CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో సాహసాలకు మారు పేరు, సంచలనాలకు మరో పేరు.. సూపర్ స్టార్ కృష్ణ..

అది 1951 వ సంవత్సరం.. గుంటూరు జిల్లా తెనాలి రత్న టాకీస్ గోడ పై “పాతాళభైరవి” సినిమా స్కోప్. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ల బొమ్మ ఎనిమిదేళ్ల కుర్రాడిని విపరీతంగా ఆకర్షించింది. మళ్లీ మళ్లీ ఆ బొమ్మనే చూశాడు. ఆ చిత్రం తరువాత మరెన్నో చిత్రాలు వచ్చినా పాతాళభైరవి సినిమా పోస్టర్ మాత్రం ఆ బాలుడి మధ్యలో నిలిచిపోయింది. కొనేళ్ల తరువాత అదే తెనాలి, ఆ కుర్రోడే మళ్ళీ నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ ఇంటి దగ్గర గుమిగూడిన జనం కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ఎవరికోసమో వందల మంది జనం  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏమి జరుగుతుందో తెలియని ఆ కుర్రాడు ఆ గుంపులో చేరిపోయాడు. అంతలోనే ఆ ఇంటిలోంచి అక్కినేని బయటకు వచ్చారు. ఒకటే ఈలలు, కేకలు. దేవున్ని చూసినట్టుగా వారి జన్మ ధన్యమైనట్టుగా జనం పరవశించిన సన్నివేశం అది. ఒక సినిమా హీరోకి ఇంత ప్రజాదరణ ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ఆ కుర్రాడు అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఎప్పటికైనా తాను కూడా సినిమా హీరో కావాలని. అంతే.. నిర్ణయానికి తిరుగులేకుండా పోయింది. అనుకున్నది సాధించాడు. వెండితెర ఏలేందుకు వచ్చేసాడు. ఆయనే ఘట్టమనేని కృష్ణ.

సాధనకు మారుపేరు కృష్ణ, సాహసానికి ఇంకో పేరు కృష్ణ, సంచలనాలకు మరోపేరు కృష్ణ. సాహసానికి మరో పేరు, సంచలనానికి అసలు పేరు, ఈ మాటలు వింటే చాలు ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఒకే ఒక్కడు అతనే ధైర్యవంతుడు, సాహసవంతుడు హీరో సూపర్ స్టార్ పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు దశాబ్దాలకు పైగా తన సాహాసాలతో అందరూ ఆశ్చర్యపోయే రీతిలో సాంకేతికంగా తెలుగు సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ అసామాన్యమైన అద్భుతమైన, విజయాన్ని అందుకున్న ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ. సామాన్యమైన వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఒక మహా శక్తిగా ఎదిగారు కృష్ణ. ఆ కృష్ణ అనే రెండు అక్షరాలలో ఎంతో పట్టుదల, దీక్ష కృషి కనిపిస్తాయి.

అవి తాను ఎదగడానికే కాకుండా పరిశ్రమ మీద కూడా ఎంతో దోహదపడ్డాయి. కృష్ణ వల్ల ఎంతోమంది దర్శకులు అయ్యారు, ఎంతో మంది నిర్మాతలయ్యారు, ఇంకా ఎంతో మంది సాంకేతిక నిపుణులుగా రాణించారు. ఎదగడం అంటే తానొక్కడే ఎదగడం కాదు, తన చుట్టూ ఉన్నవారు, పరిశ్రమను నమ్ముకున్నవారు అందరూ ఎదగాలనేది ఆయన తత్వం. అందుకే అతి తక్కువ కాలంలో 365 చిత్రాలు పూర్తి చేసిన ఘనత దక్కించుకోవడంతోపాటు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తిగా పేరు పొందారు.

ఏటికి ఎదురీదడం, ఎదురెళ్లి ఏనుగు కుంభస్థలంపై దాడి చేయడం ధీరులకు మాత్రమే సాధ్యం. అలాంటి ధీరత్వం సూపర్ స్టార్ కృష్ణ స్వంతం. ఆ తెగువే ఆయనను తెలుగునాట సూపర్ స్టార్ ను చేసింది. కోట్లాది అభిమానుల హృదయ “సింహాసనం” పై అధిష్టించేలా చేసింది. ఎక్కడో గుంటూరు జిల్లా తెనాలి దగ్గర గల బుర్రిపాలెం నుండి చెన్నై వెళ్లి కొత్తలో “ఎవరు నువ్వు” అని ప్రశ్నించిన చిత్రపరిశ్రమ తోనే “సింహాసనం” వేయించుకున్న కార్యసాధకుడు. సరికొత్త ప్రయోగాలతో చరిత్ర తిరగ వ్రాస్తూ ఊరికి మొనగాడిగా అవతరించిన బెజవాడ బొబ్బిలి పోరాటతత్వాన్ని గుర్తించి సూపర్ స్టార్ గా కీర్తించింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఎన్టీఆర్, ఏఎన్నార్ నువ్వా నేనా అంటూ పోటా పోటీగా సినిమాలు చేసే తరుణం అది.

అప్పుడు ప్రేక్షకుల దృష్టిలో హీరోలంటే వాళ్లే. అటువంటి చిత్రసీమలో అదుర్తి సుబ్బారావు దర్శకత్వం 1965 లో వచ్చిన “తేనెమనసులు” చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే శతదినోత్సవ హీరోగా అందరి దృష్టిని ఆకర్షించారు కృష్ణ. కన్నెమసుల చిత్రంతో కృష్ణ మెప్పించారు. అలా మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయేలా పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణ. ఎందరో మహానుభావులతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచారు కృష్ణ. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన కృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత తన ప్రతిభను చాటుకున్నారు కృష్ణ. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    ఘట్టమనేని కృష్ణ
  • ఇతర పేర్లు  :  శివరామకృష్ణమూర్తి  
  • జననం    :     31 మే 1943    
  • స్వస్థలం   :    బుర్రిపాలెం, తెనాలి మండలము, గుంటూరు జిల్లా 
  • వృత్తి      :     నటుడు, దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేత
  • తండ్రి    :     ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి 
  • తల్లి     :     నాగరత్నమ్మ 
  • జీవిత భాగస్వామి :  ఇందిర, విజయ నిర్మల
  • పిల్లలు     :     రమేష్ బాబు, పద్మజ, మంజుల ఘట్టమనేని, మహేష్ బాబు, ప్రియదర్శిని
  • బిరుదులు   :  సూపర్ స్టార్
  • మరణ కారణం  :  గుండె పోటు 
  • మరణం   :    15 నవంబరు 2022, హైదరాబాదు.

నేపథ్యం..

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. ఆయన 31 మే 1943 నాడు గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. వారిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా, సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా మార్చేశారు. కృష్ణ కు చిన్నతనం నుంచి ఎన్.టి.రామారావు అభిమాన నటులు. “పాతాళ భైరవి” అభిమాన చిత్రం. కృష్ణకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరును చేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. సీటు కోసం ప్రయత్నించారు.

గుంటూరు కళాశాలలో ఆ కోర్సు దొరకకపోవడంతో, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎం.పి.సి. గ్రూపుతో ఇంటర్మీడియట్ లో చేరాడు. అక్కడ మూడు నెలలే చదివి, ఆ తరువాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారాడు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఆ తరువాత బీఎస్సీ చదివాడు. సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ, ఆ తరువాత కాలంలో సినిమాల్లో నటుడిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్లు, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాషను పెంపొందించుకున్నాడు. ఆయన డిగ్రీ పూర్తిచేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసిపోయింది.

వ్యక్తిగత జీవితం…

కథానాయకుడిగా కృష్ణకు తొలి సినిమా “తేనె మనసులు” ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయ్యింది. 13 అక్టోబర్ 1965 నాడు పెద్ద కుమారుడు రమేష్ బాబు జన్మించారు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, కొడుకు మహేష్ బాబు; ముగ్గురు కుమార్తెలు పద్మజ, మంజుల, ప్రియదర్శిని. 1967లో బాపు – రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది. ఆ తరువాత “సర్కార్ ఎక్స్‌ప్రెస్” సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పారు. దాంతో వారు పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో తిరుపతిలో పెళ్ళిచేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయనిర్మలకూ కూడా ఇది రెండవ పెళ్ళి. కృష్ణకు తోటి నటిగానూ, దర్శకురాలిగానూ విజయనిర్మల సినీ రంగంలో రాణించారు. వీటిల్లో 50 సినిమాలలో కృష్ణ కథానాయకుడిగా చేశారు.

సినీ ప్రస్థానం…

కృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని , ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తన తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి సిఫారసు చేస్తూ ఉత్తరాలు వ్రాసిచ్చి మద్రాసు పంపారు. తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటివారిని కలిసిన కృష్ణ తన ఉద్దేశాన్ని చెప్పారు. ఆ సమయానికి కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు అవ్వడంతో, కొంతకాలం ఆగి తిరిగి మద్రాసుకు రమ్మని సలహా ఇచ్చారు. చేసేది లేక కృష్ణ నాటకాలలో నటించి మంచి అనుభవం పొందాలని ఆశించారు. మద్రాసులోనే “చేసిన పాపం కాశీకి వెళ్ళనా?” అనే నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించారు. ఆ తరువాత విజయవాడ జింఖానా మైదానంలో గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్యమండలి వారు ప్రదర్శించిన ఛైర్మన్ నాటకంలో ఛైర్మన్ కుమారుడి పాత్ర పోషించారు. ఆ తరువాత తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించసాగారు.

తొలి అవకాశం “పదండి ముందుకు” (1962)…

ఎల్వీ ప్రసాద్ తీస్తున్న “కొడుకులు కోడళ్ళు” అనే సినిమాలో ఒక పాత్రకు ఎంపికచేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో చేసేదిలేక మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన సాధన చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవారు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలలో ఏనాడూ ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైనా సరే ఇంటికి ఉత్తరం వ్రాస్తే, కృష్ణ తల్లి కావాల్సినంత డబ్బు పంపేవారు.

ప్రతీ రోజూ పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసినవారిని కలుస్తూ ఉండేవారు. సాయంత్రం రెండవ ఆట సినిమాలు చూస్తూ,  ఉండేవారు. అలా కొంగర జగ్గయ్య నిర్మించిన “పదండి ముందుకు” (1962) సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించారు. కులగోత్రాలు (1962), పరువు ప్రతిష్ఠ (1963), మురళీకృష్ణ (1964) సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లోనే కనిపించారు. “కాదలిక్క నేరమిల్లై” అనే తమిళ సినిమా కోసం దర్శక, నిర్మాత సి.వి.శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో ఆ అవకాశం చేజారింది. దీనితో కృష్ణ తెనాలి తిరిగి వెళ్ళిపోయారు.

కథానాయకుడిగా తొలి సినిమా “తేనెమనసులు”…

ప్రముఖ దర్శక, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు 1964లో అందరూ కొత్తవాళ్ళతో “తేనె మనసులు” సినిమా తీస్తున్నారు. అందుకోసం కొత్త నటులు కావాలని పత్రికకు ప్రకటన ఇచ్చారు. అది చూసిన కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించారు. ఎంతో మందిని పరిశీలన చేసిన తరువాత కృష్ణను మద్రాసు పిలిపించి  స్క్రీన్ టెస్ట్ చేసిన ఆదుర్తి  ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా కృష్ణను ఎంపికచేశారు. దాంతో బాటు సంభాషణలు పలకడం, డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో కృష్ణకు శిక్షణనిచ్చారు. కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నటీనటులుగా నటించిన “తేనె మనసులు” సినిమాని రంగులలో చిత్రీకరించారు. కలర్ లో తీసిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా “తేనె మనసులు” కు ప్రత్యేకత ఉంది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే రషెస్ చూసిన పంపిణీదారులు కృష్ణ నటన బాగాలేదని, తనను ఆ సినిమా నుండి తొలగించెయ్యమని ఆదుర్తి సుబ్బారావు పై ఒత్తిడి తెచ్చిరు. అయినా ఆదుర్తి తన నిర్ణయం మార్చుకోలేదు. 31 మార్చి 1965 నాడు “తేనె మనసులు” విడుదలై విజయం సాధించింది. ఆ తరువాత ఆరు నెలలకు ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన “కన్నెమనసులు” సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం “తేనె మనసులు” హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ కూడా నటించారు.

తెలుగు తొలి జేమ్స్ బాండ్ చిత్రం “గూఢచారి 116″…

తేనెమనసులు సినిమాలో స్కూటర్‌తో కారును ఛేజ్ చేస్తూ, స్కూటర్‌ను వదిలేసి కారు మీదికి జంప్ చేశారు కృష్ణ. అలా డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండీ తన “జేమ్స్‌బాండ్” చిత్రం “గూఢచారి 116” కు హీరోగా కృష్ణను ఎంపికచేశారు. ఆ సమయంలో కృష్ణ “కన్నెమనుసులు” సినిమాలో నటిస్తున్నారు. రెండు సినిమాలూ దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని, రెండూ 1966లోనే విడదలయ్యాయి. కన్నెమనసులు 22 జూలై 1966 విడుదలై యావరేజిగా నిలిచింది. 11 ఆగస్టు  1966 నాడు విడుదలైన “గూఢచారి 116” సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ సినిమా ప్రస్థానాన్ని ఓ మలుపు తిప్పింది. ఇది తెలుగు తొలి జేమ్స్‌బాండ్ తరహా చిత్రంఆ సినిమాతో కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది.

ఈ సినిమా విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాలలో హీరోగా బుక్ అయ్యారు. 1967లో ఆయన నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో “ఇద్దరు మొనగాళ్లు” అనే జానపద చిత్రం, కృష్ణ, విజయనిర్మల కలయికలో బాపు – రమణల తొలి చిత్రం సాక్షి, తరువాత రోజులలో కృష్ణతో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు వి. రామచంద్రరావు, కృష్ణ ల తొలి కలయికలో “మరపురాని కథ” ఉన్నాయి. ఈ సమయంలోనే కృష్ణ వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశారు. గూఢచారి 116 వల్ల కృష్ణకు వచ్చిన ప్రేక్షకాదరణ ప్రభావం చాన్నాళ్ళు ఉండిపోయింది. ఆ తరువాత రెండు దశాబ్దాల్లో మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణకు దాదాపు అన్నీ విజయాలనే సంపాదించిపెట్టాయి.

ఒకే సంవత్సరం 18 సినిమాలు…

అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. సినిమాల విజయం కూడా అలాగే ఉంది. ఈ దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం ఎరుగక సినిమాలు చేయడం ప్రారంభించారు. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో తెలుగు సినీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1975లో 8 సినిమాలు విడుదలయ్యాయి. 1968 నుండి 1975 వరకు సుమారు 8 సంవత్సరాలలో 110 చిత్రాలలో నటించారు. సినిమాలో నటిస్తున్నారు, కానీ తనకు స్టార్ డం తెచ్చే చిత్రాలు రాలేదు. తనకు స్టార్‌డం తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించిన కృష్ణ తన తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించేలా 1970లో తమ స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ప్రారంభించారు. ఆ బ్యానరుపై మొదటి సినిమాగా “అగ్నిపరీక్ష” సినిమా నిర్మించారు. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. అయితే రెండవ సినిమాగా 1971లో తీసిన “మోసగాళ్ళకు మోసగాడు” మాత్రం భారీ విజయాన్ని అందుకుని సాహసాలకు మారుపేరుగా కృష్ణను నిలబెట్టింది.

విజయనిర్మల దర్శకత్వంలో “మీనా”…

“ట్రెజర్ హంట్” పేరిట ఆంగ్లంలోకి  అనువాదమైన “మోసగాళ్ళకు మోసగాడు” సినిమాను సుమారు 123 దేశాల్లో విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. అనుకున్నట్టుగానే తాను ఆశించిన విధంగా ఆ సినిమా కృష్ణకు స్టార్ హోదాను సాధించిపెట్టింది. 1972లో నటుడు ప్రభాకర రెడ్డిని భాగస్వామిగా తీసుకుని “పండంటి కాపురం” అనే కుటుంబ కథాచిత్రాన్ని నిర్మించారు. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. 1974లో స్వంత బ్యానర్‌పై “అల్లూరి సీతారామరాజు” సినిమా తీశారు. కృష్ణ, విజయనిర్మల కలిసి 1973 లో విజయకృష్ణా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించారు. విజయనిర్మల దర్శకురాలిగా మలయాళంలో తొలి సినిమాను, మలి చిత్రం తెలుగులోనూ తీశారు. తెలుగులో కృష్ణ, విజయనిర్మల ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా కు విజయనిర్మలే దర్శకత్వం వహించారు. అది కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ దశలో కృష్ణకు మంచి విజయాలు సాధించిపెట్టిన మరో జానర్ – క్రైం సినిమాలు. 1968 -1970 మధ్యకాలంలో కృష్ణ పలు క్రైం సినిమాలు చేసినా 1970లో వచ్చిన “పగ సాధిస్తా” సినిమా కృష్ణ దశ మార్చింది. దీని తరువాత రెండేళ్ళలో కృష్ణ నటించిన ఎనిమిది క్రైం సినిమాలు విడుదలయ్యాయి.

దర్శకత్వం…

నటశేఖర కృష్ణ కి ఎప్పటి నుండో దర్శకత్వం చేయడంపై అభిలాష ఉండేది. సంవత్సరానికి పదికి పైగా సినిమాలలో నటిస్తూ వచ్చిన కృష్ణ చిత్రపరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాలలోనూ పట్టు సంపాదిస్తూ వచ్చారు. ఆయనకు ఎడిటింగ్ లో ఎంతో నేర్పు ఉంది. తన అభిమాన కథానాయకుడు యన్టీఆర్ తో కలసి తాను నిర్మిస్తూ నటించిన “దేవుడు చేసిన మనుషులు” కథను చూసిన కొందరు పంపిణీదారులు, అంతకు ముందు వచ్చిన అక్కినేని “కన్నకొడుకు” తో పోల్చారు. అందువలన కృష్ణ ఆ సినిమాను అటుఇటుగా మార్చి, తనదైన కూర్పుతో “దేవుడుచేసిన మనుషులు” గా మార్చారు. అదిచూసి యన్టీఆర్, దర్శకుడు వి.రామచంద్రరావు, రచయిత మహారథి లాంటి వారు కృష్ణను అభినందించారు. అప్పటి నుంచీ కృష్ణకు కూడా దర్శకత్వం నిర్వహించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. తన నూరవ చిత్రంగా రూపొందిన “అల్లూరి సీతారామరాజు” కు వి.రామచంద్రరావుని దర్శకునిగా ఎంచుకున్నారు. కానీ సినిమా మొదలైన కొద్దిరోజులకే రామచంద్రరావు అస్వస్థతతో కన్నుమూశారు. అందువలన మిగతా సినిమానంతా కృష్ణనే పూర్తి చేశారు. అయినా దర్శకునిగా వి.రామచంద్రరావు పేరునే తెరపై ప్రకటించారు.

ఆ తరువాత ఎన్నోసార్లు దర్శకుడు కావాలనుకున్నారు కృష్ణ. తనకున్న తీరికలేని షెడ్యూల్స్ కారణంగా అది వీలు పడలేదు. ఎట్టకేలకు “సింహాసనం” అనే జానపద చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తూ తొలిసారి అధికారికంగా మెగాఫోన్ పట్టారు కృష్ణ. తెలుగునాట తొలి 70 ఎమ్.ఎమ్.గా ఈచిత్రం తెరకెక్కి  ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. జితేంద్ర హీరోగా హిందీలో రూపొందిన ఈ సినిమా హిందీలో కూడా అలరించింది. ఆ తరువాత “శంఖారావం”, “నాగాస్త్రం”, “కొడుకు దిద్దిన కాపురం,”, “ముగ్గురు కొడుకులు”, “అన్న – తమ్ముడు”, “అల్లుడు దిద్దిన కాపురం”, “ఇంద్రభవనం”, “మానవుడు – దానవుడు” వంటి  చిత్రాలకు కృష్ణ దర్శకత్వం వహించారు. వీటిలో తన కుమారులు రమేశ్ బాబు, మహేశ్ బాబుతో కలసి ఆయన నటించిన “ముగ్గురు కొడుకులు”, మహేశ్ ద్విపాత్రాభినయంలో కనిపించిన “కొడుకు దిద్దిన కాపురం” చిత్రాలతో పాటు “నాగాస్త్రం” సైతం వాణిజ్యపరంగా అలరించింది.

రాజకీయం…

1984 లో ఇందిరా గాంధీ హత్య తరువాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణకు మైత్రి కుదిరింది. మాములుగానే ఎన్టీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ఆయనను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోత్సహించింది. ఎన్టీఆర్ లాంటి ఛరిష్మా ఉన్న నేతకు ధీటైన సమాధానం చెప్పగలిగే సత్తా కృష్ణకే ఉందని పార్టీ భావించింది. కృష్ణ కూడా ఎన్టీఆర్ పరిపాలన విధానాలను వ్యతిరేకిస్తూ అనేక సినిమాలు కూడా రూపొందించారు. అందువలన కొన్ని కొన్ని సినిమాల విడుదలకు ఆటంకాలు కూడా ఎదురయ్యేవి. అయినా సరే కృష్ణ మాత్రం వెనక్కి తగ్గలేదు. తరువాత నేరుగా ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 1989లో రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో ఏలూరు నుండి  లోక్‌సభకు పోటీ చేసి 71వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

అయితే తరువాత రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురి కావడంతో రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1991లో జరిగిన ఆ మధ్యంతర   ఎన్నికల్లో ఎన్నికల్లో బుల్లిరామయ్య చేతిలో 47 వేల ఓట్ల తేడాతో కృష్ణ పరాజయం పాలయ్యారు. రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనను గుర్తించే వారు తగ్గిపోయారు. గుంటూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపినా తనను ఎవ్వరూ పట్టించుకోలేదని కృష్ణ చెబుతారు. తనకు అత్యంత ఆప్తమిత్రుడైన రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడం, ఆ తరువాత వచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కృష్ణ విలువను గుర్తించకపోవడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమయ్యారు. ఆ తరవాత కేవలం సినీ పరిశ్రమకే అంకితం అయ్యారు. ఓ దశాబ్దం తరువాత వై.ఎస్.రాజశేఖర రెడ్డి సీఎం అయిన తరువాత ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ సానుభూతిపరులుగానే ఉన్న కృష్ణ చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

విశేషాలు…

★ సుమారు 350 పైగా చిత్రాలలో నటించిన మొట్టమొదటి కథానాయకులు కృష్ణ..

★ ఒకటి, రెండు కాదు.. సుమారు 1965 నుంచి 2009 వరకూ ఏ సంవత్సరమూ విరామం రాకుండా 45 సంవత్సరాలు సినిమాలలో నటించిన ఏకైక హీరో..

★ ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు విడుదల చేసిన కథానాయకుడిగా కృష్ణ అరుదైన రికార్డు నెలకొల్పారు. 1972 వ సంవత్సరంలో తాను నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి.

★ ఒకే ఏడాది ఒకే నగరంలో ఆరు శతదినోత్సవ చిత్రాలు జరుపుకున్న రికార్డు కృష్ణ పేరిట ఉంది. 1983లో విజయవాడలో ఆయన నటించిన ఆరు సినిమాలు వంద రోజులు ఆడాయి. భారతదేశ సినిమా చరిత్రలో మరే ఇతర హీరోకూ ఇటువంటి రికార్డు లేదు.

★ కృష్ణ హీరోగా 44 ఏళ్ళ పాటు సినిమాలు చేస్తే అందులో 30 ఏళ్ళు సంక్రాంతికి ఆయన సినిమాలు విడుదల అయ్యాయి. కృష్ణను సంక్రాంతి కథానాయకుడు అనేవారు.

★ ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన కథానాయకులు కూడా కృష్ణనే. తన సినీ ప్రస్థానంలో సుమారు 50 మల్టీస్టారర్స్ చేశారు.

★ తెలుగులో ఒకే దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డు  బహుశా కృష్ణదే అయ్యి ఉండొచ్చు. కె.యస్‌.ఆర్‌. దాసు దర్శకతంలో ఆయన 31 సినిమాలు చేశారు.

★ కృష్ణ 52 మంది సంగీత దర్శకులతో  పనిచేశారు..

★ కృష్ణ తన సినీప్రస్థానంలో వందకు పైగా దర్శకులతో  పని చేశారు. ఆయన 105 మంది దర్శకులతో సినిమాలు చేశారు.

★ కృష్ణ పాతిక (25) సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఆయన ఏడు సినిమాలలో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు.

★ కృష్ణ నటించిన 20 సినిమాలు తమిళంలోకి డబ్‌ అయ్యాయి. అలాగే ఆయన 10 సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయ్యాయి.

★ కృష్ణ, విజయనిర్మల కలయికలో  50 సినిమాలు చేశారు. ఆ తరువాత ఆయన జయప్రదతో ఎక్కువ సినిమాలు చేశారు. కృష్ణ జయప్రదతో 43 సినిమాల్లో నటించారు. అలాగే అతిలోక సుందరి శ్రీదేవితో 31 సినిమాలు చేశారు.

★ కృష్ణ అంటే తెలుగు ప్రజలకు ఎంతో అభిమానం. ఆయన పేరు మీద 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి.

Show More
Back to top button