HISTORY CULTURE AND LITERATURETelugu Special Stories

రావణుడి దహన ఘట్టం! ‘విజయదశమి’ పరిపూర్ణం!!

విజయదశమి రోజున ఏ పని తలపెట్టిన విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గామాత, కాళిక, లలితాంబ, మహిషాసురమర్దిని… ఇలా ఏ పేరుతో పిలిచినా, తలచినా జగన్మాత మనల్ని అనుగ్రహిస్తుందని విశ్వసిస్తాం. నిత్య జీవితంలో ఎల్లప్పుడూ విజయాలే కలగాలని ఆకాక్షించే మానవుడికి ‘విజయదశమి’ చీకటిలో వేగుచుక్కవంటిది. దసరగా పిలుచుకునే ఈ పర్వదినానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.  లోకాలను పాలించే చల్లని తల్లి సర్వజగత్ రక్షకి.. 

మహిషాసురుడనే రాక్షసుడిపై 9 రోజులు యుద్ధం చేసి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగగా అవతరించింది. ఈ కథానుసారం అందరికీ సుపరిచితమే.. కానీ

కొన్ని వందల ఏళ్ల చరిత్ర దాగి ఉన్న ఈ పర్వదినం… 

వెనుక కొన్ని గాథలు, ప్రాశస్త్యం ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే వేడుకే విజయదశమి(దసరా). సమస్త విజయాలకు సంకేతం ఈ పర్వదినం..

అశ్వయుజ పాడ్యమి రోజున ప్రారంభమయ్యే శరన్నవరాత్రులు దశమినాటితో ముగుస్తాయి. అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమినాడు అంటే, పదవరోజున రాజరాజేశ్వరిగా ఆరాధిస్తాం. 

దసరా అంటే ‘దశహరా’.. దశవిధమైన పాపహరం అని అర్థం. ఈరోజున పట్నంవాసులంతా తమ సొంతూళ్లకు చేరుకొని, బంధుమిత్రులతో కలిసి ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. 

ప్రాచుర్యంలో ఉన్న కథ:

ఒకప్పుడు శుంభుడు, నిశుంభుడు అనే రాక్షస సోదరులుండేవారు. దేవతలకు చెందాల్సిన యజ్ఞానికి అవసరమయ్యే అన్నింటినీ తీసుకుంటూ, దేవతలందరినీ బాధపెడుతూ ఉండేవారు. అప్పుడు దేవతలు హిమవత్ పర్వతానికి వెళ్లి అక్కడ ఉన్న అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆ అమ్మవారు పార్వతీదేవిగా అవతరించి దుష్టుల నుంచి రక్షించడానికి అభయమిస్తున్నట్లుగా విశ్వసించారు.  అయితే ఒకనాడు ఈ హిమవత్ పర్వత ప్రాంతంలో అంబికగా అవతారమెత్తిన పార్వతీదేవిని రాక్షస సోదరుల అనుచరులైన చండ, ముండులు చూశారు. ఆమె సౌందర్యాన్ని చూసి తమ యజమానులకు చెప్తారు. అందుకు రాజులు ఆమెను తీసుకురమ్మని వెంట దూతను కూడా పంపిస్తారు. అప్పుడు దుర్గాదేవి ‘నేను వస్తాను కానీ నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.. నన్ను ఎవరు యుద్ధంలో జయిస్తారో, నా దర్పాన్ని ఎవరు పొగొడతారో, లోకంలో నాకు ఎవరు సమవుజ్జి అవుతారో వారే నా భర్త, ఆ సోదరుల్లో ఎవరు నన్ను జయిస్తే వాళ్లతోనే పాణిగ్రహణం అవుతుంద’ని చెప్పి ఆ దూతను తిప్పి పంపిస్తుంది. అది విన్న శుంభుడు కోపంతో ధూమ్రలోచనుడుని పంపించి ఆమెపై యుద్ధం చేసి, ఓడించమని చెప్తాడు. కానీ అమ్మవారు హుంకారంతోనే అతడ్ని చంపేస్తుంది. అది విన్న శుంభుడు మహోగ్రుడై చండ, ముండులను అమ్మవారిపైకి పంపించగా, ఆమెలోంచి కాళికదేవి బయటకు వచ్చి చండుడ్ని పడగొట్టి, ముండుడి తలను నరికి ఆపై అమ్మవారి దగ్గరికి వస్తుంది. చండముండుల తలలను నరికినందుకు సంతోషించి, ఇకపై నువ్వు ‘చాముండి’గా ప్రసిద్ధికెక్కుతావని వరమిచ్చింది.

వీరి మరణం తర్వాత రాక్షస సోదరులు రకరకాల రాక్షస జాతులు, సైన్యంతో కలిసి దేవతలపై యుద్ధం మొదలుపెట్టారు. ఆ పోరులో రక్తబీజుడు అనే రాక్షసుడ్ని ఐంద్రీ దేవత వజ్రాయుధంతో కొట్టగా, రక్తం బొట్లుగా కారి వాటి నుంచి మళ్లీ వేల సంఖ్యలో రక్తబీజుడి అవతారాలు పుట్టుకొస్తాయి. దీనికి పరిష్కారంగా అమ్మవారు కాళీమాతను పిలిచి బొట్టు పడేలోగా రక్తాన్ని తాగేసేయమని చెబుతుంది. తర్వాత రక్తబీజుడి రక్తమంతా పోయి బలహీనంగా  చేసి సంహరిస్తుంది. ఆ యుద్ధపోరులో అమ్మవారు చండికాదేవి నిశుంభుణ్ణి నెలకేసి కొట్టింది. తమ్ముడు రౌద్రంగా ఆమె మీదికి రాగా శుంభుడ్ని అమ్మవారు శూలంతో కొట్టగానే మూర్ఛతో కింద పడతాడు. అప్పుడు శుంభుడు తమ్ముడి మరణంతో, బాధతో ‘దేవి నీకేదో బలముందని గర్వపడకు. ఇతరుల బలాన్ని పొంది నాతో యుద్ధం చేశావు’ అని నిందించాడు. అందుకు అమ్మవారు నవ్వుతూ వీళ్లంతా విభూతులు, నా శక్తులు. తిరిగి నాలోనికి ప్రవేశిస్తారని బదులు చెప్పింది. దేవతలందరూ ఆమెలోకి వచ్చి ప్రప్రథమంగా అంబికాదేవి ఒక్కత్తే ప్రకాశిస్తుంది. ఆ తరువాత వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శుంభుణ్ణి ఒక్క చేత్తో ఎత్తి పట్టుకొని గిరగిరా గాల్లో తిప్పి నెలకేసి కొట్టింది. ఆమె శూలంతో వక్షస్థలంలో పొడవడంతో అతడు విగతజీవుడయ్యాడు. దాంతో జగన్మాత అంతటితో తన అవతార కార్యాన్ని పూర్తి చేసింది. 

నిజానికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు త్రిమూర్తులనే పేరు. వీరి భార్యలకు త్రిశక్తులని పేరు. ఈ త్రిశక్తి దేవతల సమష్టి పండుగే ఈ విజయదశమి.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో దేవీ నవరాత్రులు మొదలై, 15న విజయదశమి(తిథిలను బట్టి తేదీలు మారతాయి)తో పూర్తవుతుంది.

మరో కథ.. 

జై మహిషాసురమర్దిని…

ఈరోజున ప్రతి ఒక్కరూ మహిషాసురమర్దిని కథ చెప్పుకుంటారు. పూర్వం మహిషాసురుడనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఇతడు ఇంద్రుడి పదవి కోసం దేవతలతో యుద్ధం చేసి, వాళ్లను ఓడిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోకాన్ని కాకుండా ప్రపంచాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడి బారి నుంచి లోకాన్ని కాపాడాలని ఇంద్రుడు త్రిమూర్తులతో వాపోతాడు. అప్పుడా త్రిమూర్తులకు వచ్చిన కోపం ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తే తదుపరి ఒక స్త్రీగా జన్మిస్తుంది. త్రిమూర్తులలో.. శివుని శక్తి.. ముఖంగా, 

విష్ణువు శక్తి భుజాలుగా, చేతులుగా, బ్రహ్మ శక్తి పాదాలుగా.. మొత్తంగా ఆ స్త్రీ మహిషాసురుడ్ని చంపే శక్తిగా అవతరిస్తుంది. 

శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని.. 

ఇలా ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్నిచ్చి మహిషాసురమర్దిని దేవీని యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో భీకరంగా పోరాడి మహిషాసురుడ్ని మట్టుబెడుతుంది ఆ తల్లి. చెడుపై ఆ అమ్మ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమిరోజున దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఉగ్రరూపాన్నే ‘మహిషాసురమర్దిని’ రూపంగా భావిస్తాం. 

జమ్మి ఆకులు పంచుకోవడం.. 

విజయదశమినాడు పూజలందుకునే శమీ(జమ్మి) చెట్టుకి ఓ ప్రత్యేకత ఉంది. పూర్వం ప్రజాపతి అగ్నిని సృష్టిస్తే, అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతినే కాల్చేయబోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజాపతి అగ్నిని శాంతింపజేసేందుకు పచ్చని చెట్టును సృష్టిస్తాడట. కొమ్మలతో కొట్టి, అగ్నిని ఆర్పివేయడంతో.. అగ్నిని శమింపచేసేందుకు ఉపయోగించిన వృక్షంగా శమీ(జమ్మి) చెట్టు ఆనాటి నుంచి వాడుకలోకి వచ్చింది. 

విజయదశమినాడు సాయంత్రం ఈ జమ్మి చెట్టును చేరుకుని ప్రదక్షిణలు చేసి, జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి, ఆశీర్వాదం పొందడం మన తెలుగువారి సంప్రదాయం. పరస్పర శుభాకాంక్షల మధ్య దసరా సాయంత్రం ముగుస్తుంది. 

తప్పకుండా పాలపిట్ట దర్శనం.. 

దసరా రోజున పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని అంటారు. ఇదే ఆచారంగానూ వస్తుంది. నీలం, పసుపు రంగుల కలబోతగా.. అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఇతిహాసిక కథలు ప్రచారంలో ఉన్నాయి. 

త్రేతాయుగంలో రావణుడితో యుద్ధానికి బయల్దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమినాడు జమ్మిచెట్టును పూజించి, దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. 

రావణ దహనంతో ముగింపు…  

ఈరోజున రాముడు రావణున్ని వధించి, విజయం సాధించాడు. దీనికి గుర్తుగా ఈరోజున సాయంత్రం రావణదహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో దసరా రోజున రావణదహనం చేస్తారు.

పెద్ద మైదానాల్లో, స్కూల్ గ్రౌండ్ లలో పది తలల రావణుడి బొమ్మను పెడతారు, అందులో బాణాసంచాను ఉంచి, ఆపై కాలుస్తారు. దసరా తర్వాత అటుఇటుగా 21 రోజులకు దీపావళి పండుగ వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది కూడా అప్పుడేనట.. అందువల్లే ఈ కథ మనకు బాగా ప్రాచుర్యంలో ఉంది.

ఇదే కథ మరోలా ప్రాచుర్యంలో..

రాముడు రావణుని పది తలలు నరికిన కొద్దీ మళ్లీ తలలు పుట్టుకొస్తుండటంతో, నిద్రలో ఉన్న దుర్గాదేవీని రాముడు పూజించగా ఆ తల్లి విజయం వరిస్తుందని చెప్తుంది. ఆ తర్వాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి యుద్ధం మొదలుపెట్టగా పదో రోజున శ్రీరాముడు రావణున్ని సంహరించి విజయం పొంది, జమ్మి చెట్టుకు పూజ చేసి, పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నాడు. అలా రాముని విజయానికి కారకురాలైన దుర్గాదేవీని పదిరోజులపాటు పూజించే కార్యక్రమాన్ని దసరా ఉత్సవంగా మనం అనాదిగా జరుపుకుంటున్నాం. ఇకపోతే రావణ, కుంభకర్ణులను బొమ్మలుగా చేసి ఊరంతా ఉరేగించి, మైదానంలో అశేష జనాల ముందు ఆ బొమ్మల్ని కాల్చి వేడుక చేసుకుంటున్నాం. కాగా ఈ వేడుక పర్వాన్ని ‘రామలీల’గా పిలుస్తారు.

అప్పట్లో ఆయుధపూజ…

అప్పట్లో ఈరోజున ఆయుధాలకు ప్రత్యేకించి పూజలు జరిపేవారు. కానీ ఇప్పుడు ఆయుధాలకు బదులు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన వస్తువుల్ని, యంత్రాల్ని పూజిస్తున్నారు. దాంతోపాటు వాహన పూజలు సైతం ఈరోజున చేస్తుంటారు. కొత్త వ్యాపారాలు, పనులు ఇలా ఏదేని కొత్తగా మొదలుపెట్టాల్సినవి విజయదశమి రోజున ప్రారంభిస్తే త్వరితగతిన వృద్ధి చెందుతారని నమ్మకం.

విజయదశమి అంటే విద్య, ధైర్యం, జ్ఞానం, శక్తి… ఇలా పలు విజయాలను అనుగ్రహించేలా చేస్తుంది ఆ తల్లి అని అర్థం.

Show More
Back to top button