
అనాదిగా కోల్‌కతా నగరాన్ని ‘సిటీ ఆఫ్ జోయ్ లేదా ఆనంద నగరం’గా పిలుస్తున్నాం. గత రెండు నెలలకు పైగా అదే ఆనంద నగరం “ఆక్రందల నగరం”, “ఉద్యమాల నగరం” లేదా “ఊరేగింపుల నగరం”గా మారడం చూస్తున్నాం. 09 ఆగష్టు 2024న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 31 ఏళ్ళ పిజీ ట్రైనీ డాక్టర్ అమానవీయంగా రేప్ చేయబడి హత్యకు కూడా గురైన ఘటనతో భారత పౌర సమాజమంతా నిరసనల ఆగ్రహజ్వాలలతో అట్టుడికి పోయింది. ఈ కేసులో అనుమానితుడిగా 33 ఏండ్ల సివిల్ వర్కర్‌ను 10 ఆగష్టున అరెస్టు చేయడం కూడా జరిగింది.
రాష్ట్రమంతటా నిత్యం పెద్ద సంఖ్యలో మహిళలు నిరసనల ర్యాలీలు, న్యాయపోరాటాలతో నేటికీ ఆనంద నగరం ఆసాంతం నిరసనల నగరంగా మారి న్యాయం కోసం ఊరేగింపుల ఉద్యమాలతో వేడిక్కుతున్నది. ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సిబిఐకి అప్పగించడం, దర్యాప్తు ప్రారంభించడం కొనసాగుతోంది. న్యాయం కోసం నగరమంతా ఒకేసారి దీపాలు ఆర్పి వేయడం, నినాదాలు చేయడం, కవితాత్మకంగా తమ నిరసన గళాలు విప్పడం, మమతా బెనర్జీ నేతృత్వపు టియంసి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించడం లాంటి చారిత్రాత్మక ఉద్యమాల నెలవుగా నేడు కోల్‌కతా మారింది.
ఈ పోరాటం మమతా బెనర్జీ పాలనకు వ్యతిరేకంగా మారుతున్నదా !
నాటి నుంచి నేటి వరకు జూనియర్ డాక్టర్లు 10- డిమాండ్లతో నిరాహార దీక్షలు, దుర్గా పూజల్లో సహితం మహిళలు నిరసనలు తెలపడం, “జస్టిస్ ఫర్ ఆర్ జీ కర్” అంటూ నివేదించడం, సాధారణ ప్రజలు సహితం ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం అనునిత్యం జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ఉద్యమకారులు జాగ్రత్త పడుతున్నారు. బిజెపీ, లెఫ్ట్, కాంగ్రేస్ లాంటి ప్రతిపక్ష పార్టీలను ఆమడ దూరం పెడుతున్నారు. న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటం రానున్న రోజుల్లో మమత ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ కేసులో న్యాయం కావాలంటూ మమత బెనర్జీపై అపారమైన ఒత్తిడిని పెంచడం, ప్రజాభిమానం కలిగిన టియంసీ నేడు ఆత్మరక్షణలో పడడం చూస్తున్నాం.
నేడు సాధారణ పౌర సమాజం, ముఖ్యంగా మధ్య తరగతి మమతా బెనర్జీ అభిమాన జనం సహితం న్యాయం కావాలని ఊరేగింపుల్లో పాల్గొనడం, రాష్ట్రం స్కాములు/దోపిడీల నిలయంగా మారడం, వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి చెదలు పట్టడం, నిరుద్యోగం పెరగడం, ఉద్యోగాల ఎంపికల్లో మంత్రుల కనుసన్నల్లో అక్రమాలు చోటు చేసుకోవడం, పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు కేటాయించడం, పెట్టుబడులు పలుచబడడం, ఎన్నికల్లో హింసను ప్రోత్సహించడం, అభివృద్ధి కుంటుపడడం, ఆర్థికంగా రాష్ట్రం చితికి పోవడంతో రానున్న రోజుల్లో ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మమతా బెనర్జీకి ఈ కేసు పంటి కింద రాయి వలె మారడం, తన ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మారడం జరుగవచ్చు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల సపోర్టు కూడా పొందిన ఈ న్యాయ పోరాట ఉద్యమాల్లో ఆయా వర్గాలు నేరుగా నిరసనల్లో పాల్గొనడం లేదు. ప్రభుత్వ ఉచిత పథకాలు, జీవనోపాధులు పొందుతున్న పేదలు ఈ కేసులో ఉద్యమించే విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. నేడు బెంగాల్ ముస్లిమ్ ఓటు బ్యాంకు కూడా టిఎంసీ పాలనను క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించినప్పటికీ వారు మమతను విడిచి దూరం జరగడం అంత సులభమేమీ కాదని తెలుస్తున్నది.
సంకట స్థితిలో మమతా బెనర్జీ:
నేటి పశ్చిమ బెంగాల్ ఆర్ జీ కర్ కేసు పరిష్కారం మమతకు జీవన్మరణ సమస్యగా మారింది. తనకు వ్యతిరేకంగా తమ ఓటర్లు నిరసనలు పెంచితే దాని ప్రభావం రానున్న రోజుల్లో రాజకీయ సవాళుగా మారి ఎన్నికల్లో టిఎంసీకి ప్రాణ సంకటంగా కూడా మారే ప్రమాదం కూడా లేక పోలేదు. ఈ కేసులోను నీరుగార్చడానికి సాక్షాలు, రుజువులను రూపుమాపే లేదా తారుమారు చేసే ప్రయత్నాలు ప్రభుత్వం లేదా పోలీసు వర్గాలు చేస్తే భవిష్యత్తులో మమతకు చిక్కులు మరింతగా పెరిగే ప్రమాదం కూడా ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు.
నేడు మమత ముందున్న ఏకైక మార్గం ఆర్ జీ కర్ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నేరస్తులకు తగిన శిక్ష పడే విధంగా అడుగులు వేయడం తప్పనిసరి అవుతున్నది. రానున్న రోజుల్లో “జస్టిస్ ఫర్ ఆల్”, “జస్టిస్ ఫర్ ఆర్ జీ కర్” సత్వరమే లభిస్తుందని, దోషులను ఉరి తీస్తేనే ప్రజాగ్రహంపై నీళ్లు చల్లినట్లు అవుతుందని మమత భావించాలి, ప్రజలకు/మహిళలకు కనీస భద్రతను కల్పించి మనోధైర్యం పెంచాల్సిందిగా బెంగాలీ పౌర సమాజం కోరుకుంటున్నది.