CINEMATelugu Cinema

భారతీయ చిత్రసీమలో ఆధునిక చలనచిత్ర మాంత్రికుడు.. మణిరత్నం..

ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్.. బొంబాయి లో పేరున్న విశ్వవిద్యాలయం. అందులో చదువుకున్న ఓ మద్రాసు కుర్రాడు ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (యం.బి.ఏ) చేసాడు. అందులో చదివిన వాళ్లంతా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. ఉదయ్ కోటక్, అజయ్ పిరమల్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, వినీతా బాలి, సామ్ బల్సారా, లలితా డి. గుప్తే తదితర ప్రముఖులంతా వ్యాపార రంగంలో అగ్రగాములుగా వెలుగొందుతున్న వారే. అలాంటి విశ్వవిద్యాలయం నుండి యం.బి. ఏచేసిన గోపాలరత్నం సుబ్రహ్మణియన్ మాత్రం మెగాఫోన్ చేతబూని సినిమా దర్శకత్వం చేపట్టాడు.

తన అపారమైన ప్రతిభను ఉపయోగించి తన మాతృభాష తమిళం వదిలేసి కన్నడలో “పల్లవి అను పల్లవి” అనే ఒక సినిమా చిత్రీకరించాడు. మొదటి సినిమానే ఘోరమైన పరాజయం. బొక్కబోర్లా పడ్డట్టయ్యింది. రెండవ సినిమా మలయాళంలో “ఉనారూ” తీశాడు. మళ్ళీ ప్లాఫ్. మూడవ సినిమా మాతృభాష తమిళంలో “పగల్ నిలవు” తీశాడు, అదీ పోయింది. నాలుగవ సినిమా కూడా మళ్ళీ తమిళంలోనే “ఇదయ కోవిల్” అది కూడా నష్టాన్నే మిగిల్చింది. ఇన్ని ప్లాఫ్ లు ఇచ్చిన తరువాత అవకాశాలు ఎవరిస్తారు? ఉద్యోగం చూసుకోవచ్చుగా నీవు సినిమాలకు పనికిరావు. వ్యాపారం అయినా చేసుకో కానీ సినిమాలు ముట్టుకోకు. ఇంట్లో ఇలా ఎన్నో చీవాట్లు, బయట సలహాలు.

ఆ కుర్రాడికి మతిపోతోంది. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ఆఖరి సినిమాగా “మౌనరాగం” తీశాడు, అద్భుతమైన విజయం. ఆ తరువాత నాయకన్ తీశాడు. రెండో అద్భుతమైన విజయం. తన రెండో విజయవంతమైన సినిమాతోనే టైం మ్యాగజైన్ వారు ఎంపిక చేసిన ఆల్ టైం 100 చిత్రాలలో భారతదేశం నుండి ఎంపికైన మూడు చిత్రాలలో ఈ కుర్రాడు తీసిన “నాయకన్” ఎంపికయ్యింది. ఆ తరువాత కొంత కాలానికే భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆధునిక చలనచిత్ర మాంత్రికుడిగా కొనియాడబడ్డాడు. అతడే దిగ్గజ దర్శకులు మణిరత్నం. టైం మ్యాగజైన్ వారు ఎంపిక చేసిన మూడు సినిమాలలో “సత్యజిత్ రే” తీసిన “అపు ట్రాయాలజీ”, గురుదత్ తీసిన “ప్యాసా”, మూడవది మణిరత్నం తీసిన నాయగన్. ఇలాంటి సంచలనాత్మకమైన విజయాన్ని ఆయన తన రెండవ విజయవంతమైన చిత్రంతోనే సృష్టించారు.

మణిరత్నం అనువాద చిత్రాలు తెలుగు చిత్రాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. ఆయన సినిమాలు గొప్పగా ఉండకపోవచ్చు, కానీ తాను కథ చెప్పే విధానం గొప్పగా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకుడిని మూడు గంటల పాటు కుర్చీలో కట్టిపడేసే నేర్పు మణిరత్నం సొంతం. ఆ నేర్పును తన మొట్టమొదటి విజయవంతమైన చిత్రం నుండే సాధించారు. సినిమా రంగంలో మిగతా సాంకేతిక శాఖలను సినిమా విజయానికి ఎలా వాడుకోవాలో తెలిసిన దర్శకుడు మణిరత్నం. సంగీతం, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం లాంటి సాంకేతిక విభాగాల్ని అత్యుత్తమంగా వాడుకుంటూ తన కథనాచాతుర్యంతో, సాదారణ కథను కూడా అసాదారణ రీతిలో వెండితెరపై అనువాదం చేయగల ఆధునిక చలనచిత్ర మాంత్రికుడు మణిరత్నం.

తన మొట్టమొదటి విజయవంతమైన చిత్రం “మౌనరాగం” నుండి వరుసగా నాయకన్, అగ్ని నక్షత్రం, గీతాంజలి, అంజలి, దళపతి, రోజా వరకు కూడా తన విజయ జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగించారు. అవార్డుల వరద, రివార్డుల పంట, కలెక్షన్ల సునామి. అప్పుడప్పుడు ఒకటి, రెండు అపజయమైన చిత్రాలు, ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలు తన దర్శకత్వం నుండి వస్తూనే ఉన్నాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    గోపాలరత్నం సుబ్రమణ్యం

ఇతర పేర్లు  :  మణిరత్నం 

జననం    :     02 జూన్ 1956    

స్వస్థలం   :    మదురై , మద్రాసు రాష్ట్రం , భారతదేశం.

వృత్తి      :     చిత్ర దర్శకుడు, సినిమా నిర్మాత, స్క్రీన్ రైటర్

తండ్రి    :     గోపాలరత్నం  

జీవిత భాగస్వామి :  సుహాసిని చారుహాసన్ 

పిల్లలు   :   కుమారుడు 

బంధువులు     :    జి. వెంకటేశ్వరన్ (సోదరుడు), చారుహాసన్ (మామ) 

బిరుదులు   :  పద్మశ్రీ (2002)

నేపథ్యం…

మధురైలో గోపాలరత్నం అయ్యర్ అనే అతను తమిళ సినిమా పరిశ్రమలో పంపిణీదారులుగా ఉన్నారు. వాళ్ళ పెద్దబ్బాయి పేరు జి.వెంకటేశ్వరన్. ఆ తరువాత వాళ్ళ ఆవిడకు సుమారు ఎనిమిది సంవత్సరాలకు రెండోసారి గర్భం దాల్చింది. అప్పుడు తమకు ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక ఈ గర్భం వద్దనుకున్నారు. ఈ గర్భం నిజం కాకపోతే బావుణ్ణు అని మీనాక్షి అమ్మగారిని వేడుకుంటూ ఆమె మీనాక్షి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. కానీ మీనాక్షి అమ్మవారు ఆమె ప్రార్థనలు వినలేదు. అందువలన ఆమె రెండవ సంతానంగా 02 జూన్ 1956 నాడు సుబ్రహ్మణ్యం అయ్యర్ జన్మించారు. ఆయనే తరువాత రోజులలో మణిరత్నంగా ప్రసిద్ధికెక్కారు. ఆ తరువాత మూడవ సంతానంగా జి. శ్రీనివాసన్ అయ్యర్ జన్మించారు. గోపాలరత్నం అయ్యర్ కు తమిళ చిత్ర పరిశ్రమతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఉన్నపళంగా మద్రాసుకు వలస వచ్చారు.

బొంబాయిలో యం.బి.ఏ…

చదువుకోవడం మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం అయ్యర్ విద్యామందిర్ సెకండరీ పాఠశాలలో హైస్కూల్ చదివారు. అది అయిపోయాక వివేకానంద కళాశాలలో కామర్స్ పూర్తి చేశారు. వారి కుటుంబం చిన్నప్పటినుండి సినిమా వాతావరణం, నాన్నగారు సినిమా పంపినదారులు. అందువలన గోపాలరత్నం “వీనస్ ప్రొడక్షన్స్” లో సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ ఉండేవారు. సుబ్రహ్మణ్యం వాళ్ళ అన్నయ్య వెంకటేశ్వరన్ కూడా సినిమా పంపిణీ విభాగంలోకి వచ్చేసారు.  సుబ్రహ్మణ్యం అయ్యర్ ని కామర్స్ పూర్తి అయ్యాక బొంబాయిలో ఉన్న జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ కి పంపించడంతో తాను ఎం.బీ.ఏ పూర్తి చేశారు. ఎం.బీ.ఏ పూర్తయ్యాక మద్రాసుకు వచ్చి ఉద్యోగం చేయకుండా ఆయన “మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ” అని ఒకటి మొదలుపెట్టి చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తుండేవారు. అందులో అన్ని భాషల సినిమాలు చూడడం, వాటిని విశ్లేషించుకోవడం, వాటి గురించి చర్చించడం చేసేవారు. 

సినీ నేపథ్యం…

ఇలా జరుగుతున్న రోజులలో మూర్తి అనే మిత్రుడు తాను తీయబోయే సినిమాకు కథ సహాయం చేయమని సుబ్రహ్మణ్యం ను అడిగారు. సరే అని ఒప్పుకుని మిత్రుడు మూర్తికి సుబ్రహ్మణ్యం కథ వ్రాసి ఇచ్చేశారు. కానీ అది ఒక కొలిక్కి రాలేదు. కానీ మణిరత్నం ఉద్దేశ్యంలో “సినిమా తీయాలంటే కథ వ్రాసుకోవడమే కాదు, ఒక ప్రాజెక్టు మేనేజ్ మెంట్ ఉండాలని” మూర్తితో అన్నారు. దానికి బదులుగా సినిమా తీసి చూపించమని సుబ్రహ్మణ్యంను ఎద్దేవా చేశారు మూర్తి. దాంతో రోషం వచ్చిన మణిరత్నం సినిమా తీసే పనిలో పడ్డారు. ముందుగా ఇద్దరు, ముగ్గురు తమిళ దర్శకుల వద్ద సహాయకుడిగా చేద్దామనుకున్నారు సుబ్రహ్మణ్యం. కానీ కుదరలేదు. 

తొలి అవకాశం ఇచ్చిన గోవిందరాజన్…

సుబ్రహ్మణ్యం నాన్నగారు గోపాలరత్నం భాగస్వాములుగా ఉన్న “వీనస్ పిక్చర్స్” లో గోవింద రాజన్ అనే మరో భాగస్వామి (తెలుగులో “పవిత్ర బంధం” వంటి సినిమాలు తీశారు) సినిమా స్క్రిప్ట్ లో సహాయం చేయమన్నారు. అప్పటికే సినిమాలంటే ఆసక్తి ఉన్న సుబ్రహ్మణ్యం మిత్రుడికి కథ సాయం చేస్తూ ఉన్నారు గనుక,  స్క్రిప్టులో గోవింద రాజన్ కు సహాయం చేశారు. సుబ్రహ్మణ్యం యొక్క చురుకుదనం, సృజనాత్మకత చూసి కథ ఉంటే చెప్పు సినిమా తీద్దాం అని గోవిందరాజన్ సుబ్రహ్మణ్యంను అడిగారు. తన వద్ద ఉన్న ఒక కథను గోవిందరాజన్ కు వినిపించారు సుబ్రహ్మణ్యం. గోవిందరాజన్ ఆశ్చర్యపోయారు. ఇంత లేత వయస్సులో ఉన్న ఒక కుర్రాడు ఇంత బరువైన కథను వ్రాయడం గోవిందరాజన్ ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. వెంటనే తేరుకుని “ఈ కథ తమిళులకు నచ్చదు. కన్నడంలో తీద్దామని అన్నారు”. అవకాశాలు రావడమే అరుదుగా భావించే సుబ్రహ్మణ్యం ఆ సినిమాను కన్నడంలో తీయడానికి ఒప్పుకున్నారు.

మణిరత్నం తొలి నటుడు “అనిల్ కపూర్”… 

ప్రముఖ ఛాయాగ్రహకులు బాలు మహేంద్రన్ కు ఈ కథ వినిపించారు. అప్పుడు సుబ్రహ్మణ్యం కథ చెప్పిన విధానం చూసి ఛాయాగ్రహకులుగా చేస్తానన్నారు. గోవిందరాజన్ తన పలుకుబడినంతా ఉపయోగించి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఇళయరాజాను ఒప్పించారు. ఈ సినిమాలో నటిగా ఒక పేరున్న నటిని సంప్రదించగా, కొత్త కుర్రాడు కావడంతో ఆమె ఒప్పుకోలేదు. కానీ ఆ తరువాత కాలంలో సుమారు ఏడెఎనిమిది సంవత్సరాల తరువాత ఈ కుర్రాడికి భార్య అయింది. ఆమెనే ప్రముఖ కథానాయిక సుహాసిని. కథానాయకుడు అనిల్ కపూర్, కథనాయికగా కిరణ్ వైరాలే, ఇంకొక నటిగా లక్ష్మి ని తీసుకున్నారు. నిజానికి ఇప్పట్లో అంతగా అనిపించకపోయినా కూడా 30 ఏళ్ల క్రిందట ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా, చాలా విప్లవాత్మకమైన సినిమా తీశారు సుబ్రహ్మణ్యం.

తొలి సినిమా కన్నడలో “పల్లవి అను పల్లవి”…

ఈ సినిమా కథలోకి వెళితే కిరణ్ వైరాలే, అనిల్ కపూర్ లు ప్రేమలో ఉంటారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అంతలోనే అనిల్ కపూర్ కి లక్ష్మితో పరిచయం ఏర్పడుతుంది. అప్పటికే పెళ్లైన లక్ష్మీ భర్తతో విడిపోతుంది. లక్ష్మి, అనిల్ కపూర్ కంటే చాలా పెద్దది. వాళ్ళిద్దరి పరిచయం ప్రేమో, ఏమో అర్థం కాని అయోమయంలో కొట్టు మిట్టడుతూ ఉంటాడు. అంతకుముందే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు మరొక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం ముందుకు సాగుతోంది. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ మానసిక సంఘర్షణని, మరోవైపు సమాజంను దృష్టిలో పెట్టుకుంటారు. తనకంటే పెద్దది, భర్తతో విడిపోయి ఉన్న అమ్మాయితో  ప్రేమలో ఉండడం లాంటి సంఘర్షణ ఉన్న కథను తీసుకొని సుబ్రహ్మణ్యం తన 26 ఏళ్ల వయస్సులో “పల్లవి అను పల్లవి” అనే కన్నడ సినిమా తీశారు.   అదే “మణిరత్నం” యొక్క మొట్టమొదటి సినిమా. ఇళయరాజా పాటలు అద్భుతంగా ఉన్నాయి. బాలు మహేంద్ర ఛాయాగ్రహణం అదిరింది. నటీనటుల గురించి చెప్పాల్సిన పనిలేదు. మణిరత్నం చేసిన స్క్రీన్ ప్లే, తీసిన విధానం కూడా ఆకట్టుకుంది.

సుబ్రహ్మణ్యం నుండి మణిరత్నం గా పేరు మార్పు...

పల్లవి అను పల్లవి సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులు చూడలేదు. ఆ సినిమా నిరాశపరిచింది. ప్లాఫ్ అయ్యింది. కర్ణాటక చలనచిత్ర పరిశ్రమ నుండి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు సుబ్రహ్మణ్యం. తన తండ్రి పేరు గోపాలరత్నం నుండి “రత్నం”, తన పేరులోని సుబ్రహ్మణ్యం నుండి మణిని తీసుకొని “మణిరత్నం” అని పేరును వెండితెరపై తొలిసారి వేసుకున్నారు. అప్పటినుండి తాను మణిరత్నంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పల్లవి అను పల్లవి సినిమాకు డబ్బులు రాలేదు. మణిరత్నం, ఇళయరాజా, బాలు మహేంద్ర తదితరుల పనితనం బాగుంది. ఈ సినిమా మంచిగా తీసినా కానీ నిరాశనే మిగిల్చింది.

మణిరత్నంకు తన మొట్టమొదటి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా 1983లో విడుదలైంది. మణిరత్నం తండ్రి కూడా ముందే చెప్పారు. సినిమా అద్భుతంగా తీశావు, కానీ ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చదు. కచ్చితంగా ఈ క్లాసిక్ సినిమాని ప్రజలు చూడలేరు అని మణిరత్నం తండ్రి చెప్పారట. మణిరత్నం మాములుగానే తమిళుడైనప్పటికీ తాను తీసిన మొట్టమొదటి కన్నడ సినిమా పరాజయం పాలయ్యింది. ఈ సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా నీకు మంచి పేరు వస్తుందని అనిల్ కపూర్ మణిరత్నంకు చెప్పారు.

రెండవ సినిమా మలయాళంలో “ఉనారూ”…

పల్లవి అను పల్లవి సినిమా పరాజయం పాలవ్వడంతో మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్ కథ నువ్వు చూసుకో, నేను సినిమా తీస్తాను అని మణిరత్నంతో అన్నారు. కానీ మణిరత్నం సంతృప్తి చెందలేదు. ఈసారి జనం మధ్య నుండే ఒక కథను తీసుకోవాలనుకున్నారు మణిరత్నం. మలయాళం ప్రజల కోసం ఒక సినిమా తీయాలని అనుకున్నారు. అప్పట్లో రాజకీయ కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. ప్రతీ కుటుంబం ఒక రాజకీయ పార్టీలో మమేకమై ఉండేది. కమ్యూనిజం భావాలన్న కేరళలో కార్మికుల యూనియన్ గొడవల చుట్టూ తిరిగే కథ ఒకటి వ్రాసుకున్నారు. ఆ సినిమా పేరు “ఉనారూ”. ఉనారూ అంటే అర్థం భావన. సాంకేతిక వర్గాన్ని ఎన్నుకోవడంలో ఎక్కువ ఇబ్బంది పడలేదు, అడ్డంకులు లేవు. అన్నయ్య మద్దతు ఉంది, నాన్న సినిమా పరిశ్రమకు చెందినవాడు. ఉనారూ సినిమాలో హీరో మోహన్ లాల్, సంగీతం ఇళయరాజా. ట్రేడ్ యూనియన్, కమ్యూనిజం, రాజకీయాలు వీటి చుట్టూ తిరిగే అంశాలతో మంచి నమ్మకంతో మలయాళ సినిమా తీశారు.  అన్నయ్య నిర్మాత. పల్లవి అను పల్లవి 1983 లో విడుదలైతే, మరుసటి సంవత్సరం 1984లో “ఉనారూ” విడుదలైంది. ఇది కూడా నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా కూడా ప్లాఫ్.

మొదటి తమిళ సినిమా “పగల్ నిలవు”…

ఉనారూ ప్లాఫ్ తో మణిరత్నం అదిరిపడ్డాడు. ఎం.బీ.ఏ డిగ్రీ గోడ మీద నుండి వెక్కిరిస్తుంది. మణిరత్నం తీసిన రెండు సినిమాలు మంచివే అన్నారు, కానీ డబ్బులు రాలేదు. ఇక లాభం లేదు ఈసారి వాణిజ్యపరమైన సినిమా తీయాలనుకున్నారు. తాను చూసిన ఇంగ్లీష్ సినిమాల నుండి, ఇంగ్లీష్ నవల నుండి కథను అల్లుకున్నాడు. భావోద్వేగాలతో నడిచే కథ. వాస్తవాలకు దూరంగా ఉన్నా కూడా కథ ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నారు. దాని పేరు “పగల్ నిలవు”. అంటే తెలుగులో “పగటి చంద్రుడు” అని అర్థం. ఇది తమిళ సినిమా. తొలి సినిమా కన్నడ, రెండవ సినిమా మలయాళం, మూడవ సినిమా తమిళ సినిమా “పగల్ నిలవు”. ఇది 1985లో విడుదల అయ్యింది. దీని కథ విషయానికి వస్తే “ఈ సినిమాలో ఒక కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో గుండా పంచన చేరుతాడు.

ఆ గుండా కూడా ఆ కుర్రాడిని చేరదీస్తాడు. దాంతో ఆ గుండా కి ఆ కుర్రాడు సహాయకుడిగా ఉండాల్సి వస్తుంది. హీరో మురళి, ఆ గుండా వద్ద ఉన్నపుడు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె రేవతి. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె పోలీసు అధికారి చెల్లెలు. ఆ పోలీసు అధికారి శరత్ బాబు. శరత్ బాబు, మురళికి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఈ పాత్రల చుట్టూ కథ వ్రాసుకున్నారు మణిరత్నం. అప్పటికే పేరున్న కథానాయకుడు మురళి, రేవతి, సత్యరాజ్, రాధిక, శరత్ బాబు అందరూ పేరున్న నటీనటులే. సంగీతం ఇళయరాజా. అన్నయ్య నిర్మాతగా ఈ సినిమాను మణిరత్నం తమిళంలో తీశారు. తనకు మొట్టమొదటి తమిళ సినిమా ఇది. ఎప్పటిలాగే ఈ సినిమా కూడా నిరాశను మిగిల్చింది. మళ్ళీ ప్లాఫ్. దాంతో మణిరత్నం పేరు పడిపోయింది. ఇక ఇతని మీద పైసా పెట్టినా దండగే అనుకున్నారు. సినిమా వదిలేసి ఉద్యోగం చేసుకోమన్నారు ఇంట్లో వాళ్ళు. కానీ మణిరత్నం వదల్లేదు.

నాలుగవ సినిమా తమిళంలో “ఇదయ కోవిల్”…

ఎక్కడో లోపల తనపై తనకు ఆత్మవిశ్వాసం పోతుంది, కూడతీసుకుంటున్నాడు. ఎందుకంటే తన వెనకాల ప్రోత్సహించేవాళ్లు ఉన్నారు. ప్రేక్షకులకి ఏం కావాలో మణిరత్నంకు అర్థం అవ్వడంలేదు. ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఈ మూడు సినిమాలలో ప్రధానమైన పాయింట్ ఒకటి ఉంది. అదే సంగీతం. దాంతో సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమా తీయాలనుకున్నారు మణిరత్నం. 

కోవైతంబి నిర్మాతగా నాలుగో సినిమా “ఇదయ కోవిల్” అనే పేరుతో సినిమా మొదలుపెట్టారు. ఇదయ కోవిల్ అనగా హృదయ కోవెల అని అర్థం. సంగీతం ప్రధానంగా ఉండే క్లాసికల్ కథను అల్లుకున్నారు. ఇందులో మోహన్ ను కథానాయకుడుగా ఎంచుకున్నారు. నటి రాధ కళాశాల విద్యార్థి.

కథ విషయానికి వస్తే మోహన్ చాలా గొప్ప గాయకుడు. ఒక కళాశాల ఫంక్షన్ లో ఈ మోహన్ ను ఆహ్వానించాలని అనుకుంటుంది రాధ. కానీ అతను దొరకడు. ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఆమె వెళ్లిన ఆ సమయంలో మందు త్రాగి అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉంటాడు. ముందు రాధ ఆశ్చర్యపోతుంది. ఆ తరువాత ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. అతని మాటలలో తన నేపథ్యం తెలుస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన అతను సినిమాలకు వెళ్లాలని అనుకుంటారు. అతడిని సినిమాలలో వెళ్లడానికి ప్రోత్సహించి ధైర్యం ఇచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అంబిక, నిజజీవితంలో రాధ వాళ్ళ అక్క. అతడిని మద్రాసుకు పంపించింది. మద్రాసుకు వచ్చిన అతడు గాయకుడు అయ్యాడు. అదే సమయంలో అతడిని వెతుక్కుంటూ అంబిక మద్రాసుకు వస్తుంది. గూండాల చేతిలో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూసిన గాయకుడు మోహన్ త్రాగుబోతు అవుతాడు.

ఈ కథ అంతా తనకు పరిచయమైన రాధకు చెబుతాడు. ఇది తెలిసిన రాధ అతడిని ఇష్టపడుతుంది. రాధ వాళ్ళ ఇంట్లో ఆమెకు సంబంధాలు చూస్తుంటారు. అనుకోకుండా ఒక సంబంధం కుదుర్చుతారు. సహజంగానే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో రాధ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. అతను అంబిక, రాధ (రెండు) సమాధుల వద్ద నిలుచుని ఉండగా కథ పరిసమాప్తమవుతుంది. ఇది హృదయాన్ని బాగా హత్తుకునే కథ. అందులో కథానాయకుడు గాయకుడు. పాటలు చాలా బాగున్నాయి. కళాఖండాన్ని చాలా అద్భుతంగా తీశాను అనుకున్నారు మణిరత్నం. కానీ ఎప్పటిలాగే పాత కథే. నాలుగో సినిమా కూడా ఏమాత్రం సందేహం లేకుండా అట్టర్ ప్లాఫ్. మణిరత్నంకు పర్వతం పైనుండి ఒకేసారి క్రింద పడ్డట్టయ్యింది. తన సినిమా ప్రస్థానం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. పైకి వచ్చే పరిస్థితి లేదు. బయటికి వచ్చే పరిస్థితి లేదు. ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. ఇక తనతో ఎవ్వరు సినిమాలు తీయరు. ఈ విధంగా ఆలోచిస్తున్నారు మణిరత్నం.

మొదటి విజయం “మౌనరాగం”… 

ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా వరుసగా నాలుగు సినిమాలు ప్లాఫ్ లే. సినిమాకు పెట్టుబడి పెడుతున్నారు. కానీ లాభాలు రావడం లేదు. మళ్ళీ అదే గోల. ఇంట్లో వాళ్ళు సినిమాలు మానేయమని, ఉద్యోగం చేసుకోమని ఒత్తిడి. లేదంటే వ్యాపారం చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. బంతిని ఎంత వేగంతో గోడకు కొడితే అంతే వేగంతో వెనక్కి వస్తుంది. అలా బంతిలా తయారవ్వాలనేది మణిరత్నం ఆశయం. అందువలన మణిరత్నంకు ఇంకా ఆశ చావలేదు. తన మీద నమ్మకం ఉంది. వాళ్ల అన్నయ్యతో మాట్లాడుతున్నారు. ఒకే ఒక్క సినిమా అన్నయ్యా, ఇదే ఆఖరి సినిమా. ఇది కూడా పోతే నేను వెళ్లి ఎం.బీ.ఏ డిగ్రీతో వ్యాపారం చేసుకుంటా అని అన్నయ్యతో చెప్పగా, తాను కూడా సరే అన్నారు.

ఆఖరి అవకాశం. నేను ఎందుకు విజయవంతం అవ్వలేకపోతున్నానని సుదీర్ఘ ఆలోచనలో పడ్డారు. విజయవంతమైన సినిమాలన్నీ చూడసాగారు. జె. మహేంద్రన్ అనే తమిళ దర్శకుడు “నెంజతై కిల్లాతే” సినిమా తీశారు. దానిని జనం ఎగబడి చూస్తున్నారు. ఆ సినిమా చూసి ఆ ప్రేమ కథను మార్చి మణిరత్నం కథ వ్రాసుకున్నారు.  మహేంద్రన్ వద్దకెళ్ళి మీ సినిమానే కథ మార్చి వ్రాసుకుంటున్నాను సార్. ఈ కథనే సినిమాగా తీస్తున్నాను అని అన్నారట. “పల్లవి అను పల్లవి” సినిమా కంటే ముందే మహేంద్రన్ దగ్గర సహాయకుడిగా చేరాలనుకున్నారు మణిరత్నం. కానీ కుదరలేదు. ఇప్పుడు నిజాయితీగా మీ కథే మార్చి వ్రాశాను అని చెప్పి సినిమాగా తీశాడు. ఆ సినిమా పేరు “మౌనరాగం”.

అద్భుతమైన కథనం “మౌనరాగం”… 

ఇక కథ విషయానికి వస్తే హీరో, హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి హీరో దగ్గరికి రాదు. తనకు బహుమతిగా ఏం కావాలని అడిగితే విడాకులు కావాలి అంటుంది. బిత్తరపోయిన హీరో ఆమె నేపథ్యం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆమె ఇంతకుముందే కళాశాలలో ఒక అబ్బాయిని ప్రేమించి, రిజిస్టర్ కార్యాలయంకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటుండగా ఆ అబ్బాయి అక్కడే పోలీసు కాల్పుల్లో మరణిస్తాడు. అందువలన తాను అంటే ఇష్టం లేదని హీరో తెలుసుకుంటాడు. ఆమె గతం తెలుసుకున్నాక హీరోయిన్ ను వదలడం ఇష్టం ఉండదు.

హీరో, హీరోయిన్ విడాకులకు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు సంవత్సరం పాటు కలిసి ఉండాలనే షరతు విధిస్తారు. ఆ క్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మళ్ళీ కలిసిపోవడం జరుగుతుంది. ఇది కథ. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం. మొట్టమొదటి నాలుగు సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ఇళయరాజా సంగీతం లోనే నడుస్తుంది. ఈ సినిమాకు ముందుగా దివ్య అనే పేరు పెడదామనుకున్నారు. కానీ ఒక పాటలో “మౌనరాగం” అనే పేరు వచ్చేసరికి ఈ సినిమాకు “మౌనరాగం” అనే పేరు పెట్టి విడుదల చేశారు. ఈ సినిమా విడుదల అయినప్పటి ఉదయం ఆట నుండే విజయవంతం అనే టాక్ రావడమే కాకుండా అత్యద్భుతమైన విజయం సాధించింది.

ఏడు సంవత్సరాలు కొనసాగిన ప్రభంజనం…

మౌనరాగం సినిమాతో మొదలైన మణిరత్నం ప్రభంజనం ఏడు, ఎనిమిది సంవత్సరాలు  “దొంగ దొంగ” సినిమా వరకు అడ్డు అదుపు లేకుండా సాగింది. “దొంగ దొంగ” సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఆ తరువాత బొంబాయి అద్భుతమైన విజయం సాధించింది. మణిరత్నం ఇప్పటివరకు తీసిన ప్రతీ సినిమా కూడా మణిరత్నం మార్క్ సినిమా లాగా నిలిచిపోతాయి. మౌనరాగం సినిమా సామాన్య ప్రేక్షకుడికి ఏ విధంగా చేరువైందో చూద్దామని మద్రాసుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరుకు వెళ్లి ఆ సినిమా చూసి  బయటకొస్తున్నప్పుడు ఒక ప్రేక్షకుడు తన మిత్రుడితో “ఎందుకురా ఆ అమ్మాయిని ఒకటే బ్రతిమిలాడుతాడు హీరో? ఆమెను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా” అన్నాడట.

ఆ సన్నివేశం చూసిన మణిరత్నం మిత్రులందరి వద్ద చాలా సంవత్సరాలు వాపోయారట. “ఇంత క్లాస్ గా సినిమా తీశాను. ఆ ఒక్క ప్రేక్షకుడు మాత్రం నా మనసు నుండి పోవడం లేదు. ఆ ఒక్క వాక్యంతో సినిమాను కొట్టి పారేశారు” అని చాలా సంవత్సరాలు మిత్రుల వద్ద వాపోయారట మణిరత్నం. తన జీవితంలో పెద్ద విషాదం ఏంటంటే “మణిరత్నం” సినిమా జీవితానికి గట్టి పునాదులు వేసి, ఆయన చలనచిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి దోహదం చేసిన అన్నయ్య వెంకటేశ్వరన్ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మణిరత్నం తమ్ముడు శ్రీనివాసన్ కూడా మనాలి వెళ్లినప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ క్రిందపడి కాళ్ళు విరిగి మరణించారు. ఈ రెండు సంఘటనలు మణిరత్నం సినిమా జీవితంలో విషాదాలు.

Show More
Back to top button