అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న దూకుడు నిర్ణయాలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేశాయి. ఇరాన్ అగ్రనేత ఖమేనీని అంతమొందించిన తర్వాత యుద్ధం త్వరగా ముగుస్తుందని అమెరికా భావించినా.. అది ఇప్పుడు 50 రోజులు దాటి భీకరంగా సాగుతోంది. వ్యూహాత్మక దాడులతో ఇరాన్ అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని ఇరాన్ దిగ్బంధించడంతో చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఈ యుద్ధం వల్ల అటు అమెరికా ఆర్థికంగా, ఆయుధ పరంగా భారీ మూల్యం చెల్లించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి.
ఇరాన్ యుద్ధం.. భారత్‌పై ప్రభావం..
ఈ సంక్షోభం భారత్‌పై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. మన దేశానికి అవసరమైన ముడి చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 50 శాతానికి పైగా హార్ముజ్ జలసంధి ద్వారానే దిగుమతి అవుతాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్, రష్యాల నుండి చమురు దిగుమతులను తగ్గించుకోవడం భారత్ చేసిన అతిపెద్ద పొరపాటని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా.. సరఫరా తగ్గి బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. గ్యాస్ కొరతతో సామాన్యులు కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. చమురు దిగుమతుల భారం పెరగడంతో రూపాయి విలువ పడిపోయి, భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం నుండి 6వ స్థానానికి దిగజారింది.
భవిష్యత్తు చర్యలు మరియు స్వయం సమృద్ధి అవసరం!
ఇప్పటికైనా భారత్ ఇంధన రంగంలో ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకుని ‘స్వయం సమృద్ధి’ సాధించాల్సిన అవసరం ఉంది. కేవలం దిగుమతులే నమ్ముకుంటే మన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ ఇతరుల చేతుల్లోనే ఉంటుంది. దీనికి పరిష్కారంగా సోలార్ ఎనర్జీని యుద్ధ ప్రాతిపదికన ప్రోత్సహించాలి. విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచడంతో పాటు, ఇథనాల్ ఆధారిత ఇంధనాలపై దృష్టి సారించాలి. గ్యాస్‌కు ప్రత్యామ్నాయ పద్ధతులను గ్రామీణ స్థాయి నుండి అమలు చేయాలి. ప్రస్తుత సంక్షోభాన్ని ఒక పాఠంగా తీసుకుని, భవిష్యత్తులో ఇంధన ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం నుండి సామాన్యులను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
ఇతర కథనాలు:
భారత్ ఇంధన భద్రత ప్రమాదంలో ఉందా?
ట్రంప్ మాస్టర్ ప్లాన్; ఎమిరేట్స్ సంచలన నిర్ణయం, సౌదీకి షాక్!










