CINEMATelugu Cinema

రచయితలుగా అరంగేట్రం చేసి నటులుగా నిలదొక్కుకున్న తెలుగు సినిమా రచయితలు…

నటులలో రచయితలు ఉండకపోవచ్చు, కానీ రచయితలలో కచ్చితంగా నటులు దాగి ఉంటారు” అని దాసరి నారాయణ రావు అంటుండేవారు. ఒక సినిమా తెరకెక్కించడానికి ఎంతో మంది కృషి ఉంటుంది. వారిలో రచయితలది సింహ భాగమనే చెప్పాలి. కథా రచయితలు, పాటల రచయితలు, మాటల రచయితలు, స్క్రిప్టు రచయితలు ఇలా.. వారు కేవలం రచనలు చేయడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నటనలో తమ ప్రతిభా పాఠవాలను చూపిస్తూ నటులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుని, అప్పుడప్పుడు రచనలు చేస్తూ, ఎక్కువ భాగం నటులుగానే కొనసాగినవాళ్ళు ఉన్నారు. ఇతరులను ఆకట్టుకునేలా, ఆరిందాలా మాట్లాడేవాడిని చూసి “వీడి మాటలు కోటలు దాటుతాయిరా” అంటూ ఉంటారు పెద్దవారు.

నిజానికి సినిమా రంగంలో ఆ విధంగా కోటలు దాటే మాటలు చెప్పే వారే సినిమాలకు కావాలని తెలుగు సినిమాకు మాటలు నేర్పిన (తెలుగు టాకీ పులి) హెచ్.ఎం.రెడ్డి (హనుమప్ప మునియప్ప రెడ్డి) అనేవారు. ఆయన కమలాకర కామేశ్వరరావు, సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, మల్లాది వెంకటకృష్ణశర్మ, కొవ్వలి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీశ్రీ లాంటి ఎందరో రచయితలను పరిచయం చేశారు. హెచ్.ఎం.రెడ్డి తరువాత తరం వారు బి.యన్.రెడ్డి, గూఢవల్లి రామబ్రహ్మం, కె.వి.రెడ్డి లాంటి దిగ్గజ దర్శకులు కూడా కోటలు దాటే మాటలు వ్రాసే రచయితలను ఏరికోరి మరీ సినిమా రంగాలకు పరిచయం చేశారు.

తెలుగు సినిమా తొలినాళ్లలో కథలు, మాటలు, స్క్రిప్టు, పాటలు వ్రాసే రచయితలకు పారితోషికం ఇప్పటి వారి కన్నా తక్కువగా ఉండేది. ఇప్పటి కథా రచయితలు, మాటల రచయితలకు బాగానే గిట్టుబాటు అవుతుంది. ఈతరం రచయితలు మాటలు అమ్ముకుంటూనే, భవంతుల లాంటి ఇళ్ళు కట్టుకుంటున్నారని ప్రస్తుతమున్న కొందరు రచయితలను చూస్తే మనకు అనిపిస్తుంది. అయితే కొందరు రచయితలు మాటలు వ్రాయడంతో పాటు, నటన కూడా నేర్చి, వారి ముఖానికి రంగు కూడా పూసుకుని వెండితెరపై కనిపిస్తూ అలరిస్తూ వచ్చారు. సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో తమ మాటలతో ప్రేక్షకులను అలంరించడమే కాకుండా, తరువాత కాలంలో వారు ముఖానికి రంగు వేసుకుని అలరించడానికి అధికంగా ఉత్సాహం చూపించి సఫలీకృతులయ్యారు.

వారికి తెర వెనుక ఉండి మాటలు పలికించడం కంటే, తెరపై తమ అభినయంతో రాణించడం వలననే ఎక్కువ ఆదరణ మరియు ఆదాయం లభిస్తుంది. అందుచేతనే వారు ఎక్కువగా నటన పైనే ఆసక్తిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు రచయితలు కూడా ముఖానికి రంగు వేసుకుని నటించారు. గొల్లపూడి మారుతీ రావు, తనికెళ్ళ భరణి, యం.యస్. నారాయణ, యల్.బి. శ్రీరామ్, పరుచూరి బ్రదర్స్, యం.వి.యస్. హరనాథ రావు మొదలగునవారు. కొందరు అతిథి పాత్రలకే పరిమితం కాగా, కొందరు గుణచిత్ర నటులుగా, కొందరు హాస్య నటులుగా చలామణి అవుతున్నారు.

దాసరి నారాయణ రావు…

ఒక రచయిత నటుడిగా మారడం అనేది దర్శకరత్న దాసరి నారాయణ రావు తోనే మొదలైంది. చిత్రసీమలోకి ప్రవేశించక ముందు, దాసరి నారాయణ రావు నాటక రంగాలలో పనిచేశారు. ఆయన 250 పైగా చిత్రాలకు సంభాషణల రచయితగా, గీతరచయితగా పనిచేశారు. చదువుకునే రోజులలోనే సొంతంగా నాటకాలు వ్రాసి అందులో నటించి ప్రదర్శించేవారు దాసరి. బాల్యంలో రచనలు కొనసాగించి నాటకాలు వ్రాసి నటించిన వారు, సినిమా రంగంలోనే నటులుగానే రాణించాలని వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల రచనను మళ్లీ స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రచయితలుగా వచ్చి చివరకు నటులుగా విజయం సాధించిన వారు ఉన్నారు.

స్వర్గం నరకం తో నటుడిగా దాసరి..

నిజానికి దాసరి నటుడిగా మారడానికి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 25 చిత్రాలకు ఘోస్ట్ (దెయ్యం) రచయితగా పనిచేశారు. అలాగే తాను “జగత్ జట్టీలు” (1970) అనే సినిమాతో నేరుగా సినిమా రంగంలోకి సంభాషణల రచయితగా అరంగేట్రం చేశారు. రచయితగా “మహమ్మద్ బిన్ తుక్లక్” (1972) చిత్రం దాసరికి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాసరి రచయితగా ఉన్న కొన్ని పోరాట సన్నివేశ (యాక్షన్) చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన తాను తెలుగు భాషలో వాడుకలో లేని “గూట్లే”, “బేకు” వంటి పదాలను సినిమాలకి అందించారు. “తాత మనవడు” (1973) చిత్రంతో దర్శకునిగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాసరి చిత్రాలలోని మాటలకు ఆ రోజులలో ఎనలేని ఆదరణ ఉండేది. తాను రచన చేసిన కొన్ని చిత్రాలలో ఆయన కనిపించినా పూర్తిస్థాయి పాత్రను తాను స్వీయ దర్శకత్వంలో రూపొందించిన “స్వర్గం నరకం” (1975) లోనే పోషించారు. ఇందులో ఆయన ఆచారి పాత్రలో ఆయన జీవించారు. ఆ పాత్ర ప్రతీ మాట తరువాత “ఫినిష్” అని చెప్పడం కూడా అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది.

మామగారు లో…

తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రాలలో దాసరి కొన్ని ముఖ్యమైన పాత్రలు ధరిస్తూ వచ్చారు. స్త్రీల సమస్యలపై పలు చిత్రాలను రూపొందించిన దాసరి, తన చిత్రాలలోని పాత్రల ద్వారా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలను కూడా సంపాదించారు. దాసరి నటనను అభిమానించిన ఇతర దర్శక, నిర్మాతలు కూడా ఏ పాత్రలకు దాసరి న్యాయం చేయగలరో వాటిని దాసరితోనే అభినయింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అనేక చిత్రాలలో దాసరి ముఖ్యపాత్రలు పోషించారు. వాటిలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, ఎడిటర్ మోహన్  నిర్మించిన మామగారు చిత్రం కూడా ఒకటి. ఆ చిత్రంలో మామ పాత్రలో నటించిన దాసరికి ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం అందజేసింది. అంతకుముందు రచయితగా, దర్శకుడుగా పలు చిత్రాల ద్వారా, పలు పురస్కారాలను సొంతం చేసుకున్న దాసరి అద్భుతమైన విజయం సాధించిన “ప్రేమాభిషేకం” (1981) చిత్రం ద్వారా గీత రచయితగా కూడా ఆయన తన విశ్వరూపం ప్రదర్శించారు.

గొల్లపూడి మారుతి రావు… 

గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను, నటుడిగానూ సుపరిచితులు. ఆయన సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు వ్రాశారు. రేడియో ప్రయోక్తగానూ, రేడియో స్టేషను సహాయ అధికారి గానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది పురస్కారంతో బాటు మరో మూడు నందులు కూడా అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన నాటకాలు, పరిశోధనాత్మక రచనలు, ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

“ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” తో నటుడిగా…

దాసరి తరువాత రచయితలలో నటుడుగా లబ్ద ప్రతిష్ఠులైన వారు గొల్లపూడి మారుతీ రావు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే వ్రాశారు. మారుతీరావుకు రచయితగా అది తొలి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది పురస్కారం లభించింది. ఆయన నటుడిగా మారకముందు గొల్లపూడి ఆత్మగౌరవం వంటి కుటుంబ కథా చిత్రాలకు, నిప్పులాంటి మనిషి వంటి కొన్ని పునర్నిర్వేద చిత్రాలకు కూడా సంభాషణలు వ్రాసి శభాష్ అనిపించుకున్నారు. దాసరి నారాయణ రావు తాను రూపొందించిన శివరంజని చిత్రంలో సి. నారాయణ రెడ్డి వంటి కవిని ఓ పాత్రలో చూపించారు. దానిని స్ఫూర్తిగా తీసుకొన్న కోడి రామకృష్ణ (దాసరి నారాయణ రావు శిష్యులు) తాను రూపొందించిన తొలి చిత్రం “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” చిత్రంలో గొల్లపూడి మారుతీ రావుతో “సుబ్బారావు” అనే పాత్రను పోషింప చేశారు. ఆ చిత్రంలో గొల్లపూడి “దటీజ్ సుబ్బారావు” అనే సంభాషణతో ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా తరువాత ఆయన నటుడిగా తీరిక లేక తన రచనలను వదిలేసారు.

తరంగిణి (1982), త్రిశూలం (1982), ఆలయశిఖరం (1983), “సంసారం ఒక చదరంగం” (1987), ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988), అసెంబ్లీ రౌడీ (1991) , ఆదిత్య 369 (1991), అల్లుడు దిద్దిన కాపురం (1991), గోల్‌మాల్ గోవిందం (1992), చిరునవ్వుల వరమిస్తావా (1993), ముద్దుల ప్రియుడు (1994), రెయిన్‌బో (2008) ఇలా 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా పలు చిత్రాల్లో వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు.

కె. విశ్వనాథ్ దర్శకులు…

అదేవిధంగా మరో ప్రముఖ రచయిత “కాశీ విశ్వనాథ్”. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాలు సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి.

కె. విశ్వనాథ్ దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. లాహిరి లాహిరిలో (2002), అల్లరి రాముడు (2002), సంతోషం (2002), వజ్రం, శుభసంకల్పం, శ్లోకం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, నీ స్నేహం, కలిసుందాం రా, కుచ్చి కుచ్చి కూనమ్మా, స్టాలిన్, జీనియస్ (2012), ఇద్దరు (2023) లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన సినిమాలలో నటించినా కానీ రచయిత గానే కొనసాగారు. అలాగే పలువురు రచయితలు అడపా దడపా తెరపై కనిపించినా తమ రచనలకు వీడ్కోలు చెప్పలేదు. అలాగే తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్ లాంటి వారు ముందుగా రచయితలుగా పేరు సంపాదించి ఆ తరువాత నటనలోనే కొనసాగుతూ వచ్చారు.

తనికెళ్ళ భరణి…

తెలుగు సినిమాలలో అనేక హాస్య ప్రధాన పాత్రలు పోషించిన నటులు తనికెళ్ళ భరణి. ఆయన సకల కళాకోవిదులు. ఆయనకు ప్రముఖ దర్శకులు వంశీ మంచి మిత్రులు. వంశీ దర్శకత్వంలో వచ్చిన “శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాకుండా అందులో ఒక మంచి పాత్రను కూడా పోషించారు. తనికెళ్ళ భరణి వ్రాసిన “చల్ చల్ గుర్రం” నాటకం చూసిన రాళ్ళపల్లి హనుమంతరావుకు ద్వారా వంశీకి పరిచయమై “కంచు కవచం” చిత్రానికి రచయితగా, నటుడిగా చేశారు భరణి. ఆ తరువాత “లేడీస్ టైలర్” చిత్రానికి రచయితగా గుర్తింపు వచ్చింది. వంశీ రూపొందించిన కొన్ని చిత్రాలకు భరణి తన పసందైన మాటలతో చక్కటి హాస్యాన్ని పండించారు భరణి. రాంగోపాల్ వర్మ రూపొందించిన తొలి చిత్రం “శివ” కు కూడా ఆయన సంభాషణలు సమకూర్చారు. అలాగే “శివ” చిత్రంలో నటుడిగా తనదైన ముద్ర వేశారు. అతను తెలంగాణా యాసలో మాటలు వ్రాయడంలో సిద్ధహస్థుడైన భరణి “మొండి మొగుడు – పెంకి పెళ్ళాం” చిత్రానికి కథానాయికకు పూర్తిగా తెలంగాణ యాసలో మాటలు వ్రాశారు.

రచనకు తీరిక లేని భరణి…

“శ్రీ మురళీ కళానిలయం” సంస్థకు రచయిత కొరత ఎదురైంది. అది భరణికి నాటక రచయితగా నిలదొక్కుకోవడానికి సహకరించింది. ఆ సంస్థ కొరకు భరణి పది నాటకాలు రచించారు. ఆ నాటకాలకు తల్లావఝుల సుందరం దర్శకత్వం వహించారు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన “గోగ్రహణం” నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడిన ఆ నాటకాలకు ప్రేక్షకుల నుండి అశేష ఆదరణ లభించింది. తనికెళ్ళ భరణి ఒకవైపు రచనలు కొనసాగిస్తూనే, మరోవైపు నటిస్తూ వచ్చారు. నటుడుగా ఆయన తీరికలేకుండా ఉండడంతో, రచన చేసేందుకు ఆయనకు సమయం సరిపోలేదు. 

నటుడిగా తొలినాళ్లలో గుర్తింపు లేని పాత్రలలో నటించిన భరణి ఆ తరువాత ఆయన కొన్ని చిత్రాలలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. ఆ తరువాత తనికెళ్ల భరణి తనదైన హాస్యంతో నటుడిగా తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. అందువలన ఆయన నటన మీద మమకారంతో తన అభిమాన రచననే వదులుకున్నారు భరణి. అయినా కూడా తనలోని రచయితను సంతృప్తిపరిచేందుకు ఆయన సొంతంగా కవిత్వం వ్రాసుకుంటూ ఉంటారు. ఆయన వ్రాసిన “పరికిణి” పాఠకులను ఆకట్టుకుంది. అలాగే ఆయన కవిత్వం శివతత్వాన్ని తెలుపుతూ కొన్ని గేయాలు వ్రాసింది. అప్పుడప్పుడు ఆయన రచనలు ఇంకా పత్రికల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే పలు చిత్రాలకు తనదైన బాణీలో సంభాషణలు వ్రాసిన భరణికి నటుడిగా నిలదొక్కుకున్నాక సినిమాలలో సంభాషణలు వ్రాసేందుకు సరైన సమయం దొరికేది కాదు.

యం.యస్. నారాయణ…

యం.యస్. నారాయణ (మైలవరపు సూర్యనారాయణ) తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు, రచయిత. ఆయన వేగుచుక్క – పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1995లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. దర్శకులు రవిరాజా పినిశెట్టితో “రుక్మిణి” సినిమా కథా చర్చల్లో యం.యస్. నారాయణ హావ భావ ప్రదర్శనకు ముగ్దుడైన దర్శకులు పినిశెట్టి హాస్యనటుడిగా ఎమ్ ధర్మరాజు ఎం. ఏ. అవకాశం కల్పించారు. పుణ్యభూమి నాదేశం, రుక్మిణి (సినిమా) చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి ఈ.వీ.వీ. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన మా నాన్నకు పెళ్ళి (1997) సినిమాలో త్రాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ వ్రాసుకుని సినిమాల్లో పలికేవారు. తన ఇరవై సంవత్సరాల సినిమా ప్రస్థానం లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించారు.

కళాశాల అధ్యాపకులుగా పని చేస్తూనే సినిమాల మీద వ్యామోహంతో చిత్రరంగానికి విచ్చేశారు యం.యస్. నారాయణ. ఆయనకు నటనాభిలాష మొదటి నుండి ఉన్నా కూడా అవకాశాలు అంత తొందరగా లభించలేదు. దాంతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ప్రోత్సాహంతో కొన్ని చిత్రాలకు సంభాషణలు వ్రాశారు. అవకాశం ఉన్నప్పుడు మాత్రం రవిరాజా తన చిత్రాల్లో యం.యస్ నారాయణకు తగిన పాత్రలు ఇచ్చేవారు. అలా మొదలైన ఆయన నట జీవితం ఇ.వి.వి. సత్యనారాయణ రూపొందించిన “మా నాన్నకు పెళ్లి” చిత్రంలో మలుపు తిరిగింది. ఇందులో నటి అంబిక తండ్రి పాత్ర పోషించారు. త్రాగుబోతుగా యం.యస్ నారాయణ అభినయం జనాన్ని ఎంతగానో అలరించింది. దాంతో ఆయనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక తాను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఆయన నటించిన పలు చిత్రాల్లోని పలు పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో యం.యస్ నారాయణ కూడా రచనకు స్వస్తి పలికి కేవలం నటన పైనే దృష్టిని కేంద్రీకరించారు.

ఎల్.బి. శ్రీరామ్…

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997 వ సంవత్సరంలో వచ్చిన “హిట్లర్” సినిమాతో “అంతొద్దు – ఇది చాలు” అన్న సంభాషణ ఆంధ్ర దేశమంతా ప్రజాదరణ పొందింది. చిరంజీవి నటించిన “హిట్లర్” చిత్రంలోని సంభాషణలు సమకూర్చినది ఎల్.బి.శ్రీరాం (లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి). ఎల్.బి.శ్రీరాం రచయిత, నటులు, దర్శకులు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత రేడియోలో పనిచేస్తూనే సినిమా పరిశ్రమలో ప్రవేశించారు. ఆయన ముందుగా సినీ రచయితగా పనిచేసి ఆ తరువాతనే నటుడిగా నిరూపించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400కి పైగా సినిమాలలో నటించారు. ఆయన నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం యూట్యూబులో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు.

ఎల్. బి. శ్రీరాం “కిష్కిందకాండ” సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందారు. అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు కూడా వేసేవారు. హలో బ్రదర్ (1994), హిట్లర్ (1997) వంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. ఆ తరువాత ఇ.వి.వి. సత్యనారాయణ సినిమా “చాలా బాగుంది” (2000) ద్వారా ఆయన పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు.ఇందులో “దొబ్బిచ్చుకోండి” అంటూ ఆయన అయోమయంగా నటించిన వైనం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో అనేక సినిమాలలో అవకాశం వచ్చింది. హాస్య పాత్రలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన రచించిన ఒంటెద్దు బండి అనే నాటకం ఆధారంగా “అమ్మో ఒకటో తారీఖు” అనే సినిమా రూపొందించబడింది.  ఇంకేముంది షరా మామూలే అన్నట్టు ఆయన కూడా రచనకు సెలవు పెట్టి నటనకే ప్రాధాన్యం ఇచ్చారు.

పరుచూరి సోదరులు…

“గుంటూరు సీమ్మిరపకాయ ఎంతుంటుందో తెలుసా? అంటితే నషాలానికి ఎక్కుతుంది. మనము అంతే” అనేది కథానాయకుడు (1984) సినిమాలోని సంభాషణ. ఇది కింగ్ కాంగ్ పాత్ర పోషించిన పరుచూరి గోపాల కృష్ణ పోషించిన ప్రతినాయక పాత్ర పలికే సంభాషణ. ఇది వ్రాసింది పరుచూరి బ్రదర్స్. పరుచూరి సోదరులు తమ రచనలతో ముందుగా పేరు సంపాదించి ఆ తరువాత నటనలోనూ రాణించారు. సినిమా రంగంలోకి ప్రవేశించడానికి ముందు రంగస్థలంపై రచయితలుగా పరుచూరి సోదరులు తమ కలం బలం చూపించారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ ఇద్దరూ నటులుగానూ రాణించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మృదువైన సంభాషణ లు వ్రాసినట్టే, ఆయన అభినయంలోనూ సాత్వికత కనిపిస్తుంది. అలాగే కొన్ని చిత్రాలలో ప్రతినాయక పాత్రలను అద్భుతంగా పండించిన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ కూడా విలనీలో ఎక్కువ మార్కులు సంపాదించారు. 

గోపాలకృష్ణ శక్తివంతమైన సంభాషణలు వ్రాయడంలో అందవేసిన చేయి. అలాగే తాను పోషించిన పాత్రలలోనూ అదే తరహాలో కనిపించేలా అభినయాన్ని ప్రదర్శిస్తారు. ఆయన తాను పొట్టివాడైనా, గట్టివాడినని నిరూపించుకోవడానికి అన్నట్లు ఆయన అభినయం ఉంటుంది. దర్శకులు వేజెళ్ళ సత్యనారాయణ రూపొందించిన కొన్ని చిత్రాలలో పరుచూరి గోపాలకృష్ణ తనదైన హాస్యంతో మార్కులు సంపాదించుకున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం తండ్రిగా, అన్నయ్యగా మార్కులు రాబట్టుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొన్న వారి శిష్యులు పోసోని కృష్ణ మురళీ  కూడా అప్పుడప్పుడు ముఖానికి రంగు వేసుకుని తెరపై కనిపిస్తుంటారు. ఒకవైపు రచన, మరోవైపు నటనలో ఇలా రెండు గుర్రాలపై స్వారీ చేసిన వారిలో తోటపల్లి మధు, యం.వి.యస్. హరనాథ రావు, సంజీవి, జనార్దన మహర్షి మొదలగు వారున్నారు.

ఆపద్బాంధవుడు లో “జంధ్యాల”…

హాస్య చిత్రాలను అద్భుతంగా రూపొందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న రచయిత, దర్శకులు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన కె.విశ్వనాథ్ దర్శకులుగా చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ఆపద్బాంధవుడు చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. మనసు కవిగా ప్రసిద్ధికెక్కిన ఆచార్య ఆత్రేయ కూడా “కోడెనాగు” (1974) సినిమాలో రామశర్మ మాస్టారు పాత్ర పోషించారు. కథ, మాటల రచయితలతో పాటు పాటలు రచయితగా ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. దర్శకులుగా రాణిస్తూ, తన చిత్రాలకు తానే కథలను రూపొందించుకునే కోడి రామకృష్ణ కూడా “స్వర్గం నరకం”, “ఎవరికి వారే యమునా తీరే”, “చదువు సంస్కారం” వంటి కొన్ని చిత్రాలలో నటించారు. తొలిసారిగా “మా ఇంటికి రండి” అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. ఇందులో సుహాసిని కథానాయిక. కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు.

సంభాషణ రచయితలు…

రచయిత, దర్శకులు యస్.వి. కృష్ణారెడ్డి దర్శకుడుగా, సంగీత దర్శకుడుగా కథకుడిగా రాణించారు. ఆయన కథానాయకుడిగా “ఉగాది”, “అభిషేకం” చిత్రాలు రూపొందాయి. అలనాటి సినిమా రచయితలు మహారథి, డి.వి.నరసరాజు (మనసు మమత, చెవిలో పువ్వు), రాజశ్రీలు కూడా కొన్ని చిత్రాలలో పాత్రలను పోషించారు. అలాగే జాలాది, బాబురావు, గణేష్ పాత్రో,    భారవి, ఏల్చూరి, ఏచూరి, కే.ఎల్.ప్రసాద్, దివాకర్ బాబు, రాజేంద్రకుమార్, ఎర్రంశెట్టి సాయి, యండమూరి వీరేంద్రనాథ్ (విలేజ్ లో వినాయకుడు, బన్నీ అండ్ చెర్రీ), ధీన్ రాజ్, రమేష్ – గోపి, ఆదివిష్ణు, చింతపల్లి రమణ, దురికి మోహన్ రావు, దానం వెంకటరావు, జలదంకి సుధాకర్, సాయినాథ్, ఆకుల శివ ఉన్నారు.

గీత రచయితలు

గీత రచయితలుగా లబ్దప్రతిష్ఠులైన ఆరుద్ర, సి. నారాయణరెడ్డి, వేటూరి సుందర రామూర్తి, శ్రీ శ్రీ, యం.యస్.రెడ్డి, జొన్నవిత్తుల, సిరివెన్నెల సీతారామశాస్త్రి (గాయం, మనసంతా నువ్వే), భువనచంద్ర, జాలాది, సుద్దాల అశోక్ తేజ, సాహితీ తదితరులు కూడా కొన్ని చిత్రాలలో నటించారు. అయితే పాటల రచయితలు కంటే సంభాషణ రచయితలే నటులుగా రాణించడం విశేషం. కొరటాల శివ, లాంటి కొందరు రచయితలు దర్శకత్వం వైపు కూడా మొగ్గుచూపారు. తరుణ్ భాస్కర్ దాస్యం లాంటి వారు కూడా నటనలో తనదైన ప్రాభవాన్ని చూపుతున్నారు.

Show More
Back to top button