Telugu CinemaTelugu Special Stories

పండిత పామరులను అలరింపజేస్తుంది సుస్వర సంగీతం

01 అక్టోబర్‌‌ “అంతర్జాతీయ సంగీత దినోత్సవం” సందర్భంగా  కోకిల గానాలు, శిశువు నవ్వుల్లో ఏదో మహత్తర సంగీతం దాగి ఉంది. అలాంటి సంగీత సంద్రంలో ఒక చక్కని పాటకు స్పందించని మనిషుండడు, పులకించని తనువుండదు. వ్యక్తి మానసిక వికాసానికి, ప్రశాంత జీవన గమనానికి, కొన్ని రుగ్మతల చికిత్సకు సంగీతం ఓ దివ్య ఔషధంగా ఉపకరిస్తున్న విషయం మనకు తెలుసు. మనకు ఇష్టమైన సంగీత రసాన్ని ఆస్వాదించడంతో రక్తపోటు నియంత్రించబడడం, ఆందోళన తగ్గడం, మానసిక స్థితి మెరుగుపడడం, ప్రశాంతత కలగడం, ఒంటరితనానికి ఔషధంగా ఉపయోగపడడం, మానసిక ఆనందానికి కారణం కావడం జరుగుతుందని పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

మెదడును ఉత్తేజపరచడంతో బాధలకు లేపనం అద్దినట్లు మానసిక ఉల్లాసం కలిగించే మహత్తర శక్తి సంగీతానికి ఉంటుందని మన అనుభవం తెలియజేస్తున్నది. సుసంగీతంతో ఆత్మవిశ్వాసం ఉరకలెత్తడం, పట్టుదల గట్టిపడడం, బాధలను మరిచిపోవడం, సృజన జాగృతం కావడం, వినోదాల విందులు వడ్డించడం కూడా జరుగుట గమనించారు. భావోద్వేగ ప్రకటన, కళా సౌందర్యాత్మక భావనలు జనించడం, సామాజిక అంశాలను ఏకరువు పెట్టడం, సమాజాన్ని జాగృత పరచడం, మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడం, వేడుక వాతావరణం కలగడం, కళాపోషకులకు ఆధరణ లభించడం, సమాజ ఏకీకరణ సుసాధ్యం కావడానికి సహితం సంగీతం దోహదపడుతున్నది. 

అంతర్జాతీయ సంగీత దినోత్సవం(ఇంటర్నేషనల్‌‌ మ్యూజిక్‌ డే):

ప్రముఖ వయోలిన్‌ సంగీత విద్వాంసులు  “యెహుడి మినూహిమ్‌” ప్రేరణతో ప్రారంభంమైన “అంతర్జాతీయ సంగీత దినోత్సవం” యునెస్కో చొకవతో ప్రతి ఏట 01 అక్టోబర్‌న ఐరాస సభ్య దేశాలు 1975 నుంచి ఘనంగా పాటించుట ఆనవాయితీగా మారింది. జీవితసారంగా మనల్ని అనునిత్యం జాగృతపరడమనే మహత్తరశక్తి సంగీతానికే ఉంది. అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేదికగా ఉచిత సంగీత ప్రదర్శనలు, కళాకారులను సన్మానించుకోవడం, అమర సంగీత విధ్వంసులను గుర్తు చేసుకోవడం లాంటివి నిర్వహించుట జరుగుతున్నది. 

భారతీయ వైవిధ్యభరిత సంగీత సంపద:

 భారతంతో శాస్త్రీయ, జానపద, లలిత, సినీ, ఇండియన్‌ పాప్‌ సంగీతం లాంటి పలు రకాలైన సంగీత సాధనలకు మన దేశం పుట్టిళ్లుగా నిలుస్తున్నది. శాస్త్రీయ సంగీతంలో హిందుస్థానీ, కర్నాటక్‌ లాంటివి అతి ముఖ్యమైనవిగా పేరుగాంచాయి. వైవిధ్యభరితమైన భారత సమాజంలో అనేక రకాలైన జానపద సంగీతాలు ప్రాంతాలు/జాతుల వారీగా నిత్యం ప్రజలను ఉత్తేజపరుస్తున్నాయి. తెలుగు గ్రామీణులు పనితో పాటు పాడుకునే ప్రజాగీతాలు, కర్నాటక భవగీతి, పంజాబీ భంగ్రా, గుజరాతీ గర్బా/దాండియా, మహారాష్ట్ర లావ్నీ, రాజస్థానీ లంగస్‌/సరేరా/భోపా/జోగి/మంగనియర్‌, ఖవ్వాలీ లాంటివి ప్రముఖ జానపద సంగీతాలుగా పేరొందాయి. 

భారతీయ సంగీత మహాపోషకులు:

 హిందూస్తానీ సంగీత వ్యవస్థాపకులు ‘తాన్‌సేన్‌’ను ‘భారత శాస్త్రీయ సంగీత పితామహుడి’గా, ‘పండిట్‌ రవిశంకర్‌’ను ‘ప్రపంచ సంగీత గాడ్‌ఫాదర్‌’గా, ‘గులామ్‌ అలీ ఖాన్’‌ను ‘కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌’గా, ‘గిరిజా దేవి’ని ‘క్వీన్‌ ఆఫ్ ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌’గా, ‘హరీష్‌ జయరాజ్‌’ను ‘ఇండియన్‌ మెలొడి కింగ్‌’గా, ‘సరోజనీదేవి/లతా మంగేష్కర్’‌లను ‘గాన కోకిల’గా,  పిలవడం జరుగుతోంది. 

పండిట్‌ రవిశంకర్ ‌(సితార్‌), జాకీర్‌ హుసేన్ (తబ్లా)‌, రామ్‌ నారాయణ్ ‌(సారంగి), లతామంగేష్కర్ (సినీ/భక్తి సంగీతం)‌, ఉస్తాద్‍ అసద్‍ అలీఖాన్‌ (రుద్రవీణ), రామ్‌నాథ్ రాఘవన్ ‌(మృదంగం), వినాయక్రమ్ ‌(ఘటమ్‌), భీంసేన్‌ దోషి (హిందుస్తానీ), హరిప్రసాద్‍ చౌరాసియా (ఫ్లూట్‌), బిస్మిల్లాఖాన్ (షెహ్నాయి)‌, ఎం ఎస్‌ సుబ్బలక్ష్మి (కర్నాటక్‌ సంగీతం), పండిట్‌ శివకుమార్‌ శర్మ (సంతూర్‌ విధ్వంసులు), అమ్జద్‍ అలీ ఖాన్ (సరోద్‍)‌ లాంటి మహానుభావులు భారత శాస్త్రీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారు.

సినీ సంగీత రంగంలో ఆశా భోంస్లే, అల్కా యాగ్నిక్‌, ఏ ఆర్‌ రెహమాన్‌, సోను నిగమ్‌, కిషోర్‌ కుమార్, మహ్మద్‍ రఫీ, మన్నాడే, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఉదిత్‌ నారాయణ్, శంకర్‌ మహదేవన్, యేసుదాస్ లాంటి మరెందరో ఉన్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఎం ఎస్‌ సుబ్బలక్ష్మి, ఉస్తాద్‍ బిస్మిల్లా ఖాన్‌, భీమ్‌సేన్‌ దోషి, రవి శంకర్‌, లతామంగేష్కర్‌ లాంటి సంగీతకారులు అందుకోవడం మనకు తెలుసు. 

తెలుగు సంగీత కళాకారులు:

 తెలుగు రాష్ట్రాల్లో అన్నమాచార్య, క్షేత్రయ్య, భక్త రామదాస్‌, త్యాగయ్య, ఈమని శంకరశాస్త్రి, చిన్న మౌలానా, చిట్టి బాబు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నెద్దునూరి కృష్ణమూర్తి, శ్రీరాగం గోపాలరత్నం, శ్రీపాద పినాకపాణి, నూకల చిన్న సత్యనారాయణ, అవసరాల కణ్యాకుమారి, లలిత హరిప్రియ,రాఘవాచారి, శేషాచారి, ఘంటశాల, మల్లపూడి లక్ష్మణరావు లాంటి అనేకులు మన తెలుగు సంగీతానికి ప్రాణం పోశారు.

సినీ జగత్తును సంగీత సాగరంలో ముంచిన మహానుభావుల్లో ఘంటశాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, చిత్ర, కీరవాణి, మహదేవన్‌, కీరవాణి, రమేష్‌నాయుడు, చక్రవర్తి, మాదవపెద్ది సత్యం, ఆదినారాయణ, సత్యం, కోదండపాణి, హనుమంతరావు, రాజ్‌కోటి, మణిశర్మ, దేవి ప్రసాద్‍, చక్రం, ఆర్పీ పట్నాయక్‌, తమన్‌, కళ్యాణ్‌మాలిక్‌, వందేమాతరం శ్రీనివాస్‌ లాంటి మరెందరో సంగీతకారులు మనకు నిత్యం వీణులవిందు చేస్తూనే ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బుర్ర కథలు, ఒగ్గు కథలు, హరికథలు, జంగం కథలు, లంబాడీ గీతాలు, శారద కళ, చెక్క భజనలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులాటలు, పగటి వేషగాళ్లు, రోకటి పాటలు, కొమ్మ దాసరులు, సువ్వి పాటలు, తిరుగలి పాటలు, జమిడిక కథలు, శ్రామిక పాటలు లాంటి అనేక గ్రామీణ జానపదాలు మనకు నిత్యం మానసిక ప్రశాంతతను కలిగిస్తూనే ఉన్నాయి. సంగీతానికి సాహిత్యం తోడైతే అద్భుత సరాగాల ఝరి ప్రవహిస్తూ మానవాళిన ఆనంద డోలికల్లా ముంచేస్తుంది.  

 సంగీతానికి భాష, యాస అనబడే హద్దులు లేవు. పాటకు కుల మతభేదాలు లేవు. భాష ఏదైనా సుస్వరానికి లొంగని మనిషంటూ ఉండడు. నచ్చిన పాటకు పులకించని తనువుండదు. భక్తి సంగీతానికి పరవశించని నరుడుండడు. అలాంటి మన సంగీత వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి తల్లితండ్రులు/ పెద్దలు తమ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పించడం మంచిది. నిన్నటి తరం నిర్మించిన పునాదుల మీద మనం నిలిచాం, ఆ పునాదులను మరింత పటిష్ట పరచాల్సిన కనీస బాధ్యత మనందరి మీద ఉందని గుర్తుంచుకుందాం, మనదైన సంగీత సంపదను పరిరక్షించుకుందాం. 

Show More
Back to top button