
సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉండే దృశ్యాలను చిత్రీకరించి వాటిని సరైన రీతిలో, అవసరమైన చోట కూర్చడాన్ని ఎడిటింగ్ (కూర్పు) అంటారు. ఈ ఎడిటింగ్ విభాగానికి షాట్‌లు మరియు ఫుటేజ్‌ల సేకరణ అవసరం. ఎవరైనా చిత్రీకరించిన షాట్‌లను సర్దుబాటు చేసి, వాటిని కొత్తగా మార్చే చర్యను “ఫిల్మ్ ఎడిటింగ్” అంటారు. ఫిల్మ్ ఎడిటర్ ముడి ఫుటేజ్‌తో పని చేస్తాడు. షాట్‌లను ఎంచుకుని వాటిని సీక్వెన్స్‌లుగా మిళితం చేసి పూర్తి చేసిన మోషన్ పిక్చర్‌ను సృష్టిస్తాడు. అందువలననే ఫిల్మ్ ఎడిటింగ్‌ను ఒక కళ లేదా నైపుణ్యంగా వర్ణించారు.
సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన ఏకైక కళ ఫిల్మ్ ఎడిటింగ్. ఫిల్మ్ మేకింగ్‌ను దాని ముందున్న ఇతర కళారూపాల నుండి వేరు చేస్తుంది. సినిమా వీక్షకుడిని ఆకర్షించడానికి ప్రయత్నించేటప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ అనేది చాలా ముఖ్యమైన సాధనం. సినిమా ఎడిటింగ్ సరిగ్గా చేసినప్పుడు, ఎడిటింగ్ వీక్షకుడిని ఆకర్షించగలదు మరియు పూర్తిగా రాడార్ కిందకు ఎగురుతుంది. దీని కారణంగా, ఫిల్మ్ ఎడిటింగ్‌కు “ది ఇన్విజిబుల్ ఆర్ట్” అనే పేరు పెట్టారు. ఇలాంటి ఎడిటింగ్ ను సమర్థవంతంగా నిర్వహించిన ఎడిటర్లలో ఒకరు అక్కినేని సంజీవి.
అక్కినేని సంజీవి స్వయానా అగ్ర దర్శకులు యల్వీ ప్రసాద్ తమ్ముడు. ఆయన వద్ద సహాయకులుగా చేరిన సంజీవి మొదట్లో స్టిల్ ఫోటోగ్రఫీ నేర్చుకుని, దానిలో భవిష్యత్తు ఉండదని తెలుసుకుని మేనల్లుడు కె.బి.తిలక్ వద్ద ఎడిటింగ్ సంబంధిత అంశాలను నేర్చుకుని అనేక సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. కేవలం 15 సంవత్సరాలలో సుమారు 60 సినిమాలకు ఎడిటర్ గా సేవలందించారంటే ఎడిటింగ్ విభాగంలో తన ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థమైపోతుంది.
తయిళ్ళ పిళ్ళై (1961), భార్యాభర్తలు (1961), ఇరువార్ ఉల్లం (1963), బంగారు గాజులు (1968), దత్తపుత్రుడు (1972) సతీ అనసూయ (1978), అష్టరాగ (1982), ము తుమే ఓ సే (1982), ఎస్.పి.భయంకర్ (1983), చక భౌరి (1985), మేరా ఘర్ మేరే బచ్చే (1985), సహరి బఘా (1985), కెప్టెన్ నాగార్జున (1986) వంటి చిత్రాలకు అక్కినేని సంజీవి ఎడిటర్ గా పనిచేశారు. అలాగే తన అన్నయ్య యల్వీ ప్రసాద్ స్థాపించిన లక్ష్మి పిక్చర్స్ పతాకం పై నిర్మించిన మొదటి చిత్రం ఇల్లాలు (1965) తో దర్శకుడిగా మారిన సంజీవి “అక్కాచెల్లెలు”, “ధర్మదాత”, “అత్తగారు కొత్తకోడలు”, “నాటకాలరాయుడు”, “మల్లమ్మ కథ” లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : అక్కినేని సంజీవ రావు
ఇతర పేర్లు : సంజీవి
జననం : 20 సెప్టెంబరు 1927
స్వస్థలం : సోమవరప్పాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : సినిమా దర్శకుడు, సినిమా ఎడిటర్
తండ్రి : శ్రీరాములు
తల్లి : బసవమ్మ
పిల్లలు : శ్రీకర్ ప్రసాద్
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 07 మే 2002
నేపథ్యం…
అక్కినేని సంజీవరావు (అక్కినేని సంజీవి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంలో 20 సెప్టెంబరు 1927 నాడు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు జన్మించారు. ఆ దంపతులకు ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. వారిలో
పెద్దబ్బాయి పేరు బసవయ్య, రెండో అబ్బాయి లక్ష్మీ వరప్రసాద్ (ప్రముఖ దర్శకులు ఎల్వీ ప్రసాద్), మూడవ అబ్బాయి నారాయణ రావు, నాలుగో అబ్బాయి రామచంద్ర రావు, ఐదవ అబ్బాయి అక్కినేని సంజీవ రావు (అక్కినేని సంజీవి). ఈ ఐదుగురు అన్నదమ్ములకు ఒక్కతే చెల్లెలు. ఆమె పేరు సుబ్బమ్మ. ఆ సుబ్బమ్మ కుమారుడే కె.బి. తిలక్.
అక్కినేని శ్రీరాములుది వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబం. కూతురు సుబ్బమ్మ జన్మించే నాటికి శ్రీరాములు కుటుంబం వ్యవసాయంలో నష్టం వాటిల్లడం వలన దివాలా తీసిన పరిస్థితులతో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. యల్వీ ప్రసాద్ తన 22 సంవత్సరాల వయస్సులో వంద రూపాయలు చేతబట్టి సినిమాలలో అవకాశాల కోసం బొంబాయికి వెళ్లిపోయారు. అప్పటికీ అక్కినేని సంజీవి వయస్సు రెండు సంవత్సరాలు. అంటే యల్వీ ప్రసాద్, సంజీవికి మధ్య వయస్సులో 20 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. తన ప్రాథమిక విద్యాభ్యాసం సోమవరప్పాడు లోనే కొనసాగింది. ఆ తరువాత తల్లిదండ్రులు సంజీవిని బొంబాయిలో ఉన్న రెండవ అన్నయ్య ఎల్వీ ప్రసాద్ దగ్గరికి పంపించారు. అప్పటికీ ఎల్వీ ప్రసాద్ సినిమా నిర్మాతల వద్ద సహాయకుడిగా ఉంటూనే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునే స్థితిలో ఉన్నారు.
విద్యాభ్యాసం…
అక్కినేని సంజీవి అన్నయ్య యల్వీ ప్రసాద్ దగ్గరే కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడ ఉన్న గుజరాతీ పాఠశాలలో చదువుకుని గుజరాతీ, హిందీ భాషలు నేర్చుకున్నారు. తద్వారా తెలుగు పదాలను మరచిపోయే పరిస్థితి వచ్చింది. ఆయనకు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి బొంబాయి నుండి సంజీవిని సోమవరప్పాడు తీసుకువచ్చిన తన అమ్మానాన్నలు ఆయనను ఏలూరు ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఆ సమయంలో సంజీవి మాట్లాడే భాష గుజరాతీ, హిందీ కలగలపి మాట్లాడుతుంటే విచిత్రంగా ఉండేది. ఆ సంభాషణలో తెలుగు పదాలు చాలా తక్కువగా ఉండేవి. పాఠశాల ఉపాధ్యాయులు బాగా కసరత్తు చేసి సంజీవిని తెలుగు బాగా మాట్లాడేలా చేశారు. పాఠశాలలో మామూలు చదువులతో పాటుగా ప్రైవేట్ గా హిందీ పరీక్షలు కూడా వ్రాశారు. బొంబాయి, ఏలూరు, సోమవరప్పాడు మధ్య తిరగడం వలన కాబోలు సంజీవికి నాటకాల పట్ల ఆసక్తి లేదు. పాఠశాల చదువు పూర్తయ్యేసరికి తన అక్కయ్య దెందులూరు లో కొన్ని రోజులు ఉన్నారు. సంజీవికి పై చదువులు చదువుకోవడం, ఉద్యోగాలు తెచ్చుకోవడం మీద కూడా ఆసక్తి ఉండేది కాదు. తనకు వ్యవసాయం అంటేనే ఎక్కువగా ఇష్టంగా ఉండేది. అక్కయ్య ఇంట్లో ఉన్నన్ని రోజులు వ్యవసాయంలో కాస్త అనుభవం సంపాదించారు.
వివాహం…
ఆ నాటి సామాజిక పరిస్థితుల ప్రభావం వలన అక్కినేని సంజీవికి తన పద్దెనిమిది సంవత్సరాలకే వాళ్ళ ఊరికే చెందిన రాధ అనే అమ్మాయినిచ్చి వివాహం చేశారు. తాను ఇష్టపడి చేసిన వ్యవసాయానికి ఎప్పుడో వచ్చే ఆదాయం కంటే కూడా ప్రతీరోజు చేసే వ్యాపారం వలన వచ్చే డబ్బులు అయితే బావుంటుందని భావించి వ్యాపారమే చేయాలని అనుకున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే సంజీవి తెనాలిలో ఉండే ఒక వ్యక్తి (వరుసకు అన్నయ్య) దగ్గర చల్లటి పానీయలు అమ్మే దుకాణంలో రెండు సంవత్సరాలు పనిచేసి అందులోని మెలకువలు నేర్చుకున్నారు. బొంబాయి వెళ్లిన యల్వీప్రసాద్ 1947 – 48 వ సంవత్సరాలలో మద్రాసులో నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. దాంతో యల్వీప్రసాద్ తో మాట్లాడి తన తల్లిదండ్రులు 1947 లో తన 20 సంవత్సరాల వయస్సులో సంజీవిని మద్రాసులో ఉన్న యల్వీ ప్రసాద్ వద్దకు పంపించారు. ఆ విధంగా సినిమాకు సంబంధించిన వివిధ విభాగాలను మూడు నాలుగు నెలల పాటు అధ్యయనం చేస్తూవచ్చారు.
చిత్ర రంగ ప్రవేశం…
స్వయానా దర్శకులు యల్వీ ప్రసాద్ కు తమ్ముడు అవ్వడంతో అక్కినేని సంజీవికి పెద్దగా సినిమా కష్టాలు ఎదురవ్వలేదు. సంజీవిని అన్ని విభాగల వారు ఆదరంగా చూసుకున్నారు. చిత్రపరిశ్రమలో అన్ని శాఖలను పరిశీలన చేసిన సంజీవికి గారి స్టిల్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే అందులో పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. సినిమా చిత్రీకరణ సమయంలో ఎప్పుడో ఒక్కసారి స్టిల్స్ తీస్తే సరిపోతుంది. సంజీవిని బాధ్యతను టీ.వీ.ఎస్. మన్యం అప్పగించారు అన్నయ్య యల్వీ ప్రసాద్. సంజీవికి స్టిల్ ఫోటోగ్రఫీలో ప్రాథమిక పాఠాలు నేర్పారు టీ.వీ.ఎస్. మన్యం. ఆయన వద్ద సంజీవి రెండు సంవత్సరాలు సహాయకుడిగా పనిచేసి స్టిల్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఆ విభాగంలో ఆర్థికంగా ఎదగడానికి పెద్దగా అవకాశాలు ఉండవని తెలుసుకుని ఎడిటర్ గా పనిచేద్దామనుకున్నారు. అప్పటికే తన అక్కయ్య సుబ్బమ్మ గారి అబ్బాయి కె.బి.తిలక్ చిత్రపరిశ్రమలో ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన యన్.వి.రాజన్ తో కలిపి కొన్ని సినిమాలకు, ఒక్కడే సొంతంగా మరికొన్ని సినిమాలకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సంజీవి ఒకవైపు స్టిల్ ఫోటోగ్రఫీ తీస్తూనే మరో ప్రక్క కె.బి.తిలక్ దగ్గర సంబంధించిన ఎడిటింగ్ శాఖను పరిశీలిస్తూ అక్కడే ఎడిటింగ్ లో తనంతట తానే తొలి పాఠాలు నేర్చుకున్నారు.
ఎడిటర్ గా తొలి సినిమా రోజులు మారాయి (1955)…
1949 ప్రాంతాల్లో బి.నాగిరెడ్డి మరియు చక్రపాణి లు విజయా పిక్చర్ ను స్థాపించారు. వారి మొదటి సినిమా షావుకారు (1950) కు దర్శకులు ఎల్.వి.ప్రసాద్. వాహినీ స్టూడియోలో అప్పటికి ఎడిటింగ్ విభాగానికి అధిపతి కోటేశ్వరరావు. వారితో మాట్లాడి తమ్ముడు సంజీవిని ఆ విభాగంలో చేర్పించారు ఎల్.వి.ప్రసాద్. ఆ సినిమాకు ఎడిటర్లుగా సి.పి.జంబులింగం, ఎం. ఎస్. మణి పనిచేస్తున్నారు. ఎడిటింగ్ (కూర్పు) విభాగంలో పనిచేస్తూనే, స్క్రిప్టు పనులు కూడా చూసుకుంటూ ఉన్న అన్నయ్య ఎల్.వి.ప్రసాద్ మరియు కథకులు, నిర్మాత అయిన చక్రపాణి లకు అనుసంధాన కర్తగా ఉండేవారు సంజీవి.
సంజీవి అంటే చక్రపాణికి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎప్పటికైనా మీ అన్నయ్య ఎల్.వి.ప్రసాద్ లాగే నీవు కూడా మంచి దర్శకుడివి అవుతావని సంజీవితో అనేవారు చక్రపాణి. షావుకారు సినిమా తరువాత కె.బి.తిలక్ మరియు ఎం.వి.రాజన్ లతో వద్ద చేరి మంత్రదండం (1951), మానవతి (1952), జ్యోతి (1954) ఎడిటింగ్ విభాగంలో సహాయకులుగా పనిచేశారు సంజీవి. ఎడిటర్ గా వెండితెర పై సంజీవి పేరు కనిపించిన మొదటి సినిమా రోజులు మారాయి (1955). తిలక్ తో కలిపి సంయుక్తంగా ఎడిటింగ్ విభాగంలో తెరపై కనిపించింది. ఆ తరువాత సంజీవి తానే సొంతంగా ఎడిటర్ గా పనిచేసిన సినిమా “ఇలవేల్పు” (1956). 1947 లో మద్రాసులో అడుగుపెట్టిన సంజీవి 9 సంవత్సరాల తరువాత ఎడిటర్ అవ్వగలిగారు.
పదిహేనేండ్లలో అరవై సినిమాలకు ఎడిటర్ గా…
తాను ఎడిటర్ గా పనిచేసిన అనేక సినిమాలకు కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారు సంజీవి. రోజులు మారాయి (1955) సినిమా తమిళ వర్షన్ “కాలం మారి పోచు” (1956) సినిమాకి సంజీవి ఒక్కరే ఎడిటర్ గా పనిచేశారు. ఆ సినిమాలో సంజీవి చూపించిన ఎడిటింగ్ నైపుణ్యాన్ని తమిళ పత్రికలు ప్రత్యేకంగా ప్రశంసించాయి. నిజానికి తమిళ పత్రికలు ఎడిటింగ్ విభాగం గురించి ఎప్పుడూ ప్రశంసించిన సందర్భాలు ఉండవు. కానీ ఒక తెలుగువాడు సంజీవి గురించి వ్రాయడం, అలాగే ఎడిటర్ గా స్థిరపడ్డ తొలి రోజులలో తనకు దక్కిన ప్రశంస అది. రోజులు మారాయి (1955), “కాలం మారి పోచు” (1956) సినిమాలతో పాటు “పునర్జన్మ” (1963), “నమ్మినబంటు” (1959), “కులదైవం” (1960), “లవకుశ” (1963) తెలుగు సినిమా, “లవకుశ” (1963) తమిళ సినిమా, ఆత్మబలం (1964), ఆస్తిపరులు (1966) మొదలగు సినిమాలకు సంజీవి ఎడిటర్ గా పనిచేశారు. తాను చిత్రపరిశ్రమకు వచ్చిన తొలి 15 సంవత్సరాల లోనే 40 తెలుగు సినిమాలకు, 20 తమిళ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఇంత కష్టపడి పనిచేయడం వలన ఆయా సంవత్సరాలలో సంజీవి ఎంతో తీరిక లేకుండా ఉండేవారు.
దర్శకుడిగా తొలి చిత్రం ఇల్లాలు (1965)…
ఎడిటర్ గా తనను తాను నిరూపించుకున్న అక్కినేని సంజీవికి ఉన్నట్టుండి దర్శకుడిగా మారే అవకాశం అన్నయ్య దగ్గరనుండి వచ్చింది. చిత్ర పరిశ్రమలో స్థిరపడి, సొంత స్టూడియోను కూడా నిర్మించి, లక్ష్మి ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు ఎల్వీ ప్రసాద్. ఆ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఆరు సినిమాలు నిర్మించిన తరువాత “ఇల్లాలు” అనే సాంఘిక చిత్రానికి దర్శకుడిగా తన తమ్ముడు అక్కినేని సంజీవిని ఎంచుకున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించక ముందు వరకు సంజీవి ఎవ్వరి వద్ద కూడా దర్శకత్వ శాఖలో పనిచేయలేదు, దర్శకత్వం శాఖలో ప్రాథమిక పాఠాలు కూడా నేర్చుకోలేదు. కాకపోతే యాభై చిత్రాలకు పైగా ఎడిటింగ్ చేసిన అనుభవం, కథ చెప్పే విధానం, దృశ్యాన్ని చిత్రీకరించే పద్ధతులను దగ్గరుండి గమనించడం వంటి అనుభవాలు తనకు ఉపయోగపడ్డాయి.
అన్నయ్య పర్యవేక్షణగా ఉంటారు గనుక ఎల్వీ ప్రసాద్ సొంత చిత్రానికి దర్శకత్వం చేయమని కోరినప్పుడు ఆత్మవిశ్వాసంతో అంగీకరించారు. అక్కినేని సంజీవి తొలి చిత్రమే ప్రయోగాత్మక చిత్రమైంది. ఇటువంటి కథను కొత్త దర్శకుడి చేతిలో పెట్టి ఎల్.వి.ప్రసాద్ పెద్ద సాహసం చేశారు. ఇల్లాలు (1965) చిత్రంలో కథానాయకుడు కె.వి.నాగేశ్వరరావు కొత్తవారు. అప్పటివరకు సహాయ పాత్రలు, హాస్య పాత్రలు పోషించిన గీతాంజలిని ఈ సినిమాకు కథానాయికగా ఎంచుకున్నారు. కుటుంబ కథా చిత్రంలా అనిపించినా కూడా ఇది ఉత్కంఠభరిత కథ. తన చేతులతో అంత్యక్రియలు చేసిన భార్య మళ్ళీ తిరిగి రావడం, తిరిగి ఆమె సంక్లిష్టమైన సందర్భాలలో ఇరుక్కోవడం. ఇల్లాలు కథాంశంతో తెరకెక్కినా కానీ ఇది ప్రయోగాత్మక చిత్రంగానే ఉండిపోయింది.
ఆ రోజులలో కుటుంబ బంధాలననుసరించి, కుటుంబ కథా చిత్రం తీసి ఉంటే కొత్త దర్శకుడికి తేలికగా ఉండేది. కానీ ఉత్కంఠమైన కథను తెరకెక్కించి, ప్రేక్షకులను మెప్పించడం, అందులోనూ కొత్త నాయకా, నాయికలతో తొలి చిత్రం తెరకెక్కించడం, అక్కినేని సంజీవికి సవాలయ్యింది. కథానాయకుడి గురించి మొదట్లో విమర్శలు వచ్చేసాయి. కానీ సంజీవి కథ నడిపిన విధానం కానీ, అద్భుతమైన పాటల చిత్రీకరణ కానీ అన్నీ కలగలిపి “ఇల్లాలు” చిత్రాన్ని 60 రోజుల పైగా థియేటర్లలో నిలబెట్టాయి. ఇల్లాలు చిత్రం 29 అక్టోబర్ 1965 నాడు విడుదలైంది. ఆ తరువాత కాలంలో కె.వి.నాగేశ్వరరావు కథానాయకుడిగా నిలబడలేకపోయినా, గీతాంజలి కథానాయికగా నిలదొక్కుకోలేకపోయినా కూడా అక్కినేని సంజీవి మాత్రం దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇల్లాలు చిత్రం కొంత నిరాశపరిచినా తరువాత సంవత్సరాలలో మంచి చిత్రాలను చిత్రీకరించారు సంజీవి.
అప్పట్లోనే ఇంగ్లీష్ లో సబ్ – టైటిల్స్…
విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత అక్కినేని సంజీవిదే. అంతేకాకుండా అప్పట్లో మనకు కొత్తదైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకున్నా కూడా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. అలా కుదించిన సినిమాలలో “నమ్మినబంటు”, “పదండి ముందుకు”, “అంతస్తులు”, “సాక్షి” మొదలైన చిత్రాలున్నాయి. విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడినప్పుడు వాటి నిడివి కుదించి, ప్రదర్శించే ఆ సినిమాలకు ఇతర భాషలో సబ్ టైటిల్స్ లాగానే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండాలి.
కానీ ఆ రోజులలో సబ్ టైటిల్స్ ను ఉపయోగించే సాంకేతికత భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందలేదు. అలాంటి సమయంలోనే “నమ్మినబంటు”, “పదండి ముందుకు”, “అంతస్తులు”, “సాక్షి” సినిమాలకు సంజీవి తన సొంత సాంకేతికతో ఇంగ్లీషు మరియు ఇతర భాషలకు సబ్ టైటిల్స్ తయారు చేశారు. “ఫిలిం ఫెస్టివల్” లో ప్రదర్శించబడిన “అంతస్తులు” సినిమాకు “సబ్ టైటిల్స్” చూసి భారత ప్రభుత్వం “ఫిలిం డివిజన్” వారు తమ డాక్యుమెంటరీలకు కూడా ఆ విధంగా “సబ్ టైటిల్స్” చేసి పెట్టాలని అడిగారు. అందుకు సంజీవి సున్నితంగా తిరస్కరించారు. కానీ ఆ తరువాత కొన్నాళ్లకు బొంబాయి లోనే సబ్ టైటిల్స్ యంత్రం దిగుమతి చేసుకోబడింది.
దర్శకుడిగా తొలి విజయం “అత్తగారు – కొత్తకోడలు”…
“ఇల్లాలు” (1965) చిత్రంలో “నీవు నా ఊహలందే నిలిచేవు నేను నీ కళ్ళలోనే వేలిసాను”, “మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగేరా” పాటలను ఆత్రేయ అద్భుతంగా వ్రాశారు. “పురిటి వెలుగున బుగ్గపై నీ పంటి నొక్కులు కంటిరా, చిరుత నవ్వుల పెదవిపై నా కంటి కాటుక అంటెరా.. చిక్కు పడిన కురులు చూసి, సిగ్గు ముంచుకు వచ్చే రా, రేయి గడిపిన హయినంత మనసు నెమరు వేసారా… కాపురాన రేపు మాపులు, కలవురా నీ చూపులోనే, మల్లె పువ్వులు విరిసెరా, మంచు తేరాలు కరిగేరా” వంటి పదాలతో సున్నితమైన భావాలను ఆత్రేయతో వ్రాయించారు అక్కినేని సంజీవి. ఆ దశాబ్దంలో తెలుగు సినిమాలలో కొన్ని మధురమైన పాటలు చెప్పమని అంటే ఇల్లాలు (1965) చిత్రంలోని పాటలను కూడా అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. తన సినీ జీవితంలో దర్శకత్వం అనేది కేవలం ఒక దశ మాత్రమే. అక్కినేని సంజీవి తొలి ప్రాధాన్యత మాత్రం ఎడిటింగ్.
దర్శకుడిగా తాను చేసిన సినిమాలు కొన్ని మాత్రమే. మొదటి చిత్రం ప్రయోగాత్మకంగా విజయవంతమైనప్పటికీ కూడా ఆయన పెద్దగా అవకాశాలు చేజిక్కించుకోలేదు. దర్శకుడిగా తన మొదటి సినిమా విడుదలైన మూడేళ్ళ తరువాత దర్శకుడిగా రెండో సినిమా విడుదలైంది. ఆ చిత్రం పేరు “అత్తగారు – కొత్తకోడలు”. కల్పనా చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదట సినిమాలా కాకుండా ఏమాత్రం ప్రయోగం చేయకుండా సినిమా టైటిల్ లోనే కథ ప్రతిబింబించేలా కుటుంబ గాథ చిత్రాన్ని ఎంపిక చేసుకుని విజయం సాధించారు అక్కినేని సంజీవి. ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల నాయక, నాయికలుగా నటించినప్పటికి కథలో సూర్యకాంతం, విజయనిర్మల కీలక పాత్రలు పోషించారు. కథ, సంభాషణలు ఆచార్య ఆత్రేయ సమకూర్చారు. జి.కె.వెంకటేష్ స్వరపరిచిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. 14 జూన్ 1968 నాడు విడుదలై. ఘనవిజయం సాధించింది.
అక్కినేని నాగేశ్వరావుతో వరుసగా సినిమాలు…
“అత్తగారు – కొత్తకోడలు” సినిమా తరువాత రెండేళ్లలో అక్కినేని సంజీవి దర్శకత్వం నుండి వరుసగా సినిమాలు వచ్చాయి. హిందీ చిత్రం “ఆల్బెలా” (1951) ఆధారంగా నిర్మించబడిన “నాటకాల రాయుడు” (1969) ను తెరకెక్కించారు సంజీవి. హిందీ చిత్రం ఆల్వేకా కి రీమిక్స్ మొదట్లో ఏ సినిమాకు ముందుగా ఈ సినిమాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పరిశీలన వచ్చింది. కానీ “రక్త కన్నీరు నాగభూషణం” తన సొంత నిర్మాణంలో “నాటకాల రాయుడు” ని నిర్మించి, తానే కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాలోని పాటలు కూడా రేడియోలో పదేపదే వినిపించేవి. 22 ఆగస్టు 1969 నాడు ఈ సినిమా విడుదలైంది.
“నాటకాల రాయుడు” సినిమా విడుదలైన ఐదు నెలలకు అక్కినేని నాగేశ్వరావు ప్రధాన పాత్రలో నటించిన “అక్క – చెల్లెలు” (1970) సంజీవి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో షావుకారు జానకి చేసిన నృత్యం ప్రేక్షకులను బాగా అలరించింది. 01 జనవరి 1970 నాడు విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.
“అక్క – చెల్లెలు” సినిమా విడుదలైన ఐదు నెలలకు అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని సంజీవి కలయికలో రెండవ చిత్రం “ధర్మదాత” (1970). రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేయగా , కాంచన, పద్మనాభం, గీతాంజలి, నాగభూషణం మొదలగు వారు నటించారు. ఇందులోని పాటలు ప్రేక్షకులకు, శ్రోతలకు అనేక సంవత్సరాలు నిలిచి ఉన్నాయి. ఫాదర్స్ డే రోజున వినిపించే “ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా” పాట “ధర్మదాత” చిత్రంలోనిదే. 08 మే 1970 నాడు విడుదలై ఘన విజయం సాధించింది.
దర్శకుడిగా ఒరియా చిత్రాలను తెరకెక్కించి…
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాణంలో శోభన్ బాబు, శారదలు నాయక, నాయికలుగా అక్కినేని సంజీవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సిసింద్రీ చిట్టిబాబు (1971). శోభన్ బాబు, శారదలు నాయక, నాయికలు అయినప్పటికీ కథ మొత్తం “మాస్టర్ ప్రభాకర్” చుట్టూనే తిరుగుతుంది. 18 జూన్ 1971 నాడు విడుదలైన ఈ చిత్రం కూడా చక్కటి విజయం సాధించింది. ఆ తరువాత సంజీవి దర్శకత్వంలో 1973లో “మల్లమ్మ కథ”, “విశాలి” సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. అవి బ్రహ్మాండమైన విజయం సాధించకపోయినప్పటికీ చక్కటి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.
“విశాలి” అక్కినేని సంజీవి దర్శకత్వంలో వచ్చిన చిట్టచివరి తెలుగు చిత్రం. 06 అక్టోబరు 1973 నాడు విడుదలైన “విశాలి” మోస్తరు విజయం సాధించినప్పటికీ అందులో పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఆ తరువాత అక్కినేని సంజీవి దర్శకత్వంలో “మథురా విజయ” (1979), రామ్ బలరామ్ (1980) అనే రెండు ఒరియా సినిమాలు తెరకెక్కించబడ్డాయి. ఆ తరువాత దర్శకత్వం ఆపేసినా కూడా ఎడిటర్ గా 1988 వ సంవత్సరం వరకు తెలుగు, హిందీ, ఒరియా చిత్రాలకు పనిచేశారు అక్కినేని సంజీవి.
మరణం…
అక్కినేని సంజీవికి 1947 వ సంవత్సరంలో అదే ఊరికి చెందిన రాధతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. 1950 వ సంవత్సరంలో గృహలక్ష్మి జన్మించింది. 1955 వ సంవత్సరంలో పంకజం జన్మించగా, 1963 వ సంవత్సరంలో శ్రీకర్ ప్రసాద్ జన్మించాడు. 1975 వ సంవత్సరంలో అనుకోని ప్రమాదం జరిగి గృహలక్ష్మి మరణించింది. శ్రీకర్ ప్రసాద్ 1983 నుండి తండ్రి అక్కినేని సంజీవి దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ వచ్చారు. సంజీవి పనిచేసిన సినిమాలన్నింటికి శ్రీకర్ ప్రసాద్ సహాయకుడిగా ఉన్నారు.
1988 అక్కినేని సంజీవి ఎడిటింగ్ పనులు తగ్గించుకోగా, అదే సమయంలో శ్రీకర్ ప్రసాద్ 1988 నుండి స్వతంత్రంగా ఎడిటింగ్ పనులు ప్రారంభించారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న శ్రీకర్ ప్రసాద్ దశాబ్దాలుగా రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు, అదేవిధంగా అనేక పురస్కారాలు అందుకుంటూ వచ్చారు. అన్నయ్య ఎల్.వి.ప్రసాద్ స్థాపించిన నెగిటివ్ హ్యాండ్లింగ్ విభాగానికి అక్కినేని సంజీవి 1988 నుండి బాధ్యతలను నిర్వహించడం మొదలుపెట్టారు. దాదాపు పాతికేళ్ల పాటు సమర్థవంతంగా నిర్వహించిన అక్కినేని సంజీవి తన 75 సంవత్సరాల వయస్సులో 07 మే 2002 నాడు కన్నుమూశారు. ఆయన మరణించిన రెండేళ్లకు శ్రీమతి రాధ కన్నుమూశారు.