Telugu News

ఎమర్జెన్సీ సినిమాపై సిక్కులకు కోపం ఎందుకు?

1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ ని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ఎలాంటి ఇబ్బందులను, అణచివేతలను ఎదుర్కొన్నారు అనే విషయం నేటి యువతకు తెలియదు. ఎమర్జెన్సీ పరిస్థితులను  కథా వస్తువుగా  ప్రముఖ సినీనటి, లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో,ఆమే ప్రధాన పాత్రగా (ఇందిరాగాంధీ) ఎమర్జెన్సీ సినిమాను తీసింది.  ఈ విషయంలో కంగనా రనౌత్ పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. చారిత్రిక సత్యాలను సినిమాల ద్వారా చూపిస్తే-ఈ దేశంలో చాలామందికి నచ్చదు.

మరీ కుల పిచ్చితో, మత పిచ్చితో కునారిల్లే వర్గాలకు ఎమర్జెన్సీ సినిమా కథా వస్తువు ఇబ్బందిని కలిగిస్తుంది. ఎమర్జెన్సీ అకృత్యాల గరించి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన అకాళీ దళ్ పార్టీని బలహీనపరచడానికి మతోన్మాద భావజాలం ఉన్న బింద్రేన్ వాలేను, అతని అనుచరులను స్వయానా ఇందిరాగాంధీ పెంచి పోషించింది. పాముకు పాలు పోస్తే కాటేసిన చందంగా ఆమె పెంచి పోషించిన ఖలిస్తాన్ ఉగ్రవాదమే ఆమెను కాటేసింది.సిక్కు తీవ్ర వాదం బలపడి, భారతదేశ సమగ్రతకు ఒక సవాలుగా మారంది.బింద్రేనువాలా అమృత్ సర్  స్వర్ణ దేవాలయాన్ని  తీవ్రవాదులకు కేంద్రంగా మార్చడంతో భారత సైన్యం ‘ఆపరేషన్ బ్లూ స్టార్’పేరుతో స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు తీవ్రవాదులను మట్టు పెట్టడం జరిగింది.

ఆపరేషన్ బ్లూ స్టార్ కు అనుమతించిన ఇందిరాగాంధీని సిక్కు బాడీ గార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు అతి కిరాతకంగా కాల్చి చంపడం జరిగింది. ఇందిరా గాంధీ హత్యా నంతరం దేశంలో అనేక ప్రాంతాల్లో అమాయకపు సిక్కు లు నరమేధానికి గురయ్యారు. ఈ విషయాలను ఎమర్జెన్సీ సినిమాలో కొంతమేరకు చూపించినా, చూపించక పోయినా సత్యము తాగదు!  సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వరాదు అంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ లేఖ రాయడం లోతుగా ఆలోచించవలసిన విషయమే! ఈ సినిమా విషయంలో సిక్కులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఖలిస్తాం ఉద్యమం పంజాబ్ రాష్ట్రంలో సృష్టించిన అరాచక పరిస్థితులను ప్రజలు తెలుసుకుంటారని సిక్కు నాయకులు భయపడుతున్నారా?

ఏమో మరి! అధికార దాహంతో  తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న సంస్థలను సమర్థించడం, అక్కున చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విషయమే! దేశంలో ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇస్లామిక తీవ్రవాదులను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది. బర్మా , బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయమిచ్చి, భారతీయ పౌరులుగా మార్చింది. ఈ కారణంగానే ఎన్ ఆర్ సీ ,సిఏఏ లను వ్యతిరేకిస్తుంది.  ఇలాంటి దేశద్రోహపు పనిని ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ చేయదు. కంగనా రనౌత్ ను తలతీస్తామని, ఇందిరా గాంధీకి పట్టిన గతి ఏమిటో తెలుసుకోవాలని ఆమెకు వీడియోలు పంపడం, సిక్కు నాయకుల చేత హెచ్చరికలు జారీ చేయించడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం లేదని చెప్పడం అసాధ్యం.

వాస్తవ విషయం అర్థం చేసుకున్న కంగనా రనౌత్ ఈ సినిమా రిలీజ్ విషయంలో సహకరించాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరడం కోసమెరుపు.  ఈ సినిమా చూస్తే ఎమర్జెన్సీ పరిస్థితులు ,ఎమర్జెన్సీ ఆకృత్యాలు దేశ ప్రజలకు తెలిసి, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటారేమో అనే భయం కాంగ్రెస్ నాయకులకు ఏర్పడినట్లు ఉంది. అందుకే శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీని రెచ్చగొట్టింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపే రైతు ఉద్యమం వెనుక ఈ కమిటీ అనుయాయులు చాలామంది ఉన్నారనే విషయం అర్థమైతే- కాంగ్రెస్ పార్టీకి సిక్కు నాయకులు ఉన్న సంబంధం ఏమిటో స్పష్టం అవుతుంది .కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా జారీ అయిన హెచ్చరికల విషయంలో నెటిజెన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు.

మానవ హక్కుల సంఘాల వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులమని బోర్డులు తగిలించుకున్న వారు మాత్రం ఈ విషయంపై నోరు మెదపక పోవడం ఆశ్చర్యం కలిగించదు, కానీ బాలీవుడ్ సినీ రంగం ఆమెకు బాసటగా నిలవకపోవడం సినిమా వాళ్ళ మానసిక దౌర్భాల్యాన్ని తెలియజేస్తుంది. హిందూ సమాజంలోని అగ్రకులాల దౌర్జన్యాలను కథావస్తువుగా చూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలు నిర్మించిన వాళ్లను మట్టు పెడతామని అగ్రకులాలకు చెందిన వారు చలరేగిపో యిన దాఖలాలు లేవు. మరి ఎమర్జెన్సీ సినిమా విషయంలో సిక్కు నాయకుల గాండ్రింపులు ఎందుకు? ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆపేందుకు దేశంలో పెద్ద కుట్ర జరుగుతున్నట్లు, ఈ కుట్రలో బాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు కొందరు ఉన్నారనే అనుమానం కలుగక మానదు. అనవసరంగా ఒక లేడీ కానిస్టేబుల్ ఆమెపై చేయి చేసుకున్నప్పుడు కూడా సినీరంగం ఆమెకు సంఘీభావం తెలపలేదు. అందుకు కారణం ఆమె హిందుత్వవాది కావడమే!

ఇక చివరగా అధికార పార్టీ ఎంపీ అయినప్పటికీ ఆమెకు ప్రభుత్వం నుంచి అండ లభించలేదు. ఆమెంటే గిట్టని వాళ్లు ఎన్ని విమర్శకులుచేసినా రాజపుత్ర స్త్రీగా కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించే వారికి ధైర్యంగా ‘ప్రతి సవాలు’ విసరడం వీరోచిత చర్యగా భావించక తప్పదు.

*Writer*

*ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు*

Show More
Back to top button