Telugu News

గర్భిణీ స్త్రీలు పూజలు చేయకూడదా.. అసలు నిజం ఇదే!

భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలు, పూజా విధానానికి అనేక ప్రాముఖ్యత ఉంది.  ప్రతిరోజు  ఇంట్లో, దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ప్రతిరోజు ఇలా ఇంట్లో పూజలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని ప్రజల నమ్మకం. సాధారణంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో గర్భంతో ఉన్న మహిళలు మాత్రం పూజ చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు కూడా వెళ్లకూడదని సూచిస్తూ ఉంటారు. మరి గర్భిణీ స్త్రీలు పూజ చేయడం దేవాలయానికి వెళ్ళటం వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గర్భంతో ఉన్న మహిళలు దేవాలయాలకు వెళ్ళకూడదని మన పెద్దలు సూచిస్తూ ఉంటారు. ఇలా చెప్పటానికి శాస్త్రీయపరమైన కారణం  ఉందట. గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో విశ్రాంతి తీసుకోవాలి. దేవాలయాలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు వెళ్ళటం వల్ల ఎక్కువ సమయం నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పూజ అయ్యే వరకు కొంతమంది స్త్రీలు ఎటువంటి ఆహారం కూడా తినటానికి ఇష్టపడరు. అయితే 

గర్భంతో ఉన్న మహిళలు ఇలా పూజ పూర్తయ్యే వరకు ఆహారం తినకుండా ఉండటంవల్ల వారి ఆరోగ్యం మీద దాని ప్రభావం ఉంటుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతారు.

ఇక గర్భంతో ఉన్న మహిళలు ఇంట్లో కూడా పూజ చేయడానికి అనుమతి ఉండదు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువ సమయం కింద కూర్చొని పూజ చేయటం వల్ల వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇంట్లో కూడా గర్భిణీ స్త్రీలు పూజ చేయకూడదని పెద్దలు సూచిస్తూ ఉంటారు. ఇలా గర్భిణీ స్త్రీలు పూజలు చేయకూడదని మన పెద్దలు చెప్పే విషయంలో శాస్త్రీయ కారణం ఉంది. అంతేతప్ప గర్భంతో ఉన్న మహిళలు పూజలు చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదని పండితులు సూచిస్తున్నారు.

మహిళలకు భక్తి భావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతారు. పూజలు, వ్రతాలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. ఇక శ్రావణ.. కార్తీక వంటి మాసాల్లో అయితే మరింత తీరిక లేకుండా దేవుని సన్నిదానంలోనే గడుపుతుంటారు.

స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..? వారిపై ఇంటి వాస్తు ప్రభావం పడుతుందా..? అనే సందేహాలు ప్రతి వారిలో వస్తుంటాయి. గర్భవతిగా ఉన్న స్త్రీ ఉండే గృహ ప్రభావం ఆమె పైన, ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల మూడు నెలలు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఇంటికి మార్పులు, చేర్పులు, కొత్త నిర్మాణం చేపట్టడం  మంచిది కాదు.

స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా? లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. అయితే ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంభించాలి, కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టు ప్రదక్షిణాలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ పుణ్యక్షేత్రాల దర్శనంకానీ చేయకూడదు.

కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందుకే గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.

5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూజలు, వ్రతాలు పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది.

అర్థమైంది కదా. కేవలం గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెద్దలు పండితులు ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అంతే కానీ  గర్భంతో ఉన్న మహిళలు పూజలు వ్రతాలు చేస్తే ఎలాంటి దోషాలు, పాపాలు  తగలవు అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం.

Show More
Back to top button