
అసిడిటీ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పొట్ట ఎగువ భాగంలో అసౌకర్యం లేదా నొప్పి కలగడం. ఇది భోజనం చేసిన వెంటనే తెలుస్తుంది. దీనివలన ఆకలిని కోల్పోతాము. దీనితోపాటు అతిసార లక్షణాలతో నోటిలో ఆమ్ల రుచితో కడుపు గడబిడగా ఉంటుంది. అసిడిటీ విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు. ఇది తీవ్ర ఆనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. నిర్లక్ష్యం వహిస్తే..ఆహార వాహిక ముఖద్వారాలు చెడిపోయే ప్రమాదం ఉంది. అసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు.
అసిడిటీ నుంచి ఉపశమనం కోసం వాము వినియోగం చాలా మంచిది. వాములో బయోకెమికల్ థైమోల్ ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒక టీ స్పూన్ వాములో చిటికెడు ఉప్పు వేసి తింటే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్లాస్ నీళ్లలో టీస్పూన్ తేనె కలిపి తాగినా..లేదా ఈ మిశ్రమానికి కొంచెం నిమ్మరసం కలిపి తాగితే కడుపులో పుల్లని త్రేన్పులకు కారణమయ్యే ఆమ్లాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
పరగడుపునే వీటిని అస్సలు తీసుకోకండి..
* ఉదయాన్నే సోడా, ఇతర శీతల పానీయాల్నీ తాగవద్దు. వాటి వల్ల జీర్ణాశయానికి హాని కలిగించే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
* ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరల్ని ఉదయం తీసుకోకూడదు. దీనివల్ల పొట్టలో తిప్పడం, రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.
* పరగడుపున కొన్ని తీపి పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో స్వీట్లు తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రోజంతా అలసిపోయినట్లు ఉంటుంది.
* చాలా మంది పరగడుపున టీ, కాఫీ తాగుతుంటారు. దీంతో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పరగడుపున టీ కాఫీ తగ్గాలనుకునేవారు, ఒక గ్లాస్ నీరు తీసుకుని 10 నిమిషాల తర్వాత తీసుకుంటే ఉత్తమం.
* పుల్లటి పదార్థాలు ఉదయం పూట తీసుకోవద్దంటున్నారు నిపుణులు. చాలా మంది టమాటా రైస్, చట్నీ వంటివి తింటారు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.