
అన్ని రసాలలోకెల్లా హాస్యరసానందాన్ని పండించి, పంచడం అంత సులభతరంకాదు. అది జన్మతః రావాలి. ఆధునికాంధ్ర సాహిత్యములో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకొని, చదివీ చదవగానే ఇది “రమణీయమయిన రచన” అని చప్పున తెలిసిపోయేలా పాఠకుల హృదయాలలో నిలిచిపోయిన ఆహ్లాద రచయిత “శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ”. తన సాహిత్యంలోనూ, సినిమా రచనలోనూ ఎన్నో మధురమైన హాస్య గుళికలు ఉన్నాయి. వెంకటరమణ అల్లరి చిచ్చర పిడుగు “బుడుగు”. ముత్యాలముగ్గులో “కాంట్రాక్టర్”, మిస్టర్ పెళ్ళాం లో “తుత్తి”, అందాలరాముడు లో “తీసేసిన తహసీల్దారు” తీతా ఇలా ఎన్నో ఎన్నెన్నో విలక్షణమైన పాత్రలను సృష్టించి గిలిగింతలు పెట్టి అందరినీ ఆకట్టుకున్న అపర బ్రహ్మ “ముళ్ళపూడి వెంకటరమణ”. వినోద భరితమైన వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో తనకు తానే సాటి.
ఒక్కమాటలో చెప్పాలంటే ముళ్ళపూడి గారి సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది. కారణం తన రచనలో అన్నీ సమ పాళ్ళలో కావలసిన విధంగా ఉంటాయి. అచ్చ తెలుగుదనం, హాస్యంతో కూడిన వ్యంగ్యాస్త్రాలు, తెలుగు ప్రజల మదిని దోచి అందరి హృదయాల్లో విశిష్టస్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి ముళ్ళపూడి వెంకటరమణ. తెలుగు సినిమాల్లో పరిపూర్ణమైన హాస్యం ఉంది అంటే, దానికి కారణమైన కొందరు మహా రచయితలలో వెంకటరమణ ఒకరు. ముళ్ళపూడి పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ఆయన సృష్టించిన “చిచ్చర పిడుగు”, “రెండు జడల సీత”, “జ్ఞానప్రసూనాంబ”, “కోతికొమ్మచ్చి”, “రాంబాబు”, “అమ్యామ్యాం” మరియు “మూగమనసులు”, “పెళ్ళిపుస్తకం”, “సాక్షి”, ఇలా ఎన్నో సినిమాలు, అందులోని విభిన్న, విలక్షణ పాత్రలు అందరికీ పరిచయం. “బాపు రమణ” అనేవి తెలుగువారి ముద్దుపేర్లు. అత్యంత స్నేహానికి నిర్వచనం బాపు రమణ” ల ద్వయం.
దుర్భరమైన పేదరికాన్ని, ఆకలితో అలమటించిన రోజులని, నిరుద్యోగ పర్వాన్ని, అన్నింటినీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడమే కాకుండా, తన సృజనాత్మక శక్తిని నమ్ముకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి లొంగకుండా తన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకొని ఎదిగిన వైనం, ఆకలి కన్నీటి జల్లులలో నవ్వుల పన్నీటి చినుకులు కలుపుకుంటూ ముళ్ళపూడి వెంకటరమణ జీవనం సాగించిన విధానం అనిర్వచనీయం. ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్నెన్ని సార్లో ఆకలికి అలమటించారు. చెక్కుచెదరని పట్టుదలతో, మొక్కవోణి ఆత్మవిశ్వాసం తో పట్టుసడలకుండా జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు కదిలారు. ఇన్ని సుగుణాలు తన తల్లి నుండి అలవర్చుకున్న సిద్ధాంతం అది. ముళ్లపూడి వెంకటరమణకు పాత్రికేయుడు, కథకుడు, సినీ విమర్శకుడు, సినీ కథా రచయిత, సంభాషణల రచయిత మరియు చలనచిత్ర కళలు, సాహిత్యం, పత్రికారంగంలో అత్యుత్తమ రచనలను అందించిన ప్రముఖ చలనచిత్ర వ్యక్తిత్వం ఇలా బహుముఖాలు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వంచే స్థాపించబడిన పద్మ పురస్కారాలకు ఎంపిక అవ్వకపోవడం దురదృష్టం.
జీవిత విశేషాలు…
జన్మ నామం : ముళ్ళపూడి వెంకటరమణ
ఇతర పేర్లు : ముళ్ళపూడి వెంకటరావు
జననం : 28 జూన్ 1931
స్వస్థలం : ధవళేశ్వరం, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా..
తండ్రి : సింహాచలం
తల్లి : ఆదిలక్ష్మి
వృత్తి : తెలుగు రచయిత, సినిమా రచయిత
పురస్కారాలు : రఘుపతి వెంకయ్య అవార్డు..
మరణం : 24 ఫిబ్రవరి 2011
నేపథ్యం…
ముళ్లపూడి వెంకటరమణ 28 జూన్ 1931 లో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో గల ధవళేశ్వరం లో జన్మించారు. ఇతని అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తన తల్లి పేరు ఆదిలక్ష్మి. తండ్రి పేరు సింహాచలం. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట కార్యాలయంలో పని చేసేవారు. వారి పూర్వీకులు బరంపురానికి చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలో ఉండగానే తన అక్క సత్యవతి కి పెళ్లి చేశారు నాన్న సింహాచలం. నాన్న సింహాచలంకి తీవ్ర అస్వస్థత చేయడంతో ఉద్యోగం మానేసి మద్రాసు లో ఉండే తన అల్లుడు దగ్గరికి వెళ్లారు. సింహాచలం అల్లుడి ఇంట్లో ఉండి వైద్యం చేయించుకునేవారు.
రమణ తొమ్మిది సంవత్సరాల వయస్సులో మద్రాసులో నాలుగో తరగతిలో చదువుతున్నప్పుడు మిత్రులు సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) పరిచయమయ్యారు. మద్రాసులు పి.ఎస్.స్కూల్లో చదువుతున్న రమణ ఆరవ తరగతిలో ఉండగా తమ కుటుంబంతో తిరిగి ధవలేశ్వరం వచ్చారు. రమణ వాళ్ళ నాన్నకు వ్యాధి ముదిరిపోయి మరణించారు. భర్త మరణంతో ఆదిలక్ష్మి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆహ్వానం మేరకు మద్రాసు వెళ్లారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభకు నిర్వాహకురాలిగా ఆదిలక్ష్మిని నియమించి నెలకు ₹20 రూపాయల జీతంతో అందులో పని కల్పించారు. అప్పటికే ఆదిలక్ష్మి అమ్మాయి, అల్లుడు ఉద్యోగం రీత్యా బదిలీ పైన విశాఖపట్నం వెళ్లిపోయారు.
బాల్యంలోనే కథలు వ్రాస్తూ..
నెలకు 30 రూపాయలు ఉంటే గాని కుటుంబ జీవనం గడవలేని స్థితిలో ఉన్న ఆదిలక్ష్మి 20 రూపాయలు జీతం సరిపడక మద్రాసులో ఒక ఇంట్లో మెట్ల క్రింద ఒక చిన్న గది అద్దెకు తీసుకుని అందులోనే ఉండిపోయారు. ఆదిలక్ష్మి ఆంధ్ర మహాసభలో హిందీ నేర్పుతూ తన 20 రూపాయల జీతంతో తమ జీవనాన్ని గడిపేస్తూ ఉండేవారు. అదనంగా పది రూపాయలు సంపాదించడానికి వేరే పనికి వెతుక్కునేవారు. ఒక షాపుకు తానే ఇస్తారాకులు కుట్టి “కాణి” కి ఎనిమిది ఇస్తారాకులు చొప్పున దుకాణం యజమానికి ఇచ్చేవారు. కానీ కొన్నాళ్ళ తరువాత వ్యాపారం కుదరక మానేశారు.
దాంతో ఆదిలక్ష్మి మిలిటరీ వారి బట్టలకు గుండీలు కుట్టి డబ్బులు సంపాదించేవారు. కొద్ది కాలానికి అదీ కూడా పోయింది. ఆదిలక్ష్మి అక్కడి నుండి “ఏలూరు” ప్రక్కనున్న “చాటపర్రు” కు వచ్చేశారు. ఒక రూపాయి యాభై పైసలకు ఒక గది అద్దెకు తీసుకొని చేతులతో పేపర్లు తయారుచేసే పనికి కుదిరారు. పేపర్లు తయారు చేసి ఏలూరుకి ఎగుమతి చేసేవారు. ఆ పేపర్లు నాణ్యతగా లేకపోవడంతో అభ్యంతరం చెప్పడంతో ఆ పని కూడా వదిలేశారు ఆదిలక్ష్మి. అప్పటికే ముళ్ళపూడి వెంకటరమణ తొమ్మిదో తరగతి చదువు కొనసాగిస్తున్నారు.
బాలన్నయ్య న్యాయపతి రాఘవరావు, బాలక్కయ్య కామేశ్వరి లు 1945 ఆగస్టులో “బాల” అనే మాసపత్రిక స్థాపించారు. మొదటి సంచిక లోనే ముళ్లపూడి వెంకటరమణ “అమ్మ మాట వినకపోతే” అనే కథను వ్రాశారు. ముళ్లపూడి వెంకటరమణ అనే పేరుతో తాను వ్రాసిన కథ ప్రచురితమైంది. దాంతో ఆయనకు ఐదు రూపాయలు పారితోషికం లభించింది. దాంతో పది కథలు వ్రాసి తీసుకెళ్లారు రమణ. కానీ ఆ కథలు పత్రిక వాళ్లు ప్రచురణకు ఒప్పుకోలేదు. రమణ 9వ తరగతి పరీక్షలు వ్రాసి పాసయ్యారు. వెంకటరమణ వ్రాసిన పది కథలు ఒక పుస్తకం గా తయారుచేసి కేసరి పాఠశాల స్థాపకులు కేసరికి అంకితం ఇచ్చారు..
రైల్వే కూలిగా…
వెంకటరమణ ఎస్.ఎస్.ఎల్.సి తప్పారు. దాంతో విశాఖపట్నం హార్బర్ డిస్పెన్సరీ లో హెడ్ గా పని చేస్తున్న తన బావ రమణను విశాఖపట్నం కబురంపించారు. దాంతో సెప్టెంబరులో పరీక్షలు అయిపోగానే వెంకటరమణ విశాఖపట్నం వెళ్లారు. ఖాళీగా ఉంటున్న వెంకటరమణ హార్బర్ కి అనుబంధంగా ఉన్న రైల్వేలో కూలీగా చేరారు. అత్యద్భుత సృజనాత్మక శైలి గల వెంకటరమణ దినసరి వేతనంగా “ఒక రూపాయి ఇరవై ఐదు” పైసలకు కూలిగా పొందేవారు.
ఒక ప్రక్క కూలి పని చేస్తునే, మరో ప్రక్క ఖాళీ సమయంలో ఇంగ్లీష్ నవల చదివేవారు. అది చూసి ఆశ్చర్యపడిన మిత్ర అనే హార్బరు ఇంజనీరు ఆనందపడి, బాధపడి “నీకున్న ప్రతిభకు ఈ పని సరిపడదని” పది రూపాయలు తన చేతిలో పెట్టి మద్రాసు వెళ్లి పత్రికలకు కథలు వ్రాసుకోమని సలహా చెప్పారు. ఆ పది రూపాయలు తీసుకొని రైలు ఎక్కి ఎనిమిది రూపాయతో ఏలూరుకు టికెట్ తీసుకుని “మద్రాసు మెయిలు” రైలెక్కి ఏలూరులో రైలు దిగారు.
అక్కడ తనకు పరిచయం ఉన్న ఈదర వెంకట్రామయ్య పంతులును కలిశారు. దాంతో వెంకట్రామయ్య పంతులు వెంకటరమణకు ఆవాసం ఏర్పాటు చేసి ఆయనకు కథలు వ్రాసే అవకాశం కల్పించారు. వెంకటరమణ ఆ రెండు, మూడు రోజులలో సుమారు పది కథలు వ్రాశారు. కానీ ఆ వ్రాసిన కథలు, పుస్తకాలు ఉన్న సంచి అదృశ్యమయ్యింది. అది తెలిసి బాధపడుతున్న వెంకటరమణను చూసిన ఈదర వెంకటరామయ్య పంతులు రమణతో “నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది”. నీవు మద్రాసు వెళ్లమని 116 రూపాయలు ఇచ్చి పంపించారు.
కష్టాలతో సహావాసం…
ఈదర వెంకట్రామయ్య పంతులు ఇచ్చిన 116 రూపాయలతో మద్రాసు వచ్చిన వెంకటరమణకు కష్టాలు మొదలయ్యాయి. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నిరుద్యోగిగా ఆకలి కష్టాలను, బాధలను భరించారు. భయంకరమైన బాధలు, కష్టాలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెంకటరమణ మిత్రుడు బాపు, అన్నయ్య వెంకట్రామయ్య, అజంతా వాళ్ళతో కలిసి వారి వద్దనే ఉంటూ ఉండేవారు. అజంతా గదిలో ఉన్నప్పుడు పడుకోవడానికి దుప్పట్లు ఉండేవి కావు. వాళ్ళు వార్తా పత్రికలనే దుప్పట్లుగా ఉపయోగించు కునేవారు. తుడుచుకోవడానికి తుండు ఉండేది కాదు. వార్తా పత్రికలను శరీరానికి అద్దుకొని తుడుచుకునేవారు.
రచయిత మాలతీ చందూర్ భర్త ఎం.ఆర్.చందూర్ నడుపుతున్న “జగతి” పత్రికలో వెంకటరమణ తాను వ్రాసిన పది కథలలోని ఒక తన కథ ప్రచురణయ్యింది. దాంతో ఆ కథకు ఇచ్చే పారితోషికం కోసమని ఆరు మైళ్ళు నడిచి మాలతీ చందూర్ ఇంటికి వెళ్లగా వెంకటరమణకు పంపించాల్సిన డబ్బులు అప్పుడే ఆయనకు తపాలా ద్వారా మనియార్డరు రూపంలో పంపించామని చెప్పి, తనకు దారి ఖర్చులకు అర్ధ రూపాయి ఇచ్చి పంపారు. ఆ అర్ధ రూపాయితో రెండు దోశెలు తీసుకుని వచ్చి గదిలోపెడితే , ప్రక్కనున్న గదిలో ఉంటున్న ఒక మలయాళీ వచ్చి ఆ దోసెలు తినేసాడు. అందుకే ఆ తరువాత రోజులలో తాను అనుభవించిన అత్యంత దుర్భరమైన పేదరికం, ఆకలితో అలమటించిన రోజులను, నిరుద్యోగ పర్వాన్ని అన్నింటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, తన సృజనాత్మక శక్తిని నమ్ముకుని, ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరికీ లొంగకుండా తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని ఎదిగిన వైనం, ఆకలి కన్నీటి జల్లులతో నవ్వుల పన్నీటి చినుకులు కలుపుకుంటూ జీవనం సాగించిన విధానం అనిర్వచనీయమైనది.
ముక్కపాటి వద్ద ఉద్యోగం…
జీవిత రథచక్రాల క్రింద నలిగితే తప్ప జీవితంలో మనిషి రాటు తేలడు. జీవిత ప్రయాణంలో కలిగే పరిచయాలను స్నేహాలుగా మలుచుకోవడం, స్నేహాలని అనుబంధాలుగా నిలుపుకోవడం ఒక కళ. అది లేని రోజున మనిషి జీవితం ఒంటరి శిల. ముళ్ళపూడి వెంకటరమణ తాను అక్క అని పిలుచుకునే రేడియో భానుమతి (పసుమర్తి కృష్ణమూర్తి గారి అమ్మాయి) వీణ వాయిస్తూ రేడియోలో నాటకాలు వేస్తుండేవారు. ఆవిడ వెంకటరమణను ఒక మలయాళ సినిమా తెలుగులో డబ్బింగ్ చేసే ఆకలి సినిమాకి సహాయ దర్శకుడిగా పని కల్పించారు. ఆ సినిమాకు పనిచేసినప్పుడు నెలకు 20 రూపాయలు జీతం, రోజుకు రూపాయి పావలా భోజనానికి బేటా ఇచ్చేవారు. ఆ సినిమా కేవలం ఆరు వారాల్లోనే అయిపోయింది. ఆ ఆరు వారాలకు గానూ వెంకటరమణకు 60 రూపాయలు పారితోషికంగా వచ్చాయి. దాంతో వెంకటరమణ అప్పులు తీరాయి, డబ్బులు కూడా ఖర్చయిపోయాయి.
దాంతో రేడియో భానుమతి మళ్ళీ వెంకటరమణకు ముక్కపాటి నరసింహా శాస్త్రి వద్ద రెండో ఉద్యోగం ఇప్పించారు. ముక్కపాటి వ్రాసిన పుస్తకాలను ముద్రణ చేశాక అచ్చుతప్పులు సరిదిద్దాలి. అక్కడ నెలకు 75 రూపాయలు పారితోషికం. ఆ పని కూడా రెండు మూడు నెలల్లో అయిపోయింది. దాంతో అక్కడ ఉద్యోగం ముగిసిపోయింది. ఆ తరువాత గోవిందరాజుల సుబ్బారావు తమ్ముడు సత్యం కుమారుడి వద్ద వెంకటరమణకు పని కల్పించారు. శ్రీనివాస శిరోమణి అనే పండితుల వద్ద రామాయణం తెలుగు వ్యవహారిక భాషలో వ్రాయడానికి ₹20 పారితోషికంతో పనిలో కుదిరారు. కొన్నాళ్లకు అది కూడా వ్రాయడం అయిపోయింది. ఆ తర్వాత కొవ్విడి లింగరాజు అనే పేరు ఉన్న రచయిత యొక్క సంపాదకత్వంలో 1952 చివర్లో “ప్రజాపత్రిక” స్థాపించబడింది. అందులో “సబ్ ఎడిటర్” గా వెంకటరమణకు ఉద్యోగం వచ్చింది. మూడు నెలలకు 70 రూపాయలు జీతం. 18 నెలలు నడిపించి ఈ పత్రికను 1954లో మూసేశారు.
ఆంధ్రపత్రిక లో సబ్ ఎడిటర్ గా..
1954 లో ప్రజా పత్రిక మూసివేయబడగానే వెంకటరమణకు మళ్లీ నిరుద్యోగం మొదలైంది. అదే సంవత్సరం 1954లో “ఆంధ్రపత్రిక” లో ఉద్యోగం దొరికింది. కాశీనాథుని నాగేశ్వరావు పంతులు అల్లుడు “శివలెంక శంభు ప్రసాద్” మరియు “కామాక్షమ్మ” లు స్థాపించిన ఆ పత్రికలో వెంకటరమణకు సబ్ ఎడిటర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు ప్రసంగాన్ని ప్రచురిస్తూ “గ్రామీణ పునర్నిర్మాణ కార్యచరణకి కంకణాభరణం చేద్దాం” అని ప్రధాన సంచికలో వార్తగా వ్రాశారు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాస్తున్న వార్తలు, సినిమా సమీక్షలతో రాత్రింబవళ్లు కస్టపడి పత్రికా ప్రచురణ అమ్మకాలను 60,000 పైచిలుకు కు తీసుకెళ్లారు.
కానీ వెంకటరమణపై సదాభిప్రాయం లేని శివలెంక రాధాకృష్ణ (శివలెంక శంభు ప్రసాదు అబ్బాయి) వెంకటరమణను ఎక్కువ సమయాన్ని పత్రికకు కేటాయించడం వలన జీతాలు ఎక్కువగా ఇవ్వలేనని చెప్పారు. అంతకుముందు కూడా రెండు, మూడు సార్లు కూడా వెంకటరమణ విషయంలో ఇలానే వ్యవహారించారు శివలెంక రాధాకృష్ణ. దాంతో ఆత్మభిమానం చంపుకోలేని వెంకటరమణ “ఆంధ్రపత్రిక” కు తన రాజీనామా సమర్పించారు. దానికి శివలెంక శంభు ప్రసాద్ వెంకటరమణను కారణం అడుగుతూ మానేయడానికి గల కారణాలను, వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ శంభు ప్రసాద్ కు వెంకటరమణ సంజాయిషీ ఇవ్వలేదు. ఉద్యోగం మానేసినా కూడా వెంకటరమణ ఆంధ్రపత్రికకే కథలు వ్రాసేవారు. ఆ కథలు వ్రాసినందుకు గానూ ఆయనకు నెలకు 800 రూపాయలు పారితోషికం రూపంలో వచ్చేవి. దానిని కూడా ఓర్వలేని శివలెంక రాధాకృష్ణ వెంకటరమణ కథలు వ్రాయడాన్ని ఒప్పుకోలేదు. దాంతో ఆ పత్రిక కు వెంకటరమణ పూర్తిగా కథలు వ్రాయడమే మానుకున్నారు. దాంతో మళ్ళీ తనకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.
సినీ రంగం…
సినిమా విడుదలకు ముందు “తోడికోడళ్ళు” చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ మంచి సమీక్ష వ్రాశారు. అది చూసి ముగ్ధులైన అక్కినేని నాగేశ్వరరావు ముళ్ళపూడిని బాగా అభిమానించేవారు. దాంతో ముళ్ళపూడి వెంకటరమణ, అక్కినేని నాగేశ్వరావుల మధ్య విపరీతమైన చనువు ఏర్పడింది. ఆంధ్రపత్రిక లో ఉద్యోగం మానేసి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వెంకటరమణను “వెలుగునీడలు” చిత్రానికి వెండితెర నవల వ్రాయమని అక్కినేని నాగేశ్వరావు ముళ్ళపూడి వెంకటరమణను సంప్రదించారు.
పారితోషికంగా “నాలుగు వేల” రూపాయలు తీసుకొన్న వెంకటరమణ, బాపు గీసిన 50 బొమ్మలతో వెండితెర నవలగా 200 పేజీల పుస్తకం వ్రాశారు. ఆ సినిమా విడుదలకు వారం రోజులు వెంకటరమణ వ్రాసిన వెండితెర నవలను అమ్మకానికి ఉంచగా సుమారు 10,000 పుస్తకాలు అమ్ముడయ్యాయి. దాంతో “వెలుగునీడలు” సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అలా వెండితెర నవలలను వ్రాయడం కొనసాగించిన వెంకటరమణ “భార్యాభర్తలు” చిత్రానికి కూడా వెండితెర నవల వ్రాశారు. దినవహి భాస్కర నారాయణ నిర్మాతగా అదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో “దాగుడు మూతలు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు ముళ్ళపూడి వెంకటరమణతో మాటలు వ్రాయించుకున్నారు. కానీ దినవహి భాస్కర నారాయణ తీసిన ఆ సినిమా నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలైంది.
తొలి పది సినిమాలలో ఎనిమిది విజయాలు…
డూండి తమిళ సినిమా “పాశమలర్” ను తెలుగులో “రక్త సంబంధం” (1962) గా పునర్నిర్మిస్తున్నారు. దానికి ముళ్లపూడి వెంకటరమణతో మాటలు వ్రాయించారు. వెంకటరమణ అద్భుతంగా మాటలు వ్రాయడంతో 01 నవంబర్ 1962 నాడు విడుదలైన “రక్త సంబంధం” సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత 01 జనవరి 1964 లో విడుదలైన “గుడిగంటలు”, ఆ తరువాత నాలుగు వారాలకు 31 జనవరి 1964 నాడు “మూగమనసులు” విడుదలైంది. తన సినీ ప్రస్థానం లో మొదటి రెండు సంవత్సరాల్లో వెంకటరమణ 10 సినిమాలకు మాటలు వ్రాస్తే అందులో ఎనిమిది చిత్రాలు విజయవంతం అయ్యాయి.
ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన “మూగమనసులు”, “దాగుడుమూతలు”, “తేనెమనసులు”, “కన్నెమనసులు”, “పూలరంగడు” చిత్రాలకు ముళ్ళపూడి వెంకటరమణ కథను సమకూర్చారు. “మూగమనసులు” చిత్రానికి ఆచార్య ఆత్రేయతో కలసి కథ, మాటలు అందించిన ముళ్ళపూడి వెంకటరమణ తొలిసారి తానే కథకునిగా “దాగుడుమూతలు” వ్రాశారు. అందిన చోట కథను అందిస్తూ, పొందిన చోట మాటలను పొందుపరుస్తూ అందరినీ అలరిస్తూ రచనలు సాగించేవారు ముళ్ళపూడి వెంకటరమణ. ఇక మిత్రుడు బాపు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం “సాక్షి” కి ముళ్ళపూడి వెంకటరమణ కలం అద్భుతంగా పనిచేసింది. అందువలన “సాక్షి” సినిమా పలు పసందైన పదాలను తెలుగువారి ముందు పరిచింది.
బాపూ రమణీయం…
సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ (బాపు) చిత్రసీమ లోకి అడుగుపెట్టాక, తన దర్శకత్వంలో రూపొందిన ప్రతీ చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ రచన కొనసాగింది. బాపు హిందీలో తెరకెక్కించిన చిత్రాలకు సైతం ముళ్ళపూడి వెంకటరమణ ఏదో ఒక రీతిన చేయి అందించేవారు. ఆ విధంగా బాపు, రమణ ల మైత్రి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ “బాపూరమణీయం” గా సాగింది. చిత్రసీమలో స్నేహం అన్న మాట వినిపించిన ప్రతీసారి ఈ ఇద్దరు మిత్రుల పేర్లు తప్పక వినిపిస్తాయి.
ఈ ఇద్దరి కలయికలో రూపొందిన “బంగారు పిచ్చిక”, “బాలరాజు కథ”, “బుద్ధిమంతుడు”, “సంపూర్ణ రామాయణం”, “ముత్యాల ముగ్గు”,, “అందాలరాముడు”, “సీతాకళ్యాణం”, “భక్త కన్నప్ప”, “గోరంతదీపం”, “మనవూరి పాండవులు”, “రాజాధిరాజు”, “రాధా కళ్యాణం”, “త్యాగయ్య”, “మంత్రిగారి వియ్యంకుడు”, “పెళ్ళీడు పిల్లలు”, “పెళ్ళి పుస్తకం”, “మిస్టర్ పెళ్ళాం”, “శ్రీనాథ కవిసార్వభౌముడు”, “శ్రీరామరాజ్యం” వంటి చిత్రాలలోని మాటలు బాగా అలరించాయి. ఈ చిత్రాలలో కొన్ని విజయాలుగా, మరికొన్ని అద్భుతమైన విజయాలుగా, ఇంకొన్ని నిరాశ పరిచిన చిత్రాలుగా మిగిలిపోయాయి. ముళ్ళపూడి వెంకటరమణ పలికించిన పదాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల పెదాలపై నాట్యం చేశాయనే చెప్పుకోవాలి.
మరణం…
ముళ్లపూడి వెంకటరమణ ఎన్నో సినిమాలు, అందులోని విలక్షణ పాత్రలు, అచ్చ తెలుగుదనం, హాస్యంతో కూడిన వ్యంగ్యాస్త్రాలు, తెలుగు ప్రజల మదిని దోచి అందరి హృదయాల్లో విశిష్టస్థానం సంపాదించాయి. అందరికీ పరిచయ పదం “బాపు రమణ”. అవి తెలుగువారికి ముద్దుపేర్లు. అత్యంత ఆత్మీయ స్నేహానికి నిర్వచనం “బాపు రమణ” ల ద్వయం. బాపూ అంటే “సత్తిరాజు లక్ష్మీనారాయణ”, రమణ అంటే “ముళ్ళపూడి వెంకట రావు” (తదుపరి పాఠశాల రిజిస్టర్ లో వెంకటరమణ అయ్యింది). ఒకరు తన కలంతో స్వఛ్ఛమైన పదహారణాల తెలుగు పాత్రలను సృష్టిస్తే, మరొకరు తన బంగారు కుంచెలో ఆ పాత్రలకు జీవం పోశారు. వారి ద్వయం విడదీయరానిది. ఆ అనుబంధంతోనే ఇద్దరూ ఒకే ఇంట్లో కలసి ఉన్నారు. కాని విధి చాలా విచిత్రమైనది. తెలుగు భాషకు కొత్త ఒరవడి నేర్పిన ముళ్ళపూడి వెంకటరమణ, బాపు కంటే ముందుగానే 23 ఫిబ్రవరి 2011 నాడు రాత్రి మరణించారు. ఆప్త మిత్రుడు బాపూని, తెలుగు అభిమానుల్ని అందరినీ వదలి నింగిని కావలించుకున్నారు.