
పర్వావరణ పరిరక్షణ, వాతావరణ సకారాత్మక మార్పులు, పేదరిక నిర్మూలన, జీవవైవిధ్య సంరక్షణ, జీవ వ్యవస్థల నియంత్రణ లాంటి పలు ప్రయోజనాలకు పర్వతాలు ఎంతగానో సహకరిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన శాశ్వత, సుందర పర్వతాల పరిరక్షణ ప్రాధాన్యాన్ని అవగాహన పర్చడం, పర్వతాల పరిరక్షణ కారణాలను వివరించడం, సుస్థిరాభివృద్ధికి తోడ్పడడం లాంటి అంశాలను విస్తృతంగా చర్చించడానికి ప్రతి ఏట 11 డిసెంబర్‌న ఐరాస నేతృత్వంలో ప్రపంచ దేశాలు “అంతర్జాతీయ పర్వతాల దినం (ఇంటర్నేషనల్ మౌంటేయిన్ డే)” పాటించుట జరుగుతున్నది. ఈ వేదికను పర్వత విజ్ఞానశాస్త్ర వినియమయం, ఉత్తమ నియంత్రణ మార్గాల చర్చ, సమైక్యంగా పర్వతాల పరిరక్షణ యజ్ఞాలను కొనసాగించడం లాంటి ప్రధాన అంశాలను తీసుకోవడం కొనసాగుతున్నది. ఐరాస నిర్ణయం ప్రకారం 2002 ఏడాదిని “అంతర్జాతీయ పర్వతాల సంవత్సరం”గా పాటించడం, 2003 నుంచి ప్రతి ఏట 11 డిసెంబర్‌న “అంతర్జాతీయ పర్వతాల దినం”గా వేడుకలు జరుపుకోవడం కొనసాగుతున్నది.
అంతర్జాతీయ పర్వతాల దినం-2024 థీమ్:
అంతర్జాతీయ పర్వతాల దినం-2024 థీమ్‌గా “సుస్థిర భవిష్యత్తుకు పర్వతాల పరిష్కారాలు – ఆవిష్కరణ, అనుసరణ, యువత” అనబడే అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇన్నొవేషన్‌ను జోడిస్తూ పర్వతాల సంక్లిష్ట సమస్యలకు సమాధానాలు వెదకడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్వతాలను కాపాడుకోవటం, డిజిటల్ వేదికగా పర్వతాలను పర్యవేక్షణ చేయడం, సృజనశీల ఆలోచనలతో సమస్యలను పరిష్కరించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా నూతన వ్యవసాయ పద్దతులను పాటించడం, పర్వతాల పరిరక్షణ నిర్వహణతో పాటు నిధులు ఏర్పాటు చేయడం కొనసాగడం నేటి కనీస అవసరమని భావిస్తున్నాయి ఐరాస సభ్యదేశాలు.
పర్వతాల ప్రధాన ప్రయోజనాలు:
పర్వతాల పరిరక్షణతో సంబంధం ఉన్న వాతావరణ సానుకూల మార్పులు, లింగ సమానత్వ సాధన, సామాజిన న్యాయం, ఆవిష్కరణలు, సాంస్కృతిక వికాసం, ఔషధాల కొలువులు, శక్తి వనరుల కేంద్రాలు, సమ్మిళిత అభివృద్ధి, పని కల్పన, ఉద్యోగ ఉపాధుల కల్పన, జీవనోపాధికి మార్గాలు, సుజల నిధుల భండాగారాలు, వ్యవసాయ నెలవులు, గిరిజన జాతులకు అమ్మ ఒడి, నేల కోతను అరికట్టడం, హరిత క్షేత్రాలుగా నిలవడం, ఆహార పదార్థాల కేంద్రాలు, ఔత్సాహికులను ప్రోత్సహించడం లాంటి లక్ష్యాలను తీసుకొని ప్రపంచవ్యాప్త యువత సుస్థిరాభివృద్ధికి బాటలు వేయాలని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. పర్వత ప్రదేశాలు 15 శాతం ప్రపంచ జనాభాకు ఆవాసాలుగా నీడనిస్తూ, దాదాపు 50 శాతం జీవవైవిధ్య కేంద్రాలుగా మహోన్నత సేవలు చేస్తున్నాయి. మహోన్నత పర్వతాలు 311 మిలియన్ల ప్రపంచవ్యాప్త నిరు పేదల పుట్టినిళ్లు.
ప్రకృతి అంటేనే ఎత్తైన పర్వతాలు, జరజరా జారే జీవ నదులు, చల్లగా వచే శీతల పవనాలు, ధోరిణి మాత చుట్టిన అందమైన హరిత చీరలు అని మనకు తెలుసు. నేడు పర్యాటకం అనేక రెట్లు పెరగడంతో పర్వత ప్రాంతాలు తమ సహజత్వాన్ని కోల్పోతూ, కార్బన్ కాలుష్య కూపాలు, హరిత ప్రాంతాల క్షీణత, నేల నాణ్యత పడిపోవడం లాంటి అవాంఛనీయ మార్పులు చోటు చేసుకోవడం విచారకరం. పర్వతాలను కాపాడకపోవడం అంటే మన ఉజ్వల భవిష్యత్తుకు మనమే పునాదులు వేసుకోవడమని తెలుసుకొని సన్మార్గంగా నడుద్దాం, పర్వతాలను ప్రేమతో ఆలింగనం చేసుకుందాం.