
గురుబ్రహ్మ గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ:”
అంటే బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరులు ముగ్గురిని గురువు స్వరూపంగా చూసుకోవచ్చని అర్థం.
“పుస్తకాం ప్రత్యయాధీతం-నాధీతం గురుసన్నిధౌ” అంటే గురువు దగ్గర నేర్చుకోకుండా సొంతంగా పుస్తకాలు చదవడం వల్ల వచ్చే జ్ఞానం అసంపూర్ణంగా ఉంటుందని గురువు గొప్పదనాన్ని ‘చాణక్యనీతి’ చెప్పకనే చెబుతుంది.
“గురువు శిక్షలేక గురుతెట్లు గల్గునో అనే శతకంలో గురువు విలువను వేమన చెప్పారు.
‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే తొలగిస్తుందని. ‘గురు’ అనే పదానికి.. చీకటిని తొలగించి వెలుతురుని చూపిస్తూ జీవితంలో మంచి మార్గాల్లో వెళ్లేందుకు తోడ్పాటునందిస్తారని అర్థం.
గురువును గౌరవించడం, సత్కరించడం ఆనాది కాలం నుంచే వస్తున్న సంస్కృతి.
శిశువును లోకానికి పరిచయం చేసిన ‘అమ్మ’ మొదటి గురువైతే, నడక నేర్పించే ‘నాన్న’ రెండో గురువు.
ఈ లోకంలో అందరితో ఎలా నడుచుకోవాలో నేర్పుతూ, విద్యాబుద్ధులు నేర్పేవాడు ‘ఉపాధ్యాయుడు’ మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆ తరువాత ఆచార్యదేవోభవ అంటూ చేతులెత్తి నమస్కరిస్తారు.
అందువల్లే మనదేశంలో తల్లి, తండ్రి తర్వాత అంతటి అత్యున్నతస్థానం ఒక్క గురువుకే ఇస్తాం.
గురుశిష్యులంటే… వాళ్లే!
మహాభారతంలో గురుశిష్యుల పరంపర ఎలా ఉండేందంటే…చిన్నతనంలోనే బోయవాళ్లకు రాజైన ఏకలవ్యుడు విల్లువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. అందుకు ద్రోణాచార్యులను అడిగితే, నీవు క్షత్రియుడవి కాదు, అందువల్ల శిష్యుడుగా నిరాకరిస్తాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా గురువు విగ్రహాన్ని తయారుచేసుకొని దానిముందు విల్లు విద్యను నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఒకానొక సందర్భంలో ఏకలవ్యుడి సంకల్పం చూసి ఆశ్చర్యపోతాడు ద్రోణాచార్యుడు. గురువుగారి దగ్గరికి వచ్చి కానుకగా మీకేం కావాలో కోరుకోమని చెప్పగా, బాణాలు వేయడానికి అతి ముఖ్యమైన తన కుడిచేతి బొటనవేలిని ఇవ్వమని అడుగుతాడు. అందుకు ఏకలవ్యుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ద్రోణాచార్యునికి గురుదక్షణగా తన వేలిని ఇచ్చేస్తాడు. అలా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప గురుశిష్యులుగా ద్రోణాచార్య, ఏకలవ్యుడు గురుశిష్య ద్వయానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.
ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం…
‘సర్వేపల్లి రాధాకృష్ణన్’.. పుట్టినరోజైన సెప్టెంబర్ 5న విద్యార్థులు, మిత్రులు వేడుకలు చేయడానికి అనుమతి కోరగా, దానికి ఆయన గురువులను అభినందిస్తూ ఆ రోజున ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని సలహా ఇచ్చారట. ఎందుకంటే సర్వేపల్లి కలకత్తా, మైసూరు విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు. అంతేకాదు తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగానూ ఉన్నారు.
కావున ప్రతి ఏటా సెప్టెంబర్ 5న మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతినే ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.
● టీచర్స్ డే రోజు సెలవు ఉండదు. ఆ రోజు పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు తమకు ఇష్టమైన గురువు బోధించే సబ్జెక్ట్‌ను తమ తరగతి గదిలో ఇతర విద్యార్థుల ముందు చెబుతూ ఉపాధ్యాయుల ప్రశంసలూ అందుకుంటారు. ఒకవేళ ఏవైనా తప్పులు చేస్తే దగ్గరుండి లోపాలను సరి చేస్తారు. అంతేకాదు చక్కగా బోధించిన విద్యార్థులకు బహుమతులను అందిస్తారు.
●1962లో సెప్టెంబర్ 5న మన దేశంలో మొదటిసారి ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు జరిగాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 1964లో ఉపాధ్యాయ దినోత్సవం గురుంచి జరిగిన చర్చల తర్వాత, 1966 నుంచి ‘ఇంటర్నేషనల్ టీచర్స్ డే’ సంబరాలు అంతటా విశేషంగా చేసుకుంటున్నారు.
●తాను కష్టపడి తెలుసుకున్న సత్యాన్ని స్వయంగా ఆచరిస్తూ నలుగురిని మార్చగల మహానీయుడే నా దృష్టిలో గురువు.. అని గాంధీజీ అన్నారు.
●మనల్ని దారితప్పకుండా సమర్థంగా నడపగల ఏకైక వ్యక్తి – గురువే.. అని స్వామి వివేకానంద నిజజీవితంలో ఆచార్య ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు.
●నేను దేశానికి ప్రధానమంత్రిని కావొచ్చు. కానీ మీ సమక్షంలో నిరంతరం విద్యార్థినే.. అని నెహ్రూజీ అన్నారు.
పాఠశాల లేని పల్లెటూరు అయినా ఉండొచ్చుగానీ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదని ప్రముఖ వ్యక్తి ప్రస్తావించారు. ‘దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను గురువుకు నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదటగా తనకు చెప్పింది గురువే కాబట్టి’.. అని కబీర్ దాసు చెప్పారు.
మనలోని అజ్ఞానమనే చీకటిని
జ్ఞానమనే వెలుగుతో పారద్రోలి
విజ్ఞానులుగా మలచిన
ఎందరో గురువులకు కృతజ్ఞతతో..
గురుపూజోత్సవ శుభాకాంక్షలు