
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలో ఉంది. దీంతో ఇక్కడి ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో గెలుపెవరిది అంటూ పలువురు చర్చలు జోరుగా సాగిస్తున్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో నాలుగుసార్లు గెలిచింది. 1983, 1985, 1999, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి గెలిచినా ప్రస్తుతం ఆమె టీడీపీలోనే ఉన్నారు.
కానీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మేకతోటి సుచరిత పోటీ చేస్తున్నారు. మేకతోటి సుచరిత వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ బరిలో నిలవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజధాని అంశం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని.. ఐదేళ్లుగా ఈ ప్రాంతం అమరావతి రైతుల ఆందోళనలతో అట్టుడికిపోతుండటంతో వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అని కామెంట్ చేస్తున్నారు.