CINEMATelugu Cinema

అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు పొందిన సంగీత దర్శకులు.. సి.ఆర్. సుబ్బరామన్..

26 జూన్ 1953 నాడు విడుదలైన ఒక తెలుగు సినిమా “తెలుగు సినిమా చరిత్ర” లో అజరామరంగా నిలిచిపోయింది. తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలబడే చిత్రం అది. ఆ సినిమాలో నటించిన సాంకేతిక వర్గంలో కూడా ప్రతీ ఒక్కరికి పేరు తెచ్చి పెట్టింది ఆ సినిమా. ప్రతీ ఒక్కరినీ కూడా చిరంజీవిని చేసింది. అదే దేవదాసు (1953) సినిమా. అక్కినేని, సావిత్రి, ఘంటసాల, సముద్రాల రాఘవాచార్య, వేదాంతం రాఘవయ్య, డి.ఎల్.నారాయణ తో పాటు సంగీత దర్శకులు సి.ఆర్.సుబ్బరామన్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. దేవదాసు చిత్రానికి స్వరాలు సమకూర్చే సమయానికి సి.ఆర్.సుబ్బరామన్ వయస్సు కేవలం 28 సంవత్సరాలు. అప్పటికే ఆయన ఎనిమిది సంవత్సరాలుగా చిత్రసీమలో కొనసాగుతున్నారు. ఎనిమిది యేండ్లలో 45 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం, అందులో సంవత్సరానికి అతి తక్కువ చిత్ర నిర్మాణం జరిగిన ఆ సంవత్సరంలో ఆ అరుదైన ఖ్యాతి సుబ్బరామన్ కే దక్కింది.

ఆ రోజులలో తెలుగు, తమిళ ప్రేక్షకులు, సంగీత అభిమానులు సి.ఆర్.సుబ్బరామన్ తమకు లభించిన వరం అనుకున్నారు. కానీ వారు అనుకున్నంతగా వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సినిమా రంగాన్ని తన సంగీత ప్రతిభతో ఒక ప్రభంజనంలా చుట్టేసిన సుబ్బరామన్ హఠాత్తుగా అందరినీ వదిలేసి అదృశ్యమైపోయారు. 70 యేండ్ల తరువాత కూడా ఆయన స్వరపరచిన పాటల్ని నిత్య నూతనంగా ఆహ్వానిస్తున్నారు.  సుబ్బరామన్ 28 సంవత్సరాల వయస్సులో కన్ను మూయకుండా ఉండి ఉంటే ఎన్ని వేల పాటలు మనకు అందించేవారో అని మనకు అనిపిస్తుంది.

“జీవితం ఎంతో తీయనిది, అందుకనే అతి స్వల్పమది” అన్నారు సినీ కవి గోపి. దానికి ఉదాహరణ సి.ఆర్.సుబ్బరామన్. జబ్బపండు ఛాయా, సిల్కు జబ్బా, సిల్కు ధోవతి, నుదుటిన బొట్టు, చేతికి బంగారు గడియారం, వ్రేళ్లకు బంగారు ఉంగరాలు, యువరాజు దర్జాతనం, సినిమా రీలు తిరిగేటంత వేగంగా స్వరాలు కూర్చగల వేగం, మనసులోనే స్వర రచన చేయగల అద్వితీయ ప్రతిభ, అన్నింటినీ వదిలేసి అతి చిన్న వయసులోనే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించిన విషాదం సి.ఆర్.సుబ్బరామన్. ఆయన స్వరపరచిన మధురాతి మధుర పాటలతో స్వరకర్తల, గాయనీ గాయకుల పరంపరను మనకు వదిలేసి వెళ్లారు. 

ఘంటసాల మాస్టారు, విశ్వనాథన్ రామ్మూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, టీ.జీ.లింగప్ప, జి.కే.వెంకటేష్, ఎం సుబ్రహ్మణ్య రాజు ఇలాగ అందరూ కూడా సుబ్బరామన్ దగ్గర సంగీత దర్శకులుగా శిష్యరికం చేసినవారే. గాయని లీల కూడా రెండు సంవత్సరాల పాటు సుబ్బరామన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు.  ఆమె తొలి రోజులలో “దేవదాసు” చిత్రం ద్వారా కె. రాణి అనే గాయనిని పరిచయం చేసింది సుబ్బరామన్. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు యం.యల్ వసంత కుమారిని సినీ గాయనిగా తమిళ చిత్రం “రాజముక్తి” ద్వారా పరిచయం చేసిందీ సి.ఆర్.సుబ్బరామన్.

ఘంటసాలను “పైత్యకారన్” అనే చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కూడా సుబ్బరామనే. తమిళనాడు టాకీస్ సౌందర రాజన్ “చెంచులక్ష్మి” చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది సుబ్బరామనే. భానుమతి రామకృష్ణ సొంత సంస్థ “భరణీ పిక్చర్స్” వారు నిర్మించిన తొలి చిత్రం “రత్నమాల” కు సంగీత దర్శకత్వం వహించింది కూడా సుబ్బరామన్. అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం “సీతారామ జననం” చిత్రానికి నేపథ్య సంగీతం అందించింది సుబ్బరామన్.

నేపథ్యం…

సి.ఆర్.సుబ్బరామన్ (లేదా) సి.ఆర్.సుబ్బురామన్ (లేదా) చింతామణి రామ సుబ్బరామన్ వాళ్ల తాత, ముత్తాతలు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణానది తీరానికి చెందినవారు. సుబ్బరామన్ జన్మించే సమయానికి కొన్ని దశాబ్దాల క్రితమే వీరు తమిళనాడులోని చింతామణి అనే ఊరికి వలస వెళ్లారు. ఎన్నో సంవత్సరాల క్రిందట వాళ్లు తెలుగు గడ్డను విడిచి వెళ్లినప్పటికీ వాళ్ళు మాతృభాషను మర్చిపోలేదు. వాళ్ళ పిల్లలందరూ తమిళ మీడియంలో చదువుకునేవారు, కానీ ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడుకునేవారు. సుబ్బరామన్ నాన్న పేరు రామస్వామి అయ్యర్.

ఆ వాతావరణంలో సుబ్బరామన్ 18 మే 1924 నాడు జన్మించారు. సుబ్బారామన్ కి ఊహ తెలిసిన మాట్లాడం మొదలుపెట్టిన నాటి నుండి సంగీతం అంటే విపరీతమైన ఆసక్తి చూపిస్తుండేవారు. ఆయనకు ఆ రోజులలో చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి లాంటి నిబంధనలు ఏమీ లేవు. పైగా ఆయన పెరిగింది కూడా సంగీతం అంటే ప్రాణమిచ్చే తమిళ వాతావరణంలో. ఆ పిల్లవాడి ఆసక్తిని గమనించిన వాళ్ళ నాన్న ఆయనకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వందల మైళ్ళ దూరంలో ఉన్న కుంభకోణం తీసుకెళ్లి అక్కడ నాదస్వర సంగీత విద్వాంసుల వద్ద శిక్షణ కోసం చేర్పించారు. అప్పట్లో శిక్షణ దాదాపు 10 ఏళ్ల పాటు కొనసాగింది.

16 సంవత్సరాలకే  హెచ్.యం.వి లో చేరిక…

“పూవు పుట్టగానే పరిమళిస్తుంది” అన్నట్లు గురువు గారు పొద్దునపూట ఎప్పుడైనా స్వరం నేర్పిస్తే సాయంకాలం కల్లా పూర్తి సాధనతో, పూర్తి పరిణితితో తిరిగి గురువుగారికి వినిపిస్తుండేవారు. ఆ కుర్రాడి వేగం చూసిన గురువుగారు అవాక్కవుతూ ఉండేవారు. ఆ వేగమే తరువాత దశాబ్దాలలో ఆయనను పూర్తిస్థాయి సంగీత దర్శకులు అయ్యాక కూడా కొనసాగింది. సుబ్బరామన్ నాదస్వరంలో శిక్షణ అయ్యాక హార్మోనియం లో శిక్షణ ప్రారంభించారు. అలా 14 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి బాల మేధావిగా గురువుల గుర్తింపు పొందారు. సుబ్బారామన్ తన తదుపరి శిక్షణ కోసం “మైలాపూర్” నుండి మద్రాసుకు మారారు. ఆయనకు పియానో నేర్పడానికి ఒక గురువును మాట్లాడారు. వాళ్ళ నాన్న రోజు మూడు మైళ్ళ కాలినడక వెళ్లి పియానో శిక్షణ పొందేవారు సుబ్బరామన్. సుబ్బరామన్ లోని ప్రతిభను గమనించిన జి.రామనాథన్ సోదరుడు సుందర భాగవతార్  హెచ్.ఎం.వి లో చేరమని సలహా ఇచ్చారు. అలా సుబ్బరామన్ తన 16 సంవత్సరాల వయస్సులో (1940) హెచ్.ఎం.వి. సంస్థలో వాయిద్య, సంగీత బృందంలో సభ్యుడిగా చేరారు.

పీ.కే.రామ్మూర్తి ని  హెచ్.యం.వి కి సిఫారసు…

హెచ్.ఎం.వి సంగీత బృందానికి దర్శకుడు ఆర్.చిన్నయ్యార్. అప్పటికే 1940 కే సంగీత దర్శకుడైన సాలూరు రాజేశ్వరరావు కూడా ఒకప్పుడు హెచ్.ఎం.వి రికార్డులలో పాటలు పాడిన వారే. ఆ పరిచయంతో ఆయన హెచ్.ఎం.వి కి వచ్చి వెళుతున్న సందర్భాలలో రాజేశ్వరరావుతో కూడా పరిచయం ఏర్పడింది. సుబ్బరామన్ హెచ్.ఎం.వి సంస్థలో చేరిన కొద్ది రోజులకే తన ప్రతిభతో సహాయ సంగీత దర్శకుడు స్థాయికి ఎదిగారు. పగలంతా హెచ్.యం.వి సంస్థలో పనిచేయడం, సాయంత్రం అయ్యేసరికి భజనలో కీర్తనలను పాడుకునేవారు సుబ్బరామన్.

అలా పాడేటప్పుడు వయోలిన్ మీద వాయిద్య సహాకారం అందించే ఒక కుర్రవాడిలో ఉన్న చురుకును గమనించి ఆ కుర్రాడిని గురించి హెచ్.యం.వి కి సిఫారసు చేశారు సుబ్బారామన్. ఆ కుర్రాడే తరువాత రోజులలో విశ్వనాథన్ రామ్మూర్తి ద్వయంలో ఒకరైన పీ.కే.రామ్మూర్తి. అలా సుబ్బరామన్ సహాయంతో హెచ్.ఎం.వి లో చేరిన రామ్మూర్తి ఆ తరువాత రోజులలో సి.ఆర్.సుబ్బరామన్ సినీ సంగీత దర్శకులయ్యాక ఆయన దగ్గర సహాయకుడిగా కొనసాగారు. ఆ రోజులలో సినీ సంగీతం కోసం ఆర్కెస్ట్రాలు ఎక్కువ ఉండేవి కావు. కొన్ని మాత్రమే ఉండేవి. హెచ్.ఎం.వి ఆర్కెస్ట్రాలో సినిమా సంగీత దర్శకులుగా పనిచేస్తూ ఉండేవారు. అలా హెచ్.ఎం.వి లో సభ్యులుగా ఐదారు సినిమా పాటల రికార్డింగ్ లలో పాల్గొన్నారు.

తొలిసారి “చెంచులక్ష్మి” తో అవకాశం…

1943లో సౌందర్ రాజన్ అనే తమిళకుడు “చెంచులక్ష్మి”  అనే తెలుగు సినిమా తీయడానికి పూనుకొన్నారు. ఆయనని తెలుగు సరిగ్గా రాదు కానీ మంచి వ్యాపారవేత్త. దర్శకత్వం కూడా ఆయనే చేద్దామనుకున్నారు. ఆయన చాలా పొదుపురి కాబట్టి వేరే సంగీత దర్శకుడు ఎందుకని హెచ్.ఎం.వి లో ఉన్న సి.ఆర్.సుబ్బరామన్ కు బాస్ అయిన ఆర్. చెన్నయ్యర్ ను సంగీతం సమకూర్చి పెట్టమని అడిగారు. కేవలం ఆర్కెస్ట్రా తోనే కాకుండా పాటలు, బాణీలు, గాయనీ గాయకులు ఇదంతా చిన్నయ్యర్ చూసుకోవాలి. ఆయన ఒకటి, రెండు పాటలు చేశాక హఠాత్తుగా మరణించారు. అప్పుడు సౌందర రాజన్ సాలూరు రాజేశ్వరావు ను సంగీత దర్శకుడిగా నియమించారు. రెండు, మూడు పాటలు చేశాక కారణాంతరాల వల్ల ఆయన కూడా బయటకు వెళ్లిపోయారు. ఇలా జరిగాక సంగీత దర్శకుడిగా ఎవరిని పెట్టాలని ఆలోచించి సుబ్బరామన్ గారిని ఎంచుకున్నారు.

చెంచులక్ష్మి సినిమాకి సుబ్బరామన్ బాణీలు సమకూర్చలేనని చెప్పారు. ఆ సినిమాకి పాటలు, మాటలు వ్రాసే సముద్రాల రాఘవాచార్య 19 ఏళ్ల సుబ్బరామన్ ను ప్రక్కన కూర్చోపెట్టుకొని ఆయన వ్రాసిన పాటకు ముందు స్వరం వేయమని, ఆ తరువాత పాట పాడమని చేపట్టుకుని నడిపించినట్టుగా సుబ్బరామన్ తో మిగతా పాటలు పూర్తి చేయించారు. ఆ విధంగా తన 19 సంవత్సరాల వయస్సులో అనుకోకుండా సినీ సంగీత దర్శకులు అయ్యారు సి.ఆర్.సుబ్బరామన్. “చెంచులక్ష్మి” సినిమా 14 జనవరి 1944 విడుదల అయ్యింది. ఆ సినిమా విజయం ఒక ప్రక్కన ఉంచితే ఆ సినిమాతో సుబ్బరామన్ సంగీతానికి మంచి పేరు వచ్చింది. నేపథ్య సంగీతంలోనూ, గూడెం డాన్సులలో కూడా ఆయన వాడిన పాశ్చాత సంగీత వాయిద్యాలు శ్రోతలను మరో లోకంలోకి తీసుకెళ్లాయి. అందులో నరసింహావతారం పాత్ర వేసింది సి.హెచ్. నారాయణ రావు. ఆయనకు సుబ్బరామన్ స్వయంగా రెండు పాటలు పాడారు.

నేపథ్య సంగీత దర్శకుడిగా “సీతారామ జననం”…

ఆ రోజుల్లో సినిమాలలో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని తెలుసుకొన్న సుబ్బరామన్ హెచ్.ఎం.వి. లో మానేశారు. అక్కినేని కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం “సీతారామ జననం” సినిమా 22 నవంబరు 1944 నాడు విడుదలైంది. అందులో నేపథ్య సంగీతాన్ని ఎక్కువగా సి.ఆర్.సుబ్బరామన్ సమకూర్చారు. సుబ్బరామన్ కు ఒక్కసారి పరిచయమైతే చక్కటి స్నేహభావాన్ని కొనసాగిస్తారనడానికి “సీతారామ జననం” ఒక ఉదాహరణ. ఆ సినిమా నిర్మాత దర్శకులు ఘంటసాల బలరామయ్య భవిష్యత్తులో తీసిన సినిమాలన్నింటిలోనూ కూడా సి.ఆర్.సుబ్బరామన్ తో సంగీతం చేయించుకున్నారు.

ఆయనకు అదే సంవత్సరం 1944 వ సంవత్సరంలో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. సి.ఆర్.సుబ్బరామన్ కు తమిళ చిత్ర పరిశ్రమ నుండి “ఉదయనన్ వాసవదత్త” అనే త్యాగరాజు భాగవతార్ సినిమాను సంగీతం సమకూర్చే అవకాశం ఇచ్చారు. కానీ అనుకోని పరిస్థితులలో పోలీసులు అరెస్టు చేసి రెండున్నర సంవత్సరాలు జైల్లో పెట్టారు. “ఉదయనన్ వాసవదత్త” నిర్మాతలు త్యాగరాజు భాగవతార్ లేడు కాబట్టి ఆయన స్థానంలో వేరే హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణులను పెట్టుకున్నారు. ఈ మార్పుల వల్ల తప్పిపోయిన సుబ్బరామన్ అవకాశాల్ని త్యాగరాజు భాగవతార్ జైలు నుంచి వచ్చిన తరువాత కల్పించారు.

సాహా సంగీత దర్శకులుగా “లవంగి”… 

ఒక త్రోవ మూసుకుపోతే ఇంకో త్రోవ తెరుచుకుంటుంది అన్నట్టుగా సుబ్బరామన్ కి 1946లో తమిళ చిత్రానికి సహా సంగీత దర్శకుడుగా పని చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు “లవంగి”. దాని దర్శకుడు, కథానాయకుడు వై.వి.రావు, కథానాయికగా వై.వి.రావు భార్య రుక్మిణి. ఆ సినిమాకి హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి సంగీత దర్శకులు. అయితే ఆయనతో కలిసి సంగీత స్వరాలు సమకూర్చారు సుబ్బరామన్. ఆ “లవంగి” సినిమా హిందీలో “జగన్నాథ పండిట్” గా వచ్చింది. ఆ విధంగా సి.ఆర్. సుబ్బారామన్ సంగీత స్వరాలు హిందీ చిత్ర రంగానికి కూడా వెళ్లాయి. ఆ రోజుల్లో నటుడిగా పేకేటి శివరాం కొంతమంది మిత్రులను కలుపుకొని “జయంత జంపాల” అనే ఒక సినిమా తీద్దామని సి.ఆర్. సుబ్బరామన్ ను కలుసుకొని ఆరు పాటలు రికార్డింగ్ కూడా చేశారు. కానీ ఆ సినిమా చిత్రీకరణ పట్టాలకెక్కలేదు. ఆ తరువాత సుబ్బరామన్ గాలి పెంచల నరసింహారావు వద్ద సహాయకులుగా చేరి “బాలరాజు” సినిమాకు సంగీతం సమకూర్చారు. ఆ సినిమాలో నేపథ్య సంగీతం అంతా కూడా సుబ్బరామన్ సమకూర్చారు.

భరణి వారి “రత్నమాల”…

ఆయన “బాలరాజు” చిత్రానికి పనిచేస్తున్న రోజులలోనే సుబ్బరామన్ కు “రత్నమాల” సినిమా తో తెలుగు సినిమాకి నేరుగా సంగీతం సమకూర్చే అవకాశం వచ్చింది. రామకృష్ణ, భానుమతి ల “భరణి పిక్చర్స్” అనే చలనచిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి తొలిసారిగా “రత్నమాల” అనే సినిమాను ప్రారంభోత్సవం చేశారు. ఆ సినిమాకి సంగీత దర్శకులు సిఆర్ సుబ్బరామన్. ఈ సినిమాతోనే ఘంటశాల సి.ఆర్.సుబ్బరామన్ దగ్గర సహాయకుడిగా చేరారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఆ సినిమాలోని పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. అలా భరణి నిర్మాణ సంస్థతో ప్రారంభమైన సుబ్బరామన్ అనుబంధం ఆయన జీవించి ఉన్నంత కాలం మాత్రమే కాదు, అనుబంధానికి గుర్తుగా సుబ్బరామన్ చనిపోయినప్పుడు కూడా “భరణి” వారి చండీరాణి (1953) కి కూడా సుబ్బరామన్ పేరే కొనసాగించారు. ఆ “రత్నమాల” సినిమా 02 జనవరి 1948 నాడు విడుదలైతే, ఆయన నేపథ్య సంగీతమయించిన బాలరాజు చిత్రం 26 ఫిబ్రవరి 1948 నాడు విడుదలైంది.

లైలా మజ్ను తో “స్టార్ ఇమేజ్”…

రత్నమాల, బాలరాజు అనే రెండు చిత్రాలు విడుదలయ్యాక త్యాగరాజ భాగవతార్ నిర్మించిన ఒక తమిళ చిత్రం “రాజముక్తి” సినిమాకి .ఆర్. సుబ్బరామన్ సంగీత దర్శకత్వం వహించారు. తన చలనచిత్ర జీవితం ప్రారంభమైన తొలి రోజుల్లోనే సి.ఆర్. సుబ్బరామన్ సంపాదించుకున్న నమ్మకం, గౌరవం గుర్తింపు అలాంటిదే. ఈ చిత్రం 09 అక్టోబర్ 1948 నాడు విడుదలైంది. ఈ సినిమాలోని పాటలు గుర్తింపు పొందాయి. సుబ్బరామన్ వద్ద గాయని పీ.లీల శాస్త్రీయ సంగీతంలో రెండు సంవత్సరాలపాటు శిక్షణ తీసుకున్నారు. ఘంటసాలతో సుబ్బరామన్ అనుబంధం బలపడుతూ వచ్చింది. ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన నాలుగు సంవత్సరాల తరువాత 1948లో సుబ్బరామన్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం భరిణి వారి “లైలా మజ్ను”. ఆ సినిమా 01 అక్టోబరు 1948 నాడు విడుదలైంది.

అరబిక్ నైట్స్ నుంచి తీసుకున్న ఈ కథ అనుగుణంగా సంగీతం దర్శకత్వం వహించడంలో సుబ్బరామన్ అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించారు. సుబ్బరామన్ కు కర్ణాటక సంగీతం మీద ఎంత పట్టు ఉండేదో, పాశ్చాత్య సంగీతం మీద కూడా అంతే పట్టు ఉండేది. సుబ్బరామన్ సంగీతం “లైలామజ్ను” చూస్తున్న సంగీత ప్రేక్షకుల్ని ఆ దేశానికి, ఆ కాలానికి తీసుకెళ్లిపోయాయి. ఈ సినిమా వచ్చేసరికి సుసర్ల దక్షిణామూర్తి, విశ్వనాథన్ రామ్మూర్తి, గోవర్ధనమ్ లాంటి వాళ్లు సుబ్బరామన్ కు సహాయకులుగా పనిచేస్తున్నారు. “లైలా మజ్ను” తరువాత సుబ్బరామన్ తీరికలేని సంగీత దర్శకులు అయ్యారు. ఆయనకు ఎల్లప్పుడూ అరడజను పైగానే సినిమాలు చేతిలో ఉండేవి. ఒకేసారి అన్ని సినిమాలకు, పైగా తెలుగు, తమిళ కలిపి పనిచేసినప్పటికీ ప్రతి చిత్రంలో కూడా ప్రతీ పాటను ప్రత్యేకంగా వినిపిస్తూ ఉండేవారు. అందుకే సి.ఆర్.సుబ్బరామన్ పాటలను శ్రోతలు సొంతం చేసుకుంటూ ఉండేవారు.

వినోద చిత్రనిర్మాణ సంస్థ…

సి.ఆర్.సుబ్బరామన్ కు “లైలా మజ్ను” సినిమా తరువాత చెప్పుకోదగ్గ చిత్రం ఘంటసాల బలరామయ్య దర్శక, నిర్మాణంలో వచ్చిన “శ్రీ లక్ష్మమ్మ కథ” చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి పోటీగా రచయిత గోపీచంద్ దర్శకత్వంలో నిర్మాణం జరిగిన “లక్ష్మమ్మ” చిత్రం వచ్చింది.   లక్ష్మమ్మ కు సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఈ పోటీలో గురు, శిష్యులు ఇద్దరు విజయం సాధించారు. ఈ రెండు సినిమాలు 26 ఫిబ్రవరి 1954 నాడు విడుదలయ్యాయి. ఆ తరువాత ఘంటసాల బలరామయ్య దర్శక నిర్మాణంలో నవంబరు 1954 లో విడుదలైన “స్వప్న సుందరి” కి సి.ఆర్.సుబ్బరామన్ సంగీతం అందించారు.

అలా తెలుగు, తమిళ భాషల్లో సుబ్బరామన్ గారి ప్రభంజనం కొనసాగుతున్న రోజులలోనే 1950లో సి.ఆర్.సుబ్బరామన్ సినీ ప్రస్థానంలో మరొక అధ్యాయం మొదలైంది. అది “వినోద చిత్ర నిర్మాణ సంస్థ”. సి.ఆర్.సుబ్బరామన్ మొదటి చిత్రం “చెంచులక్ష్మి” తో రచయితగా పరిచయమైన సముద్రాల రాఘవాచార్య, భరణి సంస్థలో పరిచయమైన నృత్య దర్శకులు వేదాంత రాఘవయ్య, భరణి సంస్థ లోనే ప్రొడక్షన్ మేనేజర్ గా పరిచయమైన డి.యల్.నారాయణ,  సుబ్బరామన్ లు నలుగురు కలిసి స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థ “వినోద చిత్ర నిర్మాణ సంస్థ”. 

ఒకవైపు సంగీత దర్శకులుగా బిజీగా ఉంటూనే 26 ఏళ్ల వయస్సులో సుబ్బరామన్ సహా నిర్మాతగా వాళ్ళందరితో కలిసి నిర్మించిన మొట్టమొదటి చిత్రం “స్త్రీ సాహసం” 09 ఆగస్టు 1951 నాడు విడుదలైంది. ఈ నలుగురు కలిసి నాలుగు విభాగాలను చూసుకున్నారు. “స్త్రీ సాహసం” సినిమాకు సుబ్బరామన్ సంగీతం సమకూర్చారు. ఆ బాణీలు “స్త్రీ సాహసం” విజయంలో ఎంతో దోహదం చేశాయి. ఈ సినిమా విడుదలైన రెండు నెలలకు తెలుగు సినిమా చరిత్రలోనే చరిత్ర సృష్టించిన చిత్రం “దేవదాసు” కు అంకురార్పణ జరిగింది. కానీ ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆపేసి “శాంతి” అనే తక్కువ బడ్జెట్ సినిమా తీసి 15 ఫిబ్రవరి 1952 నాడు విడుదల చేశారు. ఈ చిన్న సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

మరణం…

శాంతి సినిమా విడుదలైన తరువాత మళ్లీ “దేవదాసు” సినిమా చిత్రీకరణ కొనసాగించారు. కానీ అనివార్య కారణాల వలన దేవదాసు చిత్ర నిర్మాణ విభాగం నుండి సుబ్బరామన్ బయటకు వచ్చారు. అలా బయటకి వచ్చినప్పటికీ ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా సుబ్బరామన్ ను కొనసాగించారు. రెండు పాటలు మినహా అన్ని పాటల రికార్డింగ్ స్వరకల్పన పూర్తయ్యింది. అప్పటికే సుబ్బరామన్ వయస్సు 28 సంవత్సరాలు. అప్పటికే 35 సినిమాలు పూర్తి చేసిన సుబ్బరామన్ మరొక 12 సినిమాలు సంగీత స్వరకల్పనలో ఉన్నాయి. చిన్నప్పటి నుండే సుబ్బరామన్ కు ఫిట్స్ వస్తూ ఉండేది. తాను తీరికలేకుండా సినిమాలు చేస్తూ ఉండడం వలన కాబోలు 28 సంవత్సరాలు వచ్చేసరికి సుబ్బరామన్ కు విశ్రాంతి అవసరం అయ్యేది. చివరగా 27 జూన్ 1952 మధ్యాహ్నం భోజనం చేశాక ఆయన తన షవర్లెట్ కారులో ఎక్కడికో తెలిసిన వాళ్ళింటికి  వెళ్లారు. అదే షవర్లెట్ కారులో మధ్యాహ్నం ఆయన మృతదేహం వెనక్కి వచ్చింది.

ఆగిన చిత్రాలు పూర్తిచేసిన శిష్యులు..

ఆ తరువాత తన పార్ధీవ దేహాన్ని తన స్వగ్రామం తీసుకెళ్లారు. చిత్ర పరిశ్రమకు కూడా మరునాటి వరకు సుబ్బరామన్ మరణించిన విషయం తెలియదు.  తన 28 సంవత్సరాల వయస్సులో సంగీత దర్శకులు సుబ్బరామన్ మరణం చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేని విషయం అయ్యింది. ఆయన మరణం తరువాత ఆయన సారథ్యంలో పూర్తి చేయని 12 సినిమాలను ఆయన శిష్యులే పూర్తి చేసి, గౌరవ సూచికంగా ఆయన పేరును కూడా కొనసాగించారు. “దేవదాసు” లో మిగిలిన రెండు పాటల స్వరకల్పన విశ్వనాథన్ రామమూర్తి పూర్తి చేశారు. “దాసి” చిత్రంలోని పాటలను సుసర్ల దక్షిణామూర్తి పూర్తి చేశారు. “బ్రతుకుతెరువు” చిత్రంలోని పాటలను ఘంటసాల పూర్తి చేశారు.

భానుమతి “చండీరాణి” సినిమాలోని పాటలను ఎమ్మెస్ విశ్వనాథన్ పూర్తి చేశారు. సుబ్బరామన్ మరణించిన రెండేళ్ల వరకు ఆయన స్వరపరిచిన సినిమాలు విడుదలవుతూనే వచ్చాయి. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన చిట్టచివరి చిత్రం ప్రజారాజ్యం (1954). సుబ్బారామన్ తో పాటు ఇంకా ఎంతో మందిని చిరంజీవులను చేసిన చిత్రం “దేవదాసు” సుబ్బారామన్ మొదటి వర్ధంతికి ఒక్కరోజు ముందు విడుదలైంది. ఆ చిత్ర విజయాన్ని తన సంగీత శాశ్వతత్వానికి ఆనందించే అదృష్టం సుబ్బరామన్ కు లేకపోయింది. అంత పిన్న వయస్సులోనే అపారమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన సుబ్బారామన్ చూసి ప్రేక్షకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతో ఆశ్చర్య పడుతుండేవారు.

విశేషాలు…

★ సి.ఆర్ సుబ్బరామన్ కు సుబ్బురామన్ అనే పేరు కూడా వాడుకలో ఉంది. సుబ్బరామన్ తాత, ముత్తాతలు తెలుగు వాళ్ళు.

★ 1950లో పోటాపోటీగా విడుదలైన “లక్ష్మమ్మ”, “శ్రీ లక్ష్మమ్మ కథ” చిత్రాలలో మొదటి దానికి తన శిష్యుడు సంగీత దర్శకుడు అయితే, “శ్రీ లక్ష్మమ్మ కథ” కు సుబ్బరామన్ సంగీత దర్శకులు. కేవలం 15 రోజులలో 15 పాటలు స్వరపరిచి అన్నింటినీ ప్రజాదరణ పొందిన పాటలుగా మలిచిన ఘనత సి.ఆర్ సుబ్బరామన్ దే.

★ తొలి తమిళ సూపర్ స్టార్ ఎం.కె.త్యాగరాజ భాగవతార్ ఒక హత్య నేరం క్రింద జైలుకు వెళ్లి నిర్దోషిగా బయటకు వచ్చిన తరువాత నిర్మించిన ఆయన సొంత చిత్రం “రాజముక్తి”. దానికి సంగీత దర్శకత్వం చేసింది కూడా సి.ఆర్ సుబ్బరామనే.

★ త్యాగరాజ భాగవతార్ తో పాటు హత్య నేరంలో సహా నిందితుడిగా ఉన్న ఎన్.ఎస్. కృష్ణన్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిర్మించిన చిత్రానికి కూడా సహా సంగీత దర్శకులు కూడా సి.ఆర్ సుబ్బరామన్.

★ అంతవరకు తన పాటలకు తానే పాడుకుంటున్న నటీమణులు ఉన్న ఆ రోజులలో తొలిసారిగా తన తొలి చిత్రం “చెంచులక్ష్మి” లో కమలా కోట్నీస్ కు “రావు బాలసరస్వతి” తో నేపథ్య గానం పాడించిన ఘనత సి.ఆర్. సుబ్బరామన్ దే.

★ తన తొలి సంగీత చిత్రం “చెంచులక్ష్మి” లోని నేపథ్య సంగీతం, నృత్య సంగీతం గ్రామ ఫోన్ రికార్డులలో విడుదలైన ప్రత్యేకత కూడా సి.ఆర్. సుబ్బరామన్ దే.

★ 1944 నుంచి 1952 మధ్యలో దక్షిణాదిన ఉన్న అందరూ గాయనీ గాయకులే కాక, ఉత్తరాదిన ఉన్న గాయనీ, గాయకులు “లతా మంగేష్కర్” లాంటి వాళ్లతో కూడా తన సంగీత దర్శకత్వంలో పాటలు పాడించిన ఘనత సి.ఆర్.సుబ్బరామన్ దే.

★ తాను మరణించే సమయానికి 12 చిత్రాలు ఏకకాలంలో సంగీత దర్శకత్వం చేస్తున్న అరుదైన రికార్డు సి.ఆర్. సుబ్బారామన్ సొంతం.

★ కృష్ణ, జూపిటర్, ఎన్.ఎస్.కె, భరణి, రాగిణి, వినోద ఇలా ఎన్నో ఎక్కువ చిత్ర నిర్మాణ సంస్థలకు పూర్తిస్థాయి సంగీత దర్శకుడుగా కొనసాగిన ఘనత సి.ఆర్సుబ్బరామన్ సొంతం.

★ ఇన్ని రికార్డులు, ఇన్ని ప్రత్యేకతలు త్రాసులో ఒకవైపు ఉంచితే, దేవదాసు చిత్రాన్ని ఒక్కటే ఒకవైపు ఉంచొచ్చని సి.ఆర్.సుబ్బరామన్ అభిమానులు అంటుంటారు.

★ ప్రతిభ, క్రమశిక్షణ ఉండి కూడా అవకాశాలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించడానికి దశాబ్దాలు అవసరం లేదని ఆ రోజుల్లోనే నిరూపించిన సి.ఆర్.సుబ్బరామన్ కేవలం ఎనిమిది సంవత్సరాలలో ఇన్ని విజయాలు సాధించి నిరూపించారు, అలసిపోక ముందే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు.

Show More
Back to top button