CINEMATelugu Cinema

భారతీయ చిత్రసీమకు తొలి అడుగుపడిన సినిమా..  రాజా హరిశ్చంద్ర (1913)..

అది 1912.. లండన్ లోని ప్యాలెస్ లాంటి “బయోస్కోప్” పత్రికా కార్యాలయం. ధోవతీ, లాల్చీ, కోటు, గొడుగు, భుజానికి సంచీ, కాళ్ళకి షూస్, తలపై టోపీ, కళ్లపై గుండ్రటి ఫ్రేమ్ అద్దాలతో ఉన్న వ్యక్తి “ఐ యాం ధూండిరాజ్ గోవింద్ ఫాల్కే ఫ్రమ్ ఇండియా, ఐ వాంట్ టు మేక్ ఎ మోషన్ పిక్చర్, కెన్ యు హెల్ప్ మీ” అన్న మాటలకు అవాక్కయిన బయోస్కోప్ ఎడిటర్ తనవైపు తలెత్తి చూసాడు. “బయోస్కోప్” పత్రిక అనేది లండన్ లో చాలా పేరు ఉన్న సినీ పత్రిక. ఆ పాశ్చాత్యేతరున్ని చూసిన ఎడిటర్ మొదట ఆశ్చర్యపోయాడు. వచ్చిన వ్యక్తి అడిగిన సహాయాన్ని అర్థం చేసుకొన్న ఎడిటర్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత తేరుకుని ధూండిరాజ్ గోవింద్ ఫాల్కే కి షేక్ హ్యాండ్ ఇచ్చి తనతో పాటు తీసుకెళ్లాడు. సముద్రాలు దాటి వెళ్లకూడదనే సనాతన కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దానిని కాదని ముంబై నుంచి లండన్ రావడానికి ప్రేరేపించిన శక్తి “సినిమా”.

సినిమా అనేది ప్రేక్షకులను మరో కొత్త లోకంలోకి తీసుకెళ్లి ఊహల ఊయలలో రంజింపజేస్తుంది.  సృష్టికి పునః సృష్టి చేయడం అనేది సినిమాతోనే సాధ్యపడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రిటిష్ వారి దమనకాండ కు వ్యతిరేకంగా భారతీయులు ఉవ్వెత్తున స్వాతంత్ర్య ఉద్యమం కొనసాగిస్తున్న సమయంలో ఫ్రాన్స్ కు చెందిన లూమియర్ బ్రదర్స్ 1895 లో మొదటిసారిగా ముంబైలోని వాట్సన్ హోటల్ లో ఒక మూకీ చిత్రాన్ని ప్రదర్శించారు. అది కదిలే చిత్రం అవ్వడంతో ప్రజలు ఎగబడి చూశారు. అలాగే అమెరికా, జర్మనీ, లండన్ కు చెందిన కొన్ని కంపెనీలు ఇలా మూకీ చిత్రాలను ప్రదర్శిస్తూ డబ్బులు తీసుకునేవారు.

కలలకు కళారూపం ఇస్తే అది సినిమా. సినిమా కలను “సినిమా కళ” గా మార్చడం సినిమాలలో ఒక్క పాటలో హీరో కోటీశ్వరుడైన అంత సులభం కాదు. కానీ చరిత్ర స్థానాన్ని గమనిస్తే చరిత్రను సృష్టించేది, చరిత్రను మలుపు తిప్పేది ఎప్పుడైనా ఒక్కరే అని తెలుస్తుంది. భారతీయ సినిమా చరిత్ర అందుకు మినహాయింపు కానే కాదు. నూట పదేళ్ళ క్రితం సినిమా కళా మొక్కను భారతీయ నేలపై నాటారు “దాదాసాహెబ్ ఫాల్కే”. ప్రేక్షకుల రెటీనా పై చలనచిత్రాలను ముద్రించారు. భారతీయ సినిమాకు ఆదిగా, పునాదిగా నిలిచారు ఫాల్కే. 03 మే 1913 లో విడుదలైన భారతదేశంలో విడుదలైన తొలి పూర్తి మూకీ చిత్రం “రాజా హరిశ్చంద్ర”. అది విడుదలై నేటికి నూట పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :     దాదాసాహెబ్ ఫాల్కె

రచన          :     దాదాసాహెబ్ ఫాల్కె, రంచోడ్‌బాయి, ఉదయ్‌రామ్ (కథ)

నిర్మాణం   :     దాదాసాహెబ్ ఫాల్కె 

తారాగణం  :   డి.డి. డబ్కె, పి.జి. సానె

ఛాయాగ్రహణం  :   త్ర్యంబక్ బి. తెలాంగ్

నిడివి      :     40 నిమిషాలు

విడుదల తేదీ   :     03 మే 1913

భాష     :     మరాఠి

తెరపై తొలిసారి కదిలే బొమ్మలు చూసిన ఫాల్కే…

ధూండిరాజ్ గోవింద్ ఫాల్కే ఫైన్ ఆర్ట్స్ లో అయిదేళ్లు కోర్స్ పూర్తి చేసి, ఎన్నెన్నో పనులు చేసి ఎందులోనూ సంతృప్తి లేక చివరికి ఇంద్రజాల ప్రదర్శనలిస్తూ కాలం గడుపుతున్నారు. ఎందులోనూ కుదురులేని ఫాల్కే ని పెద్దవాళ్లు   మందలించేవారు. కానీ భార్య సర్వస్వతీ భాయికి మాత్రం భర్త ఏం చేసినా గొప్పగానే అనిపిస్తుండేది. ఆరోజు 14 ఏప్రిల్ 1911. అనుకోకుండా ఓ గుడారంలో వెలిసిన సినిమా హాల్ “పిక్చర్ ప్యాలెస్” ఫాల్కే కంటపడింది. యథాలాపంగా అందులోకి ప్రవేశించిన ఫాల్కే కు ఇంతకాలం వెతుకుతున్న జీవన గమ్యం ఇదేనని తనకు తెలియదు. లోపల కొన్ని బెంచీలు, వాటిపై తెల్ల దొరలు, దొరసానులు. ఫాల్కే వెళ్లేసరికి వయోలిన్ గానం నడుస్తోంది. గానం ఆగిన తర్వాత వేదిక లోపల వెలుతురు ఆగిపోయింది.

వెనకనుంచి ఓ కాంతిపుంజం ఎదురుగా ఉన్న దవళ వర్ణ తెరమీదకు దూసుకు వచ్చింది. తెరమీద బొమ్మలు కదలసాగాయి. ఫాల్కే లో ఆశ్చర్యం, సంభ్రమం, దిగ్భ్రాంతితో కూడిన నమ్మలేనితనం. కదిలే బొమ్మలతో పాటు ఫాల్కే మస్తిష్కంలోనూ చలనం దానికి కారకమైంది. అది “అమేజింగ్ యానిమల్స్” అనే షార్ట్ ఫిలిం. ఆ తరువాత రోజు ఉదయమే “పిక్చర్ ప్యాలెస్” లో ఫాల్కే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఆరోజు కొత్త బొమ్మ “ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్” ఆ రాత్రి తన భార్యకు తాను చూసిన అద్భుతాన్ని చిలువలు పలువలుగా వర్ణించాడు. ఏసుక్రీస్తు లాగానే శ్రీరాముని కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పారు భార్యతో. సంకల్పం అయితే ఏర్పడింది. కానీ దానిని ఎలా సాధించాలన్నదే తన ముందున్న ప్రశ్న.

ఇంట్లో వస్తువులు అమ్మేస్తూ…

ఫాల్కే ఆ ప్రశ్నలకు సమాధానం వెదుకుతూ మరునాడు “పిక్చర్ ప్యాలెస్” లో ప్రొజెక్టర్ ఆపరేటర్ ని కలుసుకున్నారు. ఆయన ద్వారా బయోస్కోప్ వివరాలు కనుకున్నాడు. బ్రిటిష్ గ్రంథాలయంలో పత్రిక ప్రతులను చదివారు. ఫాల్కే ప్రస్తుతం తీరని దాహంతో ఉన్నాడు, అందుకే మరిన్ని పుస్తకాలు కొని అధ్యయనం చేయాలనుకున్నారు. కానీ తన చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో తరతరాలుగా వారసత్వంగా వస్తున్న చెక్క బీరువా కనిపించింది. దాన్ని అమ్మి ఆ డబ్బుతో పుస్తకాలు కొన్నారు. రీళ్లు కొన్నారు. వాటిని భూతద్దంలో చూస్తూ గంటలు గడిపేవారు. దాని ఫలితంగా ఇంట్లో నుండి ఒక్కో వస్తువు మాయం కావడం ఆరంభమైంది. చివరికి ఇల్లు చింకి చాపలు తప్ప మరే వస్తువు లేనంతగా బోసిపోయింది. కానీ ఫాల్కే మస్తిష్కం అంతటా కదిలే బొమ్మల పరిజ్ఞానంతో నిండిపోయింది.

సినిమా అన్వేషణలో లండన్ బయలుదేరిన ఫాల్కే..

ఆయనకు ఏది చూసినా కదిలే బొమ్మల కోణంలో కనిపించేది. బంధువులతో మాట్లాడుతున్నా కూడా ఒక్కోసారి పరధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. చివరకు థానేలోని మానసిక రోగుల దవాఖానకు కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. అయినా కూడా అక్కడ నుండి పారిపోయి వచ్చారు. మళ్ళీ అదే తంతు. గుడ్డి దీపపు వెలుగులో ఫిలిం నెగిటివ్ లను కళ్లు చిలికించి చూస్తూ గంటలు గడిపేవారు. దాంతో క్రమంగా ఫాల్కే కంటిచూపు మందగించింది. ఆ సమయంలో భార్య సరస్వతీ బాయి బలవంతంగా కంటి వైద్యం చేయించి ఫాల్కేని కంటికి రెప్పలా చూసుకుంది. ఆమెకు భర్త కలల పైన ఎందుకో అపార నమ్మకం. దాదా సాహెబ్ ఫాల్కే కళ్ళు రోజురోజుకు  మెరుగుపడ్డాయి. దాంతో తనకు ఏం చేయాలో స్పష్టత వచ్చింది. లండన్ వెళ్లడమే తక్షణ మార్గం అనుకున్నారు. కానీ లండన్ వెళ్లాలంటే భార్య సలహా పై తన భీమా పాలసీని కుదవపెట్టి పదివేల రూపాయల అప్పు సంపాదించారు. అలా దేశం కానీ దేశంలో ఏమీ తెలియని ఓ కదిలే బొమ్మల ప్రపంచాన్ని అన్వేషిస్తూ ఫాల్కే ఇప్పుడు బయోస్కోప్ పత్రిక సంపాదకుడిని కలుసుకున్నారు.

సినిమా కథగా “హరిశ్చంద్ర నాటకం”.. 

“మన సంకల్పంలో చిత్తశుద్ధి ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు అంటారు. మనం చేసే కార్యంలో లోక కళ్యాణం దాగి ఉంటే కాలం కూడా కలిసి వస్తుంది అంటారు”. ఫాల్కే విషయంలో జరిగింది అదే. ఆ “ఎడిటర్” ఫాల్కేని తనకు తెలిసిన ఫిల్మ్ మేకర్ కి పరిచయం చేశాడు. అక్కడ ఫాల్కే లైట్ బాయ్ నుండి కెమెరామెన్ వరకు అన్ని పనులు చేశారు. ఆరు మాసాలు గడిచాయి. ఒక కెమెరా కొన్నారు, నెగిటివ్ లను ప్రాసెసింగ్ చేసే కెమికల్స్ కొన్నారు, తిరిగి ముంబైకి పయనం అయ్యారు. ఇప్పుడు ఫాల్కే ఒకనాటి ప్రేక్షకుడు కాదు. ప్రస్తుతం తాను ఒక సృష్టికర్త. వచ్చీ రాగానే తన కళని సహాకారం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కానీ ఏ కథతో తీయాలి అనే ఆలోచన మొదలైంది. బ్రిటిషు వారు బైబిల్ ఆధారంగా సినిమా తీసినట్టు రామాయణ, మహాభారతాల ఆధారంగా తీయాలనుకున్నారు. అప్పట్లో ప్రేక్షకుల ఆదరణ పొందిన నాటకంలో హరిశ్చంద్ర ఒకటి. అన్ని కథల కన్నా ఫాల్కేకు హరిశ్చంద్ర బాగా నచ్చింది. ఇచ్చిన మాట కోసం నమ్మిన జీవన సూత్రం కోసం సర్వస్వం త్యాగం చేసి నానా కష్టాల పాలై కూడా వెనుతిరిగి చూడని సంకల్పం హరిచంద్రుడిది. తనకు ఇష్టమైన కదిలే బొమ్మల కోసం అన్నింటినీ అర్పించి అష్ట కష్టాలు పడుతూ కూడా తన కళను మాత్రమే నమ్మి ముందుకెళ్ళిన పట్టుదల ఫాల్కేది. తెరమీద హరిశ్చంద్రుడి కథ కోసం, తెరవెనక నిజ జీవితంలో ఫాల్కే హరిశ్చంద్రుడు కావలసి వచ్చింది. 

స్త్రీ పాత్రకోసం వేశ్యవాటికల చుట్టూ…

ఫాల్కే కు కథ దొరికింది. కానీ నిర్మాణానికి చిల్లి గవ్వ కూడా లేదు. తన గృహిణి సరస్వతీ భాయి ఆభరణాలను అమ్మాల్సి వచ్చింది. కథ సరే, డబ్బులు సరే, నటీనటుల కోసం అన్వేషణ మొదలైంది. ఫాల్కే స్థానిక పత్రికలో ప్రకటన ఇచ్చారు. దాంతో కొంతమంది వచ్చారు, కానీ వారిలో నటీనటుల లక్షణాలేవి ఫాల్కే కు కనిపించలేదు. రంగస్థల కళాకారులను తీసుకోవడమే ఉత్తమం అని భావించారు ఫాల్కే. హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి పాత్రకి మహిళా నటి కావాలి. అప్పట్లో రంగస్థలం పైన మహిళా నటులు ఉండేవారు కాదు. ఎవ్వరూ దొరకలేదు. తన భార్యతో ఆ పాత్ర ధరింపజేయాలని ఆమెను బ్రతిమాలాడు. ఆమె నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ వంటలు, వడ్డనలు ముఖ్యం కదా అని భర్తకు బదులిచ్చింది.

చేసేదిలేక ముంబైలోని వేశ్య వాటికలో అన్వేషించారు. విటుడు అనుకొని వారు ఆహ్వానించే వారు. వారికి నటన గురించి చెప్పేసరికి వెర్రివాడని తనను వెళ్లగొట్టేవారు. ఫాల్కే వేశ్య వాటికల చుట్టూ తిరుగుతున్న విషయం బంధువులకు తెలిసి తిట్టడం మొదలుపెట్టారు. కానీ తన భార్యకు ఆ విషయం గురించి తెలుసు కనుక అందరి నోర్లూ మూయించేసింది. ఇక విధి లేక ఒక “ఉపహారశాల” లో అంట్లు కడిగే యువకుడిని ఒప్పించి తెచ్చారు. మళ్ళీ సమస్య మొదలైంది. నాటకాలలో స్త్రీ పాత్రను పోషించే పురుషులు మీసాలు తీసుకునేవారు కాదు. ఆనాటి సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించినప్పుడు మాత్రమే మీసాలు తీసేసేవారు. అందుకని ఆ యువకుడి తండ్రిని కొడుకు మీసాలు తీయించడానికి ఒప్పించారు. నటీనటులంతా కుదిరారు. రిహార్సల్స్ ఆరంభమయ్యాయి. మొత్తం నటవర్గం సభ్యులు దాదాపు 500 మంది. మేకప్, సెట్టింగ్స్, దుస్తుల కోసం రవి వర్మ తీసిన పురాణ పురుషుల చిత్రాలను ప్రేరణగా తీసుకున్నారు.

తొలి ప్రదర్శన “కరొనేషన్ థియేటర్” లో…

రాజా హరిశ్చంద్ర సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. సజావుగా సాగుతోంది. కొన్ని సన్నివేశాలలో చిత్రీకరణ అవుట్ డోర్ లో చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో హరిశ్చంద్రుడు చంద్రమతి మెడ నరకే సన్నివేశం ఉంది. అది తీస్తుండగా అటువైపుగా వచ్చిన పోలీసులు హత్యాయత్నం క్రింద సినిమా సభ్యులందరినీ అరెస్ట్ చేశారు. ఫాల్కే పోలీసు అధికారులతో ఎంతగానో బ్రతిమాలి, నచ్చజెప్పి చివరికి పోలీస్ స్టేషన్ లో ఆ సన్నివేశాన్ని నటింపజేసి పోలీసు వారిని నమ్మించాల్సి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తయితే, ఆ రోజంతా చిత్రీకరణ చేసిన ఫిల్మ్ రాత్రంతా కూర్చుని ఫోటో ప్రింటింగ్ చేస్తూ ఉండేవారు. ఫాల్కే తోడుగా భార్య మెలకువగానే ఉండేది. దాదా సాహెబ్ ఫాల్కే చివరికి ఎలాగైతేనేమి కదిలే బొమ్మల కథ రాజా హరిశ్చంద్ర పూర్తి చేశారు.

ఆ సినిమాను స్థానిక “కరొనేషన్ థియేటర్”లో ప్రదర్శన మొదలుపెట్టారు. మొదటిరోజు బయటి ప్రేక్షకుల కన్నా అందులోని నటీనటులే ఎక్కువ వచ్చారు. మొత్తం ఐదు ఆటలకు గాను కేవలం 57 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రెండో రోజు కూడా అంతంత మాత్రమే. కానీ ఫాల్కే మెదడు పాదరసంగా పనిచేస్తుంది. వెంటనే “రాజా హరిశ్చంద్ర” ప్రచార పత్రాలను ముద్రించి ముంబై వీధుల్లో పంచారు. ప్రధాన కూడళ్ళ దగ్గర తన బృందంలోని నటుల చేత సంభాషణ శైలిలో నాటకాలు వేయించారు. ఐదో రోజున టికెట్ కొన్న వారిలో ఒకరికి బహుమతి పథకం ప్రారంభించారు. మహిళలకు, బాలలకు సగం ధరకే టికెట్ అని ప్రకటించారు. నెమ్మదిగా ఆ నోటా, ఈ నోటా ముంబై నగరం అంతా వ్యాపించింది. పదో రోజు నాటికి జనాలు తండోపతండాలుగా రావడం మొదలైంది.

విడుదల..

ఎన్ని కష్టాలు పాలైనా రాజ్యాన్ని, కుటుంబాన్ని కోల్పోయినా, సత్యవాక్య పరిపాలన విశ్రమించని రాజా హరిశ్చంద్ర సంకల్పానికి మహా శివుడే పరవశించాడు. హరిశ్చంద్రుడికి అన్నీ తిరిగి ఇచ్చి తనను మహా చక్రవర్తిని చేశాడు. దాదాసాహెబ్ ఫాల్కే మన కాలపు రాజా హరిశ్చంద్రుడు. చివరికి ప్రేక్షకులు ఫాల్కే కి కీర్తికిరీటం తొడిగారు. భారతీయ చలనచిత్ర పితామహుడిని చేశారు. 03 మే 1913 నాడు రాజా హరిశ్చంద్ర మూకీ సినిమా విడుదలైంది. సినిమా మూకీ కావచ్చు. తరువాత సినిమా మాటలు నేర్చి టాకీగా మారి, రంగుల్ని పులుముకుని సాంకేతిక పరిజ్ఞానంలో కొత్తపుంతలు తొక్కినా ఎందరెందరో తారలు, ఎందరెందరో దర్శకాగ్రేసరులు, ఎందరెందరో కళాకారులు ఉద్భవించిన బీజమే మహా వృక్షంగా ఎదిగింది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద సినీ పరిశ్రమగా ఏర్పడింది. ఒక కల శతకోటి కళలకు ఆధారంగా నిలిచింది. దాదాసాహెబ్ ఫాల్కే జిందాబాద్. రాజా హరిశ్చంద్ర జిందాబాద్. భారతీయ సినిమా వర్థిల్లాలి.

రాజా హరిశ్చంద్ర విశేషాలు.. 

 ★ “రాజా హరిశ్చంద్ర” సినిమా నిడివి 40 నిమిషాలు..

★ “రాజా హరిశ్చంద్ర” మూకీ సినిమా 03 మే 1913 నాడు ముంబైలోని “కరొనేషన్ థియేటర్” లో విడుదలైంది. కానీ దీనికంటే ముందే తొలి ప్రదర్శన 21 ఏప్రిల్ 1913 నాడు ఒలంపియా థియేటర్ లో జరిగింది. క్యాథలిక్ హాస్పిటల్ కోసం చారిటీ షో గా దీనిని ప్రదర్శించారు. 

★ “రాజా హరిశ్చంద్ర” మూకీ సినిమానే. కానీ చిత్రీకరణ లో పాత్రలు హిందీ భాషలో సంభాషించేవని అనుకుంటారు. కానీ అవి మరాఠీలో సంభాషించేవి. ఆ లెక్కన తొలి భారతీయ సినిమానిచ్చిన ఖ్యాతి మరాఠీ సినిమాదే.

★ ఈ సినిమా కోసం 500 మందికి పైగా నటీనటులు, సాంకేతిక వర్గం, ఇతర సిబ్బంది పనిచేశారు. వీరి భోజనాల బాధ్యతను ఫాల్కే భార్య సరస్వతీ బాయి చూసుకుంది. సిబ్బంది బట్టలు ఉతకడమే కాకుండా, సినిమా నిర్మాణంలో కూడా సహకరించింది.

★ అడవి, అగ్ని, నదీ ప్రవాహం లాంటి దృశ్యాలను సహజంగా చిత్రీకరించారు ఫాల్కే. నాటకాలలో ఉండే చిత్రలేఖన చిత్రాలక తాలూకు కృత్రిమతకు అలవాటు పడిన ప్రేక్షకులను ఈ దృశ్యాలు ఏ లోకంలోకో తీసుకెళ్లాయి. 

★ అప్పట్లో సినిమాలలో నటిస్తున్నామని చెప్తే ప్రజలు వింతగా చూసేవారు. అందువలన హరిశ్చంద్ర కార్ఖానాలో పనిచేస్తున్నామని ఫాల్కే చెప్పమన్నారు. ఫాల్కే తన సినిమా కోసం పడిన కష్టాలను హరిశ్చంద్ర  ఫ్యాక్టరీ పేరుతో మరాఠీ సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు పరేష్ మోకాషీ. అందులో ఫాల్కేగా నందు మాధవ్, సరస్వతీగా విభావరి దేశ్ పాండే నటించారు.

★ ఈ సినిమా రచన, నిర్మాణం, దర్శకత్వం దాదాసాహెబ్ ఫాల్కే. (రచనలో రంచోడ్ బాయ్ ఉదయ్ రామ్ అనే నాటక రచయిత పాలుపంచుకున్నారు).

★ ఈ సినిమాకు ఛాయాగ్రహణం త్రయంబక్ తెతాంగ్..

★ ఈ సినిమాలో “రాజా హరిశ్చంద్ర” పాత్ర దత్తాత్రేయ దామోదర డబ్కే..

★ ఈ సినిమాలో చంద్రమతి పాత్రకు పీ.జీ.సానే, విశ్వామిత్రుడు పాత్రలో జి.వి.సానే, లోహితాస్యుయుడు పాత్రలో దాదా సాహెబ్ ఫాల్కే కుమారుడు బాలచంద్ర ఫాల్కే.

Show More
Back to top button