Telugu News

ప్రపంచ పేదరిక కేంద్రంగా భారతం…!

ఐరాస‌ విడుదల చేసిన “ప్రపంచ బహుమితీయ పేదరిక సూచిక-2024” తాజా నివేదిక ఆధారంగా)

  8.2 బిలియన్ల ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న పలు సమస్యలకు పేదరికమే ప్రధాన కారణమని, పేదరికం ఓ బహువ్యాధి లక్షణంగా మారిందని మనకు తెలుసు. మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన నిరక్షరాస్యత, అధిక జనాభా, ప్రజారోగ్యం, అసమానతలు, లింగ వివక్ష, పర్యావరణ కాలుష్యం, నిరుద్యోగం, పారిశుధ్యలోపం లాంటి అంశాలు పేదరికంతో సమీప సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 112 దేశాలకు సంబంధించిన 6.3 బిలియన్‌ (630 కోట్లు) ప్రజల “ప్రపంచ బహుమితీయ పేదరిక సూచిక”లను ఐరాస అనుబంధ సంస్థలు అధ్యయనం చేసి నివేదికను రూపొందించడం జరిగింది.

“ఐరాస డెవలప్‌మెంటల్‌ ప్రోగ్రామ్ (యూఎన్‌డిపీ)”, “ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్ హూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనిషియేటివ్‌(ఓపిహెచ్‌ఐ)”లు సంయుక్తంగా ఈ నివేదికను తయూరు చేశాయి.‌ గృహ వసతులు, పారిశుధ్యం, విద్యుత్తు సరఫరా, వంట గ్యాస్‌/ఇంధనాలు, పోషకాహారం, విద్యార్థుల పాఠశాలల హాజరు లాంటి ప్రధాన అంశాలను అధ్యయనం చేసిన పిదప “బహుమితీయ పేదరిక సూచిక-2024 (మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌, ఎంపిఐ-2024)“లను నిర్ణయించి నివేదిక రూపొందించారు. 

అల్ప, మధ్యాదాయ దేశాల్లో కోరలు చాచిన పేదరికం:

  పారిశుధ్యలోపంతో 828 మిలియన్లు, గృహ వసతులు లేని వారు 886 మిలియన్లు, వంట గ్యాస్‌ లేని వారు 998 మిలియన్లు ఉన్నారని, 110 కోట్ల ప్రపంచ పేదల్లో 637 మిలియన్ల పేద పిల్లలకు పోషకాహారం అందడం లేదని వెల్లడవుతున్నది. దక్షిణ ఆసియాలో 272 మిలియన్లు, సబ్‌-సహార ఆఫ్రికా ప్రాంతాల్లో 256 మిలియన్ల పేదలకు కనీస పోషకాహారం అందడం లేదని తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 83.2 శాతం పేదలు సబ్‌-సహారా, దక్షిణ ఏసియా ప్రాంత దేశాల్లోనే ఉన్నారని పేర్కొనబడింది. అల్పాదాయ దేశాల్లో 34.8 శాతం, మధ్య ఆదాయ దేశాల్లో 65.2 శాతం మంది కడు పేదలు ఉన్నారని నివేదిక వెల్లడించింది. ప్రపంచ పేదల్లో 83.7 శాతం వరకు గ్రామీణ బడుగులే ఉన్నారని తేలింది. ప్రపంచ జనాభాలో 28 శాతం గ్రామీణులు, 6.6 శాతం పట్టణ ప్రాంత పేదలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. 

ప్రపంచ పేదరిక కేంద్రంగా భారతం !       

  ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ల (110 కోట్ల) ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారని, పేదరికం అత్యధికంగా భారత్‌, పాకిస్థాన్ దేశాల్లోనే ఉందని తాజాగా విడుదల చేసిన “ఐరాస ప్రపంచ బహుమితీయ పేదరిక సూచిక – 2024 (యూఎన్‌ గ్లోబల్‌ మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌-2024)” నివేదిక స్పష్టం చేస్తున్నది. అత్యధికంగా భారత్‌లో 234 మిలియన్లు, పాకిస్థాన్‌లో 93 మిలియన్లు, ఇథియోపియాలో 86 మిలియన్లు, నైజీరియాలో 74 మిలియన్లు, కాంగోలో 66 మిలియన్ల పేదలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచ పేదల్లో 48.1 శాతం ఈ ఐదు దేశాల్లోనే ఉన్నట్లు తేలింది.

ఐరాస అధ్యయనం చేసిన దేశాల “బహుమితీయ పేదరిక సూచిక” జాబితాలో భారత్‌ 105వ స్థానంలో నిలిచింది.  18 ఏండ్ల లోపు వయస్సు కలిగిన కడు పేదలు దాదాపు 584 మిలియన్లు, అనగా 27.9 శాతం ఉండగా, పెద్దలు 13.5 శాతం ఉన్నట్లు వర్ణించబడింది. భారత పేదల్లో 13.7 శాతం జనాభా పోషకాహారలోపంతో, 35.5 శాతం ఐదేళ్ల లోపు పిల్లలు వయసుకు తగిన ఎత్తు లేకపోవడం (స్టంటెడ్‌ గ్రోత్‌), 18.7 శాతం ఎత్తుకు తగిన తక్కువ బరువు లేక పోవడం (వేస్టింగ్‌), 2.9 శాతం పిల్లలు ఐదేళ్ల లోపు అకాల మరణాల బారిన పడడం గమనించారు. తరతరాలుగా పోషకాహార లోపాలు, ఆర్థిక అసమానతలు, అవిద్య, అనారోగ్యాలు, లింగ వివక్ష లాంటి కారణాలే పేదరికం రూపంలో భారతాన్ని పట్టి పీడిస్తున్నది. 

విపత్తు/ఘర్షణాత్మక/యుద్ధ ప్రాంత దేశాలు:

 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 2023లోనే యుద్ధాలు/ఘర్షనలు/వివాదాస్పద ఘటనలు అధికంగా నమోదు అయ్యాయని, వీటి పర్యవసానంగా 117 మిలియన్ల ప్రజలు ఖాళీ చేతులతో వలసలు వెళ్లినట్లు, ఆకలి చావుల అంచున దీన స్థితుల్లో బతుకులు ఈడుస్తున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్త 110 కోట్ల పేదల్లో దాదాపు 40 శాతం వరకు, అనగా 455 మిలియన్ల ప్రజలు ఈ ప్రాంతాలకు చెందిన వారే అని పేర్కొనబడింది. వీటిలో 218 మిలియన్ల ప్రజలు యుద్ధ ప్రాంతాల్లో, 335 మిలియన్ల ప్రజలు ఘర్షనాత్మక ప్రాంతాల్లో, 375 మిలియన్లు అశాంతియుత సమాజ ప్రాంతాల్లో ఉన్నారని వివరించబడింది. 2023 నాటికి ఇజ్రాయిల్‌ దాడితో పాలస్తీనా గాజా ప్రాంత ప్రజలు 83 శాతం వలసల బాట పట్టారని, 60 శాతం వరకు ఇండ్లు నేల మట్టం అయ్యాయని స్పష్టం చేసింది. 

పేదరికానికి కారణాలను అధ్యయనం చేయడం, ఆయా కారణాలకు తగిన పరిష్కారాలకు పథక రచనల అమలు చేయడం, జీవన ప్రమాణాలను పెంచడం, గ్రామీణులకు కనీస వసతులు పెంచడం, పోషకాహార భద్రత కల్పించడం, నిలువ నీడను ఏర్పాటు చేయడం, పరిసరాల పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం లాంటి చర్యలు ప్రపంచ పేదరికాన్ని, ముఖ్యంగా భారతదేశ పేదరికాన్ని అదుపు చేస్తాయని గమనించి ప్రభుత్వాలు/పౌర సమాజం/స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరుకుందాం. పేదరికం లేని ప్రపంచ కలలను సాకారం చేసుకుందాం. 

Show More
Back to top button