Telugu Cinema

సాత్వికాభినయం తనకు ఆభరణం… సుజాత…

సుజాత (10 డిసెంబర్ 1952 – 6 ఏప్రిల్ 2011)

అందం, అభినయం, ఆహార్యం కథానాయకి కి సరిగ్గా సరిపడే అలంకరణలు.. ప్రాంతం ఏదైనా, భాష వేరైనా ప్రతిభ ఉంటే ఏ రంగంలో అయినా రాణించగలుగుతారు. తెలుగు చలనచిత్ర రంగంలో పరభాషా నటీమణులు ఎక్కువ. కొంతమంది పరభాషా కథానాయికలను మనం గుర్తించలేము. కట్టు, బొట్టు, వ్యవహార శైలి, పదహారణాల తెలుగుదనం ఉట్టిపడే అచ్చ తెలుగు అమ్మాయిలా, అచ్చ తెలుగు అమ్మలా అభినయించే అతి కొద్ది మంది నటీమణులలో సుజాత గారూ ఒకరు..

విదేశంలో పుట్టి, పర దేశంలోనే పెరిగి మన దేశానికి వచ్చి, తెలుగు భాష నేర్చుకుని, తెలుగులో ఓ వెలుగు వెలిగి,  సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న నటీమణి సుజాత గారూ. తొలిరోజుల్లో అగ్ర కథనాయకుల సరసన కథానాయికగా నటించి, ఆ తరువాత వాళ్లకు తల్లిగా, అత్తగా అద్భుతమైన అభినయం ప్రదర్శించిన నటీమణులు సుజాత గారూ.

విశిష్టమైన నటనతో అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న సుజాత గారూ సినిమాలో తన పాత్రలన్నీ త్యాగం, మంచితనంతో కూడినవే ఎక్కువగా ఎంచుకునే వారు. కథానాయికగా తన ప్రాభవం తగ్గిన తరువాత తల్లి పాత్రలకు పరిమితమైనారు. చంటి సినిమాలో వెంకటేష్ తల్లిగా అద్భుతమైన అభినయం ప్రదర్శించి అమ్మగా అందరి ప్రసంశలు పొందింది. పెళ్లి సినిమాలో దుర్మార్గుడైన తన కొడుకు బారి నుండి తన కోడలిని కాపాడుకోవడం కోసం తన కొడుక్కి విషం ఇచ్చే తల్లి పాత్రలో అద్భుత నటన ప్రదర్శించినందుకు గానూ నంది అవార్డును అందుకున్నారు.

జీవిత విశేషాలు…

జననం :   10 డిసెంబరు 1952

స్వస్థలం:        శ్రీలంక ( గాలే )..

తండ్రి    :       శంకరన్ మీనన్

తల్లి      :            సరస్వతి

జీవిత భాగస్వామి :  జయకర్

పిల్లలు  :     సాజిత్, దివ్య

పురస్కారాలు:   కలైమామణి ( తమిళనాడు ప్రభుత్వం )

మరణం:    6 ఏప్రిల్ 2011 (వయసు 58)

చెన్నై, తమిళనాడు

జననం…

సుజాత గారూ 10 డిసెంబరు 1952 న శ్రీలంక దేశం లోని “గాలె” లో జన్మించారు. వీరి తండ్రి శంకర్ మీనన్, తల్లి సరస్వతి లు. వీరి సొంత ఊరు కేరళ లోని మరుదు. వీరు మలయాళీ కుటుంబానికి చెందినవారు. ఉద్యోగ రీత్యా తండ్రి శ్రీలంక లోనే స్థిరపడడంతో సుజాత గారూ శ్రీలంక లోనే జన్మించారు. తన బాల్యమంతా ఎక్కువ భాగం శ్రీలంకలోనే గడిచింది. తాను 8వ తరగతి వరకు అక్కడే చదువుకుంది. వాళ్ళ నాన్న గారూ పదవీ విరమణ చేయడంతో వాళ్ళు సొంత ఊరుకు వచ్చేశారు. సుజాత గారి పాఠశాల చదువు ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒకసారి “సినిమా మాసియా” అనే మలయాళ పత్రికలో సుజాత గారి ఫోటో ప్రచురితమైంది. అది చూసిన చాలా మంది నాటకాలలో నటిస్తావా అని అడిగారు. వాళ్ళ అన్నయ్య కు నాటకాల మీద విపరీతమైన అభిమానం ఉండడంతో, తన అన్న గారి ప్రోత్సాహంతో సుజాత గారు నాటకాలలో నటించేందుకు ఒప్పుకున్నారు.

సినీ ప్రస్థానం..

సుజాత గారూ “తపస్విని” అనే మలయాళం చిత్రం ద్వారా తెరంగ్రేటం చేశారు. తెలుగులోకి రాకముందే ఆమె బాలచందర్ చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలు. తెలుగులో కూడా విజయవంతమైన “అంతులేని కథ” చిత్రం తమిళ వర్షన్ లో కథానాయిక పాత్ర సుజాత గారూ పోషించారు. ఆ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. శివాజీ గణేషన్, కమలహాసన్ రజనీకాంత్ వంటి ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు కల్పించింది.

బాలచందర్ దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన కె. మురారి (యువచిత్ర అధినేత) సుజాతను గోరింటాకు చిత్రంతో తెలుగులోకి పరిచయం చేశారు. “గోరింటాకు” చిత్రం ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించినా కూడా గోరింటాకు సుజాత గానే ఆవిడ గుర్తింపు పొందడం విశేషం. ఆమె మాతృభాష మలయాళం కావడంతో ప్రారంభంలో తెలుగులో జయలక్ష్మి గారూ ఆవిడకు డబ్బింగ్ చెప్పేవారు. తర్వాత సుజాత గారూ పట్టుదలతో తెలుగు నేర్చుకుని పసుపు పారాణి (దుర్గా నాగేశ్వరరావు దర్శకుడు) చిత్రం నుంచి తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకునేవారు. ఆవిడ గొంతులోని మాధుర్యం సంభాషణలు పలకడం ప్రదర్శించే నైపుణ్యం ప్రేక్షకులను మరింత దగ్గర చేశాయి.

ప్రారంభం నుండి సుజాత గారూ గ్లామర్ పాత్రల జోలికి వెళ్ళలేదు. సాత్విక పాత్రలు, సంసార పక్షమైన పాత్రలనే ఎక్కువగా సుజాత ఎన్నుకునే వారు. తెరపై పోషించిన పాత్రలు ఎంత హుందాగా మంచితనంతో ఉండేవో, నిజ జీవితంలో కూడా ఆమె అలాగే మెలిగేవారు. సెట్ లో ఉన్నంత సేపు సాధ్యమైనంత తక్కువగా మాట్లాడుతూ తన పని తాను మౌనంగా చేసుకుపోయేవారు. తమిళంలో బాలచందర్ చిత్రాలు సుజాత ఎదుగుదలకు దోహదపడితే, తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటించిన అన్ని సినిమాలు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి, పరిశ్రమలో సుస్థిర స్థానం కల్పించాయి. “ఏడంతస్తుల మేడ” లో సుజాత నటనని ఎవరూ మర్చిపోలేరు. అలాగే “సుజాత” పేరుతో చిత్రాన్ని నిర్మించిన ఘనత కూడా దాసరి గారిదే.

అక్కినేని నాగేశ్వరావు గారితో నటించిన “అనుబంధం, సూత్రధారులు”, జస్టిస్ చక్రవర్తి లాంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఎన్టీఆర్ గారితో రెండు సినిమాలలో ఆమె నటించారు. “మహానుభావుడు” లో ఎన్టీఆర్ గారికి సోదరిగా నటించారు. తన తొలిచిత్ర కథానాయకుడు శోభన్ బాబు గారితో ఐదు చిత్రాలు, కృష్ణ గారితో రెండు చిత్రాలు, కృష్ణంరాజు గారితో ఐదు చిత్రాల్లో నటించారు.

తొలి తమిళ చిత్రం “అవల్ ఒరు తోడర్ కథై” తో విజయపథంలోకి..

బాలచందర్ గారి విజయవంతమైన చిత్రాలలో “అవల్ ఒరు తొడర్ కథై” ఒకటి.  ఇందులో సుజాత గారూ ప్రధాన పాత్ర పోషించారు. 1974లో కె. బాలచందర్ గారూ దర్శకత్వం వహించిన భారతీయ తమిళ భాషా నాటక చిత్రం. ఈ కథలో ఇంటికి పెద్ద దిక్కు తన కుటుంబాన్ని పోషించడానికి తన కోరికలను త్యాగం చేసే ఒక శ్రామిక మధ్యతరగతి మహిళ చుట్టూ తిరుగుతుంది. తన మొదటి తమిళ చిత్రంలోనే సుజాత గారూ  ప్రధాన పాత్ర పోషించారు. కమలహాసన్ , విజయకుమార్ , జై గణేష్ , ఎం.జి.సోమన్ , శ్రీప్రియ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నలుపు, తెలుపు రంగులలో చిత్రీకరించారు. సుజాత గారూ అద్భుతమైన అభినయం కనబరిచిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.

ఈ చిత్రానికి బాలచందర్ గారూ ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ విజయం ఇచ్చిన ప్రేరణతోనే దర్శకులు బాలచందర్ గారూ ఈ చిత్రాన్ని మిగతా భాషలలో పునర్నిర్మించారు. “అవల్ ఒరు తోడర్ కథై” తెలుగులో అంతులేని కథ (1976) గా పునర్నిర్మించబడింది. దీనికి కూడా బాలచందర్ గారే దర్శకత్వం వహించారు. శ్రీప్రియ మరియు జయలక్ష్మి వారి పాత్రలను తిరిగి పోషించగా, హాసన్ విభిన్న పాత్రను పోషించారు. ఈ చిత్రం బెంగాలీలో “కబిత” (1977) గా పునర్నిర్మించబడింది. ఈ చిత్రం 1982లో హిందీలో  “జీవన్ ధార”గా పునర్నిర్మించబడింది. 1983లో కన్నడలో “బెంకియల్లి అరలీద హూవు” గా పునర్నిర్మించారు. బాలచందర్ గారూ కన్నడ రీమేక్ కి దర్శకత్వం వహించారు. ఇందులో కమలహాసన్ గారూ బస్ కండక్టర్‌గా అతిథి పాత్రలో నటించారు.

తెలుగులో అందంగా పండిన “గోరింటాకు”..

సాధారణంగా కథనాయికలకు పెళ్లితో తమ సినీ ప్రస్థానం ముగుస్తుంది. కానీ సుజాత గారికి ఇందుకు భిన్నంగా పెళ్లి తరువాతే తన సినిమాలు ఉపందుకున్నాయి. శోభన్ బాబు కథనాయకుడుగా దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో, “యువచిత్ర” బ్యానరుపై కాట్రగడ్డ మురారి “గోరింటాకు” చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేశారు. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. చాలామందిని చూశారు. ఎవ్వరూ నచ్చలేదు. దర్శకులు బాలచందర్ గారూ తమిళంలో తీసిన “అవల్ ఒరు తోడర్ కథై” చిత్రంలో నటించిన సుజాత గారూ వీరిని బాగా ఆకర్షించారు. వెంటనే ఆమెతో మాట్లాడి ఆ చిత్రంలో కథనయీకగా ఖరారు చేశారు.

అప్పటికే ఆవిడ తమిళంలో, మలయాళంలో సినిమాలు చేశారు. తెలుగులో ఇదే ప్రథమం. అప్పటికే ఆమెకు పెళ్లయ్యింది, మూడు నెలల బాబుతో చిత్రీకరణ కు వచ్చారు. శోభన్ బాబు, సుజాత గార్ల జంట తెరపై అద్భుతంగా కనిపించింది. ప్రేక్షకులు ముగ్దులైపోయారు. “గోరింటా పూచింది కొమ్మ లేకుండా”, “కొమ్మ కొమ్మకో సన్నాయి”, “చెప్పనా సిగ్గువిడిచి చెప్పరనిది”, “ఇలాగ వచ్చి అలాగ తెచ్చి” లాంటి పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా అద్భుతమైన విజయం సాధించింది. తెలుగు తెరపై గోరింటాకు అందంగా పండింది. ఈ సినిమాతో కథానాయికగా తిరుగులేని నటిగా తెలుగులో బిజీ అయిపోయారు సుజాత గారూ.

కథానాయిక నుండి క్యారెక్టర్ నటిగా…

సినీ పరిశ్రమలో హీరోల కెరీర్ కంటే.. హీరోయిన్ కెరీర్ తక్కువ అన్న సంగతి మనకు తెలిసిందే. కథానాయకులు (హీరోలు) అరవై ఏళ్ళు వచ్చినా హీరోగానే నటిస్తారు. తమ కూతురు వయసున్న హీరోయిన్స్ తో జోడీ కట్టి ఆడిపాడతారు. అయితే కథానాయకిల (హీరోయిన్ల) పరిస్థితి మాత్రం చిత్ర పరిశ్రమలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ హీరోయిన్ గా తమ ఫేమ్ ను కొన్నేళ్ళకే కోల్పోతారు. అవకాశాలు తగ్గాక ముఖ్యంగా పెళ్లి అయిన  తర్వాత హీరోయిన్లు ఎక్కువగా క్యారెక్టర్ నటిగా మారిపోతారు. అక్క, చెల్లి, వదిన, అమ్మ పాత్రలకు మారిపోతారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా చిత్ర పరిశ్రమలో అయినా ఇదే పరిస్థితి. ఇప్పుడు మాత్రమే కాదు. సినీ పరిశ్రమలో ఇదే పద్దతి అనాది నుండి కొనసాగుతూనే ఉంది. జయప్రద, జయసుధ, నదియా వంటి వారు అనేక మంది ఉన్నారు. వారిలో సుజాత గారు కూడా ఒకరు. 1975 లో స్టార్ హీరోయిన్ గా వెండి తెరపై ఓ వెలుగు వెలిగి, కాలక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన సీనియర్ నటి సుజాత గారూ. మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించి, అనంతరం చెల్లి, అక్క, కాలక్రమంలో అమ్మగా నటించిన ఓ సీనియర్ నటీమణి సుజాత గారూ.

“చంటి” చిత్రంలో తల్లి పాత్రలో..

ప్రభు, కుష్బు జంటగా నటించిన “చిన్న తంబి” అనే  తమిళ సినిమాను, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “చంటి” అనే పేరుతో పునర్నిర్మించారు. వెంకటేష్ , మీనా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్ కి తల్లిగా సుజాత గారూ నటించారు. తాను నటించిన పాత్ర విజయవంతం అయ్యింది. ఈ చిత్రం తోనే తాను తల్లి పాత్ర మొదలుపెట్టి క్యారెక్టర్ నటిగా తన ప్రస్థానానికి నాంది పలికింది అని చెప్పవచ్చు. చంటి చిత్రం 40 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది.  తన అభినయంతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసిన సుజాత గారూ ఆ పాత్రను అభినయించిన తీరు, ఆ తరువాత కాలంలో అన్నీ తల్లి పాత్రలే ఎక్కువగా ధరించేలా చేసింది. రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో హీరోయిన్ గా నటించిన సుజాత గారూ తరవాత కాలంలో బాబా చిత్రంలో రజినీకాంత్ కు, బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవి గారికి తల్లి పాత్రలలో అభినయించాల్సి వచ్చింది.

“పెళ్లి” చిత్రంలో కొడుకుకు విషం ఇచ్చే తల్లిగా..

సుజాత గారూ తల్లి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయిన చిత్రం “పెళ్లి”. కోడి రామకృష్ణ గారూ దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో వడ్డే నవీన్ , మహేశ్వరి , పృథ్వీ, సుజాత, బ్రహ్మానందం తదితరులు నటించారు. అతి గారాబంగా పెరిగిన కొడుకుకు పెళ్లి చేస్తుంది తల్లి. తన కొడుకు కోడలును మంచిగా చూసుకోకుండా చిత్ర హింసలు పెడుతుంటాడు. తన వాలకం చూసిన తల్లి, తన కొడుకుతో విబేధించి కోడలికి ఇంకొకరితో పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటుంది.

ఇది తెలిసిన కొడుకు ఆ పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తుండడంతో తన కొడుక్కి విషం ఇచ్చి చంపేస్తుంది. ఆ క్రమంలో తాను విషం పుచ్చుకుని మరణిస్తుంది. కొడుకుగా పృథ్వి, కోడలుగా మహేశ్వరి, తల్లిగా సుజాత గారూ నటించారు. తల్లి పాత్రలో సుజాత గారూ అభినయించిన తీరు అద్భుతం అని చెప్పాలి. ఎంత కఠినమైన పరిస్థితులలో తల్లి తన కొడుక్కి విషం ఇస్తుంది. అలాంటి పాత్రలో నటించాలంటే ఎంత సాహసం ఉండాలి. అలాంటి పాత్రను పోషించిన తీరు, ప్రేక్షకులను మెప్పించిన తీరు అమోఘం. ఈ పాత్రకు సుజాత గారూ పూర్తి స్థాయిలో న్యాయం చేశారానే చెప్పాలి.

వివాహం..

ఉద్యోగ రీత్యా శ్రీలంకలో స్థిరపడిన సుజాత గారి తండ్రి గారూ పదవీ విరమణ చేయడంతో తిరిగి కేరళకు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే “తబస్విని” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆవిడ గారికి సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగారు. తరువాత వివాహం చేసుకున్నారు. సుజాత గారిది ప్రేమ వివాహం. తాను, తమ ఇంటి యజమాని వాళ్ల అబ్బాయి “జయకర్‌ హెన్రీ”ని ప్రేమించారు. పెద్దలు ఒప్పుకోకపోయినా వాళ్ళని ఎదిరించి పెళ్ళిచేసుకొంది. పెళ్లయిన తరువాత తన భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. కానీ అక్కడి సంప్రదాయాలు సుజాత గారికి ఏమాత్రం నచ్చలేదు. కాన్పు కోసం కేరళకు వచ్చిన సుజాత గారూ మళ్లీ తిరిగి అమెరికాకు వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరణం…

తెలుగు ప్రేక్షకులకు చిరపరిచతురాలైన సుజాత గారూ సుమారు 300 చిత్రాలకు పైగా నటించారు. అక్క, చెల్లి, వదిన, అమ్మ పాత్రలతో, వైవిధ్య భరితమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్న సుజాత గారూ తన 58 వ యేట 06 ఏప్రిల్ 2011 నాడు చెన్నైలోని తన స్వగృహంలో మరణించారు. మాములుగానే మొహమాటం ఎక్కువగా ఉండే సుజాత గారూ తన కుటుంబ సమస్యలతో మానసికంగా కృంగిపోయి, ఒతిళ్లకు లోనవ్వడంతో తన రెండు కిడ్నీలు పాడైపోయాయి. తీవ్రమైన అనారోగ్య సమస్య కు గురైన సుజాత గారూ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

అవార్డులు, సన్మానాలు…

ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్..

1975 వ సంవత్సరానికి గానూ “ఉరవు సొల్ల ఒరువన్” చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డు వరించింది..

1976 సంవత్సరంలో “అన్నకిలి”కి చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డు అందుకున్నారు..

1977 సంవత్సరానికి గానూ అవార్గల్ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డును స్వీకరించారు..

1979 సంవత్సరంలో “గుప్పెడు మనసు” చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డు గెలుచుకున్నారు..

నంది అవార్డులు…

1997 సంవత్సరానికి గానూ “పెళ్లి” చిత్రానికి ఉత్తమ పాత్ర నటిగా నంది అవార్డును అందుకున్నారు..

తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు..

1981 సంవత్సరంలో “తునైవి” చిత్రానికి ప్రత్యేక ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు..

1982 సంవత్సరానికి గానూ “పరిచ్చైక్కు నేరమాచు” చిత్రానికి ప్రత్యేక ఉత్తమ నటి అవార్డును స్వీకరించారు..

తమిళనాడు ప్రభుత్వం నటి సుజాత గారిని “కలైమామణి” బిరుదునిచ్చి సత్కరించారు..

సశేషం…

తెరమీద అందంగా, అద్భుతంగా అభినయించి ప్రేక్షకులను మెప్పించే కథనాయికల తెర వెనుక జీవితాలు ఊహించని విధంగా విషాదంగా ఉంటాయి. విభిన్న శైలిలో శోకభరితమైన పాత్రలో ఆకట్టుకునే విధంగా నటించే సుజాత గారి నిజ జీవితం కూడా దుఃఖం, దిగులు, బాధ తోనే నిండిపోయి ఉండేది. తాను ఇష్టపడి, ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తతో ఇమడలేక అమెరికా నుండి తిరిగి వచ్చిన సుజాత గారూ తిరిగి వెనక్కి వెళ్లకుండా ఇండియాలోనే స్థిరపడింది. తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో తనకు ఇష్టమైన నటననే కొనసాగిస్తూ తిరిగి సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని నటిగానే స్థిరపడిపోయింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూ, మరోవైపు భర్త వేధింపులతో ఎన్నో కష్టాలను అనుభవించేది.

అమెరికా నుండి తిరిగి వచ్చిన తన భర్త జయకర్ హెన్రీ, పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. కొద్దికాలానికి వ్యాపారంలో నష్టం వచ్చింది. దాంతో తాను సుజాత గారి సంపాదన మీదనే జీవనం కొనసాగించేవాడు. సుజాత గారితో పాటే షూటింగులకు వెళ్ళేవాడు. తనను అనుమానంతో అవమానించేవాడు. వేధించేవాడు. సున్నిత మనస్కురాలైన సుజాత గారూ మానసిక వేధింపులతో, ఒత్తిడికి గురయ్యేవారు. తనకున్న కష్టాలు, కన్నీళ్లు అలవాటుగా మారి కాబోలు నటనలో నిజంగా జీవించేవారు. అభినయం అద్భుతంగా పండిచేవారు. తన కొడుకు సాఫ్ట్ వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టరు గానూ స్థిరపడ్డారు. తనకున్న విపరీతమైన మానసిక ఒత్తిడి సుజాత గారి ఆరోగ్యాన్ని కుంగదీసింది. దాంతో 58 ఏళ్ళ వయస్సులోనే సుజాత గారూ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.

Show More
Back to top button