CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో బుద్ధిలో బృహస్పతి, నిగ్రహంలో ప్రవరాఖ్యుడు.. నటులు మురళీమోహన్..

సినిమా రంగం రకరకాల ఆకర్షణలకు, రకరకాల ప్రలోభాలకు నిలయం. ఇక్కడ ఎంతటి నిగ్రహ సంపన్నులైనా తేలికగా వ్యసన ప్రకోపితులై తమ పతనానికి తామే దారులు వేసుకుంటారని చాలామంది అభిప్రాయం. అందుకు నిదర్శనం అన్నట్లు అత్యంత దయనీయంగా కొంతమంది సినీ ప్రముఖుల జీవితాలు అంతమయ్యాయి. కానీ ఈ రంగుల పొంగుల అందాల ప్రపంచంలో ఉంటూ అత్యంత క్రమశిక్షణతో, నియమపాలన, సమయపాలన పాటిస్తూ, బుద్ధిలో బృహస్పతిగా, నిగ్రహంలో ప్రవరాఖ్యుడిగా, అందరినీ కలుపుకో గల అజాతశత్రువుగా పేరు పొందటం సామాన్య విషయం కాదు. వ్యసనాలకు, ఆకర్షణలకు, తృణప్రాయంగా తోసేసి, క్రమశిక్షణే అభిమతంగా, నమ్మకమే పెట్టుబడిగా తన నట, నిజ, వ్యాపార జీవితాలను సుసంపన్నం చేసుకుని “ది రియల్ జెంటిల్మెన్” గా గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈ సినిమా రంగుల ప్రపంచంలో ఒకరున్నారు. ఆయనే ప్రముఖ నటుడు, నిర్మాత, వ్యాపార నిపుణులు మురళీమోహన్.

మాగంటి మురళీ మోహన్ గా సుపరిచితులైన తన అసలు పేరు మాగంటి రాజా రామ్ మోహన్ రాయ్ సినిమా కథానాయకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు మరియు తెలుగు సినిమాలకు వ్యాపార కార్యనిర్వాహకుడు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన “జగమే మాయ” తో మురళీ మోహన్ సినీ రంగప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1974లో వచ్చిన “తిరుపతి” చిత్రంతో ఆయన గుర్తింపు పొందారు. తన నట జీవితంలో మురళీమోహన్ 350కి పైగా చలనచిత్రాలలో నటించారు. 1980లో తన సోదరుడు కిషోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సొంత చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు.

నిర్మాతగా మురళీమోహన్ మొదటి చిత్రం రాజా చంద్ర దర్శకత్వం వహించిన “వారాల అబ్బాయ్”. మురళీమోహన్‌ కు ఇది 100వ సినిమా. ఈ జయభేరి ఆర్ట్స్ సంస్థ 25 చిత్రాలను నిర్మించింది. అందులో మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం “అతడు” మూడు నంది పురస్కారాలను గెలుచుకుంది. నిర్మాణ సంస్థ జయభేరి గ్రూప్‌కు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. అతను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) మరియు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వివిధ హోదాలలో పనిచేశారు. 2015లో ఎన్నికలు జరిగే వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా కొనసాగారు.

సినిమా నటుడు కావాలన్న కోరిక లేకపోయినప్పటికీ కూడా కలిసి వచ్చిన అదృష్టం మురళీమోహన్ ను సినీ కథానాయకుడిని చేశాయి. ముఖ్యంగా 1970 – 80 లలో ప్రతీ ఆడపిల్ల ఇష్టపడే అందమైన అబ్బాయి లాగా, రాముడు మంచి బాలుడుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు మురళీమోహన్. తెరమీద తాను పోషించే సాధు, సాత్విక పాత్ర లక్షణాలను తన వ్యక్తిత్వంలో కూడా నింపుకొని పరిశ్రమ పెద్దలందరికీ ఇష్టమైన “గుడ్ బాయ్” గా ఎదిగారు మురళీమోహన్.

మాగంటి మురళీమోహన్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా ఉన్నారు. అతను 2009లో 15వ లోక్‌సభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. చివరికి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి వుండవల్లి అరుణ్ కుమార్ చేతిలో కేవలం 2,147 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో 16వ లోక్‌సభ ఎన్నికలలో రాజమండ్రి నుండి పార్లమెంటు సభ్యునిగా గెలుపొందారు. అయిదు దశాబ్దాల తన చలనచిత్ర జీవిత పయనంలో వివాద రహితంగా, విజయవంతంగా పయనిస్తున్న మాగంటి మురళీమోహన్ అలియాస్ రాజ రామ్ మోహన్ రాయ్ జీవిత సంగ్రహణం…

జీవిత విశేషాలు…

జన్మ నామం :    మాగంటి రాజా రామ్ మోహన్ రాయ్

ఇతర పేర్లు  :  మురళీ మోహన్  

జననం    :     24 జూన్ 1940    

స్వస్థలం   :    చాటపర్రు , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా

వృత్తి      :     తెలుగు సినీ నటుడు, వ్యాపారి, రాజకీయ నాయకుడు

తండ్రి    :     మాగంటి మాధవరావు

తల్లి     :    వసుమతీదేవి

జీవిత భాగస్వామి :  విజయ లక్ష్మి

రాజకీయ పార్టీ    :    తెలుగుదేశం పార్టీ

పిల్లలు   :   కుమార్తె మధు బిందు, కుమారుడు రామ్ మోహన్ 

బిరుదులు   :  2016లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.

నేపథ్యం…

మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. ఇతడు 24 జూన్ 1940 నాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధులు, తల్లి వసుమతి దేవి. మురళీమోహన్ ఎస్.ఎస్.ఎల్.సి వరకు చాటపర్రులోనే చదివారు. కళాశాల విద్యాభ్యాసం ఏలూరులో కొనసాగింది. ఇతడు 1963లో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తరువాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. కళాశాల చదువులకు ఏలూరులో చేరినప్పుడు నటులు సూపర్ స్టార్ కృష్ణ, మురళీమోహన్ క్లాస్ మేట్స్. ఇద్దరు ఇంటర్ లో ఫెయిలయ్యారు. అదే సంవత్సరం ఇంటర్ తీసేసి పి.యు.సి పెట్టారు. ఫెయిల్ అయిన వాళ్లు విద్యా సంవత్సరం వృధా కాకుండా డిగ్రీలో ఫస్టియర్ లెక్కలోకి తీసుకోవడం ప్రారంభించడంతో కృష్ణ డిగ్రీలో చేరారు. మురళీమోహన్ కు మాత్రం మొదటినుండి చదువు మీద పెద్ద ఆసక్తి లేదు. మొదటి నుంచి ఆయనకు వ్యాపారం అంటే ఇష్టం.

అక్కినేని సినిమా ఉదయం ఆటనే…

మురళీమోహన్ నాన్న అదిలాబాదులో ఫారెస్ట్ కాంట్రాక్టర్. అడవిలో చెట్లు కొట్టించి దుంగలు చేయించి టింబర్ డిపోలకు సరఫరా చేసేవారు. సెలవులకు ఆదిలాబాద్ రావడం వలన మురళీమోహన్ కు వ్యాపారం మీద కొంత అవగాహన ఏర్పడింది. చదువు మానేసిన తరువాత ఆ వ్యాపార రంగంలో దిగిపోదామని అనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితులు తలక్రిందులయ్యాయి. వాళ్ళ నాన్న వ్యాపారంతో పాటు రాజకీయంగా రెండు పడవల మీద కాలు పెట్టడంతో విపరీతంగా నష్టాలు వచ్చాయి. ఆయన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు స్థాయికి ఎదిగేసరికి వారి వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. దాంతో వారి స్వగ్రామం చాటపర్రు వచ్చి ఉన్న డబ్బుతో ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేశారు. అందువలన మురళీమోహన్ జీవితం అయోమయంలో పడింది. చదువు పట్ల ఆసక్తి లేని తనకు వ్యాపారమే దారి. కానీ వ్యాపారానికి పెట్టుబడి లేదు. దాంతో ఖాళీగా తిని తిరగడం తప్ప వేరే వ్యాపకం ఉండేది కాదు. మురళీమోహన్ కు చిన్నప్పటి నుండి అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని. అందువలన మొదటిరోజు ఉదయం ఆట నాగేశ్వరావు సినిమా చూసేవారు. చిన్నప్పటి నుండే తాను అందంగా ఉండేవారు. ఆయన పెదాలు చూసి లిప్ స్టిక్ వ్రాసుకున్నట్లుగా అందంగా ఉండేవారు. సినిమాలో కథానాయకుడిగా ప్రయత్నం చేయవచ్చుగా అని బంధువులు, మిత్రులు అనేవారు.

నాటక రంగం…

ఒకసారి మద్రాసు ఆంధ్ర క్లబ్ లో నాటక పోటీలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలిసింది. మిత్రులతో కలిసి సరదాగా నాటకం వేద్దామనుకున్నారు మురళీమోహన్. నిజానికి అదేదో ఊసుపోక తీసుకున్న నిర్ణయం తప్ప వారిలో ఎవ్వరికీ నటన పట్ల ఆసక్తి, అనుభవం లేదు. అయితే ఆంధ్ర క్లబ్ లో నాటక పోటీలు నిర్వహిస్తున్న గుత్తా రామినీడుది మురళీమోహన్ వాళ్ళ ఊరే కావడంతో పాటు బంధుత్వాలు కూడా కలిసి ఉండడంతో వారి నాటకాన్ని అవలీలగా ఎంపిక చేస్తారనుకున్నారు మురళీమోహన్. గుత్తా కృష్ణారావు నిరంతరం నాటక పోటీల బృందాన్ని తయారు చేసేవారు. ఆయన దగ్గరికి వెళ్లి అడిగారు మురళీమోహన్ తన స్నేహితులతో కలిసి. రెండు మూడు గంటల నాటకం ఆడేంత అనుభవం మీకు లేదు కాబట్టి ముందు 50 నిమిషాల నాటకం నేర్చుకోండి అని చెప్పి వారితో “పోలీసు” అనే ఒక నాటకం ప్రాక్టీస్ చేయించారు.

వారు ప్రదర్శించిన నాటకం బాగుంది. కానీ ప్రదర్శన బాగాలేదు. నాటిక ప్రదర్శన బాగుంది. కానీ ఎవ్వరూ సరిగ్గా చేయలేదు. దాంతో నాటకం బాగా సాధన చేయండి ముందు ముందు మంచిగా అలవాటైపోతుంది అని చెప్పారు. అయితే ఊర్లో మిత్రులు, బంధువులు మాత్రం మురళీమోహన్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. నీ వరకు నువ్వు బాగానే చేశావు అని మెచ్చుకోవడంతో ఆయనకు చాలా సంతోషం వేసింది. ఇంతలో గుత్తా రామినీడు నుండి ఒక ఉత్తరం వచ్చింది. మీ నాటకం ఎంపిక కాలేదని బాధపడవద్దు. ఎలా ప్రదర్శించాలో తెలుసుకునేందుకు మద్రాసు వచ్చేయండి అని మురళీమోహన్ కు ఒక లేఖ వ్రాశారు. అప్పుడు మద్రాసులో ఆంధ్ర క్లబ్ లో వారం రోజుల పాటు నాటకాల పోటీలకు వెళ్లారు.

అలా మొదటిసారి మద్రాసులో కాళ్ళు మోపి నాటకోత్సవం ఆసక్తిగా తిలకించారు. నాటకం ఎలా ఉండాలి? మనం చేసిన తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? వంటి మెలకువలు గ్రహించారు. గుత్తా రామినీడు దగ్గర సినిమాల్లో నటించే విషయం ప్రస్తావించారు మురళీమోహన్. నీ వయస్సు బాల పాత్రలకు పెద్దదిగా, కథనాయకుడు పాత్రకు చిన్నదిగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఊరెళ్ళి నాటకాల్లో ఇంకా మంచి శిక్షణ తీసుకో. అయితే వెళ్లే ముందు ఒకసారి గాత్రం పరీక్ష చేయించుకొమ్మని అప్పారావు అనే సంగీతం దర్శకుడితో మురళీమోహన్ గాత్రం పరీక్ష చేయించారు. ఆ అప్పారావు ఎవరో కాదు ఆ తరువాత సంగీత దర్శకుడుగా సంచలనం సృష్టించిన “చక్రవర్తి”.

వ్యాపారం…

నాటకాల తరువాత మద్రాసు నుండి విజయవాడ వచ్చారు. అయితే జీవనోపాధిక అవసరమైన వ్యాపకం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండగా మాణిక్యాలరావు, అయ్యన్న అనే ఇద్దరు బంధువులు వ్యాపారం మొదలుపెడుతూ మురళీమోహన్ ను పెట్టుబడి లేని భాగస్వామిగా చేర్చుకున్నారు.  వ్యవసాయానికి ఉపయోగించే పంప్ సెట్లు లాంటివి, కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీలో పదిహేను పైసల వాటా, వంద రూపాయలు జీతంతో 1963 సంవత్సరంలో అంటే 23 ఏళ్ల వయస్సులో మురళీమోహన్ వ్యాపార జీవితం ప్రారంభమైంది. పగలంతా వ్యాపారం చూసుకుంటూ, రాత్రి 8 గంటలకు వెళ్ళిపోయి ఒంటిగంట వరకు నాటకాలకు వెళ్లేవారు. నాటక మండలి అనే సంస్థను స్థాపించి దానికి సెక్రటరీగా ఉంటూ నిరంతరం నాటకాలు ఆడేవారు. “సంభవామి యుగే యుగే”, “రాళ్లు రత్నాలు”, “ఇదేమిటి”, వంటి నాటకాలు విరివిగా ప్రదర్శించే వాళ్ళు. 

అలా రెండు రోజులు గడిచిపోయాక 19 జూన్ 1965 నాడు విజయలక్ష్మి తో మురళీమోహన్ కు పెళ్లయ్యింది. ఆయన జీతం 100 నుండి 150 కి పెరిగింది. అలా వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తుండగా విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కు చెందిన “శ్రీ రామ్మోహన్ రావు”, నండూరి సుబ్బారావు, విన్నకోట రామన్న పంతులుగారు “క్రాంప్టాన్ ఇంజనీరింగ్ కంపెనీ ఓనర్” సత్యనారాయణతో పరిచయాలు ఏర్పడ్డాయి. మరోవైపు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాదారుడు నారాయణ మాణిక్యాలరావు తన వాటాను అమ్మేయడంతో మురళీమోహన్ వాళ్ళ ఆవిడని ఒప్పించి ఆమెకు కట్టంగా వచ్చిన ఐదు ఎకరాల పొలం అమ్మి కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీలో 50 పైసల వాటాదారుడయ్యారు.  దాంతో వ్యాపార బాధ్యతలు ఇంకా పెరిగాయి. పని ఎంత పెరిగితే అంత ఉత్సాహంగా పట్టుదలగా అభివృద్ధిలోకి తీసుకెళ్లడం, వ్యాపారాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు మురళీమోహన్. ఇలా వ్యాపారం ప్రధాన వృత్తిగా, నాటకాలు ఆడటం ప్రవృత్తిగా హాయిగా సాగిపోతుంది.

తొలి సినిమా “జగమేమాయ”…

ఇలా వ్యాపారం హాయిగా సాగిపోతున్న సమయంలో సినిమా నిర్మాత చటర్జీ నుండి పిలుపు వచ్చింది. తాను నిర్మిస్తున్న చిత్రంలో రెండవ కథానాయకుని పాత్ర కోసం మురళీమోహన్ ను పిలిచారు. కానీ ఆయనకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ మిత్రుల బలవంతంతో సరే అన్నారు. అయితే అప్పట్లో తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉండటం వలన ఎక్కడ రైళ్ళు అక్కడే ఆగిపోయాయి. దాంతో ఒక లారీ పట్టుకొని మద్రాసుకు చేరుకున్నారు. అడిషన్ చేశారు. కుర్రాడు బాగున్నాడు అని అభిప్రాయానికి రావడంతో తనను ఎంపిక చేశారు. కానీ నెల రోజులయినా ఆ నిర్మాత దగ్గరినుండి పిలుపు రాలేదు. ఆ సినిమాలో మరో హీరోను పెట్టుకున్నారు. దాంతో నిరాశపడడం మురళీమోహన్ వంతు అయ్యింది.

ఆ సమయంలో శారద సినిమా తీస్తున్న నిర్మాత క్రాంతి కుమార్, హనుమాన్ ప్రసాద్ లు తమ మరుసటి సినిమాలో హీరోగా అవకాశం ఇస్తానన్నారు. అయితే మేకప్ స్టిల్స్ తీశారు. అవి నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారి కంటపడ్డాయి. వెంటనే మురళీమోహన్ ను పిలిపించారు పూర్ణచంద్రరావు, తాతినేని రామారావు, దర్శకులు ఐ.యన్. మూర్తి, కెమెరామెన్  కె.ఎస్.మణి అందరూ ఏకగ్రీవంగా మురళీమోహన్ ను అంగీకరించారు. మురళీమోహన్ ను మరియు ఈ సినిమాతోనే సినీ పరిశ్రమకు విలన్ గా పరిచయం అయిన గిరిబాబును కూడా కైలాస అనే బట్టల షాపుకు తీసుకెళ్లి చిత్రీకరణకు కావలసిన బట్టలు ఎంపిక చేశారు. 24 ఫిబ్రవరి 1973 నాడు కర్ణాటకలో చిత్రీకరణ మొదలైన “జగమేమాయ” సినిమా, 28 జూలై 1973 నాడు విడుదల అయ్యింది.

అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ…

జగమే మాయ చిత్రం తరువాత గిరిబాబు చాలా బిజీ అయ్యారు. కానీ మురళీమోహన్ కు మాత్రం అవకాశాలు రాలేదు. అలా వేషాలు రావాలంటే మద్రాస్ లోనే మకాం పెట్టి ఆఫీసుల చుట్టూ తిరగాలి. తాను మాత్రం అలా వేషాల కోసం తిరగకూడదని నిర్ణయించుకున్నారు. ఇంతలో మరొక కొత్త అవకాశం వచ్చింది. మురళీమోహన్, ప్రసాద్ బాబు, రామ్మోహన్ మరొకరు ఎవరో కొత్త కుర్రాడు కలిపి నలుగురు హీరోలుగా ఒక సినిమా మొదలయ్యింది. ఆ సినిమాలో యస్వీ రంగారావుని ఒక రోజంతా చిత్రీకరణ చేశారు. కానీ మరుసటి రోజే ఆయన మరణ వార్త వచ్చింది. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. మురళీమోహన్ తిరిగి ఊరుకెళ్ళి వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయారు. 

కథానాయకుడిగా నిలబెట్టిన దాసరి, రాఘవేంద్ర రావు…

హనుమాన్ ప్రసాద్ గారు తాను నిర్మిస్తున్న “తిరుపతి” చిత్రంలో ఒక మంచి వేషం కోసం మురళీమోహన్ ను పిలిపించారు. ఆ సినిమా దర్శకుడు నన్ను చూడగానే “గుడ్. వెరీ గుడ్. బాగున్నారు” అన్నారు. రెండు రోజులు చిత్రీకరణ జరిగిన తరువాత ఆయన మురళీమోహన్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ “నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. బాగున్నావు, బాగా చేస్తున్నావు. నిన్ను మంచి హీరోను చేస్తానన్నారు”. అవ్యాజమైన ఆయన అభిమానం మురళీమోహన్ కు చాలా ఆనందాన్నిచ్చింది. తనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచింది. ఆ తరువాత ఆ దర్శకుడు ఇచ్చిన మాట ప్రకారం మురళీమోహన్ కు వరుసగా అవకాశాలు ఇచ్చారు. ఆయనను హీరోగా నిలబెట్టారు. అలా అన్న మాటలకు కట్టుబడి ఆయనను హీరోగా నిలబెట్టిన నాటి వర్ధమాన, అగ్ర దర్శకులు మరెవరో కాదు. ఆయనే దాసరి నారాయణరావు.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “భారతంలో ఒక అమ్మాయి” అద్భుతమైన విజయం సాధించడంతో హీరోగా మురళీమోహన్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. అంతకుముందు “జేబుదొంగ” సినిమాలో యంగ్ హీరోగా మురళీమోహన్ మీద చిత్రీకరించిన “రాదారాధా అందించు నీలేత పెదవి యెహే లాలించి తీరాలి” పాట కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇలా ఒకవైపు దాసరి హీరోగా నిలబడితే మరోవైపు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చిత్రాలు హీరోగా మురళీమోహన్ స్థాయిని, ప్రచుర్యాన్ని బాగా పెంచాయి. “అమరదీపం”, “జ్యోతి”, “కల్పన” “ఆమె కథ”, “ప్రేమ లేఖలు” లాంటి చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. అలా ఇద్దరు అగ్ర దర్శకులు మురళీమోహన్ నట జీవితానికి బలమైన పునాదులు వేశారు.

అంతరాత్మ సాక్షిగా… 

దాసరి నారాయణ రావు, కె.రాఘవేంద్ర రావు ఇద్దరి నుంచి వచ్చిన విజయాలు ప్రోత్సాహం కారణంగా కథానాయకుడిగా స్త్రీస్థిరపడగలనన్న నమ్మకం మురళీమోహన్ కు బలపడింది. ఇక కుటుంబాన్ని మద్రాసుకు తీసుకువద్దామని ఆయన అనుకున్నారు. అయితే కుటుంబాన్ని మద్రాసుకు తెచ్చే ముందు తన అంతరాత్మ సాక్షిగా తాను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఆ ప్రతిజ్ఞ ఆయనను మనిషిగా, ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా తీర్చిదిద్దింది. “ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్నాను. నా జీవితాన్ని గ్యాంబ్లింగ్ చేసుకునే అధికారం నాకుంది.

కానీ భార్య పిల్లల జీవితాలతో ఆడుకునే హక్కు నాకు లేదు. నేను క్రమశిక్షణగా ఉంటేనే వాళ్లకు గొప్ప జీవితం ఇవ్వగలుగుతాను. కాబట్టి మొదటి నుంచి నేను పాటించే క్రమశిక్షణ ఇక్కడ కూడా కొనసాగిస్తాను. ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నంతకాలం తాగుడు, వ్యభిచారం, జూదం వంటి వ్యసనాల జోలికి వెళ్ళను” అని మనసులో తీర్మానించుకున్న తర్వాత కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు. ఆ నిర్ణయం ప్రకారమే తన యాభై యేండ్ల నట జీవితంలో తాగుడుకు, వ్యభిచారానికి, జూదానికి చోటు ఇవ్వలేదు. అలా మురళీమోహన్ తన జీవితాన్ని తాను నిర్దేశించుకున్న కట్టుబాట్లలో క్రమశిక్షగా నడిపించుకున్నారు.

Show More
Back to top button