
మనసును హత్తుకునే పాత్రలు..
లోతైన సంభాషణలు..
సంగీత ప్రధానంగా ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రతి సినీప్రియుడి మదిలో సజీవ సాక్ష్యాలు..
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, శాస్త్రీయ కళలను వెండితెరపై అద్భుతంగా మలిచిన తీరు వర్ణనాతీతం. ఆయన సినిమాల్లో కథాకథనాలే హీరోలు. ‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం’.. ఇలా ఒక్కోటి ఒక్కో మధురకావ్యంగా నిలిచింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినీ సొంతం చేసుకున్న ఆయన సినిమా ఆస్కార్ అంచుల దాకా వెళ్లింది. కళాఖండాలకు కేరాఫ్ గా మారిన కే.విశ్వనాథ్.. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న(గురువారం, ఫిబ్రవరి 02న) రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో, కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా… అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు జాతీయస్థాయిలో ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘శంకరాభరణం’ విడుదలైన రోజు(1980 ఫిబ్రవరి 2న)నే యాదృచ్ఛికంగా కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన సినిజీవిత విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
నేపథ్యం…
1930 ఫిబ్రవరి 19న బాపట్ల జిల్లా రేపల్లెలోని పెదపులివర్రు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు విశ్వనాథ్. చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడు ముందుండే ఈయన.. ఏ పుస్తకం కనిపించినా చదువుతూపోయేవారట. అలా రామాయణ, మహాభారతం, భాగవతాలను చిన్నప్పుడే చదివేశారట. పాఠశాల విద్య అయ్యాక.. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ చేశారు. ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ చదివారు.
ఈయన తండ్రి ముందు నుంచి సినిమా రంగంలోనివారే.. అప్పట్లో చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ చదువయ్యాక ఎం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు.. తెలిసిన వ్యక్తి సలహాతో వాహిని స్టూడియో లో ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసి చేరిపోయారట. సౌండ్ రికార్డిస్ట్‌గా కొన్నాళ్లు చేశారు. తొలిసారి ‘పాతాళభైరవి’ సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. అలా చేస్తున్న క్రమంలోనే దర్శకత్వం వైపు ఆయన మనసు మళ్లింది. దీంతో ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్‌గా చేరారు. అది మొదలు పలు చిత్రాలకు కథారచనలో భాగస్వాములయ్యారు. అక్కడినుంచి విశ్వనాథ్ పనితనం మెచ్చి దుక్కిపాటి మధుసూదనరావు ‘ఆత్మగౌరవం’ చిత్రం చేసే అవకాశం ఇచ్చారు. తొలిసారి ఆయన్ను దర్శకునిగా పరిచయం చేసింది దుక్కిపాటినే. మొదటి చిత్రం.. అందులోనూ ఏఎన్నార్ వంటి దిగ్గజ నటులతో సినిమా చేసే అవకాశం రావడం.. అది మొదలు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబులతో సినిమాలు తీశారు.
తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తపించేవారు. అందుకు తగ్గ కథలను కూడా అలానే ఎంచుకొనేవారు. నిజానికి తెలుగునాట శోభన్‌బాబు, చంద్రమోహన్, కమల్‌హాసన్ లకు స్టార్డమ్ వచ్చిందంటే ఆయన చిత్రాలే కారణం.
విశ్వనాథ్ భార్య జయలక్ష్మి, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎంచుకోవడానికి సాహసించని భారతీయ కళలను, నేపథ్యాలను సినిమాలుగా మలిచిన కళాభరణం ఆయన.
కళలేగాక సామాజిక సమస్యలపై కూడా విశ్వనాథ్ ఎన్నో సినిమాలు రూపొందించారు. స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ఈ కోవలోనివే. కాలంతోపాటు సినిమాల ట్రెండ్ మారటంతో దర్శకత్వానికి స్వస్తి చెప్పి నటుడిగా మారి ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నటనతో మెప్పించారు. 2002లో లాహిరి లాహిరి లాహిరి ఆయన మొదటి సినిమా. 2012లో వచ్చిన జీనియస్ చివరి సినిమా.
శుభసంకల్పం, నరసింహానాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలిసుందాం రా.. వంటి సినిమాల్లో ఆయన నటించిన పాత్రలు.. సజీవంగా ప్రేక్షకుల మనస్సులో మిగిలిపోయాయి.
తెలుగులో అత్యధికంగా 40కి పైగా, బాలీవుడ్ లో 9 చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్షన్ తో పాటు ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు.
ఎనలేని గుర్తింపు..
సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్రసీమకు అందించారు. ఎందరో అగ్రకథానాయకులకు దర్శకత్వం వహించి… ఎన్నో అవార్డులను అందుకున్నారు. కళాత్మక సినిమాలు తీయడంతో ఇండస్ట్రీ ఆయన్ను ‘కళాతపస్వి’ అని బిరుదు ఇచ్చింది. సినిమారంగానికి ఆయన చేసిన కృషికిగానూ 1992లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. అదే ఏడాది పద్మశ్రీ అవార్డు వరించింది. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. ఇక తొలి చిత్రానికే ఆయన్ను నంది అవార్డు వరించింది. విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్ (59వ)చిత్రాల బరిలోనూ నిలిచింది. ఆసియా పసిఫిక్ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించడం విశేషం.
విశ్వనాథ కలం నుంచి జాలువారిన సినీఆణిముత్యాలు..
ఆయన రచించి, తెరకెక్కించిన ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’.. చిత్రాలు అంతటా ప్రాచుర్యం సొంతం చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ అవార్డులను అందించింది. అవి..
శంకరాభరణం…
కేవలం సంగీతం ప్రాధ్యాన్యంగా తెరకెక్కిన ఈ చిత్రం మన దేశంలోనేకాక అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకన్నా మానవత్వం గొప్పదని తెలియజెప్పిన సినిమా ఇది. జె.వి.సోమయాజులు ముఖ్యపాత్రలో 1980లో విడుదలైంది ఈ సినిమా. ఇందులోని పాత్రలు, పాటలు, మాటలు.. వేటికవే ప్రత్యేకం. ఈ చిత్రానికి అప్పట్లో ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. నాలుగు జాతీయ అవార్డులు సైతం వచ్చాయి.
ఈ సినిమా విడుదల సమయంలో పంపిణీదారులు లేరు. కొనుగోలు దారులే దిక్కు. సినిమా చూసి ‘బాగుందండీ’ అన్నవాళ్లేగానీ, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదట. పైగా ఏవో ఒకటి పేరు పెట్టిపోయేవారే. ‘కొత్తవాడు కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పెట్టి తీసి ఉంటే ఆయన కోసం కొనేవాళ్లం’ అని ఒకరు. ‘జనం చూడరండీ.. ఇలా పాటలు, డ్యాన్సులు ఎవరికీ కావాలండి. అట్టర్ ఫ్లాప్ అవుతుంది.. అంటూ విమర్శలు చేశారట.
దీంతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు సైతం డీలా పడిపోయారట. విశ్వనాథ్ గారు నిరాశపడినా జనంలోకి వెళ్తే కచ్చితంగా ఆదరణ లభిస్తుందని నమ్మారు. సినిమా విడుదలై బాగా నడిస్తే వచ్చిన దాంట్లో లాభం తీసుకుందామనుకున్నారు. అలాగే ఒప్పందం చేసుకున్నారు కూడా. ఎట్టకేలకు కొంత నష్టానికే కొన్ని జిల్లాలకు అమ్మేశారు. కొన్ని జిల్లాల్లో అమ్ముడు పోలేదు. ఎలాగోలా సినిమా విడుదలైంది. నాలుగో రోజువరకు థియేటర్లు వెలవెలబోయాయి. క్రమంగా ‘బాగుంది’ అన్న టాక్. ప్రేక్షకులు రెండోసారీ, మూడోసారి చూడటానికి వస్తుండటంతో.. మామూలు హిట్ కాదు.. పెద్ద హిట్ అయ్యింది. మూడో వారంలో బ్లాక్‌లో టిక్కెట్లు కొని మరీ చూశారట. ఎక్కడ చూసినా ‘శంకరాభరణం’ పాటలే. తమిళ, కన్నడ భాషల్లోనూ బాగా ఆడింది. మలయాళంలో మాటలు డబ్ చేసి, పాటలను మాత్రం తెలుగులోనే ఉంచి విడుదల చేశారట. అక్కడా పెద్ద హిట్. కొనలేకపోయినవాళ్లు నెత్తినోరూ కొట్టుకొన్నారు. అమ్ముడుపోక తానే అట్టిపెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాతకు కలెక్షన్ల పంట పండింది. అబ్బో ఎనలేని అవార్డులు రివార్డులు చవిచూసింది ఈ సినిమా.. అప్పట్లో ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తే అంతగొప్ప మరీ.
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ (స్వర్ణ కమలం.. రూ.2 లక్షల నగదు), ఉత్తమ సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్(రజత కమలం.. రూ.50 వేలు), ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(రజత కమలం.. రూ.50 వేలు), ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్(రజత కమలం.. రూ.50 వేలు) అందుకున్నారంటే అతిశయోక్తి కాదు.
సప్తపది…
మనుషులను విడదీసే కుల వ్యవస్థను సమూలంగా చెరిపివేయాలని చాటి చెప్పిన అద్భుత చిత్రం ఇది. జె.వి.సోమయాజులు, సబితా భామిడిపాటి, రవిశంకర్, అల్లు రామలింగయ్య ప్రధాన తారాగణంతో తెరకెక్కిన చిత్రం. సంగీత ప్రధానమైన సినిమా. ఫలితం సమాజంలో పేరుకుపోయిన కులవ్యవస్థను రూపుమాపాలనే ఆలోచన అందరిలో కలిగేలా చేసింది. 1981లో విడుదలైన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘నర్గీస్‌దత్త్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్’(రజత కమలం.. రూ.50 వేలు) అవార్డు వరించడం విశేషం.
స్వాతిముత్యం…
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన రేకెత్తించిన చిత్రమిది. లోకం తెలియని అమాయకుడిగా కమల్‌హాసన్, చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన వితంతువుగా రాధిక నటించిన తీరు వర్ణణాతీతం. సినీప్రియుల ప్రశంసలు సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా (రజత కమలం రూ.50 వేలు నగదు) జాతీయ అవార్డు అందుకుంది.
సూత్రధారులు…
అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం అవ్వదని, శాంతియుతమార్గమే ఉత్తమమని చాటి చెప్పిన చిత్రం ‘సూత్రధారులు’. అక్కినేని నాగేశ్వరరావు, భానుచందర్, రమ్యకృష్ణ, సత్యనారాయణలు నటించిన ఈ సినిమా 1989లో విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును పొందింది.
స్వరాభిషేకం…
పాశ్చాత్య సంస్కృతివైపు అడుగులువేస్తోన్న వేళ.. సంగీత ప్రధాన చిత్రంగా ‘స్వరాభిషేకం’ వచ్చి నిలిచింది. సంగీతద్వయంగా విశ్వనాథ్, శ్రీకాంత్ ఇందులో నటించి అలరించారు. లయ కీలకపాత్రలో మెరిసింది. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను అందుకుంది. తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డు అందుకుంది. అలాగే, ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
ఇతరాంశాలు…
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా 1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం.. విడుదలైన రోజే కళాతపస్వి శివైక్యం పొందడం బాధాకరం.
ఈ చిత్రానంతరమే కె.విశ్వనాథ్ ‘‘కళాతపస్వి’గా పేరుపొందారు. పెద్దగా పేరు ప్రఖ్యాతలు లేని నటీనటులతో తీసిన ఈ సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు.
‘శంకరాభరణం’ చిత్రంలోని శంకరా.. నాదశరీరా పరా.. అనే పాట సంగీత ప్రియుల మనసులను అలరించింది. ఈ పాటను వేటూరి సుందరరామమూర్తి రాశారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా వేటూరికి నంది అవార్డు వచ్చింది. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.
నటుడు చంద్రమోహన్, గాయని గాయకులైన ఎస్పీ. బాలసుబ్రమణ్యం, శైలజలు బంధువులు..
ఆ తర్వాత వరుసగా చెల్లెలి కాపురం, ఓ సీత కథ, కాలం మారింది, నేరము- శిక్ష, శారద, జీవనజ్యోతి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అప్పటివరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు చిత్రాలకు విశ్వనాథ్ దిశానిర్దేశం చేశారు.
కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన 1985లో వచ్చిన స్వాతిముత్యం.. చిత్రానికి మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనత దక్కించుకుంది.
ఎంతోమంది సినీ ప్రముఖులకు గురువులు అయిన ఆయన.. తరతరాలకు స్ఫూర్తి ప్రదాత..
కళలకు జీవం పోస్తూ ఆయన తీసిన చిత్రాలు ఏనాటికైనా అజరామరమే!