 12 సినిమాలు విజయవంతం అవ్వగా కేవలం “వింత కథ”, “మమత”, “మంచి వాళ్లకు మంచి వాళ్ళు” మాత్రమే అనుకున్న స్తాయి విజయాలని అందుకోలేకపోయాయి. 1974లో “అల్లూరి సీతారామరాజు” గోల్డెన్ జూబ్లీ హిట్ గా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని సాధించి స్వర్ణోత్సవం జరుపుకుంది. అయితే ఆ చిత్రం తరువాత వచ్చిన కృష్ణ చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను   అందుకోలేకపోయాయి. “అల్లూరి సీతారామరాజు” నుండి “పాడిపంటలు” వరకు మధ్యలో సుమారు 17 చిత్రాలు విడుదలవ్వగా “మనుషులు మట్టి బొమ్మలు”, “రాధమ్మ పెళ్లి”, “కొత్త కాపురం”, “చీకటి వెలుగులు”, “దీర్ఘసుమంగళి”, “ఇంటింటి కథ” చిత్రాలు మాత్రమే నిలిచాయి. మిగిలిన 11 చిత్రాలు విజయాలు సాధించకపోవడంతో ఇక కృష్ణ సినీ ప్రస్థానం ముగిసిందని అంతా అనుకున్నారు.

ఓకే సంవత్సరంలో అయిదు విజయాలు…

కానీ కృష్ణా 01 అక్టోబరు 1975 నాడు “పాడిపంటలు” ప్రారంభించి 14 జనవరి 1976 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంటానని ప్రకటించారు. చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు అనే పేరున్న నటశేఖర కృష్ణ చెప్పినట్టుగానే “పాడిపంటలు” సినిమాతో ఘనవిజయం సాధించి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తన సినిమా ప్రస్థానంలో 365 చిత్రాలు పూర్తి చేశారు. 1983లో “ముందడుగు”, “కిరాయి కోటిగాడు”, “రామరాజ్యంలో భీమరాజు”, “అడవి సింహాలు”, “శక్తి”, “ప్రజారాజ్యం”, “పోరాటం”, “అమాయకుడు కాదు అసాధ్యుడు”,  ఇలా ఒకే సంవత్సరంలో 8 విజయవంతమైన చిత్రాలు ఇచ్చిన హీరోగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 1985 లో “అగ్నిపర్వతం”, “వజ్రాయుధం”, “పల్నాటి సింహం” వంటి అత్యద్భుతమైన విజయవంతం సినిమాలు, “పచ్చని సంసారం”, “సూర్యచంద్ర” వంటి విజయవంతమైన సినిమాలు ఒకే సంవత్సరంలో ఐదు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఘనత కూడా కృష్ణదే.

అత్యధిక మల్టీస్టారర్ చిత్రాలలో…

కృష్ణకి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. “పాతాళభైరవి” సినిమాలోని ఎన్టీఆర్‌ నటనకు ముగ్దుడైన కృష్ణ, ఆయనతోనే కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయంగా చెబుతుండేవారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో పద్మాలయ ప్రొడక్షన్స్ బ్యానర్లో “దేవుడు చేసిన మనుషులు” వంటి భారీ మల్టీస్టారర్ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు. భారీ ఎత్తున నిర్మించి చిత్రంలో విజయనిర్మల, ఎస్వీ రంగారావు, జగ్గయ్య, కాంతారావు, జయలలిత, కాంచన, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య లాంటి అగ్రతారలతో పాటు జమున, మంజుల, కృష్ణ నటీనటులుగా నటించిన ఈ సినిమా అజరామర మల్టీస్టారర్ గా చరిత్ర సృష్టించింది. హిందీలో పద్మాలయ బ్యానర్ లో టక్కర్ పేరుతో పునర్ణిర్మించగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

కృష్ణ స్టార్‌గా ఎదిగిన తర్వాత మరో హీరోతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న తొలి చిత్రం “ఇద్దరు మొనగాళ్లు” అందులో కాంతారావుతో కలిసి ఆయన నటించారు. ఆ తరువాత వీరి కలయికలో మరో రెండు చిత్రాలొచ్చాయి. ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణ నటించిన తొలి సినిమా “స్ర్తీ జన్మ”. ఆ తరువాత వీరిద్దరి కలయికలో “నిలువు దోపిడి”, “విచిత్ర కుటుంబం”, “దేవుడు చేసిన మనుషులు”, “వయ్యారి భామలు – వగలమారి భర్తలు” సినిమాలు వచ్చాయి. ఈ ఐదు చిత్రాల్లోనూ ఎన్టీఆర్‌ – కృష్ణ లు అన్నదమ్ములుగా నటించారు. కళాశాల రోజులలో అక్కినేనిని చూసి ఆయనలా ఎప్పటికేౖనా హీరో కావాలి అని కలలు కని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు కృష్ణ. అక్కినేని నాగేశ్వరావు స్ఫూర్తితోనే కృష్ణ హీరోగా నిలబడ్డారు. అక్కినేనితో కలిసి “మంచి కుటుంబం”, “హేమాహేమీలు”, “గురుశిష్యులు”, “అక్కాచెల్లెళ్లు”, “ఊరంతా సంక్రాంతి”, “రాజకీయ చదరంగం” లాంటి సినిమాలలో నటించారు. 

అలాగే కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన కథానాయకుడు కృష్ణంరాజు. కాంతారావు, శోభన్‌బాబు, మోహన్‌బాబుతో 3, రజనీకాంత్‌తో 3, శివాజీ గణేశన్‌తో 3, సుమన్‌తో 3, నాగార్జునతో 2, చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ, రాజశేఖర్‌, రవితేజలతో ఒక్కో సినిమా చేశారు. అలాగే తన కొడుకులు రమేశ్‌బాబుతో 5, మహేశ్‌బాబుతో 7 చిత్రాల్లో నటించారు కృష్ణ. మల్టీస్టారర్ చిత్రాల చరిత్రలో కొత్త ధోరణి సృష్టించిన ఘనత దక్కించుకున్న కృష్ణ 50 కి పైగా మల్టీ స్టారర్ చిత్రాలలో నటించి అత్యధిక మల్టీ స్టారర్ సినిమాలలో నటించిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించారు.

సంక్రాంతి కథానాయకుడు…

12 జనవరి 1968 నాడు కృష్ణ నటించిన 11 వ సినిమా “అసాధ్యుడు” విడుదల, విజయం. కృష్ణకి సంక్రాంతి సెంటిమెంటు మొదలైంది “అసాధ్యుడు” విజయంతో. ఆ నాటి నుంచి ప్రతీ సంక్రాంతికి తన సినిమా ఒకటి విడుదల అవ్వాలని కృష్ణ నియమం పెట్టుకున్నారు. దాంతో దానికి తగ్గట్టుగానే రికార్డు బ్రేకింగ్ 30 సంక్రాంతి సినిమాలిచ్చారు. తన అభిమాన హీరో ఎన్టీఆర్ 28 సంక్రాంతి సినిమాలిస్తే, తాను మాత్రం రెండాకులు ఎక్కువే చదివి 30 సంక్రాంతి సినిమాలు ఇచ్చారు. ఒక సంక్రాంతికి 14 జనవరి 1977 మాత్రం ఎన్టీఆర్ సినిమాతో తలపడ్డారు. ఆ సంక్రాంతి రోజున ఎన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన “దానవీర శూర కర్ణ” పౌరాణికంతో, కృష్ణ తన పౌరాణికం “కురుక్షేత్రం” ని ధీటుగా విడుదల చేసి ఎన్టీఆర్ ను ఢీకొన్నారు. కృష్ణతో బాటు శోభన్ బాబు, కృష్ణం రాజు, జమునలతో మల్టీస్టారర్ గా తీసిన ఆ పౌరాణికం కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించగా, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ముందు అది నిలబడలేకపోయింది. కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు  పాత్రలు తానే వేశారు.

సూపర్ స్టార్ కృష్ణ తన 350 సినిమాలకి పైగా విస్తరించి ఉన్న తన సినీ ప్రస్థానంలో 30 సినిమాలు సంక్రాంతి సినిమాలే. 1968 మొదటి సంక్రాంతి సినిమా “అసాధ్యుడు” తరువాత, 1969 లో శోభన్ బాబుతో కలిసి “మంచి మిత్రులు”, 1973 లో వచ్చిన కౌబాయ్ చిత్రం “మంచి వాళ్ళకు మంచి వాడు”, 1976 లో “పాడి పంటలు”, 1977 వ సంవత్సరంలో “కురుక్షేత్రం”, 1978 లో “ఇంద్రధనస్సు”, 1980 లో “భలేకృష్ణుడు”, “ఊరికి మొనగాడు (1981), “బెజవాడ బెబ్బులి” (1983), “ఇద్దరు దొంగలు” (1984), “అగ్ని పర్వతం” (1985), తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987), “కలియుగ కర్ణుడు (1988), “రాజకీయ చదరంగం (1989), ఇన్‌స్పెక్టర్ రుద్ర (1990), “పరమ శివుడు (1992), “పచ్చని సంసారం”(1993), “నంబర్ వన్” (1994), “అమ్మ దొంగా” (1995) ఇలా కృష్ణ సినిమాల సంక్రాంతుల సరదా సాగింది.

నిర్మాతల నిజమైన హీరో… 

ఎడతెరిపి లేకుండా వరుసగా సినిమాలు చేసి చిత్రపరిశ్రమ ఎదుగుదలకు పాటుపడడమే కాకుండా, ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ఆ నిర్మాతను పిలిచి మరో సినిమాకు డేట్స్ ఇచ్చి సినిమా చేసుకోమని చెప్పే మంచి మనసున్న మనిషి కృష్ణ. అందుకే ఆయనను అందరూ నిర్మాతల హీరో అంటుంటారు. తాను నటించిన సినిమా నిరాశపరిస్తే, వెంటనే ఆ నిర్మాతలను పిలిచి, మరో మంచి కథని సిద్ధం చేసుకోమని చెప్పేవారు. తనకు ఎలాంటి పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదని, డబ్బులు తీసుకోకుండానే సినిమా చేస్తానని మాటిచ్చేవారు. ఇలా ప్రతీ నిర్మాతకు ఇచ్చిన మాటను కృష్ణ నిలబెట్టుకున్నారు. నిజంగానే నిర్మాతలకు ఆయన నిజమైన హీరో. అందుకే ఒకసారి కృష్ణతో సినిమా తీసిన నిర్మాత మళ్లీ మళ్లీ కృష్ణ తోనే సినిమాలు తీయడానికి పోటీపడేవారు.

“గూఢచారి 116” తీసిన డూండీ, బాబ్జీలు అప్పటినుంచి వారి చివరి చిత్రం “దొరకని దొంగ” వరకు మరో హీరోతో సినిమా తీయాలనే ఆలోచన కూడా లేకుండా అన్ని చిత్రాలను కృష్ణతోనే తీయడం విశేషం. “అభిమానవతి”, “భలే దొంగలు”, “దొంగలకు దొంగ”, “దొంగల నేల”, “దొంగలు బాబోయ్ దొంగలు”, “అమాయకుడు కాదు సాధ్యుడు” వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆ బ్యానర్ లోనే వచ్చాయి. గడ్డుకాలంలో ఉన్న నిర్మాతల్ని గట్టెక్కించారు. ఇదే విషయాన్ని అప్పటి నిర్మాతలు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా నష్టపోయిన పంపిణీదారులు, బయ్యర్లను కూడా ఆదుకునేవారు. ఒక సినిమాతో నష్టపోతే, ఆ తరువాత సినిమా హక్కుల్ని చాలా తక్కువ ధరకే ఇచ్చేవారు. ఇంకో విశేషం ఏమిటంటే కృష్ణ హీరోగా ఆరంగేట్రం ఇచ్చినప్పటి మొదటి సినిమా నుండి 40 సినిమాల వరకు కేవలం అయిదు వేల రూపాయల పారితోషికమే తీసుకున్నారు. ఏనాడూ పారితోషికం విషయంలో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అందుకే, కృష్ణను నిర్మాతల హీరో అని చెప్తుంటారు.

నెమ్మదించిన సినిమాలు…

తన ప్రస్థానం మొదలైన 1962 నుండి 1989 నాటికే 27 సంవత్సరాలలో 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ తన 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగారు. తొలిసారిగా తన నట జీవితంలో కొంచెం విశ్రాంతి తీసుకున్నది ఈ సమయంలోనే. కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబును 1987లో కథానాయకుడిగా పరిచయం చేశారు. కృష్ణ పద్మాలయా పిక్చర్స్ నిర్మాణంలో రమేష్ బాబుతో తీసిన అతని మూడవ సినిమా “బజారు రౌడీ” అద్భుతమైన విజయాన్ని ఇచ్చినా కూడా ఆ విజయాన్ని అవకాశంగా అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. అతని సినీ ప్రస్థానం దెబ్బతినడం కృష్ణ మీద ప్రభావం చూపింది.

కృష్ణ సినీ ప్రస్థానం 1990 – 1992 సంవత్సరాలలో అపజయాలతో కొనసాగింది. ఫలితంగా సినీ జీవితం మొదలైన పాతికేళ్ళ తరువాత 1992లో కేవలం ఒకే ఒక్క సినిమా “రక్తతర్పణం” విడుదలైంది. 1993 వ సంవత్సరంలో “పచ్చని సంసారం”, “వారసుడు” సినిమాలు అనూహ్యమైన విజయాన్ని సాధించాయి. 1995 వ సంవత్సరంలో “నెంబర్ వన్”, “అమ్మదొంగా” సినిమాలూ విజయాన్ని సాధించాయి. పద్మాలయా సంస్థ 1990వ దశకం చివరలో హిందీలో నిర్మించిన “సూర్యవంశం” సినిమా భారీ పరాజయం పొందేసరికి ఆర్థికంగానూ దెబ్బతిన్నారు. ఇక 2000 దశకంలో ఏడాదికి ఒకటి నుంచి మూడు సినిమాల వరకు నటించసాగారు. చివరిసరిగా కృష్ణ ముప్పలనేని శివ దర్శకత్వంలో “శ్రీశ్రీ” చిత్రంలో నటించి సినిమాల నుండి విశ్రాంతి తీసుకున్నారు.

మరణం…

కృష్ణ యొక్క చివరి చిత్రం 2016లో విడుదలైన శ్రీశ్రీ. ఆ తరువాత అతను చిత్రాలకు వీడ్కోలు పలికి లైమ్‌లైట్‌కు దూరంగా ఉటూ వచ్చారు. 14 నవంబర్ 2022 నాడు కృష్ణ గుండెపోటుతో బాధపడుతుండడంతో తనని హైదరాబాదు లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించడంతో తనను వెంటిలేటర్‌పై ఉంచారు. కృష్ణ తన 79 సంవత్సరాల వయస్సులో 15 నవంబరు 2022 తెల్లవారుజామున మరణించారు. 16 నవంబరు 2022 నాడు కృష్ణ భౌతికకాయాన్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో దహనం చేశారు. కృష్ణ తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయనిర్మల (2019), పెద్ద కొడుకు రమేష్ బాబు (2022), మొదటి భార్య ఇందిరా దేవి (2022)ల వరుస మరణాలు చవిచూడవలసి వచ్చింది.

ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకున్న కృష్ణ…

కృష్ణ తనకు తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూండీల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతోనే వ్యవహరించేవారు. ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు “పాడిపంటలు” సినిమా కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్ళిన కృష్ణ, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారీ లేకపోతే “ద హిందూ పత్రిక” వాళ్ళు వాడే ప్రత్యేక విమానంలో వెళ్లి హాజరయ్యారు. ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆదుర్తి స్వంత బ్యానర్ “రవి కళామందిర్” బ్యానర్ సినిమాలు తీశారు. ఆ బ్యానరు మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేట్టు, నష్టం వస్తే కృష్ణ భరించేట్టుగా నిర్ణయం చేశారు. 

అలా కృష్ణ తాను హీరోగా “పంచాయితీ”, “సిరిమల్లె నవ్వింది”, “రక్త సంబంధం” సినిమాలు చేసిపెట్టాడు. మొదటి రెండూ ఫ్లాప్ అయినా మూడో సినిమా విజయవంతం అయ్యింది. ఆదుర్తి సుబ్బారావు కొడుకు సాయి భాస్కర్‌ను కృష్ణ తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని, తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ “పచ్చ తోరణం” సినిమా చేశారు. అదీ నిరాశ పరచడంతో పద్మాలయా టెలీఫిల్మ్స్ ఏర్పాటుచేసి, టెలివిజన్ వ్యాపార రంగంలోకి దిగినప్పుడు సాయి భాస్కర్‌కే ఆ బాధ్యతలు అప్పగించి ఎలాగైనా ఆదుర్తి కుటుంబాన్ని ఒక దారిలోకి తేవాలని పదే పదే ప్రయత్నించారు.

Show More
Back to top button