Telugu News

ఆనిమేషన్‌ కళకు ప్రపంచ మానవాళి ఫిదా !

మనకు సుపరిచితమైన స్పైడర్‌ మాన్‌, మిక్కీ మౌస్‌, డొనాల్డ్ డక్‌, టామ్‌ అండ్‌ జెర్రీ, ఫిలిమ్‌ అవతార్‌, బాహుబలి సినిమా, పౌరాణిక గాథల ఆనిమేషన్‌ చిత్రాలు లాంటి పాత్రల ప్రభావం మన మనసుల్లో సుస్థిరంగా నాటుకున్నాయి. షార్ట్ వాణిజ్య ప్రకటనలతో మెుదలు పూర్తి నిడివిగల చలన చిత్రాల వరకు ఆనిమేషన్‌ కళకు సృజన జోడించి వినియోగించే స్థాయికి టెక్నాలజీ  చేరడం సంతోషదాయకం. సమాజ శ్రేయస్సు కోరే పలు అంశాలను ఆనిమేషన్‌ కళలో ప్రత్యేకతలుగా, సరళంగా, స్పష్టంగా, అర్థవంతంగా, ఆకర్షణీయంగా తక్కువ సమయంలో గొప్ప భావాలను వ్యక్తం చేయవచ్చు. 

ఇంటర్నేషనల్‌ ఆనిమేటెడ్‌ ఫిలిమ్‌ అసోసియేషన్‌ చొరవ:

28 అక్టోబర్‌ 1892లో తొలి సారి పారిస్‌లో ఆనిమేషన్‌ చిత్రం ప్రదర్శించడం జరిగింది. దీనికి గుర్తుగా ఆనిమేషన్‌ కళకు పెరిగిన అపార ఆదరణను దృష్టిలో ఉంచుకొని వాణిజ్య, చలనచిత్రరంగాల్లో దాని ప్రాముఖ్యతను వివరించే సదుద్దేశ్యంతో “ఇంటర్నేషనల్‌ ఆనిమేటెడ్‌ ఫిలిమ్‌ అసోసియేషన్”‌ నేతృత్వంలో 2002 నుండి ప్రతియేటా 28 అక్టోబర్‌ రోజున ‘అంతర్జాతీయ ఆనిమేషన్‌ దినోత్సవం(ఇంటర్నేషనల్‌ ఆనిమేషన్‌ డే)’ పాటించుట జరుగుచున్నది.

అంతర్జాతీయ ఆనిమేషన్‌ దినం-2024 థీమ్‌గా “ఓ ప్రత్యేకమైన కళ – అంటార్వినెట్‌ స్టార్‌కోవిజ్‌కు నివాళిగా” అనే అంశాన్ని తీసుకున్నారు. ఆనిమేషన్‌ కళకు సృజనను జోడించి నూతనత్వాన్ని ఆపాదించడం, ఆనిమేషన్‌ కళ వైపుకు యువతను ఆకర్షించడం, ఆనిమేషన్‌లో వినూత్న భావాలను జోడించడం, ఆనిమేషన్‌ ఆర్ట్ గూర్చి కార్యశాలలు నిర్వహించడం, ప్రఖ్యాత ఆనిమేషన్‌ ఫిలిమ్‌లను ప్రదర్శించడం, ఆనిమేషన్‌ కళ వెనుక దాగిన వైజ్ఞానికశాస్త్రాన్ని వివరించడం, ఆనిమేషన్‌ కళలో నిష్ణాతులను సన్మానించడం లాంటి అంశాలను చర్చించేందుకు అంతర్జాతీయ ఆనిమేషన్‌ దినోత్సవ వేదికలను వినియోగించుకుంటారు. 

బహుళ ప్రచారం పొందుతున్న కళ:

 ప్రపంచవ్యాప్తంగా ఆనిమేషన్‌ ప్రక్రియకు విద్య, వినోదం, వాణిజ్యం, మార్కెటింగ్‌, శాస్త్రీయ అవగాహన, సృజనశీల కళ, గేమింగ్‌, సిమ్యులేషన్‌, సినిమా, షార్ట్ ఫిల్మ్, మెడికల్, రిటైల్‌, ఆర్కిటెక్చర్‌, ఇంజనీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ లాంటి రంగాల్లో అనంతమైన అవకాశాలు, ప్రయోజనాలు ఉన్నాయి. నిజ జీవితాన్ని నకలు చేస్తూ బోమ్మల కదలికలతో చిత్రాలు తీయడాన్ని ఆనిమేషన్ నైపుణ్య‌ కళ అంటారు. వాస్తవికతకు ఊహను జోడించి అందరికీ అర్థం అయ్యేలా సరళ, వినోదాత్మక చిత్రాల ద్వారా సందేశాన్ని ఇవ్వడం ఆనిమేషన్‌ ప్రత్యేకత. స్వల్ప వ్యవధిలో అధిక ప్రభావం చూపగల సామర్థ్యం ఆనిమేషన్‌ కళకు ఉంటుంది.

ఆనిమేషన్‌లో సంప్రదాయ, 2డి, 3డి, మోషన్‌ గ్రాఫిక్స్, స్టాప్‌ మోషన్‌, కటౌట్‌ అండ్‌ కల్లాజ్‌, రోటోస్కోపింగ్‌, సెల్‌‌ ఆనిమేషన్‌ మెుదలగు రకాలు ఉన్నాయి. సాధారణ జనాలతో కాకుండా వ్యాపారవర్గాలలో కూడా ఆనిమేషన్‌ కళ ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది. డిజిటల్‌ విప్లవం, అంతర్జాల ప్రభంజనం నేపథ్యంలో ఆనిమేషన్‌ కళకు అపార ఆదరణ లభించింది. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, ముఖ్యంగా సినిమాలు, టివీల్లో ఆనిమేషన్‌ కళ ప్రవేశంతో ఆ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయు. 

ఆనిమేషన్‌ కళ ప్రయోజనాలు:

అన్ని వర్గాల, వయసుల ప్రజలను ఆనిమేషన్‌ కళ ఆకర్షిస్తున్నది. ఆనిమేషన్‌ వీడియోలతో సందేశాలను సులభంగా ఇవ్వడం, ఊహాత్మక పరిధికి అవధులు లేక పోవడంతో సృజనశీలత పెరగడం, వైద్యరంగంలో వినియోగపడడం, ఆకర్షనీయంగా ఉండడం, సులభంగా అవగాహనకు రావడం, వాణిజ్య ప్రకటనలతో ఆకర్షించడం, తేలికగా వేగంగా ప్రజలకు చేరడం, కంటికి ఇంపైన రంగుల చిత్రాలు తీయగలగడం లాంటి ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. 1906లో స్టువార్ట్ బ్లాక్టన్‌ మెుదటి ఆనిమేషన్‌ చిత్రం ‘హ్యూమరస్‌ ఫేజెస్‌ ఆఫ్‌ ఫన్నీ ఫేసెస్‌’ తీయడం జరిగింది. 1928లో వాల్ట్ డిస్నీ ‘స్టీంబోట్‌ విల్లి’ అనబడే ప్రథమ ఆనిమేటెడ్‌ కార్టూన్‌ ఫిల్మ్ తీయడం జరిగింది. 1937లో మెుదటి పూర్తి నిడివిగల ఆనిమేటెడ్‌ ‘స్నోవైట్‌’ అనే చలనచిత్రాన్ని వాల్ట్ డిస్నీ తీశారు. 1993లో 3డి ఆనిమేషన్‌ సాఫ్ట్ వేర్‌ అందుబాటులోకి వచ్చింది.

ఆధునిక డిజిటల్‌ యుగపు యువత ఆనిమేషన్‌ కళ పట్ల ఆసక్తిని పెంచుకొని, ఆ రంగాన్ని తమ వృత్తిగా ఎంచుకొని, మరింత సృజనను జోడించి ప్రపంచ మానవాళికి నవ్య ఆనిమేషన్‌ దృశ్య ‌రుచులను చూపుతారని ఆశిద్దాం. 

Show More
Back to top button