CINEMATelugu Cinema

పాత్రలో అవలీలగా పరకాయ ప్రవేశం చేయగల విలక్షణ నటులు.. రావు రమేష్..

తండ్రికి సినిమా నేపథ్యం ఉంటే కుటుంబంలోని వ్యక్తులకు కూడా అవకాశాలు తన్నుకుంటూ వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది అబద్దం అని చెబుతారు రావు రమేష్. ఆయన ప్రముఖ నటులు కళాప్రపూర్ణ బిరుదాంకితులు రావు గోపాలరావు గారి పెద్ద కుమారుడు. నిజానికి నటుడవ్వాలనే ఆలోచన రావు రమేష్ మస్తిష్కంలో ఏ కోశాన కూడా లేదంటారు. తాను ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నారు. అనుకోకుండా నాన్న చనిపోవడం, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడం, అమ్మ ప్రోద్భలం ఆయనను నటుడిగా మార్చాయి. కానీ ముందుగా రావు రమేష్ సినిమా దర్శకుడు అవుదామనుకున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఒకే మాట సూచించారు. “జీవితం తెలిస్తే దర్శకుడు అవుతాడు, సన్నివేశం పండించాలంటే జీవితానుభవం ఉండాలి. దర్శకుడివి అవ్వాలంటే 24 క్రాఫ్ట్ తెలియాలి. ముందు ఒకదానిని సక్రమంగా చెసేయ్, తరువాత దర్శకత్వం గురించి ఆలోచించవచ్చు అన్న ఆమె మాటలే రావు రమేష్ ను నటుడ్ని చేశాయి.

“ఇక్కడ ఓ చరిత్ర ముగిసిపోయింది, రేపటి నుండి మీ ఇంట్లో ఫోన్ మోగితే నా పేరు మార్చుకుంటాను” రావు గోపాల రావు చనిపోయినప్పుడు మిత్రుడు నగేష్ రావు రమేష్ తో అన్న మాటలివి. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నాడో గానీ ఆ మాటలు నిజమయ్యాయి. నాన్న రావు గోపాల రావు గారి వారసత్వం, ఆయనకు చిత్ర పరిశ్రమలో ఉన్న పేరు వల్ల ఎక్కడికి వెళ్ళినా ఎంతో గౌరవం మాత్రం దక్కేది, కానీ ఏనాడూ అవకాశాలు రాలేదు. ఏదైనా మనిషి ఉన్నంతవరకే, అది ముమ్మాటికి నిజం అంటారు రావు రమేష్. ముందుగా ఘంటసాల రత్న కుమార్ దర్శకత్వం వహించిన టెలివిజన్ ధారావాహికలో నటించడం ప్రారంభించిన రావు రమేష్ ఆ షెడ్యూల్ మధ్య అంతరాయముతో ఆ సీరియల్ నిర్మాణం నిలిపివేయబడింది. ఆ తరువాత మద్రాసుకు తిరిగి వెళ్లి పవిత్ర బంధం మరియు కలవారి కోడలు వంటి సీరియల్స్ లో నటించడం ప్రారంభించారు. అలా నాలుగున్నర సంవత్సరాల వ్యవధిలో 1000 ఎపిసోడ్‌లకు పైగా నటించారు.

బిబో శ్రీనివాస్, మురళీ శ్రీనివాస్, పంగులూరి శ్రీనివాస్ అని మద్రాసులో తన స్నేహితులు ఉన్నారు. దర్శకుడు “క్రిష్” బిబో శ్రీనివాస్ యొక్క బావమరిది. క్రిష్ మూడు సంవత్సరాల నుండి ఒక సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ సమయంలో రావు రమేష్ సి.నారాయణ రెడ్డి వ్రాసిన కవిత్వం “కవిత నా చిరునామా” ను చాలా ఇష్టంగా చదివేవాడు. అది గమనించిన క్రిష్, రావు రమేష్ చేసిన కొన్ని కవిత్వ వ్యాఖ్యానాలను యిష్టపడి అతని చిత్రం “గమ్యం” లో ఒక పాత్ర ఇస్తానని హామీయిచ్చారు. హామీ ఇచ్చినట్టే క్రిష్ తన “గమ్యం” సినిమాలో జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్షలైటు పాత్ర ఇచ్చారు. ఆ పాత్రను అద్భుతంగా పండించడంతో శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారులోకం సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ పాత్ర కూడా అద్భుతంగా పండడంతో రావు రమేష్ వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    రావు రమేష్ 
  • జననం    :    25 మే 1970
  • స్వస్థలం   :   గంగనపల్లి , కాకినాడ ఆంధ్రప్రదేశ్..
  • వృత్తి      :    సినిమా నటులు 
  • తండ్రి   :   రావు గోపాలరావు 
  • తల్లి     :  రావు కమల కుమారి 
  • జీవిత భాగస్వామి  :   గాయత్రి 
  • ​​పిల్లలు    :     కుమారుడు, కుమార్తె 
  • మతం        :      హిందూ

నేపథ్యం..

రావు రమేష్ 25 మే 1970 నాడు రావు గోపాలరావు మరియు రావు కమలాకుమారి దంపతులకు జన్మించారు. రావు గోపాలరావు, కమలాకుమారి దంపతులది ఆంధ్రప్రదేశ్ జిల్లా కాకినాడ సమీపంలోని గంగనపల్లి గ్రామం. తండ్రి రావు గోపాలరావు భారతీయ నటుడు, దర్శకుడు. ఆయన తెలుగు సినిమాలలో ప్రతినాయక పాత్రలు పోషించడంలో సిద్ధహస్థులు. తల్లి రావు కమలకుమారి హరికథా విద్వాంసురాలు. రావు గోపాలరావు దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో పెద్దవాడు రావు రమేష్. ఆయనకు ఒక తమ్ముడు, చెల్లి ఉండేవారు. ఆయన తండ్రి గొప్ప సినిమా నటుడు అవ్వడం, అప్పట్లో సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండడం వలన రావు గోపాలరావు కుటుంబంతో మద్రాసులోనే ఉండేవారు. అందువలన రావు రమేష్ బాల్యం కూడా మద్రాసులోనే గడిచింది. రావు గోపాల రావు సినిమాల్లో విలన్, కానీ గాని బయట మాత్రం బోళా మనిషి, ఆయనకు కోపం తక్కువ. మితభాషి, తక్కువగా మాట్లాడుతారు. ఆయన సినిమాలలో గొప్ప ప్రతినాయకులు గనుక తనకున్న సినిమాల హడావుడిలో తాను తీరిక లేకుండా ఉండేవారు. అందువలన ఇంటి బాధ్యతలన్నీ రావు రమేష్ అమ్మ చూసుకునేవారు.

రావు రమేష్ అమ్మ గొప్ప హరికథ కళాకారిణి అవ్వడం చేత ఆమె సుమారు 14 వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఒక్కో హరికథ ప్రదర్శన ఆరు గంటల పాటు ఉండేది. వివాహానంతరం ఆమె కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. రావు రమేష్ నాన్న గోపాలరావు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుటుంబంతోనే గడిపేవారు. ఆయన క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఇంట్లో ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు. ఏం చేసినా పద్ధతిగా చేయాలి అనేవారు. నాన్న అంటే ఎంత ప్రేమ ఉండేదో, అంతే భయం ఉండేది. తలకు ఆముదం రాసుకొని చక్కగా దువ్వుకోవడం, పాఠశాల దుస్తులు (యూనిఫాం) ధరించి బడికి వెళ్లడం, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం ఇది రావు రమేష్ దినచర్య. నందమూరి తారకరామారావు, సూపర్ స్టార్ కృష్ణ మొదలగు వారు రావు గోపాలరావు ఇంటి పక్కనే ఉండేవారు. వారితో పాటు గోపాలరావును చూసేందుకు అభిమానులు బస్సుల్లో వచ్చేవారు. అలా వచ్చిన వారు 100 మందితో కలిసి గోపాలరావు భోజనం చేసేవారు. రావు కుటుంబం రోజూ జాతరలా ఉండేది. ఆ అభిమానాన్ని ఆ హడావిడి ప్రతీరోజూ గమనించే రావు రమేష్ కు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన సన్నగిల్లింది.

ఫోటోగ్రఫీ పై మక్కువ…

రావు రమేష్ కు పాఠశాల రోజులలో ఉన్న స్నేహితుల ద్వారా ఫోటోగ్రఫీ (ఛాయాగ్రహణం) అంటే ఇష్టం ఏర్పడింది. ఛాయాగ్రహణ స్టూడియోలో శిక్షణ కూడా తీసుకున్నారు. అప్పట్లో తనకున్న యాసిక  కెమెరాతో ఫోటోలు తీసుకుంటూ తనకు ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఫోటోగ్రఫీపై ఇష్టం రెట్టింపు అయ్యింది. దాంతో చదువుపై ఉన్న ధ్యాస పక్కకు మళ్ళింది. తనకు పాటలు వినాలంటే బోర్ గా అనిపించేది. తరగతి గదికి వెళ్లి సరిగ్గా పాఠాలు కూడా కూడా వినేవాడు కాదు. గత్యంతరం లేక చదువు ఆపేస్తానని ఇంట్లో చెబితే, వాళ్ల ఇంట్లో బాగా తిట్టారు. చేసేదిలేక బలవంతంగా కళాశాలకు వెళ్లేవారు కానీ, క్లాసులో పాఠాలు వినేవారు కాదు. గదిలో సూర్యరశ్మి ప్రసరిస్తున్న తీరును పరిశీలించేవారు. వెంటనే దాన్ని ఫోటోలు తీసేవారు. ఇంటి దగ్గర కూడా అదే సాధన.

తాను తీసిన ఫోటోలు చాలా భిన్నంగా ఉండేవి. వాటిని ఎవ్వరికీ చూపించేవారు కాదు. వాటిని పోటీలకు పంపించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడేవారు. ఆ ఫోటోలు చూసి చాలా బాగా తీశావురా అని నాన్న మెచ్చుకునేవారు. డిగ్రీలో బీకాం చదువుకునేటప్పుడు అదే ఉత్సాహం చూపించేవారు. రావుగోపాల రావు గారి అబ్బాయి మంచి స్థితిలో ఉన్నాడు అనిపించుకోవాలని డిగ్రీతో చదువు ఆపేసి బెంగళూరులోని పరిశ్రమల విభాగంలో ప్రకటనల (ఇండస్ట్రియల్ యాడ్ కంపెనీ) విభాగంలో అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ (సహాయ ఛాయాగ్రహకుడిగా) గా ఏడాదిన్నర పాటు పనిచేశారు. ఆ అనుభవంతో జానకి రాముడు, దొంగ రాముడు లాంటి సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. అంతేగాని ఏ రోజు తనకు నటన మీద ఆసక్తి కలగలేదు. వాళ్ళ నాన్న కూడా తనను నటించమని ఏనాడూ అడగలేదు.

దిగ్భ్రాంతిని కలించిన రావు గోపాల మరణం..

రావు రమేష్ 1994 వ సంవత్సరం ఛాయాగ్రహణం నేపథ్యంలో ఎదగాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో తమ్ముడు ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది. అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా అనుకోకుండా గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది. అనుకోకుండా రావు గోపాలరావు మరణించారు. దాంతో రావు రమేష్ కూలిపోయారు. అందువలన తన భవిష్యత్తు అంధకారమైపోయింది. తాను ఇంటి పెద్ద కావడంతో కుటుంబ బాధ్యతలు తనపై పడ్డాయి. ఫోటోగ్రఫీలో పెద్దపెద్ద ఆర్డర్లు వస్తే డబ్బులు వస్తాయి. కానీ వాటి కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. నెలలు గడుస్తున్నాయి. ఇంకో పక్క కుటుంబం ఎలా గడవాలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసేది కాదు, పిచ్చెక్కిపోయేది. తనకు ఎలాగో ఫోటోగ్రఫీలో పరిచయం ఉంది. కాబట్టి సీరియల్ లకు దర్శకత్వం చేయాలనుకుని, ప్రణాళికలు వేసుకొని అంతా సిద్ధం చేసుకుని బోలెడు డబ్బులు ఖర్చు పెట్టారు.

దురదృష్టం కొద్దీ ప్రాజెక్టు అభ్యంతరంగా ఆగిపోయింది. వ్యాపారం చేద్దామని ప్రయత్నాలు చేస్తే, అది విఫలమయ్యింది. స్టాక్ మార్కెట్లో డబ్బులు ఖర్చు పెట్టాయి. అందులోని చేతులు కాలాయి. ఇలా డబ్బులు పోవడమే కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. తనకు పట్టరానంత కోపం వచ్చేది, విసుగు వచ్చేది. ఎవరైనా తన దగ్గరకు వచ్చినా కసురుకునేవారు. రావు రమేష్ పరిస్థితిని చూసి తన అమ్మ చాలా బాధపడేవారు. అప్పటికే తనకు పెళ్లి అయిపోయింది. తన పరిస్థితి గమనిస్తూ ఉన్న అమ్మ తనను నటనపై దృష్టి పెట్టమని, నటనే తనకు సరైన దారి అని సలహా ఇచ్చింది. రోజులు, నెలలు గడిచాయి. తాను మాత్రం అమ్మ ఇచ్చిన సలహా మీద అమ్మకు సమాధానం చెప్పలేదు. తనకు వేరే దారి కూడా కనిపించలేదు. తప్పని పరిస్థితులలో అమ్మ ఇచ్చిన సలహాకే ఓటు వేశారు.

బుల్లితెర పై తొలి అవకాశం…

రావు రమేష్ కు తొలి అవకాశం బుల్లితెరపై వచ్చింది. తొలిసారి సుడిగుండాలు సీరియల్ తో నటనకు శ్రీకారం చుట్టారు. తొలిసారి కెమెరా ముందు వచ్చిన తాను ఇబ్బంది పడుతున్న సందర్భంలో తన అమ్మ ప్రోత్సాహమే తనను ముందుకు నడిపించింది. తన నటన చూసిన చాలామంది బాగా చేశావయ్యా అని మెచ్చుకోవడంతో తనలో బెరుకు మాయమయ్యింది. కోపం కరిగిపోయింది. చాలా ఏళ్ల తరువాత తన పెదవులపై చిరునవ్వు, అంతకుమించి ఆత్మవిశ్వాసం తనలో వెల్లివిరిసింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక సినిమాల సంగతి చూద్దామని తట్టా, బుట్టా సర్దుకుని మద్రాసు నుండి హైదరాబాదు వచ్చేశారు.

హైదరాబాదులో అద్దె ఇంట్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం అన్వేషణ మొదలుపెట్టేవారు. ఎంతో మంది దగ్గరికి తాను వెళ్లి చేతులు కట్టుకొని వంగి నమస్కారాలు పెట్టినా కూడా బాగున్నావా అని పలకరించేవారే కానీ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం లేరు. చాలా రోజుల ప్రయత్నం తరువాత “సీమ సింహం” సినిమాలో చిన్న పాత్ర వచ్చింది. ఆ తరువాత ఎవ్వరూ మళ్ళీ అవకాశం ఇవ్వలేదు. మళ్లీ చిరాకు విసుగు తెచ్చుకుని పెట్టే బేడా సర్దుకుని మద్రాసుకు వచ్చేశారు. పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. తన ఆశయం, సినిమా కల భూస్థాపితం అయిపోయినట్లేనని నిర్ణయించుకున్న ఆ తరుణంలో “బాలాజీ టెలిఫిలిమ్స్” వారి “పవిత్ర బంధం” సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అది అలా ఉండగానే మరో సీరియల్ అలా సీరియల్ లలో అవకాశాలు నన్ను మళ్లీ రీచార్జ్ చేశాయి. సుమారు నాలుగున్నర సంవత్సరాల పాటు టీవీ సీరియల్ లలో నటించారు.

గమ్యం సినిమాలో నక్షలైటు పాత్రలో…

రావు రమేష్ అలా సీరియల్ లలో తీరికలేకుండా ఉంటున్న రోజులలో తనకు అనుకోకుండా ఓ రోజు దర్శకుడు క్రిష్ నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. తాను చిత్రీకరించే “గమ్యం” సినిమాలో ఓ పాత్ర ఉంది చేస్తారా అని అడిగారు. ఆ సమయంలో దేవుడిలా అగుపించారు క్రిష్. ఎడారిలో ఎండమావులతో విసుగెత్తి పోయినవాడిని చెంబుడు నీళ్లు త్రాగుతావా అని ఎవరైనా అడిగితే ఎలా ఉంటుంది? అలా ఊరకలేసే ఉత్సాహంతో గమ్యం సినిమా చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ పాత్ర అది. తనను నటుడుగా నిరూపించడమే కాకుండా ప్రేక్షకులకు కూడా దగ్గర చేసింది. ఆ సినిమాతో రావు రమేష్ రావు గోపాలరావు కొడుకు అని చాలామందికి తెలిసింది.

ఆ సినిమా ద్వారానే ఆ మహానుభావుడి లాగానే తనలో ఒక వైవిధ్యమైన అభినయం ఉన్నదని, నటుడిగా పేరు రావడంతో ఆయనకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తరువాత ఆవకాయ బిర్యానీ, కొత్త బంగారులోకం, మగధీర, శంభో శివ శంభో, విలేజ్ లో వినాయకుడు, లీడర్, మర్యాద రామన్న ఇలా అన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గాడిలో పడ్డారు. ఇప్పుడు నాన్న ఉంటే ఎంతో సంతోషంగా ఉండేవారు అని చెప్పుకొచ్చే రావు రమేష్, నాన్న చనిపోయినాక తన అమ్మే తన బాగోగులన్నీ వాళ్ళమ్మే చూసేవారు. ఆమె గనుక దిశానిర్దేశం చేయకపోతే రావు రమేష్ అనే నటుడు వెండితెరపై మీ ముందుకు వచ్చేవాడు కాదు అని రావు రమేష్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. భవిష్యత్తు ఏంటో తెలుసుకోలేని సమయంలో ముందు చూపుతో అమ్మ తనను సినిమాల్లోకి వెళ్ళమని ధైర్యం చెప్పింది. రావు రమేష్ గురించి అంతలా ఆలోచిస్తుంది కాబట్టే, ఆమ్మ మాట ఎప్పుడూ తోసిరాజనేవారు.

కుటుంబం…

అనుకోకుండా నా పెళ్లి జరిగినా కూడా నన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం, ఈ విషయంలో అమ్మ నాకెంతో మేలు చేసింది అంటారు రావు రమేష్. వాళ్ళ నాన్న మరణించిన రెండేళ్లకే ఆయన పరిస్థితి చూసిన వాళ్ళ అమ్మ తాను ఏమైపోతాడో అని భయపడి తనకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1996 లో విశాఖపట్నం లో తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం చూశారు. ఆ సంబంధం వద్దని చెప్పారు. అలా చూస్తూ చూస్తూ చివరికి ఓ సందర్భంలో ఒక అమ్మాయిని చూపించారు. తెలిసిన వాళ్ల చేత అమ్మాయి బాగుందా అని రావు రమేష్ ని అడిగించారు.

ఏదో ఆలోచనలో ఉన్న తాను ఏమో బాగుంది అనడంతో తన అమ్మ కూడా బుద్ధిమంతురాలు, చదువుకుంది, మనలో కలిసిపోతుంది అంటూ రావు రమేష్ ని పెళ్లికి ఒప్పించారు. అలా వారి పెళ్లయిపోయింది. వాళ్ళ అమ్మ చెప్పిందే నిజమయ్యింది. రావు రమేష్ భార్య పేరు గాయత్రి. ఆమె చాలా మంచిది. ఇంట్లో రావు రమేష్ ఎంత కోపంగా అరిచినా కూడా ఆమె మౌనంగా భరించేవారు. ఆ నిశ్శబ్దమే తనకు మార్పు తెచ్చింది. అరిచిన కాసేపటికే అయ్యో తొందరపడ్డాను అని బాధపడే వారు. అది కావాలి, ఇది కావాలి తీసుకురండి అని ఆమె అడిగిన సందర్భం ఆయనకు గుర్తుకులేదు. బహుశా ఇది రావు రమేష్ ను కమర్షియల్ గా ఆలోచించకుండా చేసింది. కుటుంబం సహాకారం ఉంటే ఏ వృత్తిలో అయినా రాణిస్తామనేది ఆయన నమ్మకం.

Show More
Back to top button