
తెలుగువారి ఇష్టదైవాల్లో నరసింహస్వామి ఒకరు.. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ముందువరుసలో నిలిచేది సింహాచలమే..! విశాఖపట్నం జిల్లాలో ఈ పుణ్యక్షేత్రంలో శుక్రవారం(నిన్న) ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని అప్పన్నస్వామి పెళ్లి చూపులు ఉత్సవం, డోలోత్సవం సంప్రదాయబద్దంగా జరిగాయి. అర్చకులు స్వామి, అమ్మవార్లను సింహగిరి పైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకొచ్చారు.
పుష్కరిణి ఉద్యాన మండపంలో దేవతామూర్తులను ఉయ్యాలలో అధిష్ఠించి చూర్ణోత్సవం, వసంతోత్సవం, ఉయ్యాల సేవలు నిర్వహించారు. అప్పన్న స్వామి సోదరి, పైడితల్లి అమ్మవారి కుమార్తెతో స్వామికి పెళ్లి కుదిరిన సందర్భంగా అర్చకులు, స్థానికులు హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని వేడుకలు నిర్వహించారు. డోలోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్ల గ్రామ తిరువీధి మహోత్సవం కనుల పండువగా సాగింది. అయితే వచ్చే నెల ఏప్రిల్ 8న సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా జరగనున్నాయి.
స్థలపురాణం…
విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న పర్వతమే సింహాచలంగా పేరుగాంచింది. ఆ కొండమీద వెలసిన దైవమే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ఈ ఆలయంలోని మూలవిరాట్టుని సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుడే ప్రత్రిష్టించాడని కథనాలు ఉన్నాయి. రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశపులని చంపిన వరాహ, నరసింహ అవతారాల కలయికగా ఇక్కడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. వరాహ ముఖంతో, మనిషి శరీరంతో, సింహం తోకతో స్వామి ఉంటారు.
ఒకప్పుడు ప్రహ్లాదుని పాలనలో పూజలందుకున్న ఈ ఆలయం క్రమేపీ శిథిలావస్థకు చేరుకుందనీ అలానే స్వామి మీద పుట్టలు వెలిశాయని స్థల పురాణం చెబుతోంది. ఒకనాడు పురూరవుడనే మహారాజు ఈ ప్రాంతంనుంచి వెళ్తుండగా ఇక్కడ పుట్టల కింద స్వామివారు ఉన్నట్లు ఆయనకు కలలో తెలిసిందట. దాంతో సహస్ర కలశాలతో పుట్టని తడిపి స్వామి వారిని రూపం బయటపడేట్లు చేశారట. ఈ సంఘటన సరిగా అక్షయ తృతీయ రోజున సంభవించింది.
ఆలయ విశేషాలు..
*ఉగ్రరూప మూర్తి అయిన స్వామివారి రూపాన్ని భక్తులు తట్టుకోలేరు. కాబట్టి నిత్యం వారిని చందనంతో కప్పివేయమని పురూరవుడు ఆజ్ఞాపించినట్లు చెబుతారు. అప్పటినుంచి ప్రతి అక్షయ తృతీయకు పాత చందనాన్ని తొలగించి ఓ 12 గంటల పాటు స్వామివారి నిజరూప దర్శనానికి అవకాశమిస్తారు. ఆపై స్వామివారిని సహస్ర కలశాలతో అభిషేకించి తిరిగి చందనాన్ని లేపనం చేస్తారు.
*నిజరూప దర్శనం సమయంలో స్వామివారి విగ్రహం త్రిభంగి భంగిమలో కనిపిస్తుంది. నిటారుగా నిల్చొని, నడుము దగ్గర ఒక పక్కకు ఒంగి, తిరిగి మెడను నిటారుగా ఉంచడమే త్రిభంగి భంగిమ. అయితే చందనోత్సవం సందర్భంగానే కాకుండా… ఏడాది పొడవునా ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రావడం విశేషం.
*సింహాచలం కొండ మీదకు అడుగుపెట్టగానే దివ్యమైన దైవానుభూతి కలుగుతుందని భక్తుల భావన. తిరుమల కొండల మీద ఉన్నట్లు సింహాచలం మీద కూడా అనేక జలధారలు కనిపిస్తాయి. వాటిలో గంగధార, ఆకాశధార, మాధవధార, చక్రధార ముఖ్యమైనవి. ఈ ధారలలో స్నానం చేసి భక్తులు తొలిగా ఆలయానికి చేరుకుంటారు.
*పశ్చిమముఖంగా ఉన్న గాలిగోపురం ద్వారా గుడిలోకి ప్రవేశించడమనేది ఇక్కడ విచిత్రం. సాధారణంగా మనం చూసే గుళ్లన్నీ తూర్పుముఖంగా కనిపిస్తాయి. కానీ సింహాచలం మాత్రం దీనికి భిన్నంగా పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇలాంటి ఆలయాన్ని దర్శిస్తే విజయం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.
*ఆలయం గోపురం మాత్రమే కాదు అలయంలోనూ అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆలయ ప్రాంగణంలో అరుదైన శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ గర్భగుడికి ఎదురుగా కనిపించే స్తంభాన్ని కప్పస్తంభం అంటారు. స్వామివారికి భక్తులు తమ కప్పాలను (ముడుపులు) చెల్లించుకుంటారు.. కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చని అంటారు. ఆ కప్ప స్తంభం కింద సంతాన గోపాలస్వామి యంత్రం ఉందని అంటారు. అందుకే ఈ స్తంభాన్ని కౌగలించుకున్నవారికి తప్పకుండా సంతానం లభిస్తుందట.
*స్వామివారి అనుగ్రహ మహిమో, వారి మీద ఉండే చందనం మహిమో కానీ గర్భగుడిలోకి ప్రవేశించగానే మండు వేసవిలో సైతం ఒళ్లు చల్లబడిపోతుందని వెళ్ళినవారు చెబుతారు.
*గర్భగుడిలోని స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. కొండ మీద వెలసిన స్వామి చుట్టూనే కాదు… ఆ కొండ చుట్టూతా ప్రదక్షిణం చేసే అవకాశం ఉండటం మరో విశేషం.
*తమిళనాట తిరువణ్ణామలై కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా, సింహాచలానికి కూడా గిరిప్రదక్షిణ చేసే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
*ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున వేలాదిమంది భక్తులు 32 కిలోమీటర్ల చుట్టుకొలత ఉండే సింహాచలం కొండని చుట్టి, స్వామిని చేరుకుంటారంటే అతిశయోక్తి కాదు.
*సింహాచలం స్వామి అంటే తెలుగువారికి, అందులోనూ ఉత్తరాంధ్రవారికి చాలా నమ్మకం. ఆపదలు తీర్చే దైవం కాబట్టే ఆయనను అప్పన్నగా పిల్చుకుంటారు. ‘అప్పడు’ అంటే ‘తండ్రి’ అన్న అర్థం కూడా వస్తుంది. మరి ఆ చల్లని స్వామి మనల్ని తండ్రిలా కాచుకుంటాడనే పరమార్థం ఈ పేరులో ఉంది.
సింహాచలం దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (వైజాగ్)లో ఉంది. ఇది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అంకితంగా వెలసింది. ఈయన విష్ణువు అవతారం. ఈ ఆలయ నామం “సింహ” అంటే సింహం, ‘ఆచల’ అంటే పర్వతం అనే పదాల నుంచి ఉద్భవించింది. ఆలయంలో 16 స్థంభాల నాట్య మండపం, 96 స్తంభాల కల్యాణ మండపం ఉన్నాయి.
ఎలా వెళ్లొచ్చు..
*వారంలోని అన్ని రోజులలో ఉదయం 7:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు తిరిగి సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు సందర్శకులకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రత్యేక దర్శనం కోసం రూ. 100 రుసుం అవుతుంది.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ భారత రైల్వేలలో ముఖ్యమైన జంక్షన్లలో ఒకటి. ఈ స్టేషన్లో అనేక రైళ్లు ఆగుతాయి, ఇవి పెద్ద సంఖ్యలో ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. వీటిద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
ద్వారకా బస్టాండ్ ఆలయ ప్రాంగణానికి చాలా దగ్గరగా ఉంది. విశాఖపట్నం నగరం వివిధ నగరాలతో అనుసంధానమై ఉండటంతో, 24 గంటలూ బస్సు సౌకర్యం కలిగి ఉంది. ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ క్యాబ్‌లు వంటి అనేక ఇతర లోకల్ ట్రాన్స్ పోర్ట్ వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి.