
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటివరకు ఐదు సార్లు గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.
2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయనకే వైసీపీ టిక్కెట్ కేటాయించింది. అయితే కూటమి అభ్యర్థి విషయంలో హైడ్రామా నడిచింది. బీజేపీతో పొత్తు కుదరకముందు అనపర్తిలో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు ఇచ్చింది.
అయితే బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీకి అనపర్తి సీటు దక్కింది. ఈ మేరకు బీజేపీ శివరామకృష్ణంరాజును తమ అభ్యర్థిగా ప్రకటన చేసింది. దీంతో నల్లమిల్లి వర్గీయులు తీవ్ర నిరసనలు తెలిపారు. అయినా టీడీపీ అధిష్టానం సైలెంట్‌గానే ఉంది. చివరకు నల్లమిల్లి వెనక్కి తగ్గి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థిని మార్చి నల్లమిల్లికి సీటు కేటాయించింది.
దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి నల్లిమిల్లి వర్సెస్ సత్తి సూర్యనారాయణ తలపడనున్నారు. అయితే నల్లమిల్లి బీజేపీ తరఫున పోటీ చేస్తుండటం ఆయనకు కలిసివస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.