CINEMATelugu Cinema

చలనచిత్ర సీమలో తెలుగు వారి సీతమ్మ తల్లి… అంజలీదేవి.

ఇలా నటించాలని చెప్పడానికి పుస్తకాలు లేవు, ఎలా నటిస్తే బావుంటుందో కొలిచే తూనికలు లేవు. అంజలీదేవి లాంటి నటీమణి ఉంటే ఇవన్నీ ఎందుకు. కథానాయిక అంటే అందం, చందం, దానికి అభినయం, అణకువ, ఆలోచన జోడిస్తే అంజలీదేవి. ఆదర్శం అన్న పదానికి నిలువెత్తు తార్కాణం సీత. ఆమెను తలచుకోగానే శాంతం, సహనం కలబోసిన స్త్రీ మూర్తి మన కళ్ళముందు కదలాడుతుంది. తెలుగు చిత్రసీమలో ఆ రూపాన్ని పుణికి పుచ్చుకున్న నటీమణి శ్రీమతి అంజలీదేవి. తమకు ఇచ్చిన పాత్ర ఇచ్చినట్టు చేసుకుపోవడం ఇప్పటి కథానాయికల శైలి. అప్పట్లోనూ అలాగే ఉండేవారు. కానీ మొండి పాత్రల తలలు వంచి గెలిచి చూపించిన సాహస నారి అంజలీదేవి. “పల్లెటూరి పిల్ల”, “సువర్ణ సుందరి”, “అనార్కలి”, “సతీసక్కుబాయి”, “రంగులరాట్నం”, “ఇలవేల్పు” లాంటి సినిమాలను మరలా ఇప్పుడు చూడండి. “నటన అంటే సముద్రం అని, అందులో ఉవ్వెత్తున లేచే కెరటం అంజలీదేవిఅని అర్థమవుతుంది. అంతేలేని అగాథంలో ఆమె ఓ ఆణిముత్యం అని తెలుస్తుంది.

“రాజశేఖరా నీపై మోజు తీరలేదురా” అన్న పాట వింటే మనసులో మెదిలే రూపం అంజలీదేవి. స్వతహాగా మంచి నృత్య కళాకారిణీ అయిన తాను అనుకోకుండా సినీ పరిశ్రమలోకి వచ్చారు. చిన్నప్పటి నుండి తండ్రి ప్రోత్సాహంతో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. కాకినాడలోని “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” లో సభ్యులుగా ఉంటూ పలు విషయాలలో అవగాహన ఏర్పరచుకున్నారు. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు తో ఆమె వివాహమైన తర్వాత చిత్ర పరిశ్రమకు వచ్చారు. పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు. “గొల్లభామ”, “స్వప్నసుందరి”, “మాయల మరాఠి” వంటి చిత్రాల తరువాత ఆమె నటించిన “కీలుగుఱ్ఱం” లో పాత్ర ప్రేక్షకులు విపరీతంగా నచ్చింది. ఆ తరువాత “లవకుశ” చిత్రంలో సీతమ్మగా తన నటన నభూతో  నభవిష్యత్ లా సాగింది.

సినిమాల్లోకి అడుగుపెట్టే నాటికి అంజలీదేవి పదహారేళ్ల బాలకుమారి కాదు. ఇద్దరు పిల్లల తల్లి. ఇది అంజలీదేవికి ఎదురైన తొలి సవాల్. “కష్టజీవి” సినిమా ఆగిపోయినా దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య అండతో గొల్లభామగా ఆ సవాలుకి సమాధానం ఇచ్చింది. ఈ సినిమాతో అంజనీ కుమారి కాస్త “అంజలీదేవి” గా మారింది. గొల్లభామ, కీలుగుఱ్ఱం, బాలరాజు, “మదాలస” లలో వేశ్యగా, నర్తకి గా కనిపించిన అంజలీ తరువాత మహాసాధ్వి సీత పాత్ర పోషిస్తుంది అంటే నమ్మగలమా? కానీ అంజలీదేవి తనని తాను నమ్మింది. ఆ నమ్మకమే ఓ మహానటి ప్రస్థానానికి పునాదిరాయి అయ్యింది.

ఒకటా, రెండా ఆమెలోని నటికి ఎన్ని కోణాలో? కథానాయిక, ఆ తర్వాత వదిన, అమ్మ పాత్ర ఏదైనా ఆకలింపు చేసుకోవడం తనకు ఇష్టం. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావు లకు కథానాయికగా నటించిన ఆమె తరువాత వారికి తల్లిగా కూడా నటించి మెప్పించారు. అంజలీదేవి అపూర్వమైన కీర్తిని సాధించారు. అంజలి పిక్చర్స్ పతాకంపై అనేకమైన విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఉత్తమ నిర్మాతగా పేరుగాంచారు. సినిమా పరిశ్రమకు అంజలీదేవి చేసిన సేవలకు గానూ 2005లో రఘుపతి వెంకయ్య పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం అందించింది. 2006లో రామినేని ఫౌండేషన్ పురస్కారం లభించింది. 2007లో ఆమె అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు. గొల్లభామ సినిమాతో ప్రారంభమైన తన సినీ ప్రస్థానం 1990లో “పోలీసు అల్లుడు” చిత్రంతో ముగిసింది.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం   :    అంజలీదేవి
  • ఇతర పేర్లు    :    అంజనీ కుమారి 
  • జననం    :    24 ఆగస్టు 1927   
  • స్వస్థలం   :   పెద్దాపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ 
  • వృత్తి      :   నటి
  • తండ్రి       :     నూకయ్య
  • తల్లి       :    సత్యావతి 
  • జీవిత భాగస్వామి  :  ఆదినారాయణ రావు 
  • మరణ కారణం   :    గుండెపోటు
  • మరణం   :   13 జనవరి 2014,
  • మరణించిన స్థలం  :    విజయ హాస్పిటల్, చెన్నై, తమిళనాడు

ఆదిలో వేశ్య పాత్రలతో…

1948 ఫిబ్రవరి 26న “బాలరాజు” విడుదలైంది. యస్.వరలక్ష్మి పాటలవల్ల ఆ సినిమా రికార్డు సృష్టించింది. నిజానికి అందులో అంజలీదేవి చిన్న పాత్రలో నటించారు. మొదటి అరగంటలోనే ఆ పాట వస్తుంది. అయినా “తీయని వెన్నెల రేయి” అనే పాటకు అంజలీదేవి చేసిన డ్యాన్సులు తనకు ఎంతో పేరు తెచ్చాయి. వక్కలంక సరళ ఆ పాట పాడింది. అంత మంచి పాట అంజలీదేవి కోసం పాడింది. అందుకు ఆమెకు అంజలీదేవి ప్రత్యేకంగా ఒక వజ్రపు ఉంగరం కూడా ఇచ్చారు. మహానటి సావిత్రి కి కూడా ఆ “తీయని వెన్నెల రేయి” పాట చాలా ఇష్టమట. కానీ బాలరాజు సినిమాలో కూడా అంజలీదేవిది వేశ్య పాత్రనే. అలా బాధపడుతున్న రోజుల్లోనే అంజలీదేవికి మరో అవకాశం వచ్చింది.

ఆ అవకాశం “కీలుగుర్రం” లో రాక్షసి వేషం. అంజలీదేవి ఆ వేషం వేయనని మొండికేశారు. దాంతో ఆదినారాయణ రావుకు అంజలీదేవిని ఒప్పించడానికి నెల రోజులు పట్టింది. మీర్జాపురం రాజావారు ఆ వేషానికి అంజలీదేవినే సరైనది అని మరీ బలవంతంగా ఒప్పించేశారు. ఆఖరికి అంజలీదేవి పారితోషికం బాగా పెంచి ఇచ్చారు. అప్పట్లో కీలుగుర్రం (1949) లో నటించినందుకు గానూ ముప్పై వేల రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆ చిత్రంతో అంజలీదేవికి మరింత మంచి పేరు వచ్చింది. ఘంటసాల రామయ్య గారు “శ్రీ లక్ష్మమ్మ కథ” ప్రారంభిస్తూ అంజలీదేవిని హీరోయిన్ వేషానికి ఎన్నుకున్నారు. అప్పటివరకు వేశ్య పాత్రలు చేసిన ఆమెను ఒక పవిత్రమైన పాత్ర ద్వారా హీరోయిన్ గా చేయడానికి చాలామంది విమర్శించారు. అవే విమర్శలు బలరామయ్య గారు విన్నారు. కానీ ఆయన తనను మార్చలేదు.

అంజలీదేవి నటిగా 500 చిత్రాలలో నటించారు. వాటిల్లో కనీసం 50 చిత్రాలకు కథానాయిక పరంగా టైటిల్స్ నిర్ణయించడం భారతదేశంలో మరే నటికీ దక్కనటువంటి అపూర్వ గౌరవంగాను, రికార్డులు గానూ చెప్పుకోవాలి. ఇందుకు ఉదాహరణగా స్వప్న సుందరి, తిలోత్తమ, నిర్దోషి, అనార్కలి, పల్లెటూరి పిల్ల, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, పక్కింటి అమ్మాయి, ఇలవేల్పు, శాంత, సతీసుమతి, సతీసక్కుబాయి, లక్కీ, సుఖరంభ, చెంచులక్ష్మి, సతీ సులోచన మొదలైనవి.

తెలుగింటి సీతమ్మ (“లవకుశ”)..

తన సినీ ప్రస్థానంలో అంజలీదేవి నటించిన సినిమాలు దరిదాపు 500 పైచిలుకే. కానీ తన మనసుకు నచ్చినవి, జనం మెచ్చినవి మూడే మూడు చిత్రాలు. అవి “లవకుశ”, “ఇలవేల్పు”, “రంగుల రాట్నం”.  లవకుశ సినిమాలో అంజలీదేవి తెలుగులో సీతమ్మ తల్లిగా కొలువు తీరారు. ఆ రోజుల్లో మన పల్లెటూర్లలో చాలా ఇళ్లలో సీతారాములుగా వేసిన నందమూరి తారకరామారావు, అంజలీదేవిల చిత్రపటాలు దేవుడి మందిరంలో కనిపించేవి. సినిమా చిత్రీకరణకు ఆవిడ తెలుగు నేలకు వస్తే రైతులు వరి కంకులు కోసుకువచ్చి ఆవిడ పాదాల ముందుంచి భక్తిగా నమస్కరించేవారు. ఆడవాళ్ళు చీర, జాకెట్టు సమర్పించుకుని ప్రణామిల్లేవారు. వాళ్ళ దృష్టిలో ఆవిడ అంజలీదేవి కాదు, వాళ్ళు నమ్ముకున్న భూదేవి కుమార్తె సీత. అందుకే ఆ రకమైన భక్తి, ప్రేమ. తెలుగులో చాలామంది కళాకారులు భక్తి సినిమాలో నటించారు. కానీ అంజలీదేవికి దక్కిన ఈ గౌరవం నాటికి నేటికి కూడా మరెవరికి దక్కలేదు అన్నది సత్యం.

యల్వీ ప్రసాద్ “ఇలవేల్పు”.. 

ఎల్వీ ప్రసాద్ తీసిన “ఇలవేల్పు” చిత్రం అప్పట్లో ఒకరకంగా ప్రయోగం  అనే చెప్పాలి. అందులో సినిమా సగమయ్యాక అంజలీదేవి అక్కినేని తల్లిగా మారుతుంది. ఒకవేళ జనానికి ఆ సన్నివేశం నచ్చకపోతే సినిమా పని గోవింద. కానీ అక్కడ ఉన్న ఇద్దరు మహాకళాకారులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. సినిమా బ్రహ్మాండంగా ఆడింది. యల్వీ ప్రసాద్ తరువాత ఈ సినిమాను శారద పేరుతో హిందీలో కూడా తీశారు. మీనా కుమారి, రాజ్ కపూర్ నటించారు. అక్కడ కూడా అద్భుతమైన విజయం సాధించింది.

బి.యన్. రెడ్డి రంగులరాట్నం…

“రంగులరాట్నం” సినిమాకు బి.ఎన్.రెడ్డి స్క్రిప్టు వ్రాసుకున్నప్పుడే  అంజలీదేవిని దృష్టిలో ఉంచుకొని సన్నివేశాలు అల్లుకున్నారు. “రంగులరాట్నం” సినిమాలో కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి తిరుగు ప్రయాణం అవుతుంది సీతమ్మ. తల్లిని కావలించుకుని బోరు బోరున ఏడుస్తుంది కూతురు. కొత్త పెళ్లికూతురు అలా కంటతడి పెట్టకూడదు అంటూ కళ్ళతోనే మందలించి ధైర్యం చెబుతుంది సీతమ్మ. ఆ సన్నివేశంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంజలీదేవి చూపించిన హావాభావాలు నిజంగా ఇప్పటి గుణచిత్ర నటులకు పెద్ద బాలశిక్ష.

“లక్ష్మీ నివాసం”, “కల్యాణ మండపం”, “బడిపంతులు”, “తాత మనవడు” ఇలా అంజలీదేవి నట విశ్వరూపం చూపిన సినిమాలు ఒకటా రెండా? లెక్కలేనన్ని? ఎన్నని తలిచేది? ఎంతని ఆ కళామూర్తిని కొలిచేది. 1963 లో భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి పురస్కారం అంజలీదేవి అందుకున్నారు. మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్ సంగీత నాటకాడమీ పురస్కారం అందుకున్నారు. అకాడమీ సభ్యత్వం కూడా పొందారు. 1995లో రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా అందుకున్నారు. ఈ రోజుకు కూడా తెలుగింటి సీతమ్మ. ఇంతకు మించిన గొప్ప పురస్కారం ఏముంటుంది?

అబ్బాయి గారు – అమ్మాయి గారు..

అంజలీదేవి సినిమాలోనే సంపాదించి, సినిమాలోనే పోగొట్టుకున్నారు. తిరిగి మళ్ళీ అందులోనే పైకి లేచారు. డబ్బు విలువ తెలుసుకొని బ్రతికారు. ముఖ్యంగా గృహిణిగా తన సంసారాన్ని చక్కదిద్దుకోగలిగారు. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే భార్యాభర్తలు పాలు, తేనెలా కలిసిపోవాలి అంటుంటారు. ఆదినారాయణ రావు, అంజలీదేవిలు సంసారంలో అలా కలిసిపోయేవారు. భార్యగానీ, భర్తగానీ తాము సంపాదించే ప్రతీ రూపాయికి విలువ ఉందని గ్రహించిన అంజలీదేవి దంపతులు తమ జీవితాన్ని, సంసారాన్ని సుఖమయం చేసుకున్నారు. అంజలీదేవి నటిగా ఎంత ఎత్తుకు ఎదిగినా, గృహిణిగా తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. తన ఇద్దరు కొడుకులకు చక్కని భవిష్యత్తును ఇచ్చారు. ఆదినారాయణ రావు గారు ఉన్నంతకాలం తనకు అంజలీదేవి శిష్యురాలుగా, ప్రేయసిగా, భార్యగా విభిన్న రకాల సేవ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే మాట, ఒకే మనస్సుతో తమ జీవితంలో ప్రయాణించారు. కాబట్టి పరిశ్రమలో అబ్బాయిగారు అని ఆదినారాయణ గారిని, అమ్మాయిగారు అని అంజలీదేవిని ప్రేమ పూర్వకంగా చిత్రపరిశ్రమలో పిలుచుకొనేవారు.

నిర్మాత గా…

1949లో అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరావు, మేకప్ గోపాలరావు ముగ్గురు కలిసి భాగస్వామిగా అశ్విని పిక్చర్స్ ప్రారంభించారు. ఆ సంస్థను ప్రోత్సహించిన పూర్ణ మంగరాజు “మాయలమారి” తీయించారు. కారణాలేవో తెలీదు గానీ ఆ సినిమా సుమారుగా విజయవంతం అయిన తర్వాత “అశ్విని పిక్చర్స్” మూతపడింది. దాంతో 1951లో “అంజలి పిక్చర్” స్థాపించి మొదటి ప్రయత్నంగా “పరదేశి” సినిమాను తెలుగు, అరవ భాషలో నిర్మించారు. ఇది శివాజీ గణేశన్ కు తొలి తెలుగు చిత్రం. తెలుగు చిత్రాలు మొట్టమొదటిసారిగా ఈ చిత్రంతోనే స్లో మోషన్ ఫోటోగ్రఫీతో దృశ్య నిర్మాణం జరిగింది. పరదేశి తర్వాత “అనార్కలి”, “సువర్ణ సుందరి”, “సుమతి”, “తుకారాం”, “క్షేత్రయ్య” ఇలా సుమారు 25 చిత్రాలు నిర్మించారు. అంజలీదేవికి చిత్ర నిర్మాతగా కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా “సుమతి” లో హీరో పాత్ర కుష్టు రోగి పాత్ర. డీ గ్లామర్ పాత్ర అది. అగ్రనటులు ఇద్దరు కాదన్నారు. కాంతారావును బలవంతంగా ఒప్పించారు. తాను పూర్తిగా సహకరించి పరిపూర్ణ న్యాయం చేశారు. అలాగే “తుకారం” లో శివాజీ పాత్ర ఎంతకూ చివరిదశకు రాలేదు. ఒక అగ్రశ్రేణి నటుడు ఆ పాత్ర ధరిస్తాడని ప్రకటన చేశారు. ఈ విషయమై శివాజీ గణేష్ ని కలిసారు. విషయం చెప్పేసరికి ఆయన వెంటనే ఒప్పసుకున్నారు. తనను మొదటిసారిగా “పరదేశి” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతగా పారితోషికం కూడా తీసుకోలేదు.

ఆదాయపు పన్ను సోదాలు…

ఎంతటి వారైనా జీవితంలో ఒక్కోసారి విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిదే అంజలీదేవి జీవితంలో కూడా జరిగింది. వంద చిత్రాలు పూర్తిచేసి తాను సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నారు. 1960 ప్రాంతంలో కొత్త చిత్రాలు అంగీకరించడం మానేశారు కూడా. అప్పుడే అంజలీదేవి కి కష్టాలు మొదలయ్యాయి. సుమారు 20 ఏళ్ల నుండి సంపాదించిన సొమ్ము ఆదాయ పన్నుక్రింద పోయింది. ఆవిధంగా డబ్బు అంతా హరించుకుపోవడంతో గత్యంతరం లేక ఫైనాన్షియర్స్ దగ్గర అప్పు తీసుకుని సొంతంగా “పూలోంకి సేజ్” అనే హిందీ చిత్రాన్ని తీసి చేతులు కాల్చుకున్నారు. ఫైనాన్షియర్స్ తమను అడకత్తెర లో ఇరికించారు. కోర్టు వారు అంజలీదేవి ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకున్నారు.

అయ్యో పాపం అన్న వాళ్ళు ఉన్నారు, అంజలీదేవికి మతి పోయిందని,  పిచ్చి ఆస్పత్రిలో చేర్చాలని, ఎక్కడో గుడారం మార్చేసిందని, ఆత్మహత్య చేసుకోబోయిందని పరిశ్రమలలో వదంతులు వ్యాపించాయి. అంజలీదేవి వాటిని మౌనంగా భరించారు. ఆ సమయంలోనే చిత్తూరు వి.నాగయ్య గారు అంజలీదేవిని సాయిబాబా దగ్గరికి తీసుకెళ్లారు. బాబా “ఇది నీకు పరీక్ష సమయం. ధైర్యంగా ఎదుర్కో, చీకటి పోయి వెన్నెల వస్తుందంటూ అభయహస్తం చూపించారు. ఆ భగవానుని దీవెనతోనే క్రమక్రమంగా అంజలీదేవి కోలుకున్నారు. తమిళ సినిమా రంగంలో ఆమెను తిరిగి ఆహ్వానించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు తాను నిర్మించబోయే “పూమాలై” అనే తమిళ చిత్రంలో నటించమన్నారు. ఆ వెనువెంటనే తమిళ దర్శక, నిర్మాత కే.ఎస్.గోపాలకృష్ణన్ తాను నిర్మించే “ఎన్నదాన్ ముడివు” చిత్రంలో అవకాశం ఇచ్చారు. దీంతో అంజలీదేవి ఆశాసుమాలు తిరిగి పుష్పించాయి.

పిన్న వయస్సులోనే పదవులు…

అంజలీదేవి 1950 – 51 లో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన తొలి మహిళ అంజలీదేవినే. 1958లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనెట్ మెంబర్ గా నియమితులయ్యారు. 1959 సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1963 లో భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా బహుమతి అందుకున్నారు. 1964 లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఉత్తమ నటిగా బహుమతి ప్రధానంచేశారు. సంగీత నాటక అకాడమీ సభ్యురాలుగా కూడా నియమింపబడ్డారు. 1995లో “రఘుపతి వెంకయ్య” పురస్కారాన్ని పొందారు. అన్నిటికీ మించి ప్రేక్షకుల అభిమానం అంజలీదేవి సంపాదించుకున్నారు.

దీర్ఘ నిద్ర…

అంజలీదేవి అనారోగ్యంతో 13 జనవరి 2014 సోమవారం చెన్నైలోని విజయా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంజలీదేవి కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది ఘడియలకు నాలుగు రోజుల ముందు విజయా ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. వృద్ధాప్యం కారణంగా శరీరం సహకరించ పోవడంతో ఆ రోజు మధ్యాహ్నం భూదేవి కౌగిలిలో దీర్ఘనిద్రకు ఉపక్రమించారు. శ్రీ రామచంద్ర ఆస్పత్రికి ఆమె అవయవాలు దానం చేశారు. అంజలీదేవి భర్త ప్రముఖ సంగీత దర్శకుడు నిర్మాత ఆదినారాయణరావు, సుమారు దశాబ్దం క్రితమే మరణించారు. తాను మరణించినప్పటికీ తన అవయవాలు ఎందరికో ఉపయోగపడాలనే సదుద్దేశంతో చివరి ఘడియలలో అవయవదానాన్ని ప్రకటించిన మానవతా మూర్తి అంజలి దేవి. జీవితాన్ని మథించి అమృతాన్ని, హాలాహలాన్ని సమపాళ్లలో స్వీకరించి, విషాన్ని మాత్రం అంతర్యంలో దాచుకొని అమృతతుల్యమైన అభినయాన్ని, ఆప్యాయతల్ని, అనుభూతుల్ని ప్రేక్షకులు పంచేసిన అంజలీదేవి కారణజన్మురాలు. వందేళ్ళ భారతీయ చలనచిత్ర చరిత్రలో నట నారీలోకానికి చెందినంతవరకు ఒక లెజెండ్ అంజలీదేవి.

విశేషాలు…

★ గొల్లభామ (1945) చిత్రంతో అంజలీదేవి సినీ ప్రస్థానం మొదలైంది. కాంచనమాల, భానుమతి చిత్రసీమలో రాజ్యమేలుతున్న రోజులవి. నాట్యం అనే ప్రక్రియను కథానాయికలు అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో వచ్చిన అంజలీదేవి నాట్యం అంటే ఏమిటో వెండితెరకు రుచి చూపించారు. 

★ అంజలి సినీప్రస్థానం లో కీలుగుఱ్ఱం (1949) సినిమా మేలిమలుపు. అందులో చేసిన మోహినీ పాత్ర అంజలీదేవి ని అగ్రతారగా చేసింది. కథ రీత్యా అందులో ఉంటే మూడు రాక్షసుల్లో అంజలీదేవి ఓ రాక్షసి. అందువలన ప్రేక్షకుల హృదయాలలో “అందాల రాక్షసి” గా తాను నిలిచిపోయారు.

★ పరదేశి (1951) తరువాత అంజలి పిక్చర్స్ పతాకం పై ఆమె భర్త ఆదినారాయణ రావు అనార్కలి (1955) చిత్రాన్ని నిర్మించారు. ప్రేమించిన పాపానికి జీవ సమాధికి గురయ్యే ప్రేమికురాలు పాత్ర “అనార్కలి” గా అంజలీదేవి నటించిన తీరు ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది.

★ సువర్ణ సుందరి (1957) నటిగా మరో కోణం. తెలుగు, తమిళ, హిందీ మూడు భాషలలో విజయదుందుభి మ్రోగించిన సినిమా ఇది. ఓవైపు దేవకన్యగా, మరోవైపు మహాసాధ్విగా, ఇంకోవైపు బిడ్డకు తల్లిగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

★ పాండురంగ మహత్యం (1957) చిత్రంలో పుండరీకుని భార్య పాత్ర నిజంగా కత్తి మీద సామే. నా భర్త, నా పిల్లలు, నా ఆస్తి అనే క్రమంలో అత్తమామలను నిర్లక్ష్యం చేస్తుంది ఆ పాత్ర. అటు మంచిది అనలేము, ఇటు చెడ్డది అనలేము. కానీ అంజలీదేవికి ఏ పాత్రైనా కరతలామలకం. అందుకు నిదర్శనమే పాండురంగ మహత్యం.

★ చెంచులక్ష్మి (1958) లో శ్రీ మహాలక్ష్మి గా అంజలీదేవిని చూస్తే అచ్చంగా క్యాలెండర్ లో లక్ష్మీదేవి లాగే ఉంటారు. అందులో కూడా లక్ష్మిగా, చెంచులక్ష్మిగా అంజలీదేవి రెండు కోణాలను సమర్ధవంతంగా ఆవిష్కరించారు.

★ అంజలీదేవి నటవైదుష్యానికో మెచ్చుతునక జయభేరి (1958).

★ ప్రభావతిగా అంజలీదేవి అభినయం నిజంగా అనితర సాధ్యం అనిపించిన సినిమా భట్టి విక్రమార్క (1960). విక్రమార్కుని ప్రేయసిగా అంజలీదేవి అభినయం ఒక ఎత్తైతే, శాప కారణంగా మాటలు రాని వృద్ధురాలిగా మారినపుడు తాను పలికించిన ఆర్థ్రతాపూరిత అభినయం మరో ఎత్తు.

★ భీష్మ (1962) సినిమాలో శిఖండి పాత్ర అంజలీదేవి సవాలుతో కూడిన పాత్రలలో ముందు చెప్పుకోవాల్సింది. ఆ పాత్రలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో ఏ కథానాయిక కూడా ఆ పాత్ర చేయడానికి ముందుకు రాలేదు.

★ తెలుగువారికి సీత అంటే అంజలీదేవి నే. లవకుశ (1963) లో సీత పాత్ర సరేసరి. తెలుగు చిత్ర సీమలో సీత పాత్రను ఎంతమంది పోషించినా కూడా ఆమె దరిదాపులకు కూడా రాలేకపోయారు.

★ బడిపంతులు (1972) చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసిన పలికించిన అభినయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం.

★ తెలుగు సినిమా స్వర్ణయగం చవిచూస్తున్న రోజులలో “లేడీ హీరోలు” ఇద్దరు ఉండేవారు. వారిలో ఒకరు భానుమతి రామకృష్ణ అయితే రెండో వారే అంజలీదేవి. ఆ రోజులలోనే పలు స్త్రీ ప్రాధాన్యత చిత్రాలలో నటించిన ఘనత వీరిద్దరిదే. అంజలీదేవి – ఎన్టీఆర్, అంజలీదేవి – ఏఎన్నార్ అని టైటిల్ పడ్డ సినిమాలో చాలానే ఉన్నాయి.

★ ఎన్టీఆర్ తొలి హీరోయిన్ అంజలీదేవే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం “పల్లెటూరి పిల్ల”. అలాగే నిర్మాతగా ఎన్టీఆర్ తొలి విజయం “జయ సింహ” లో కథానాయిక కూడా అంజలీదేవినే. తొలినాళ్ళలో అక్కినేని, ఆదినారాయణ రావు కలిసి “మాయల మరాఠీ” చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా అక్కినేని తొలినాయిక కూడా అంజలీదేవినే.

★ అంజలీదేవి సరసన ఎక్కువ చిత్రాలలో నటించిన కథానాయకుడు ఎన్టీఆర్ అయితే, ఆమె సొంత నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్ లో ఎక్కువ చిత్రాలు నటించిన కథానాయకుడు మాత్రం అక్కినేని నాగేశ్వరావు. అనార్కలి (1955), సువర్ణ సుందరి (1957),  ఋణానుబంధం (1960), భక్తతుకారం (1975), మహాకవి క్షేత్రయ్య (1976) లాంటి చిత్రాలను అక్కినేని కథనాయకునిగా తన భర్త ఆదినారాయణ రావు తో కలిసి నిర్మించారు అంజలీదేవి. ఎన్టీఆర్ నటించిన ఏకైక అంజలి పిక్చర్ చిత్రం స్వర్ణ మంజరి (1962).

★ తెలుగులో అంజలీదేవి కథనాయకులు అంటే ఎన్టీఆర్, ఏ.యన్.ఆర్ పేర్లు ఎవరైనా చెబుతారు. వాళ్ళిద్దరి సరసన ఎక్కువ చిత్రాలలో నటించారు. కానీ అంజలీదేవికి మరొకరు కూడా హిట్ పెయిర్. ఆయనే ఎస్వీ రంగారావు. భట్టి విక్రమార్క లో ప్రఛండుడు గా, ఎస్వీ రంగారావు, ప్రభావతి గా అంజలీదేవి నటించిన తీరు పేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

★ తెలుగులో ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, తమిళంలో యం.జి.ఆర్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్లతో కలిసి ఎన్నో మరపురాని చిత్రాల్లో అంజలీదేవి నటించారు.

★ నటిగా అంజలీదేవి చివరి సినిమా చిరంజీవి బిగ్ బాస్ (1995). ఆ సినిమా తర్వాత మళ్లీ అంజలి వెండితెర పై కనిపించలేదు.

Show More
Back to top button