భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఆచార వ్యవహారాలను పాటించడంలో మన దేశ ప్రజలు ముందుంటారు. వివాహ బంధంలో కట్టుబాట్లకు విలువనిస్తారు. ఏక భార్యత్వం లోతుగా పాతుకుపోయిన దేశం మనది. అయితే ఓ ప్రాంతంలో మాత్రం పురుషునికి ఇద్దరు భార్యలు ఉంటారు. అది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఆ వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం.. జైసల్మీర్ లోని ఓ మారుమూల గ్రామం రామ్‌దేయో కి బస్తీ. పూర్తిగా భిన్నమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఈ గ్రామంలో ప్రతి పురుషునికి ఇద్దరు భార్యలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మన దేశంలో బహుభార్యత్వం అంగీకరించబడదు. అయినప్పటికీ.. ఇక్కడ పూర్తి విరుద్ధం అనే చెప్పాలి.
బహు భార్యత్వం చట్ట విరుద్ధ నేరమే అయినప్పటికీ.. ఆ గ్రామంలోని ఈ పద్ధతి తమ గ్రామ సంప్రదాయం అని అక్కడి వారు చెప్పడం గమనార్హం. ఇలా చేయడమే తమ ఆచారం అనేది వారి మాట. ఒక వ్యక్తికి ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకుంటే.. అతనికి పిల్లలు పుట్టరు లేదా అతనికి ఆడపిల్లలు మాత్రమే పుడతారని అక్కడి ప్రజల అభిప్రాయం. కాబట్టి అటువంటి పరిస్థితిలో.. తమకు కొడుకును కనాలనే కోరికను తీర్చడానికి సంతోషంగా రెండుసార్లు వివాహం చేసుకుంటారట. రెండవ వివాహం వారికి కొడుకు పుట్టాలనే ఆశ కలిగిస్తుందని వారు చెబుతున్న మాట.
ఒక భార్యతోనే వేగలేమంటున్న పురుషులకు ఇదొక ఆశ్చర్యకర విషయమే. అయితే.. ఇద్దరు భార్యల మధ్య గొడవల మాటేంటి అనే అనుమానం రావడం సహజం. ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ అస్సలు వివాదాలకు తావు లేకుండా సొంత అక్కా చెల్లెళ్ల మాదిరిగా ఒకే భర్తతో ఒకే ఇంట్లో కాపురం చేస్తారని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆచారం పురాతన తమ నమ్మకాలతో ముడిపడి ఉందని వారు నమ్ముతున్నారు. ఉండకపోవచ్చు.
గ్రామంలోని పురుషులు రెండుసార్లు పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యలతో జీవిస్తున్నారు. తమ మొదటి భార్య గర్భం దాల్చడంలో విఫలమవడంతో లేదా ఆడపిల్లలకు జన్మనివ్వడంతో మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అక్కడి పురుషులు అంటున్నారు.
రెండో భార్యకే కొడుకు పుడతాడనేది గ్రామంలో దాదాపుగా ఒక నమ్మకంగా మారింది. రెండో భార్య కొడుకుకు పూచీకత్తు లాంటిది అని గ్రామంలోని వృద్ధులు అంటున్నారు. ఇద్దరు భార్యలు ఉన్న పురుషులు, సాధారణం కానప్పటికీ, జైసల్మేర్.. బార్మర్లోని మైనారిటీ వర్గాల్లోని కొన్ని కుగ్రామాల్లో కనిపిస్తారు.
పురుషులు తమ భార్యలిద్దరికీ సమాన హక్కులు కల్పిస్తారు. దీని ద్వారా వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు, తగువులకు చోటు లేదు. మహిళలను సంతోషంగా ఉంచే బాధ్యత తమపై ఉందని, ఎవరినీ నిర్లక్ష్యం చేయమని భర్తలు అంటున్నారు. ఇలా ఉండడం వల్లే ఇరువురి మధ్య ఎటువంటి సంఘర్షణ, సమస్య ఎప్పుడూ ఉండదని చెబుతున్నారు. పిల్లలు కూడా తమ తల్లులిద్దరినీ సమానంగా చూస్తారని, మహిళలు శాంతి, సామరస్యంతో జీవిస్తున్నారని అక్కడి పురుషులు వెల్లడించారు.
అయితే.. రామ్‌దేయోకి బస్తీలోని నేటి యువత ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. నెమ్మదిగా ఈ సంప్రదాయాన్ని వదులుకుంటున్నారని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి. తమ గ్రామంలోని పెద్ద మనుషుల మాదిరిగా కాకుండా.. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని వదిలి ఆధునికతను అంగీకరిస్తోన్నట్టు అక్కడి యువత ద్వారా తెలుస్తోంది.