
శాస్త్రీయ సంగీతంలా కాకుండా సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా అందంగా, ఆకర్షణీయంగా ఉండే ఒక సంగీత శైలి “లలిత సంగీతం”. ఇది ఒక అందమైన, సులభమైన సంగీత శైలి. లలిత సంగీతం శాస్త్రీయ సంగీతం కన్నా చాలా సులభంగా ఉంటుంది. దీనిని నేర్చుకోవడం, వినడం, పాడటం కూడా చాలా సులభం. శ్రుతి, లయ, రాగ, భావయుక్తంగా సామాన్య శ్రోతలకు సైతం అర్థమయ్యే విధంగా వినిపించే మధుర మనోజ్ఞ గీతమే లలిత సంగీతం. లలిత సంగీతం శాస్త్రీయ, జానపద సంగీత స్రవంతికి వారధి వంటిది. ఇది భావగీతాలు, సినిమా పాటలు, జానపద గీతాలు, భక్తి గీతాలు వంటి వాటిని కలిగి ఉంటుంది. ఆకాశవాణి కేంద్రం వారు ఈ లలిత గీతాలకు స్వయంగా బాణీలు కట్టి, తాము పాడి, ఎందరో గాయనీ గాయకుల చేత పాడించి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వారిలో కందుల మల్లికార్జున రావు ఒకరు. ఆయన రేడియో శ్రోతలకు మల్లిక్ అనే పేరుతో సుపరిచితులు.
“తందనానా అహి, తందనానా భళా తందనానా” అంటూ ఉషోదయాన, సుప్రభాత వేళ రేడియోలో అన్నమాచార్య కీర్తన వినిపించగానే మనకు గుర్తొచ్చే మంద్రస్వర గాయకులు “మల్లిక్”. రేడియోకు, లలిత సంగీతానికి ప్రాచుర్యం కల్పించి పెట్టిన సంగీత కళాకారులు మల్లిక్. బాలాంత్రపు రజనీకాంతరావు పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు మల్లిక్. ఆకాశవాణి మదరాసు, హైదరాబాదు, విజయవాడ తదితర కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు అందించారు. వెంపటి చిన సత్యం బృందంలో ఎంతో కాలం గాత్ర సహాకారం అందించిన మల్లిక్, నర్తకీమణులు రాజసులోచన, శోభా నాయుడు, మంజు భార్గవి, చంద్రకళ , కొత్తపల్లి పద్మ, రత్నపాప మొదలగు వారి నృత్యప్రదర్శనలకు తన గాత్రాన్ని అందించారు. అంతే కాకుండా “శ్రీనివాస కల్యాణం”, “ఛండాలిక”, “శ్రీకృష్ణ పారిజాతం”, “మోహినీ భస్మాసుర”, “వాల్మీకి” మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు ఆయన సంగీతం సమకూర్చారు.
మల్లిక్ కేవలం ఆకాశవాణిలో లలిత సంగీత గాయకులుగా పనిచేయడమే కాకుండా సినిమాలకు నేపథ్య గానం కూడా చేశారు. తమిళ చలనచిత్ర రంగంలో “చంద్రలేఖ” (1948) అనే తమిళ చిత్రానికి తొలిసారిగా నేపథ్య గానం చేసిన మల్లిక్ “బంగారుపాప” (1955), చరణదాసి (1956), భాగ్యరేఖ (1957), లవకుశ (1963), సంపూర్ణ రామాయణం (1961), వింధ్యరాణి, భక్త శబరి, జయభేరి తదితర చిత్రాలకు నేపథ్య గానం అందించారు. మల్లిక్ అనేక ప్రసిద్ధ తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలకు మొదటి స్వరకర్త. ఆయన ప్రముఖ స్వరకల్పనలలో “అడిగో అల్లాడిగో”, “తంధనన ఆహి” మరియు “నారాయణనాథే నమో నమో” లాంటి కీర్తనలు ఉన్నాయి. ఆయన ప్రఖ్యాత “రాజ రాజేశ్వరి అష్టకం” మరియు “హనుమాన్ మంజరి” లను కూడా సృష్టించారు. ఆయన ప్రతిభకు గాను మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా “నాద కౌముది” పురస్కారం అందుకున్నారు. మల్లిక్ 1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించిన మల్లిక్ 50 సంవత్సరాలుగా ప్రతియేటా టిటిడి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : కందుల మల్లికార్జున రావు
ఇతర పేర్లు : మల్లిక్
జననం : 1921
స్వస్థలం : మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : నేపథ్య గాయకులు, సంగీత స్వరకర్త
తండ్రి : వెంకటాచలం
తల్లి : లక్ష్మీ నరసమ్మ
మరణం : 27 ఏప్రిల్ 1996
నేపథ్యం…
గాయకులు మరియు సంగీత స్వరకర్తగా ప్రసిద్ధి చెందిన మల్లిక్ అసలు పేరు అసలు పేరు “కందుల మల్లికార్జునరావు”. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నివాసమున్న కందుల వెంకటాచలం, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 1921 వ సంవత్సరంలో జన్మించారు. సంగీతంలో ఆయన ప్రారంభ శిక్షణ దివంగత క్రోవి సత్యనారాయణ మార్గదర్శకత్వంలో జరిగింది. ఆయన వద్దనే సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తనకు సంగీతం మీద కంటే పాడడం మీదనే ఎక్కువ ఆసక్తి ఉండడంతో సత్యనారాయణ వద్ద సంగీత శిక్షణ ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. సంగీతంతో పాటు పాడటం నేర్చుకోవాలనే తపనతో ఒకవైపు శాస్త్రీయ సంగీత శిక్షణ తీసుకుంటూనే రకరకాల సంగీత విద్వాంసులు ఆలపించిన గేయాల రికార్డులు శ్రద్దగా వినేవారు. వాటితో తన గళం కలుపుతూ ఏకలవ్య వీణ సాధన చేసేవారు. ఆవిధంగా ఆయన స్వయంగా వినికిడి వల్ల చేసిన సాధనతోనే ఎక్కువ నేర్చుకున్నారు. 1943 వ సంవత్సరం లో మల్లిక్ తన గురువు క్రోవి సత్యనారాయణ వద్ద సాధన చేస్తున్న సమయంలోనే ఆల్ ఇండియా రేడియో, మద్రాసు వారు అక్కడికి విచ్చేశారు.
గాత్ర పరీక్ష నిర్వహించి ఎంపికైన వారిని తమ రేడియోలో పాడించాలని అనుకున్న మద్రాసు రేడియో వారు అడిషన్ టెస్ట్ నిర్వహిస్తే వారి ముందు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకోమని తన శిష్యులందరినీ వెళ్ళమన్న గురువుగారు మల్లిక్ ను మాత్రం వెళ్ళమని చెప్పలేదు. మల్లిక్ లో ఉన్న ప్రతిభ గురువు సత్యనారాయణకు తెలుసు. మల్లిక్ సామర్థ్యం గ్రహించిన ఆయనను తనవద్దనే ఉంచి ఇంకా మంచి ప్రావీణ్యంగల వాడిగా తయారుచేయాలనేది గురువు కోరిక. మల్లిక్ ను సంగీతంలో నిష్ణాతుడిని చేయాలని అనుకునేవారు. ఆ విషయం మల్లిక్ కు అర్థం కాలేదు. దాంతో గురువు అనుమతి లేకుండానే తాను అడిషన్ కి వెళ్లారు. ఆడిషన్ లో మీరు ఏం పాడగలరు? అని రేడియో వారు మల్లిక్ ను అడిగారు. దానికి బదులుగా మీకేం కావాలో చెబితే అవి పాడతాను అని వారికి బదులు సమాధానం ఇచ్చారు మల్లిక్. మాకు అన్నీ కావాలి అని రేడియో వారు అడిగితే సరే అని సమాధానం ఇచ్చి ఆయన కొన్ని పాటలు పాడారు. మల్లిక్ పాడిన పాటలు నచ్చిన రేడియో వారు ఆయనను ఎంపిక చేశారు.
ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం…
మల్లిక్ ఆల్ ఇండియా రేడియో మద్రాసుకు ఎంపికయ్యే సమయానికి “ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ” లో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు. అందుకు వచ్చే జీతం కూడా తనకు సరిపోయేది కాదు. అందుకే ఆడిషన్ పూర్తయిపోయిన తరువాత మల్లిక్ ను ఎంపికచేసిన రేడియో వారు ఆయనను జీతం ఎంత కావాలని అడిగారు. దానికి ఆయన “మద్రాసు నగరంలో అప్పుల పాలు కాకుండా బ్రతకగలిగినంత ఇవ్వండి. హాయిగా పాడుకుంటూ గడిపేస్తానని జవాబు ఇచ్చారు. ఆడిషన్ లో రేడియో వారి ముందు మల్లిక్ పాడుతుండగా చివరిలో తన గురువు గారు క్రోవి సత్యనారాయణ వచ్చారు. శిష్యుడు పాడిన ఆ పాటను విని బాగా పాడావురా అని మెచ్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో పాడడం మొదలుపెట్టిన 1943 నుండి 1972 వరకు సుమారు 29 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రంకే తన సేవలను అందించారు. అక్కడ లలిత సంగీతంలో నిష్ణాతులైన దేవులపల్లి, బాలాంత్రపు రజనీకాంత రావు, ఈమని శంకర శాస్త్రి వంటి వారి సహచర్యం లభించింది.
ఆ తరువాత 1972 నుంచి 1981 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ పనిచేశారు. విజయవాడ కేంద్రంలో ఓలేటి వెంకటేశ్వర్లుతో కలిసి పలు కార్యక్రమాలను ఆయన రూపొందించారు. అన్నమాచార్య కీర్తనలు అంటే బాగా ఇష్టపడే మల్లిక్ చేత ఆకాశవాణి 150 పైగా అన్నమయ్య కీర్తనలను స్వరకల్పన చేయించింది. 1954 వ సంవత్సరంలో “అదిగో అల్లదిగో శ్రీహరివాసము” అనే అన్నమయ్య కీర్తనకు మల్లిక్ సమాకూర్చిన రాగము జనసామాన్యంలో విస్తృతమైన ప్రచారం పొందింది. ఎందరు కొత్త గాయకులు వచ్చినా కూడా ఆ కీర్తనను అదే రాగంలో పాడడం విశేషం. 90 వ దశకంలో అక్కినేని నాగార్జున నటించిన “అన్నమయ్య” చిత్రంలో కీరవాణి అనుసరించిన బాణీ కూడా మల్లిక్ దే కావడం విశేషం. అన్నమయ్య కీర్తనలను లలిత శాస్త్రీయం, లలిత సంగీతం, జానపదం అని మూడు భాగాలుగా విభజించి, సాహిత్యాన్ని బట్టి స్వరకల్పన చేసిన ప్రతిభావంతులు మల్లిక్. 1978 వ సంవత్సరంలో స్థాపించబడిన అన్నమాచార్య ప్రాజెక్టు వారు అప్పటినుండి 1996 వరకు అన్నమయ్య వర్థంతుల సభలను 46 నిర్వహించగా వాటిలో 40 సభలలో మల్లిక్ పాల్గొన్నారు. ఇది ఆయనకు అన్నమయ్య పై ఉన్న అనురక్తికి నిదర్శనం.
భావ కవులకు స్వరాల జీవం పోసి…
మల్లిక్ ఆల్ ఇండియా రేడియో మద్రాసులో పనిచేస్తున్న సమయంలో ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారితో పరిచయం ఏర్పడింది. వారి సహచర్యంలో “లలిత సంగీతం” పై మల్లిక్ మరింత పట్టు సాధించారు. ఆ ప్రతిభ తోనే భావ కవులైన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆరుద్ర, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రజినీ, అడవి బాపిరాజు, రావులపర్తి భద్రరాజు వంటి భావ కవుల పాటలకు తన స్వరాలతో జీవం పోశారు మల్లిక్. “ఒదిగిన మనసున పొదిగిన భావము”, “మాకు శరణం రామచరణం”, “జాబిలి నా గాథ ఒక వింత గాథ” తదితర గీతాలకు ఆయన స్వర కల్పన చేశారు. ఇంకా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ “కరుణ ఒక్క కాసారము, దానికి కంట నీరు ఆధారం” పాటను కళ్యాణి రాగంలో కూర్చి వన్యప్రాణుల పట్ల కారుణ్యత చూపాలనే ప్రబోధాన్ని ఆవిష్కరించారు.
అలాగే శ్రీకాంత శర్మ వ్రాసిన “పాగడపూలు” అనే గేయ సంకలనంలో చాలా పాటలకు మల్లిక్ స్వర రచన చేశారు. మల్లిక్ పాడిన లలిత గీతాలు, స్వరాలు కూర్చిన లలిత గీతాలు ఒక ఎత్తైతే, ఆయన పాడిన జానపద గీతాలను రేడియో ద్వారా వ్యాప్తి చేయడం మరొక ఎత్తు. ప్రయాగ నరసింహ శాస్త్రి, అనసూయ, సీత వంటి వారితో కలిసి మల్లిక్ పాడిన గ్రామఫోన్ రికార్డులు మల్లిక్ కు మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఆయన చిన్నపిల్లలకు కూడా పాటలు నేర్పేవారు. చిన్నపిల్లల కార్యక్రమంలో పాటలు నేర్పే “మల్లిక్ మామయ్య” గా ఆయన పిల్లలకి కూడా సుపరిచితులే. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపదం, అమ్మవారి స్తోత్రం, దేశభక్తి గీతాలు, భక్తి రంజని కీర్తనలు మొదలగు ఏవైనా మల్లిక్ స్వరంలో సుమధురంగా జాలువారి, శ్రోతలను ఓలలాడించేవి.
చిత్రసీమలో గాయకుడిగా…
కేవలం గేయాలకు స్వరకర్త గానే కాకుండా వెంపటి చిన్న సత్యం ప్రోత్సహంతో “పారిజాతం” నృత్య ప్రదర్శనలకు, యక్షగానాలకు మల్లిక్ స్వరాలను కూర్చారు. రాజ సులోచన (ప్రసిద్ధ సినీ నటి, నర్తకి) “భామ కలాపం” లో స్త్రీ పాత్రకు మల్లిక్ గాత్ర దానం చేసి, ప్రేక్షకులను మెప్పించడం ఆయన ప్రతిభావ్యుత్పత్తులకు నిదర్శనం. వెంపటి చిన్న సత్యం “ఛండాలిక” కు కూడా మల్లిక్ సంగీతం చేశారు. ఇంకా “మోహినీ భస్మాసుర”, “శ్రీనివాస కళ్యాణం”, “వాల్మీకి” వంటి నృత్య రూపాలకు మల్లిక్ సంగీతం అందించారు. ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడం, సంగీతంలో ప్రావీణ్యం ఉండడం, అలాగే మద్రాసులో చాలా కాలం ఉండటం వలన, అనేకమంది కళాకారులతో పరిచయం ఉండడం వలన, అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారితో సత్సంబంధాలు ఉండడం వలన ఇతర సంగీత కళాకారులాగే మల్లిక్ కూడా కొన్ని సినిమాలకు నేపథ్య గాయకుడిగా పనిచేశారు.
అప్పుడప్పుడే నటులకు నేపథ్య గానం పాడడం మొదలైన తొలి రోజులలో మల్లిక్ తమిళంలో తొలి నేపథ్య గానం చేశారు. 1948లో విడుదలైన భారతీయ చారిత్రక సాహస చిత్రం “చంద్రలేఖ” కు తొలి పాట పాడారు. జెమినీ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చంద్రలేఖ చిత్రంలో ఆయన ఎం.ఆర్.రాధా కు పాడారు. ఎం.ఏ.వి. పిక్చర్స్ బ్యానర్‌పై కె.సోము దర్శకత్వంలో తెరకెక్కిన సంపూర్ణ రామాయణం (1959) సినిమాలో “అన్నవు పితృస్వామియై నను ఓదార్చు”, “అభయము దయచేయు మాచాలవాస శుభ పాదమ్ము నమ్మినాను”, “తపోనిధి విశ్వామిత్రుని వెనుక పుట్టుకనుండి భోగము లొంది”, “పాదుకలే కొలిచేము సంతతము భూప్రజానీకము పూజించు” మొదలగు గేయాలు ఆలపించారు. అలాగే వాహిని పిక్చర్స్ పతాకంపై బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “బంగారు పాప” (1954) చిత్రంలో “బ్రతుకు స్వప్నం కాదు”, “ఘల్ ఘల్‌మని గజ్జలు మ్రోగ” అనే పాటలు పాడడమే కాకుండా సంసారం (1950), భాగ్యరేఖ (1957), లవకుశ (1963) వంటి సుమారు 50 చిత్రాలలో నేపథ్య గానం చేశారు మల్లిక్.
మరణం…
సినిమాలకు నేపథ్య గానం చేయడమే కాకుండా మల్లిక్ నాలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. 1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు. రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసిన మల్లిక్, ఆ తరువాత విజయవాడకు బదిలీ అయ్యారు. మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి 1981లో పదవీ విరమణ చేశారు. 1981 లో ఆకాశవాణిలో పదవీ విరమణ చేశాక తన మనుమరాలు లక్ష్మీనరసమ్మతో కలిసి కచేరీలు చేస్తూ గడిపారు మల్లిక్. ఆయన సంగీత కళను తన జీవితం కోసం కాకుండా, దానికి ఒక నిజమైన ఉపాసకుడిగా జీవించారు. “మధుర గాయకుడు”, “నాద కౌముది” తదితర బిరుదులతో గౌరవాలు అందుకున్న మల్లిక్ 27 ఏప్రిల్ 1996 శనివారం నాడు తన 76వ ఏట విజయవాడలో స్వర్గస్తులై తన స్వరయాత్రను ముగించారు.

