
ప్రతిఒక్కరు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంటారు. కానీ ఆర్థిక, కుటుంబ పరిస్థితులు సహకరించక అవి కలలుగానే మిగులుతున్నాయి. కానీ, కొందరు మాత్రం ఎన్ని అడ్డంకులు ఎదురైనా… వాటిని ఎదురొడ్డి నిలబడతారు. అలాంటి వారిలో ఒకరే.. అన్సర్ షేక్. అన్సర్ మహారాష్ట్రలో జాల్నా గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నతనం నుండే ఎన్నో కష్టాలు పడ్డారు. తండ్రి ఆటో డ్రైవర్‌గా, తల్లి వ్యవసాయ కూలీగా పని చేసేవారు. ఈ కుటుంబంలో చదువుకు ఎక్కువ ప్రాధాన్యత లేదు. దాంతో అన్సర్ సోదరికి 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. రోజు గడవడానికి కష్టంగా ఉండటంతో కుటుంబానికి అండగా ఉండేందుకు సోదరుడు మెకానిక్ షాప్‌లో పనికి చేరాడు. అలా ఇంటిల్లిపాది పని చేస్తేనేగాని పూట గడవని కుటుంబంలో పుట్టి IAS ఆఫీసర్ అయిన అన్సర్ గురించి మనం తప్పక తెలుసుకోవాలి.
అన్సర్ తన చిన్న వయసు నుంచే ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొని వచ్చానని తెలిపారు. తన అన్న అండగా నిలిచి ఫీజులు చెల్లిస్తే పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పూర్తి చేశా అని చెప్పారు. ఇక మాస్టర్స్ చేసే సమయంలో హాస్టల్ కోసం తన పేరు మార్చుకుని చెబితేనే హస్టల్లో సీటు వస్తుందని అనడంతో.. శుభం అని పేరు మార్చుకోవల్సి వచ్చిందని అన్నారు. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. సివిల్స్ సాధన కోసం రోజుకు 14 నుంచి 15 గంటలు చదివేవారట. ఇలా 3 సంవత్సరాలు శ్రమించి 2016లో జాతీయ స్థాయిలో 361వ ర్యాంక్ సాధించారు. దీంతో ఇక పేరు చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు’ అని పలు ఇంటర్వ్యూల్లో అన్సర్ తెలిపారు.
ప్రస్తుతం అన్సర్ షేక్ పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్లో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM)గా పనిచేస్తున్నారు.
* అభ్యర్థులకు అన్సర్ సలహా
జీవితంలో ఏదైనా సాధించాలంటే దృఢ సంకల్పం అవసరమని, అలా అయితే విజయాన్ని అందుకోవడాన్ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు.
మన లక్ష్య సాధనలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని అస్సలు పట్టించుకోవద్దు.
అంతేకాకుండా గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలు వినటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్‌తో ప్రాక్టీస్ చేయటం, రోజువారీ కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక శ్రద్ధపెట్టి చదవడం.
గత సంవత్సరం వచ్చిన ప్రశ్నశైలిని అర్థం చేసుకుని.. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ జరిపితే పరీక్షల్లో ఈజీగా విజయం సాధించవచ్చని అన్సర్ షేక్ తెలిపారు.