CINEMATelugu Cinema

కర్ణాటక సంగీతంలో తెలుగుజాతి కీర్తిని వ్యాపింపజేసిన కళారత్నం. శ్రీరంగం గోపాలరత్నం.

విజయనగరం అనగానే మనకు గుర్తుకు వచ్చేది సంగీత కళాకారులు. పూర్వకాలంలో మహా రాజులు విజయనగరంలోని తమ ఆస్థానంలో సంగీత కళాకారులను పోషించారు. కాలక్రమంలో ఆ మహారాజులే గానకళపట్ల అభిమానంతో విజయనగరంలో ఒక కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ కళాశాల పేరు మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల. విజయనగరంలో ప్రసిద్ధిచెందినది ఆ సంగీత, నృత్య కళాశాల. ఎందరో సంగీత విద్వాంసులు విజయనగరంలో శిక్షణ పొంది దేశదేశాల్లో తమ కీర్తిని, విజయనగరం ఖ్యాతిని చాటి చెప్పుకున్నారు.

భువినేశ్వర మిశ్రా (ఒడిశా సంగీతకారుడు), చాగంటి గంగరాజు (వాయులీన విద్వాంసుడు), ద్వారం భావనారాయణ రావు (వాయులీన విద్వాంసుడు), ద్వారం మంగతాయరు, ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం సత్యనారాయణ రావు, ద్వారం త్యాగరాజు, ఎవటూరి విజయేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.వి.రెడ్డి (వాయులీన విద్వాంసుడు), కొమండురి కృష్ణమాచార్యులు, మంచాళ జగన్నాధరావు, మారెళ్ల కేశవరావు, ముళ్ళపూడి లక్ష్మణరావు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, పి.సుశీల, సాలూరు హనుమంతరావు, సాలూరు రాజేశ్వరరావు, శ్రీపాద సన్యాసరావు, వంకాయల నరసింహం, గరిమెళ్ల నాగరాజారావు ఇలా ఎంతోమంది ఆ కళాశాలకు పూర్వ విద్యార్థులు. వీరంతా ఆ కళాశాలలో సంగీత విద్యను అభ్యసించారు.

అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఆ కళాశాలకు ప్రధానాచార్యులుగా ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం భావనారాయణ రావు, నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం దుర్గా ప్రసాదరావు, పి.వి.ఎస్. శేషయ్యశాస్త్రి లాంటి వారు వారి వారి విధులను నిర్వర్తించారు. అదే కళాశాల (మహారాజా ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాల) కు “శ్రీరంగం గోపాలరత్నం” 1979 – 1980 సంవత్సరాల మధ్య ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఆమె హైదరాబాద్‌లోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రధానాచార్యులు గా, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు మరియు శాఖాధిపతి గా పదవులు నిర్వహించారు. ఆమె ఆల్ ఇండియా రేడియోలో భక్తి రంజని కార్యక్రమాలకు కూడా పదవిని నిర్వహించారు. బెజవాడ ఆకాశవాణిలో 1957 నుండి నిలయ కళాకారిణిగా ఆవిడ ఇరవై సంవత్సరాలు పనిచేశారు. అవి ఆవిడ జీవితంలో మరపురాని రోజులు. బాలమురళి, రజని, ఓలేటి, వింజమూరి లక్ష్మి, నల్లాన్ చక్రవర్తుల, పింగళి, ప్రయాగ,  మల్లిక్, బందా వంటి ఉద్దండులతో కలసి ఎన్నో అపురూపమైన వైవిధ్య కార్యక్రమాలను సమర్పించారు.

కర్ణాటక సంగీతానికి మహిళల విభాగంలో త్రిమూర్తులు అనదగిన వారు యం.యస్. సుబ్బలక్ష్మి, డీ.కే.పట్టమ్మాళ్, యం.యల్. వసంత కుమారిలు. ఆ తరువాత అంతటి స్థాయిని ఏర్పరుచుకుని, ఆ స్థానాన్ని ప్రస్తావించుకోదగిన  సంగీత విద్వన్మణి “శ్రీరంగం గోపాలరత్నం”. చాలా మంది జీవితంలో సంగీతం ఒక భాగమైతే గోపాలరత్నం జీవితమంతా సంగీతమయమే. శ్రీరంగం గోపాలరత్నం భారతీయ శాస్త్రీయ మరియు చలనచిత్ర నేపథ్య గాయని. కూచిపూడి , యక్షగాన , జావళి , యెంకి పాటల ప్రదర్శనలలో ఆమె ప్రత్యేకతను సంతరించుకుంది.

ఆమె జీవించినది కేవలం 53 సంవత్సరాలే. కానీ ఆవిడ తన జీవితకాలంలో అధిరోహించిన కీర్తి శిఖరాలు అనితర సాధ్యాలు. విజయవాడ ఆకాశవాణిలో ఆవిడ పనిచేసే రోజులలో సమర్పించిన యక్షగానాలు, కూచిపూడి, సంగీత రూపకాలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, భక్తిరంజని, దేశభక్తి గీతాలు, సంగీత శిక్షణ, నాటకాలు, లలితగీతాలు, సంగీత నిర్వహణలు ఇలా ఒకటేమిటి తమిళ, కన్నడ, సంస్కృత, హిందీ భాషల్లో కూడా ఆవిడ పాటలు పాడారు. తెలుగులో వేలాది పాటలు పాడారు. అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా స్వరపరచి, గానం చేశారు. కొన్ని సినిమాలకు ఆవిడ నేపథ్య గానం చేశారు. ఆకాశవాణికే వన్నె తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ.

జీవిత విశేషాలు…

జన్మనామం  :  శ్రీరంగం గోపాలరత్నం

జననం   :     1939

స్వస్థలం :    పుష్పగిరి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్

వృత్తి   :        గాయకురాలు

సంగీత శైలి     :     భారతీయ శాస్త్రీయ గాయని, నేపథ్య గాయని, 

తండ్రి    :   వరదాచార్యులు

తల్లి      :    సుభద్రమ్మ 

జీవిత భాగస్వామి :   అవివాహితురాలు

మరణం      :     16 మార్చి 1993

నేపథ్యం…

కళలకు కాణాచి అయిన విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1939 వ సంవత్సరంలో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు శ్రీరంగం గోపాలరత్నం జన్మించారు. వారిది మొదటినుండి సంగీత కుటుంబమే. అందువలన గోపాలరత్నం పసితనంలో తన బామ్మ వద్ద సంగీతంతో తొలి పాఠాలు అభ్యసించారు. ఆ తరువాత మలి పాఠాలను తండ్రి వరదాచార్యులు వద్ద నేర్చుకున్నారు. తన తల్లి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు వ్రాసిన రెండు హరికథలను తన తొమ్మిదేళ్ల వయస్సులో పాలకొల్లు వైష్ణవ సభలో చెప్పి అలనాటి ప్రఖ్యాత హరికథ విద్వాంసులు పెద్దింటి దీక్షితులు చేత ప్రశంసలు అందుకున్నారు. శ్రీరంగం గోపాలరత్నం తన గురువు విద్వాన్ కవిరాయని జోగారావు వద్ద తొలుత వీణావాద్యాన్ని  అభ్యసించి, కొన్ని వీణ కచేరీలు కూడా ఆవిడ నిర్వహించారు. ఆ తరువాత గురువు గారి సలహా మేరకు గాత్రంలో స్థిరపడిన డా.శ్రీపాద పినాకపాణి వద్ద మెళకువలు నేర్చుకున్నారు. అలాగే ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద శిష్యరికం చేసి వయోలిన్ విద్యను నేర్చుకున్నారు. వీరి వద్ద నేర్చుకున్న విద్య ఆమె పాండిత్యానికి మెరుగులు దిద్దడానికి ఉపయోగపడింది.

ఆకాశవాణి లో…

విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 1957 వ సంవత్సరంలో నిలయ విద్వాంసురాలిగా చేరిన శ్రీరంగం గోపాలరత్నం అలాగే కొనసాగుతూ 1977 వరకు సుమారుగా 20 సంవత్సరాలు ఆకాశవాణి రేడియో ద్వారా కర్ణాటక సంగీతాన్ని, లలిత సంగీతాన్ని ప్రేక్షకులకు, శ్రోతలకు, జన సామాన్యానికి చేరువ చేశారు. 1960 – 70 దశకాలలో విజయవాడ, హైదరాబాదు లలో ఆకాశవాణి కేంద్రాలు సంగీతానికి పెద్ద పీట వేసిన రోజులలో విజయవాడలో సంధ్యావందనం శ్రీనివాసరావు, మంగళపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, వింజమూరి లక్ష్మి, నల్లాన్ చక్రవర్తుల, ప్రయాగ, మంచాల జగన్నాధరావు, పింగళి లక్ష్మీకాంతం, మల్లిక్, బందా, బాలాంతరపు రజినీకాంతరావు, ఎం.వి. రమణ మూర్తి వంటి ఉద్దండులతో కలసి, ఎన్నో అపురూపమైన వైవిధ్య కార్యక్రమాలను ఆమె సమర్పించిన సంగీత కార్యక్రమాలు గోపాల రత్నం సంగీత ప్రతిభకు నిదర్శనాలు.

ఈ ప్రసారవాణి లో భాగంగా ఆకాశవాణి ద్వారా ఆమె వినిపించిన అన్నమాచార్య కీర్తనలు, భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. “కస్తూరి రంగయ్య కరుణించవేమయ్యా”, “ఏడే అల్లరి వనమాలి” పాటలు మంచి పేరు తీసుకువచ్చాయి. క్షేత్రయ్య పదాలు, మీరా భజనలు, లీలాశుకుని తరంగాలు, జయదేవుని అష్టపదులు, రామదాసు కీర్తనలు, ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు, నండూరి వెంకి పాటలు, పెళ్లి పాటలు, సాంప్రదాయ జానపద గీతాలు, థిల్లానాలు, జోల పాటలు, భక్తి గీతాలు ఆమె తీయనైన గొంతుతో పాడుతుండడం వలన ఆమె గొంతులో తీయదనాన్ని కలుపుకొని ఆ పాటలు హృద్యంగా బయటికి వచ్చేవి. సుప్రభాతం మొదలు, ప్రసార సమాప్తి వరకు విజయవాడ రేడియో కేంద్రంలో రెండు దశాబ్దాల పాటు ఏదో ఒక సందర్భంలో శ్రీరంగం గోపాలరత్నం తన కంఠంతో శ్రోతల హృదయక్షేత్రాన్ని సుసంపన్నం చేసేవారు.

యక్ష గానం…

సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటులు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకులు “బందా కనకలింగేశ్వరరావు” పుణ్యమా అని కూచిపూడికి నూతన ఒరవడి వచ్చినప్పుడు, ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు “ఓలేటి వెంకటేశ్వర్లు” కూచిపూడి నాట్యాచార్యులు చింతా కృష్ణమూర్తిని ప్రక్కన కూర్చోబెట్టుకుని “భామా కలాపం” యక్షగానాన్ని సంస్కరించి గాయనీ గాయకులు శ్రీరంగం గోపాలరత్నం, మరియు బాలమురళీకృష్ణల చేత రికార్డు చేసి ప్రసారం చేశారు. ఈ యక్షగాన రూపకాన్ని ఎన్ని సార్లు వినాలన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మదనా (ఆనంద భైరవి), “శకునాలు మంచివాయే” (మోహన), “భామనే సత్యభామనే” వంటి స్వర రచనలు నేటికీ ఎందరికో మార్గదర్శకంగా ఉన్నాయంటే శ్రీరంగం గోపాలరత్నం యొక్క అద్భుత స్వరమాధుర్య మహిమనే అని చెప్పాలి.

పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రఖ్యాతి గాంచిన కర్ణాటక సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ నౌక చరిత్రను హైదరాబాదు లోని అమృతవాణి స్టూడియోలో ఓసారి శ్రీరంగం గోపాలరత్నం చేతనే రికార్డు చేయించారు. ఇందులో భాగంగా “తనయందే ప్రేమ” అనే కృతిని నలుగురు గోపికలకు, నలుగురు గాయనీమణులు పాడాలి. నలుగురు గోపికలలో ఒకరికి శ్రీరంగం గోపాలరత్నం పాడారు. రికార్డు పూర్తయిన తరువాత మిగతా ముగ్గురు ఆమె స్థాయిలో పాడకపోవడంతో నూకల చిన్న సత్యనారాయణ పూర్తిపాటను (మిగతా ముగ్గురు పాడే పాటను) శ్రీరంగం గోపాలరత్నం చేతనే పాడించారు.

రెండు దశబ్దాల సంగీత జైత్రయాత్రకు తెరపడింది…

అలాగే మీరాబాయి సంగీత నాటకాన్ని కూడా శ్రీరంగం గోపాలరత్నం పాడడం విశేషం. ఆమె పాడిన ఆ నాటకం వినడమే గొప్ప అనుభూతి. కృష్ణ భక్తురాలైన మీరాబాయిలో శ్రీరంగం గోపాలరత్నం ప్రవేశించిందా అని శ్రోతలకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఆమె ఆలపించారు. సుఖీభవ ప్రొడక్షన్స్ వారు నిర్మించగా పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం లో తెరకెక్కిన “బికారి రాముడు” (1961) లో “ఇదియే నీ కధ తుదిలేని వ్యధ”, “ఎచటినుండి వచ్చావో ఎచటి కేగినావో”, “చల్లని నీ దయ జల్లవయ్యా ఎల్లలోకముల” పాటలను ఆలపించారు  “శ్రీ వెంకటేశ్వర వైభవం” జీవితచిత్రం (డాక్యుమెంటరీ) (1971) కి “ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట” వంటి పాటలు ఆమె పాడారు. అలా ఇరవై ఏళ్ళు గడిచిన తరువాత 1977 సంవత్సరం వచ్చేసరికి దురదృష్టవశాత్తు ఆమె పాడలేని స్థితికి వచ్చారు. దాంతో ఆమె విజయవాడ నుండి హైదరాబాదు వెళ్లిపోయారు. విజయవాడలో విజయవంతంగా నడిచిన ఆమె సంగీత యాత్రకు అప్పుడు అవాంతరం ఏర్పడింది.

అవివాహిత గానే మిగిలిపోయి…

హైదరాబాదులో సంగీత కళాశాల ప్రధానాచార్యులుగా నియమితురాలైన శ్రీరంగం గోపాలరత్నం పాడలేకపోతున్నానని మనోవేదనకు గురయ్యారు. తెలుగు వర్సిటీ ఆవిర్భావం తరువాత లలిత కళాపీఠానికి ఆమె ప్రత్యేక అధికారి అయ్యారు. శ్రీరంగం గోపాలత్నం తన సంగీత జీవితంలో లెక్కలేనని కచేరీలు చేశారు. గానకళలో ఆమె సృష్టించని ప్రక్రియ లేదు. రాష్ట్రంలో పలు సాంస్కృతి సంస్థలు ఆమెకు సన్మానాలు చేసి గాన కోకిల, సంగీత కళానిధి, సంగీత రత్న, “ఆంధ్ర నైటింగేల్” వంటి బిరుదులు సమర్పించుకున్నాయి. శ్రీరంగం గోపాలత్నంను 1969 లో తిరుపతి తిరుమల దేవస్థానం వారు తమ ఆస్థాన విద్వాంసురాలిగా నియమించారు. 1992లో భారత ప్రభుత్వం ఆమెను “పద్మశ్రీ” బిరుదుతో సత్కరించింది. తన జీవితాన్ని సంగీతంతోనే పండించుకోవాలని ఆమె వివాహం కూడా చేసుకోకుండా అవివాహిత గానే మిగిలిపోయారు. 

మరణం…

ఒకరోజు ఏదో పనిమీద ఆకాశవాణి మాజీ సంచాలకులు శ్రీనివాసన్ ఇంటికి వెళ్లిన గోపాలరత్నం కు, శ్రీనివాసన్ ఇంట తను చిన్నతనంలో రేడియోలో పాడిన పాట వినటం తటస్థించింది. ఎంతో అమాయకంగా “నేనే పాడాను ఈ పాట. అప్పుడు బాలమురళీగారు నాకు వయోలిన్ వాయించారు. ఎక్కడివి మీకీ పాటలు”? అని శ్రీనివాసన్ భార్య శారదని ఆశ్చర్యంగా అడిగారు గోపాలరత్నం. అప్పుడు శారద “నేను మీ అభిమానిని. మీపాటలన్నీ నేను సేకరించాను”  అన్నారావిడ. అప్పుడు గోపాలరత్నం వెంటనే “నాదగ్గర ఒక్కటీ లేదు. నాకు కూడా ఒక క్యాసెట్ లో అన్నీ రికార్డ్ చేసివ్వరూ” అంటూ బ్రతిమలాడారు.

దాంతో “పదిరోజుల్లో అందజేస్తాననను అని మాటిచ్చారు శారద. అయితే ఆ పదిరోజులు గడవకుండానే 16 మార్చి 1993 నాడు మ్రోగుతున్న వీణకు తీగె తెగినట్లు  శ్రీరంగం గోపాలరత్నం తుది శ్వాస విడిచారు. ఆవిడ పార్థివ దేహాన్ని హైదరాబాదుకు తరలిస్తూ మార్గ మధ్యలో ఆవిడకు ప్రాణప్రదమైన విజయవాడ రేడియో స్టేషన్ ముందు కొంతసేపు అభిమానుల సందర్శనార్థం ఆపారు. ఆనాడు ఎందరికో ఆ పుణ్యాత్మురాలిని కడసారి చూసే అదృష్టం కలిగింది. సంగీత ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించిన శ్రీరంగం గోపాలరత్నం సదాస్మరణీయురాలే.

Show More
Back to top button