CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో డి.రామానాయుడు నిర్మాతగా   తొలిచిత్రం.. రాముడు భీముడు..

దక్షిణభారత సినీ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ ద్విపాత్రాభినయం. సినిమాలలో ఈ ప్రక్రియ విశేష నైపుణ్యాన్ని సంతరిచుకొంది. ఎందుకంటే ఒకే ఫ్రేములో రెండు పాత్రలనూ చూపే అద్భుతాన్ని ఛాయాగ్రాహకులు సాధించారు గనుక. తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయం అనేది దర్శకులకూ, నటులకూ, ప్రత్యేకించి ఛాయాగ్రాహకులకూ ఒక సవాలు అయ్యింది. కొన్నిచోట్ల కథలో అనుకోని మలుపులు తిప్పడానికీ, కొన్ని చోట్ల హీరోయిజాన్ని సమతుల్యం చేయడానికీ, మరి కొన్నిచోట్ల నాయకుని ప్రతిభను బహుముఖంగా ప్రదర్శించడానికీ ఈ ప్రక్రియ వాడ బడింది. కవలపిల్లల పాత్రలు ఈ అభినయానికి పట్టుగొమ్మలైనాయి. తెలుగు దర్శకులు ఈ ప్రక్రియతో ఎన్నో ప్రయోగాలు చేశారు. భారతీయ సినిమాలలో తొలి ద్విపాత్రాభినయము 1923 లో విడుదలైన మూకీ చిత్రములో , “పత్నీ ప్రతాప్” లో నటి పేషన్స్ కూపర్ చేసింది.

ద్విపాత్రాభినయాన్ని మరికాస్త విస్తరించి చూస్తే మూడు, నాలుగు ఇలా ఎన్ని పాత్రలైనా ధరించవచ్చును. తమిళంలో శివాజీ గణేశన్ 9 పాత్రలు ఒకే సారి ధరించారు. తెలుగులో నందమూరి తారక రామారావు సినిమా దానవీరశూరకర్ణ ఈ విధమైన బహుపాత్రాభినయంలో ఒక మచ్చుతునక. శతచిత్ర నిర్మాత రామానాయుడు తీసిన తొట్టతొలి చిత్రం “రాముడు భీముడు”. 1964 లో ఈ సినిమా విడుదలైంది. తీసిన మొదటి చిత్రంతోనే పెద్ద నిర్మాతల జాబితాలో చేరిపోయిన అదృష్ట జాతకుడు రామానాయుడు. 100 పైగా సినిమాలు తీసినా కూడా ఆయనకు ఆత్మ సంతృప్తినిచ్చిన సినిమాలు రెండే రెండు. మొదటి చిత్రం “రాముడు భీముడు” అయితే, రెండోది “ప్రేమనగర్”. సినిమాల మీద చాలా మోజుతో వచ్చిన రామానాయుడు పరిశ్రమలో ఒక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన రాముడు భీముడు సినిమా వెనుక చాలా ఆసక్తికర కథ ఉంది. ప్రేక్షకులను ఇంత సమ్మోహన పరిచిన ఈ సినిమా కథ దాదాపు నాలుగేళ్లు ఏ నిర్మాత దృష్టిని ఆకర్షించకపోవడం, ఏ దర్శకుడి ఆచరణకు నోచుకో పోవడం అతి పెద్ద వింత, విశేషం కూడా.

సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై డి రామానాయుడు నిర్మించిన తొలిచిత్రం “రాముడు భీముడు”. మహానటుడు ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రూపొందించిన చిత్రం 1964 లో విడుదలై ఘనవిజయాన్ని సాధించగా ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. తాపీ చాణక్య చిత్రీకరించిన వరుస ఎనిమిది చిత్రాలు నిరాశపరిచినా కూడా కొసరాజు రాఘవయ్య చౌదరి సలహా మరియు సూచనతో తాపీ చాణక్యకే దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు రామానాయుడు. ఎన్టీఆర్ కు డూప్ గా కైకాల సత్యనారాయణ నటించారు. “ఉందిలే మంచి కాలం ముందు ముందునా”, “సరదా శారదా సిగరెట్”,  తెలిసిందిలే తెలిసిందిలే, “దేశమ్ము మారిందోయ్” లాంటి అద్భుతమైన పాటలకు పెండ్యాల గారు సంగీతం సమకూర్చగా, శ్రీ శ్రీ,  సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య సాహిత్యం అందించగా ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, జమునా రాణిలు నేపథ్య గానాన్ని ఆలపించారు. 21 మే 1964 నాడు విడుదలై అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం నేటికి 60 ఏళ్ళు పూర్తిచేసుకుంది.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :       తాపీ చాణక్య

కథ           :      డి.వి.నరస రాజు

నిర్మాణం   :     డి. రామానాయుడు 

తారాగణం  :   నందమూరి తారక రామారావు (ద్విపాత్రాభినయం), జమున, ఎల్. విజయలక్ష్మి, ఎస్.వి. రంగారావు, రాజనాల, రమణారెడ్డి, రేలంగి, గిరిజ, శాంతకుమారి, జమున

సంగీతం    :     పెండ్యాల నాగేశ్వరరావు

నేపథ్య గాయకులు :  ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, జమునా రాణి..

సాహిత్యం  :  సి.నారాయణ రెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ…

ఛాయాగ్రహణం  :   అన్నయ్యా

కూర్పు       :       కె.ఏ.మార్తాండ్

నిర్మాణ సంస్థ    :    సురేష్ ప్రొడక్షన్స్

నిడివి      :     168 నిమిషాలు

విడుదల తేదీ   :     21 మే 1964

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ రాముడు భీముడు. రాముడు శాంతకుమారి కుమారుడు. ఆయనకు తండ్రి లేడు. మేనమామ (రాజనాల) ఆస్తిపై అజమాయిషీ చేస్తూ రాముడిని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు కూడా తింటుంటాడు. భీముడు పల్లెటూరులో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు. మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒకరి స్థానంలో ఒకరు ప్రవేశిస్తారు. మేనమామకి రాముడి స్థానంలో ఉన్న భీముడు బుద్ధి చెబుతాడు. రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది. రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మిని భీముడు పట్నం పిల్ల జమునను పెళ్ళాడతారు. దాంతో కథ సుఖాంతం అవుతుంది.

కథకు బీజం…

నిజానికి అప్పటికే “రాముడు భీముడు” కథను తయారు చేసే నాథుడు లేక నాలుగేళ్లుగా ఫైల్ లో మగ్గుతుంది. “రాముడు భీముడు” సినిమా కథా రచనకు 1956 లోనే బీజం పడింది. అప్పటికి తెలుగులో హీరోలతో ద్విపాత్రాభినయ చిత్రాలు రాలేదు. “అపూర్వ సహోదరులు” వచ్చింది. దాని మాతృక తమిళం. అది తమిళ సినిమా తెలుగు రూపం. రచయిత డి.వి.నరసరాజుకు ద్విపాత్రాభినయం చిత్రాలలో ఒక కొత్త ధోరణి తీసుకురావాలన్న గాఢమైన కోరిక మనసులో ప్రబలంగా ఉంది. ద్విపాత్రలంటే ఒకడు మంచివాడు, రెండోడు చెడ్డవాడు. ఇది ఆనాటి ధోరణి. ఈ సిద్ధాంతానికి దూరంగా ఇద్దరినీ మంచివారుగా చూపిస్తూ కథ వ్రాయాలన్నది ఆయన తాపత్రయం. విపరీతమైన ప్రజాదరణ పొంది రెండు సార్లు సినిమాగా కూడా వచ్చిన “ప్రిజనర్ ఆఫ్ జెండా” అనే ఆంగ్ల నవల ఆయనకు ప్రేరణ.  

“ప్రిజనర్ ఆఫ్ జెండా” నవలలో ఒకరు రాకుమారుడు, రెండోవాడు సామాన్యుడు. తెలుగులో వచ్చిన వేదం వెంకట్రాయ శాస్త్రి “ప్రతాపరుద్రీయం” నాటకం కూడా ఆ కోవకు చెందినదే. ఈ రెండింటినీ ప్రేరణగా తీసుకొన్న నరసరాజు గారు ఒక జానపద కథ అనుకున్నారు. రాకుమారుడికి తెల్లారితే పట్టాభిషేకం. ముందు రోజు రాత్రి విలన్ ఆ రాకుమారుడిని ఎత్తుకుపోయి ఎక్కడో దాచేస్తాడు. మంత్రి కుశాగ్ర బుద్ధితో అచ్చు రాకుమారుడి మాదిరే ఉన్న సామాన్యుడిని తెచ్చి  పట్టాభిషేకం జరిపించేస్తాడు. ఆ తరువాత ఆ సామాన్యుడు విలన్ ఆట కట్టించి రాకుమారుడిని కాపాడుతాడు. నరసరాజు గారు ఈ కథ ఏ నిర్మాతకైనా చెబుదామనుకున్న సమయంలో తమిళంలో ఎం.జీ.ఆర్, భానుమతి, బి.సరోజాదేవి లతో “నాడోడి మన్నన్” అనే సినిమా వచ్చింది. దానికి ప్రేరణ “ప్రిజనర్ ఆఫ్ జెండా” నవల అని ఆయనకు తమిళ మిత్రులు చెప్పారు. అది ఎలాగో తెలుగులోకి పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి ఇక తన కథ గురించి ఎవ్వరికీ చెప్పినా ప్రయోజనం ఉండదని డి.వి.నరసరాజు మిన్నకుండి పోయారు.

నిర్మాత రామానాయుడు…

ప్రకాశం జిల్లా కారంచేడులో “నమ్మిన బంటు” సినిమా చిత్రీకరణలో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సన్నివేశంలో నటించారు. తాను హుషారుగా అటూ, ఇటూ తిరుగుతూ సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించారు. తిరిగి వెళ్తునప్పుడు “మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు?” అని అక్కినేని నాగేశ్వరావు అడిగారు. దానికి సమాధానంగా ఊరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బదులిచ్చారు. ఇష్టం లేకున్నా కూడా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టారు. ఓ రోజు హఠాత్తుగా ఆదాయపు పన్ను శాఖ వారు వచ్చి బిల్లులు రాయడం లేదంటూ రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మీద విరక్తి వచ్చేసింది. మిల్లు మూసీవేసీ ఊరు విడచి చెన్నపట్నం చేరుకున్నారు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నారు.

తన కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి “ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్” కు వెళ్ళేవారు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. “అనురాగం” చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చారు. జి.రామినీడు దర్శకత్వంలో “అనురాగం” అనే చిత్రాన్ని నిర్మించారు. కానీ అది విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో రామానాయుడు తాను పెట్టుబడిగా పెట్టిన 50 వేల రూపాయలు కోల్పోయారు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ సంపాదించుకోవాలన్న పట్టుదల తనకు మొదలైంది. అందుకని ఈసారి తానే స్వయంగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. తన కుమారులు సింహాలుగా చూపిస్తూ రూపొందించిన లోగో తో “సురేష్ ప్రొడక్షన్” సంస్థ ఆరంభించారు. తాపీ చాణక్యను దర్శకుడిగా పెట్టుకున్నారు. కథ కోసం అన్వేషణ ఆరంభమైంది.

కథనాయకుడిగా ఎన్టీఆర్…

అలనాటి ప్రముఖ రచయిత కొసరాజు రాఘవయ్య రామానాయుడు కి బంధువే. సినిమా తీస్తే దర్శకుడిగా తాపీ చాణక్యను పెట్టుకోమని కొసరాజు రాఘవయ్య సూచించారు. కానీ అప్పుడే తాపీ చాణక్య వరుసగా తీసిన ఎనిమిది చిత్రాలు నిరాశపరిచాయి, అపజయం పాలయ్యాయి. అయినా పెద్దాయన కొసరాజు మాట కాదనలేక చాణిక్యని దర్శకుడిగా పెట్టుకోవాల్సి వచ్చింది కథాన్వేషణలో నెల రోజులు వృథాగా గడిచిపోయింది. తన దగ్గర ఒక కథ ఉందని చాలామంది పెద్ద నిర్మాతలు ఆ కథను తిరస్కరించారని డి.వి.నరసరాజు చెప్పారు. ఆ కథ వినడానికి రామానాయుడు సిద్ధమయ్యారు. ఓ రోజు మద్రాసులోని మెరీనా బీచ్ కి వెళ్లిన రామానాయుడు, చాణక్యలు అక్కడ రెస్టారెంట్ వెనుక ప్రక్కన కథ వినడానికి కూర్చున్నారు.

వారికి డి.వి.నరసరాజు గంటన్నర పాటు ఆ కథను  చెప్పారు. అది వినగానే అనవసరంగా కథ కోసం నెల రోజులు వృథా చేశామే అన్నారు రామానాయుడు. ఇక ఆ కథను హీరోకి చెప్పి ఒప్పించడమే తరువాయి అనుకుని కథ చెప్పడానికి పొద్దున్నే ఎనిమిది గంటలకు రమ్మని ఎన్టీఆర్ అన్నారు. ఆయన డ్రాయింగ్ రూమ్ లో డి.వి.నరసరాజు ఎన్టీఆర్ కు కథ వినిపించారు. వెంటనే రామానాయుడుతో చేయి కలుపుతూ నేను ఈ సినిమా చేస్తున్నాను అనేశారు. అదే “రాముడు భీముడు” కథ. ఈ కథను తీసుకున్నందుకు పారితోషికంగా డి.వి.నరసరాజు 2500 రూపాయలు ఇచ్చారు. తమిళ హక్కుల కోసం మరో 5000 రూపాయలు చెల్లించారు. ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఈ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. 16 నవంబరు 1963 నాడు ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ పాత్రకు పారితోషికం 40 వేల రూపాయలు.

నాగార్జున సాగర్ వద్ద చిత్రీకరణ…

రాముడు భీముడు సినిమా అనుకున్న దానికంటే నాలుగు నెలల ముందే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అప్పట్లో ఎన్టీఆర్ జెమినీ, విజయా సంస్థలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ ప్రకారం రామానాయుడు ఏ తొమ్మిదో స్థానంలో ఉండేవారు. “ఆడ బ్రతుకు” సినిమా చిత్రీకరణ కూడా “రాముడు భీముడు” తో పాటే జరిగింది. రెండు షిప్టులుగా చిత్రీకరణ జరిగేది. జమున ఖాళీగా ఉంటే భీముడికి సంబంధించిన సన్నివేశాలు, ఎల్.విజయలక్ష్మి ఖాళీగా ఉంటే రాముడికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించేవారు. ఈ సినిమాను అక్కినేని నాగేశ్వరావు, సావిత్రిలు నటించిన “డాక్టర్ చక్రవర్తి” చిత్రానికి పోటీగా విడుదల చేయాలని ఎన్టీఆర్ అన్నారు. దానికి రామానాయుడు “వద్దండీ నేను వ్యాపారం చేసుకోవడానికి వచ్చాను” అని బదులిచ్చారు. ముగింపు సన్నివేశాలలో ఎన్టీఆర్ కు డూప్ గా కైకాల సత్యనారాయణ నటించారు.

ఇందులో సత్యనారాయణ కేవలం డూప్ పాత్రకే పరిమితమయ్యారు. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద చిత్రీకరణ చేసిన తొలి సినిమాగా “రాముడు భీముడు” నే చెప్పుకోవాలి. చిత్రీకరణలో జనాన్ని అదుపు చేయడం కోసం పోలీసు రక్షణ అడిగితే అధికారులు యంత్రాంగం చేతులెత్తేసింది. ఆ సమయంలో నల్లగొండలో గొడవలు జరుగుతుండడం వలన రెండు రోజుల తరువాత పోలీసుల్ని  ఇస్తామన్నారు. అయినా నిగ్రహం కోల్పోని ఎన్టీఆర్ అలాంటివి ఏమీ అవసరం లేదు బ్రదర్ అని రామానాయుడుతో చెప్పి చిత్రీకరణ సిద్ధం చేసుకోమన్నారు. జనం తండోపతండాలుగా వచ్చారు. ఎన్టీఆర్ వారిని సమీపించి అందరిని పలకరించాడు. మీరు దూరంగా కూర్చుంటే మేము సినిమా చిత్రికరణ చేసుకుంటామని ఎన్టీఆర్ అనడంతో జనం షూటింగ్ కు సహకరించారు. అప్పుడు “ఉందిలే మంచి కాలం ముందు ముందునా” పాటను చిత్రీకరించారు.

విడుదల…

ఆ రోజుల్లో ఈ సినిమా నిర్మాణ వ్యయం అక్షరాల ఆరు లక్షలు. ఇప్పుడు సినిమాకు కాదు కదా పబ్లిసిటీ కూడా ఆ మొత్తం చాలడం లేదు. చాణక్యకు తన సినిమాలో ప్రబోధ గీతాలు పెట్టడం అంటే మహా ఇష్టం. ఈ సినిమాలో “దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్” అన్న పాట అలాంటిదే. ఈ పాటను నాగార్జునసాగర్ లో తీశారు. ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా అదే. అలాగే ఈ సినిమాలో చాలా సన్నివేశాలలో ఎన్టీఆర్ కు డూప్ గా కైకాల సత్యనారాయణ వేశారు. రాముడు భీముడులో ఆయనకు వేరే వేషం ఏమీ లేదు. చాలా సన్నివేశాలలో మనకు రెండో ఎన్టీఆర్ గా ఆయన స్పష్టంగా కనిపిస్తారు.

మొత్తానికి అనుకున్న సమయానికన్నా నాలుగు నెలల ముందుగానే అన్ని పనులు పూర్తి చేసుకొని రాముడు భీముడు సినిమా 21 మే 1964న విడుదలైంది. అఖండ విజయం సాధించింది. ఆ తరువాత ఈ సినిమాను తమిళంలో ఎంజీఆర్, బి. సరోజాదేవి లతో “ఎంగ వీట్టు పిళ్లై” అని, హిందీలో దిలీప్ కుమార్, వహీదా రెహ్మాన్, ముంతాజ్ లతో “రామ్ ఔర్ శ్యామ్” గానూ వచ్చింది. అన్ని భాషలలోనూ రాముడు భీముడు అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రంలో హోటల్ లో సన్నివేశాలు ప్రసిద్ధి. ప్రతినాయకుడు రాజనాల రాముడు అనుకోని భీముని కొరడాతో కొట్టబోవడం, అప్పుడు ఎన్టీఆర్ తిరగబడటం థియేటర్ లోని అశేష ప్రేక్షకులు తామే ఆ పని చేస్తున్నట్టు అనుభూతికి లోనయ్యారు. చప్పట్లతో, ఈలలతో ఆ దృశ్యం మార్మోగిపోయేది.

నరసరాజు కథే మూలం…

రాముడు భీముడు సినిమా విడుదలైన తరువాత ద్విపాత్రాభినయం ప్రేరణతో ఆ తరువాత చాలా సినిమాలు వచ్చాయి. వీటన్నిటికి కూడా అడుగుజాడ నరసరాజు కథనే. చలం “బుల్లెమ్మ బుల్లోడు” అంటూ 1971లో ఒక సినిమా తీశారు. దాన్నే ఏ.వి.యం వారు “జైసాకోతైసా” అని జితేంద్రతో హిందీలో తీశారు. ఇందులో జి.పి.సిప్పీ తన కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో “సీతా ఔర్ గీత” తీశాడు. అది ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. అప్పటిదాకా సతీష్ బట్నాకర్ దగ్గర సహాయకులుగా ఉన్న సలీం జావేదులు పూర్తిస్థాయి స్వంతంగా రచన చేసిన మొట్టమొదటి సినిమా అది. వాళ్లు దానికి ఎత్తుగడగా ఎన్నుకుంది మాత్రం “రామ్ ఔర్ శ్యామ్” నే. హీరోను హీరోయిన్ చేసి చూపించారు, అంతే. నాగిరెడ్డి ఆ సినిమాను మళ్ళీ తెలుగులో “గంగ-మంగ” గాను తమిళంలో “వాణి రాణి” గాను తీశారు. కానీ ఆ రెండు వేర్వేరు భాషలలో తీసిన చిత్రాలు ఆర్థికంగా నష్టాల్ని చవిచూశాయి.

రామానాయుడు స్టూడియో కు వెళ్లిన వారికి అక్కడ “సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ” లో నటించిన కథానాయకులు, కథానాయికలు అందరి ఛాయాచిత్రాలు కనిపిస్తాయి. వాటిల్లో తొలి ఫోటో జమునదే. రాముడు భీముడు కథానాయికగా ఆవిడకు దక్కిన అరుదైన గౌరవం అది. రామానాయుడు బ్రతికి ఉన్న రోజులలో సందర్భం వచ్చినప్పుడల్లా తన తొలి కథానాయికగా జమునను ప్రస్తావిస్తుంటారు. జమున సినిమా జీవితంలో 1964 – 65 సంవత్సరాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. “రాముడు భీముడు” సినిమా విడుదలైన తరువాత సరిగ్గా 15 నెలలకు అంటే  04 ఆగస్టు 1965  తేదీన జమున వివాహం డాక్టర్ రమణారావు తో జరిగింది. మద్రాసులో జరిగిన విందుకు సినిమా పరిశ్రమ అంతా తరలివచ్చింది.

Show More
Back to top button