CINEMATelugu Cinema

తెలుగు సినిమా స్వర్ణయుగంలో అమ్మ పాత్రలకు పెట్టింది పేరు.. పి. హేమలత.

కేవలం నటన మీద ఆసక్తితో సినీరంగంలోకి ప్రవేశించేవారు కొందరయితే, నటన మీద ఆసక్తితో పాటు కుటుంబ పోషణ కోసం, జీవిక కోసం సినిమాల్లో ప్రవేశించి తన ప్రతిభని చాటినవారు మరికొందరు. ఆ కోవకే చెందిన వారు గుణచిత్ర నటులు పి.హేమలత. తెలుగు సినిమా స్వర్ణ యుగంలో ఉజ్వల కీర్తితో ప్రకాశించిన తార పి.హేమలత. ఉన్నత విలువలతో ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు వచ్చినంత కాలం ఆ చిత్రాలలో హేమలత  కచ్చితంగా ఉండేవారు.

ఉమ్మడి కుటుంబం, మంచి కుటుంబం, ఆదర్శ కుటుంబం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలలో తల్లి పాత్రలన్నీ ఆమెవే. తెరపై హేమలతను చూస్తున్నంత సేపు ఇంట్లో తల్లి, వదిన, అక్క, అమ్మమ్మ ఇలా మన వాళ్లను, మన కుటుంబ సభ్యులను చూస్తున్నట్లే అనుభూతికి లోనయ్యేవారు ప్రేక్షకులు. అంత సహజంగా సాత్వికతత తెరపై ఆవిష్కరించి  రాణించగలిగిన గొప్ప గుణ చిత్ర నటులు పి.హేమలత.

పి.హేమలత తెలుగు సినిమా నటి. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగారు. ఆమె నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరావు వంటి అగ్ర కథానాయకుల చిత్రాలలో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఆమె ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పలు చిత్రాలలో ఆయనకు తల్లిగా నటించి అలరించారు. ఆమెకు అవకాశాలు వచ్చిన మొదట్లో అనేక చిత్రాలలో సాధుమూర్తిగా నటించారు. నటీనటులు అన్నాక ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాలి. అందువలన హేమలత “బలిపీఠం” వంటి చిత్రాలలో గయ్యాళి పాత్రలూ పోషించారు. 

1960ల నుండీ వచ్చిన సినిమాలలో అమ్మ పాత్ర కొంచెం మారింది. అందువలన ఆమె తనను తాను మార్పు చేసుకోవడం నేర్చుకున్నారు. హేమలత “వారసత్వం”, “పరువు – ప్రతిష్ట” వంటి సినిమాలలో ఇంటి వ్యవహారాలలో తన పట్టు నిలుపుకుంటూనే సినిమా ఆసాంతం ఒక ప్రధాన పాత్రలా కనిపించారు. సుమారు మూడు దశాబ్దాలు తెరపై అక్కినేని, నందమూరి, గుమ్మడి కృష్ణ వంటి నటీనటులకు తల్లిగా నటించి సుమారు 200 పెద్ద తరహా పాత్రను పోషించి మెప్పించారు పి.హేమలత.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    పి. హేమలత  

జననం    :      1926    

స్వస్థలం   :    గుడివాడ 

వృత్తి      :     గుణచిత్ర నటి 

భర్త        :        శేషగిరి రావు

మరణం కారణం  :   వృద్దాప్యం 

పిల్లలు     :       ఒక కుమారుడు 

మరణం   :    2019

నేపథ్యం…

హేమలత స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని గుడివాడలో 1926లో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పెద్దగా అభిలాష ఉండేది కాదు. నిజానికి ఆమె భర్త శేషగిరి రావు ప్రోత్సాహంతో నటిగా కెరీర్ ప్రారంభించారు. శేషగిరిరావు నాటక కళాభిమాని, రంగస్థల నటుడు కావడం వలన ఆమెను నాటకాలలోకి ప్రవేశ పెట్టాలని అభిలాషిస్తూ ఉండేవారు. ఏలూరు నాటక కళాపరిషత్తులో రావూరి రచించిన “పరితాపం” అనే నాటకంలో భర్త శేషగిరిరావు ఆమెను ప్రోత్సహించి నటించేలా చేశారు. ఆ నాటకంలో తొలిసారిగా నటించినందుకు ఆమెకు ఒక ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి పొందిన హేమలతను పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అదర్శ మండలి “పినిశెట్టి శ్రీరామమూర్తి” తమ నాటకం “పల్లె పడుచు” లో ఆమె చేత జమీందారిణి “రమాదేవి” పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఈ నాటకం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శించబడి జమీందారిణి పాత్రలో అందరికీ సుపరితురాలింది.

సినిమా నేపథ్యం…

హేమలతకు మొదటి నుంచి ప్రజా నాట్య మండలి తోనూ దానిని నిర్వహించే “గరికపాటి రాజారావు” తోనూ పరిచయాలుండేవి. ఈ పరిచయాల వలన ఆమెకు సినిమాలలో అవకాశాలు లభించాయి. పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు “పల్లెటూరు” చిత్రాన్ని తీస్తున్నప్పుడు అందులో ప్లీడరు భార్య పాత్ర ధరించడానికి తగిన వ్యక్తి కావాల్సి వచ్చింది. ఆ సమయంలో చదలవాడ కుటుంబరావు సిఫారసు చేయగా దర్శకులు తాతినేని ప్రకాశరావు ఆమెను చేసారు. తాతినేని ప్రకాశరావు ఆమెను చుడనైనా చూడకుండా ప్లీడరు భార్య “అనసూయ” పాత్రకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కొన్నాళ్ళకు వెంటనే బయలుదేరి రమ్మని ఆమెకు టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికే 10 నెలల వయసున్న ఆమె కుమారునికి జ్వరం వచ్చి మంచం పట్టినప్పటికీ కూడా ఆమె ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి హడావుడిగా మద్రాసు చేరుకున్నారు.

కుమారునికి జ్వరం రావడంతో కన్నకడుపు గనుక ఆ దిగులుతోనే ఆమె ఇంకా చిక్కి శల్యమై ఉన్నారు. శల్యావశిష్ఠమైన ఆమె ఆకారం చూసిన కొందరు ఆమె “అనసూయ” పాత్రకు పనికిరాదన్నారు. కానీ ఆమె అధైర్యపడక సినిమాలో నటించారు. అయినా తాతినేని ప్రకాశరావు అధైర్య పడకుండా ఆమెతోనే సినిమా చిత్రీకరణ జరిపించారు. మొట్టమొదటి సన్నివేశంలో సంభాషణలు ఏ జంకు, గొంకు లేకుండా పలికి అక్కడ వారిని ఆశ్చర్యకితుల్ని చేశారు. అప్పటికీ ఆకారపుష్టి లేకపోయినా సంభాషణల ఉచ్ఛారణ బాగుందనిపించుకున్నారు. ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, టీజీ కమలాదేవి వంటి గొప్ప వారందరి సరసన నటించారు. ఆ చిత్రంలో కథానాయికగా నటించిన సావిత్రి చాలా చిన్న పిల్ల.

హేమలత ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్…

పల్లెటూరు చిత్రం తరువాత హేమలత గుమస్తా (1953) లో నటించారు. ఆత్రేయ ఎన్జీవో నాటకం ఆధారంగా నిర్మించిన చిత్రం “గుమస్తా”. ఆ సినిమా తరువాత నవయుగవారు సి.వి.శ్రీధర్ దర్శకత్వంలో నిర్మించిన జ్యోతి (1954) లో హేమలతకు నటించే అవకాశం లభించింది. ఆ చిత్రంలో కథానాయకుడి తల్లి పాత్ర ధరించారు. శ్రీరామమూర్తి, సావిత్రి, జి.వరలక్ష్మీ వంటి హేమహేమీలు నటించిన ఆ చిత్రం విజయవంతం అవ్వలేదు. దాంతో పి.హేమలత కు ప్రత్యేకమైన పేరు ఏమి రాలేదు.  జ్యోతి చిత్రానికి సి.వి.శ్రీధర్ దర్శకులు. కానీ ఆ సినిమాకు అసలు దర్శకత్వం వహించింది కె.బి.తిలక్. అప్పటినుండే కె.బి.తిలక్ కి హేమలత అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. కె.బి.తిలక్ ఆ తరువాత కాలంలో “అనుపమ” చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ సంస్థద్వారా అభ్యుదయ భావాలతో ఉన్న అనేక చలన చిత్రాలు నిర్మించారు. అలా “అనుపమ” పతాకంపై నిర్మించిన చిత్రాలలో చాలా మంచి పాత్రలు ఇచ్చారు. ఆయన చిత్రీకరించిన “అత్తా ఒకింటి కోడలే” (1958) చిత్రంతో అత్త పాత్రలో హేమలత అద్భుతంగా నటించారు.

ప్రతిభ కలిగి భవిష్యత్తులో రాణించగల వారికి ఎన్టీఆర్ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. అలాంటి సద్గుణం ఎన్టీఆర్ సొంతం. వై.ఆర్. స్వామి దర్శకత్వం వహించిన “వద్దంటే డబ్బు” సినిమాలో నటిస్తుండగా హేమలత నటనాపటిమను గుర్తించిన ఎన్టీ రామారావు, తాను సొంతంగా నిర్మించదల్చుకున్న “పిచ్చి పుల్లయ్య” లో కథానాయకుడి తల్లి పాత్ర పోషించడానికి అవకాశం ఇప్పించారు. ఆ తరువాత కూడా నందమూరి తారక రామారావు తన సినిమా “తోడుదొంగలు” (1954) లో ఆయన భార్య పాత్ర ఇచ్చి ప్రోత్సాహించారు. ఆ సినిమా ఆమె ప్రతిభ నిరూపించుకోవడానికి ఎంతో దోహదం చేసింది. ఆ సినిమాకు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి బహుమతి లభించింది.

వాహినీ వారి “బంగారు పాప”…

అలాగే హేమలత నటనా జీవితంలో గొప్ప మలుపు వాహినీ వారి “బంగారు పాప” (1954). ఆ రోజుల్లో వాహినీ సంస్థలో అవకాశము రావడమే గొప్పగా ఉండేది. స్వాతి వానకు ముత్యపు చిప్పలు ఎదురు చూసినట్లు ఆంధ్రదేశం వాహినీ చిత్రాలకు ఆ రోజులలో ఎదురు చూస్తూ ఉండేవారు. అందులోనూ బి.యన్.రెడ్డి దర్శకత్వంలో సినిమా అంటే ఆ రోజుల్లో అది ఉత్తమ కళాఖండము అని ఉన్నత కుటుంబాల వాళ్ళు ఎదురుచూసే రోజులవి. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో నటించడం హేమలతకు పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి.

బి.యన్.రెడ్డి “బంగారు పాప” తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తూ రౌడీ కోటయ్య (ఎస్వీ రంగారావు) ను మాటలతో కట్టడిచేసే మంగమ్మ పాత్రకు తగిన నటి కావాలని అన్వేషిస్తున్నారు. కొత్తవారైనా ఫర్వాలేదు అని అనుకుంటున్న ఆ సమయంలో పినిశెట్టి శ్రీరామమూర్తికి ఆ సమయంలో హేమలత పేరు గుర్తుకు వచ్చి ఆమెను సిఫారసు చేశారు. ఆ సమయానికి విజయా అధినేతలలో ఒక్కరైన చక్రపాణి కూడా అక్కడే ఉన్నారు. హేమలతను చక్రపాణి అదివరకే “తోడు దొంగలు” చిత్రీకరణలో సెట్ మీద చూసి ఉన్నారు. ఆయన కూడా మంగమ్మ పాత్రకు హేమలత తగినదేనని సిఫారసు చేశారట. వారిద్దరి సలహా మేరకు బి.యన్.రెడ్డి హేమలతను పిలిపించి మాట్లాడి ఆమెను ఒప్పించారు.

బి.యన్ రెడ్డి ప్రశంస…

బి.యన్ రెడ్డి ముందుగానే హేమలతతో మీకు “నేను అవకాశం ఇవ్వబోతున్నాను, ఆ పాత్రతో మీరు విశిష్ట స్థానం అందుకోగలరు” అన్నారు. నిజంగానే బి.యన్.రెడ్డి ఆ రోజు చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. “బంగారు పాప” సినిమాలోని ఆ మంగమ్మ పాత్ర హేమలతను ఒక చక్కటి కళాకారిణిగా, నటిగా చలనచిత్ర రంగంలో నిలబెట్టింది. ఆ తరువాత పాతికేళ్ళు ఆమె చిత్రపరిశ్రమ లో అదే స్థానంలో కొనసాగడానికి “బంగారు పాప” నే ప్రధాన కారణం  అని చెప్పుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అందుకు బి.ఎన్.రెడ్డి సహకారం ఎంతో ఉంది. అందులోనూ ఎస్వీ రంగారావు ఇచ్చిన ప్రోత్సాహం ఆమె ఎప్పటికీ మరువలేనిది.

అనుకున్నట్లు గానే “బంగారు పాప” సినిమా పురస్కారాల సమయంలో వేదికపై బి.యన్.రెడ్డి మాట్లాడుతూ “బంగారు పాప” లో మంగమ్మ పాత్ర ధరించిన హేమలతలో నటనా కౌశలం మరుగునపడి ఉంది. మన తెలుగు సినిమా నిర్మాతలు అందరూ అవకాశాలు ఇస్తే బెట్టీ డేవిస్ మాదిరిగా ఆమె నటించి అశేష ప్రజానీకాన్ని మెప్పించగల సామర్థ్యం కలవారని ఆమెను ఆ సభలో ఎంతగానో మెచ్చుకున్నారు. నిజానికి బి.యన్ రెడ్డి గారి ప్రశంసలు ఆమెకు దక్కటమే పెద్ద పురస్కారం. ఆయన ప్రశంసలు పొందటమంటే మాటలు కాదు.

అన్నపూర్ణ వారి “దొంగరాముడు”...

తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతి తల్లి అన్నపూర్ణ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన దుక్కిపాటి మధుసూదనరావు, దానికి అక్కినేని నాగేశ్వరరావుని ఛైర్మన్‌ని చేశారు. ఆ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు (1955) చిత్రం నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రిల జంట కన్నుల పండుగగా నటించిన ఆ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. వాహినీ వారి “బంగారు పాప” సినిమా తరువాత అన్నపూర్ణ వారి “దొంగరాముడు” (1955) లో దొంగరాముడి తల్లి పాత్ర పోషించడానికి హేమలతకు అవకాశం ఇచ్చారు దుక్కిపాటి మధుసూదన రావు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో హేమలతకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. “దొంగ రాముడు” విడుదలైన కొత్తలో అభిమానుల నుండి ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. మాకు నిజంగా మీలాంటి అమ్మ ఉంటే ఎంత బాగుండునోనని, చచ్చిపోయిన మా అమ్మ గుర్తొస్తుందని ఇలా ఎంతో మంది అభిమానులు ఆమెకు ఉత్తరాలు వ్రాశారు. 

ఈ చిత్రం తరువాత హేమలతకు మరెన్నో చిత్రాలలో నటించే అవకాశాలు లభించాయి. గురజాడ అప్పారావు వ్రాసిన “కన్యాశుల్కం” నాటకంను డి.ఎల్.నారాయణ సినిమాగా మలిస్తే, అందులో విన్నకోట రామన్న పంతులు సరసన వెంకమ్మ పాత్రలో హేమలత నటించారు. అలాగే సి.ఎస్.ఆర్. ఆంజనేయులుతో “నిత్య కళ్యాణ్యం పచ్చ తోరణం” (1960), విఠల్ ప్రొడక్షన్స్ వారి కన్యాదానం (1955) సినిమాలో షావుకారు జానకి తల్లి పాత్రలో, ప్రతిభా పిక్చర్స్ వారి “ఏది నిజం” (1956) సినిమాలో కూడా షావుకారు జానకికే తల్లి సీతమ్మ పాత్ర, ప్రముఖ దర్శకులు ఘంటసాల సొంత చిత్రం “సొంత ఊరు” (1956) లో ఎన్టీ రామారావు గారి తల్లి సుభద్రమ్మ పాత హేమలత పోషించారు. ఆ తరువాత తల్లిగా ఎన్నో చిత్రాలలో పలు రకాల నటనతో చారిత్రకాలు, పౌరాణీకాలు, సాంఘీకాలు, జానపదాలు ఇలా అన్నీ కలిపి సుమారు 200 చిత్రాలలో నటించి ఉన్నారు. 

గయ్యాళి పాత్రలలో…

ఎన్నో సినిమాలలో ఆమె మనసుకు నచ్చిన అమ్మ పాత్రలే వేసిన హేమలత అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆమె స్వభావానికి విరుద్ధమైన పాత్రలలో నటించారు. “ఇల్లరికం” (1959), “తిరుపతమ్మ కథ” (1963), “మల్లమ్మ కథ” (1973) చిత్రాలలో గయ్యాళి పాత్రలు కూడా వేశారు. ఇదేమిటి హేమలత ఇలాంటి పాత్రలు చేశారు అని అవాక్కయినవారు కూడా వున్నారు. కానీ ఏ నటీనటులు అయినా ఏ పాత్రలోనైనా చేయాలి,   చేయగలగాలి. అప్పుడే వాళ్ళు నిజమైన కళాకారులు. చిత్రాలతో వచ్చే పాత్రలు, వాటి ఆచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. వాటిని గుర్తించి ఆ పాత్రలు మాట్లాడే భాషను వాటికి అనుగుణంగా చక్కగా మాట్లాడితే గానీ జీవం పోయలేము. “ఏది నిజం” సినిమాలో సీతమ్మ పాత్ర మాట్లాడిన భాషలోనూ, “బంగారు పాప” సినిమాలో మంగమ్మ పాత్ర మాట్లాడిన భాషలోనూ, “కన్యాశుల్కం” లో వెంకమ్మ పాత్ర మాట్లాడిన భాషలోనూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

ఏ పాత్ర పోషిస్తే, ఆ పాత్రకు తగినట్టు భాషను సమర్థవంతంగా మాట్లాడి అటు దర్శక నిర్మాతలను, ఇటు అభిమానులను మెప్పించగలిగారు. హేమలత సినిమా రంగంలో వెలిగిపోవడానికి ఆమె అలవర్చుకున్న గాత్రం, కంఠ స్వర మాధుర్యం కూడా ప్రధాన కారణం అని ఆమె నమ్మేవారు. తమిళంలో కూడా ఆమె సంభాషణలు ఆమెనే చెప్పుకునేవారు. ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు “రాముడు భీముడు” చిత్రంలో రామారావు కు అమ్మగా హేమలత నటించారు. ఆ చిత్రాన్ని చూసి ముగ్ధుడైన ఎం.జీ.ఆర్ దానిని తమిళంలో తీసినప్పుడు అందరూ నటీనటులను మార్చారు. కానీ గుణచిత్ర నటులు హేమలతను మాత్రం ఆ సినిమాలోని తన పాత్రకు తననే ఎంపిక చేశారు. ఆమె నటన చూసి ఎం.జీ.ఆర్ అంతలా ఇంప్రెస్ అయ్యారు

చివరి చిత్రం “సీతమ్మ సంతానం”…

ఆ రోజులలో దర్శకులు, నిర్మాతలు అంటే నటీనటులకు భయం, భక్తి ఉండేవి. నటీనటులలో, కళాకారులలో ప్రేమ, అపేక్ష లాంటివి ఉండేవి. వారిలో సర్దుకుపోయే స్వభావం కూడా ఉండేది. ఒక్కోసారి నటీనటులు చిత్రీకరణకు వెళ్లలేక ఆలస్యమైపోయినా కూడా అర్థం చేసుకొని సరదాగా ఉండేవారు. అలా ఒకసారి బాపు “సంపూర్ణ రామాయణం” (1972) చిత్రీకరణకు చాలా ఆలస్యంగా వెళ్లారు హేమలత. అందులో ఆమెది కౌసల్య పాత్ర. ప్రముఖ నటి జమున కైకేయి. హేమలత వెళ్లేసరికి ఆలస్యం అయ్యింది. ఆమె వెళ్లి “నాకోసం ఎదురుచూస్తూ ఉన్నారా”? అనడిగారు. దానికి చిత్ర సహాయ దర్శకులు కే.వీ.రావు “అవునమ్మా! ఈ అడవిలో ఏ లత కదిలినా, హేమలత అనుకుంటున్నాము” అన్నారు. దాంతో అందరు హాయిగా నవ్వేశారు. చిత్రీకరణ కొనసాగించారు. ఇలా ఉండేది ఆ రోజులలో. అంతే కానీ ఆమె ఆలస్యంగా వస్తే ఎలా అని కోపం ప్రదర్శించి కక్ష కట్టే వారు కాదు అని హేమలత కొన్ని సందర్భాలలో చెప్పుకొచ్చేవారు.

హేమలత కు సినిమా రంగం అంటే మొదట నుండే గౌరవం. ఆమె కొడుకుకు మాత్రం సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. హేమలతను సినిమాలు మానేయమని చెప్పేవాడు. కానీ “నీవు చదువుకుని బాగా ప్రయోజకుడివి అయ్యాక మానేస్తానని వాగ్దానం చేశారు” ఆమె. ఉహించినట్టే ఆమె కుమారుడు ప్రయోజకుడు అయ్యాడు. ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తరువాత హేమలత చిత్ర పరిశ్రమ నుండి విరమించుకున్నారు. నిర్మాత దేవి వరప్రసాద్ హేమలత ఇంటికి వచ్చి అడిగితే ఒక నిర్మాతను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కథానాయకుని కథ (1975) లో నటించారు. దాంతో  ఆమెకు మళ్ళీ తల్లి వేషాల కోసం నిర్మాతలు హేమలత ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఇలా కాదని సినిమాలు మానేయాలని భీష్మంచుకున్నారు. హేమలత నటించిన చివరి చిత్రం “సీతమ్మ సంతానం” (1976).. 

ఆధ్యాత్మిక మార్గంలో…

1976 సంవత్సరం తరువాత సినిమా రంగానికి దూరంగా ఉంటూ మద్రాసులో నాగార్జునసాగర్ లో ఉన్న పెద్ద భవంతిని అమ్మేసి హైదరాబాదుకు వచ్చేసారు. సినిమా ప్రపంచానికి దూరంగా హైదరాబాదుకు వచ్చి పూర్తిగా ఆమెకు ఆధ్యాత్మిక ప్రపంచం దొరికింది. ప్రజాహిత బ్రహ్మకుమారి శాంతి సమాజంలో నిరంతరం శాంతి మార్గంలో ప్రశాంత జీవితం గడుపుతూ చాలా సంతోషంగా, హాయిగా గడిపారు. చిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు ఉన్న ఆమె గౌరవాన్ని ఆమె ఎప్పుడూ పోగొట్టుకోలేదు. కన్నాంబ, శాంతకుమారి, టి.జి.కమలాదేవి వంటి సాత్విక నటీమణుల మధ్య హేమలత తల్లిపాత్రలతో విశేషంగా రాణించగలిగారు.

మరణం…

పెద్ద పెద్ద దర్శకులందరూ ఆమెను అమ్మా అని పిలిచేవారు. ఆమెకు ఒక్కడే కొడుకు. కానీ సినిమా రంగంలో మాత్రం ఎంతోమంది హీరోలకు తల్లినయ్యారు. ఆ అనుభూతి మర్చిపోలేనిది అని అంటుండేవారు. ఆమె హైదరాబాదులోనే ఆవాసం ఉన్న విషయం చాలామందికి తెలియదు. హేమలత మొదటినుండి ప్రచారాలకు, ఆర్భాటలకు, పబ్లిసిటీకి దూరంగా ఉంటూ వచ్చారు. పైగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చాక వాటన్నిటి మీద పబ్లిసిటీ మీద ఆసక్తి ఉండకూడదు అని అనుకునేవారు. అప్పుడప్పుడు ఆదోని లక్ష్మీ వస్తూ ఉండేవారు. హైదరాబాదు వచ్చాక అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, కె.బి.తిలక్ వచ్చి పలకరించి వెళ్లేవారు. ఆమె సినిమాలు మానేసిన తర్వాత, దాదాపుగా 20 ఏళ్లు పాటు హైదరాబాదులోనే ఉండేవారు. ఆవిడ క్షేమంగానే ఉన్నా, చూడ్డానికి ఎవర్ని రానిచ్చే వారు కాదు. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న హేమలత తన 93వ ఏట 2019 లో ఆమె మరణించారు. ఆమె మరణవార్త ఎవ్వరికీ తెలియనీయలేదు.

Show More
Back to top button