
ఇటీవల 7 రాష్ట్రాల్లోని జరిగిన ఉప ఎన్నికల్లో 13 శాసనసభ స్థానాలకు ఇండియా బ్లాక్ పదింటిలో ఘన విజయం సాధించింది. ఇందులో ఏన్‌డిఎ రెండింటిలో మాత్రమే గెలిచింది. ఈ రిజల్డ్స్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీకి చెంపపెట్టు అన్నట్లు అనిపిస్తోంది. దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా, ఎన్‌డిఎ ఎదుర్కొన్న తొలి పరీక్ష ఈ ఉప ఎన్నికలు. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్నీ ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌ను గమనించాలి.
ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లో రెంటిని కాంగ్రెస్ గెలుచుకోగా ఒక చోట బీజేపీ గెలిచింది. ముగ్గురు ఇండిపెండెంట్లు రాజీనామా చేసి బీజేపీలో చేరాక ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరి ముగ్గురితో పాటు ఆరుగురు కాంగ్రెస్ MLAలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సంక్షోభం అంచుదాకా వెళ్లింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అభిషేక్ మను సింగ్వీ ఓడిపోవడంతో ఆ MLAలపై అనర్హత వేటు పడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు గెలుచుకుంది.
ఇక తాజాగా జరిగిన మూడు స్థానాల్లో రెంటిని కాంగ్రెస్ గెలుచుకుంది. అవకాశవాదంతో వ్యవహరించిన వారిని, ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీని ఎన్నికల్లో ప్రజలు శిక్షించారని అర్థమవుతుంది. ఉత్తరాఖండ్‌లోనూ కూడా అదే తీరు. బద్రీనాథ్ కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజేంద్ర సింగ్ భండారీ బీజేపీకి ఫిరాయించారు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ గెలిచి తన స్థానాన్ని తాను నిలబెట్టుకుంది. పార్టీలు మారిన అందరికీ ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని కాదు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మారిన అభ్యర్థి గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో ఓటమిని చవిచూస్తూనే వచ్చింది. స్థానిక నాయకత్వాన్ని ప్రక్షాళన చేయాలన్న సంకేతాలను ఉప ఎన్నికలు కాంగ్రెస్ నాయకత్వానికి ఇస్తున్నాయి.
తమిళనాడులోని విక్రంవాడి స్థానంలో డిఎంకె ఇంతకుముందు కంటే తన విజయాన్ని మరింత బలపర్చుకుంది. పశ్చిమబెంగాల్లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా నాలుగింటినీ TC పార్టీ సొంతం చేసుకుంది. వాటిలో మూడింటిని బీజేపీ నుంచి ఆ పార్టీ సాధించింది. బెంగాల్లో మూడు చోట్ల పోటీ చేసిన వామపక్షాలకు మంచి ఓట్లే వచ్చాయి. పంజాబ్‌లో జలంధర్ సీటును ఆప్ గెలుచుకుంది.
కేజ్రీవాల్ అరెస్ట్‌తో సహా పంజాబ్ సర్కారును, ఆప్‌ను బీజేపీ ఎంతగా ఇబ్బంది పెట్టినా జలంధర్‌లో కమలానికి పరాభవమే ఎదురైంది. బీహార్‌లోని రూపౌలి ఫలితం బీజేపీని అంటకాగిన అధికార జెడియుకు గట్టి షాక్. అక్కడ జేడీయు అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఈ పరిమాణాలు చూస్తుంటే బీజేపీకి గట్టి దెబ్బలే తగులుతున్నాయని విశ్లేషలకులు చెబుతున్నారు.