
మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు (ఔదుంబర్) నీడలో కొలువై ఉంటాడు. మూడు శిరస్సులు, ఆరు చేతులు కలిగిన దత్తాత్రేయుడి భిక్షువు రూపం అహంకార నాశనానికి ప్రతీక. సదా ఆయనను వెన్నంటి ఉండే గోవు ధరణికి, శునకాలు వేదాలకు ప్రతీకగా భావిస్తారు. ధర్మస్వరూపుడై, జ్ఞానస్వరూపుడై, విష్ణు అంశగా జనించి..
సనాతన ధర్మంలో అవధూత సంప్రదాయానికి బాటలు పరిచింది ఈ దత్తుడే..
మహా యోగీశ్వరుడు, భక్తవత్సలుడు అయిన దత్తాత్రేయుడు లోకోపకారిగా జనుల హితం కోసం గురువుగా మారాడు. అటువంటి గురు దత్తా మార్గశిర పౌర్ణమి రోజున జన్మించిన కారణంగా ఈ రోజున హిందువులు పర్వదినంగా జరుపుకోవడం అనాతిగా వస్తోంది. ఈ నెల 14(శనివారం)న దత్త జయంతి సందర్బంగా ఆ దత్తాత్రేయుడి వృతాంతం గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం.
గొప్ప అవధూత వృత్తాంతం…
పూర్వం ఓ అత్రి మహాముని. సుపుత్రులు కావాలని తలచి, ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఫలితంగానే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుగ్రహించి ఆయన ముందుకు ప్రత్యక్షమవుతారు. అప్పుడు, వారు ఇలా పలుకుతారు .. ‘మా అంశతో నీకు ముగ్గురు పుత్రులు కలుగుతారు’ అని వరమిస్తారు. అన్నట్లుగానే అత్రి, అనసూయ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రాంశతో దుర్వాసుడు జన్మిస్తారు. అలా మహావిష్ణువు అంశతో జన్మించిన అవతారమూర్తే గురు దత్త/ దత్తాత్రేయుడు. చిన్ననాటి నుంచే దత్తుడు లోకోపకారి లీలలు ప్రదర్శించేవాడట.
అంతేకాక మునీశ్వరులకు అపూర్వమైన యోగవిద్యను ప్రసాదించాడు. స్వయానా తన తల్లికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. ఆ తర్వాత దత్తాత్రేయుడు భక్తుల రక్షణ కోసం సహ్యాద్రి గుహల్లో తపస్సును ఆచరించాడు.
ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ.. వేదాలను మరచిపోతే దత్తాత్రేయుడే బ్రహ్మదేవుడికి తిరిగి వేదదానం చేశాడని పురాణాల్లో ఉంది.
ఇంకో సందర్భంలో జంభాసురుడనే రాక్షసుడి నుంచి దేవతలను రక్షించాడు.
కార్తవీర్యార్జునుడనే అతడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వెయ్యి చేతులు, నిత్యయవ్వనం పొందేలా వరాన్ని పొందాడు. అదే విధంగా ప్రహ్లాదుడికి అజగరవ్రతధారి మునిరూపంలో సాక్షాత్కరించి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఇలా అనంత కరుణా సముద్రుడై భక్తులను ఎల్లవేళలా రక్షించే సనాతన శాశ్వత ఆనందమే శ్రీ దత్తాత్రేయ అవతారమని చెప్పకనే చెప్తున్నాడు.
గురు సంప్రదాయంలో దత్తాత్రేయుడిది ప్రత్యేక స్థానమని చెప్పుకోవాలి. దత్తోపాసన అనేది పాసనాల్లో అన్నిటికంటే తేలికైంది, వెంటనే ఫలితాన్ని ప్రసాదించేదనీ అర్థం.
కృతయుగంలో ప్రహ్లాదుడు, త్రేతాయుగంలో అలర్కుడు, ద్వాపరయుగంలో పరశురాముడు, కార్తవీర్యార్జునులు… ఇలా ఒక్కరేమిటి… ఎందరో దత్తుడ్ని ఆరాధించి, ఆయన నుంచి యోగవిద్యను, ఆధ్యాత్మిక విద్యను పొందినట్లు ప్రతీతి. భక్తుల పాలిట కామధేనువైన దత్తాత్రేయుడ్ని కేవలం స్మరిస్తే చాలు ప్రసన్నుడవుతాడని శాస్త్రవచనంలో రాసి ఉంది.
ఈరోజున ఏం చేస్తారు… ఈరోజున భక్తులు దత్త చరిత్ర, గుర చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేయడం వల్ల మేలు జరుగుతుంది. మూగజీవాలకు రొట్టెలు తినిపించడం, గురువులను పూజించడం వల్ల సత్ఫలితాలు పొందొచ్చని దత్త సంప్రదాయం చెబుతోంది.
పిఠాపురంలోనూ, గానుగాపురంలోనూ దత్త క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో ఈరోజున విశేష పూజలు జరుగుతాయి. కావున ఈరోజు స్వామిని నోరారా శ్రీగురుదత్త- జయగురుదత్త లేదా శ్రీ దత్త శరణం మమ.., ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈరోజునేకాక నిత్యం నిష్ఠగా తొమ్మిదిసార్లు 21 రోజుల పాటు దత్తస్తవాన్ని దీక్షగా పఠించి, తీపిపదార్థాలను నివేదించి, సాధు సన్యాసులకు భిక్ష పెట్టడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం.
దత్త సంప్రదాయం…
మన తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోనూ దత్త సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. దత్తాత్రేయుల అవతారం పరంపరగా కొనసాగటం విశేషం. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు.. ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఆవిర్భవించాడు. మనుషుల్లో పేరుకుపోయిన మనోమాలిన్యాలను, పూర్వపు పాపాలను, సంచిత కర్మలను తన స్మరణతోనే తొలగించి, ధన్యతను ప్రసాదించే పుణ్యమూర్తిగా శ్రీవల్లభుడు ప్రతీతి చెందాడు.
రెండో అవతారమైన శ్రీనరసింహ సరస్వతి…
ఆయన భక్తురాలైన అంబకి కుమారుడిగా జన్మిస్తానని శ్రీపాదులు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆవిర్భవించిన అవతారమే ఇది. దత్తాత్రేయుడి మూడో అవతారం మాణిక్య ప్రభువు… వీరి తల్లిదండ్రులు కల్యాణి నగరంలోని మనోహర నాయకుడు, బయాదేవిలు. దత్తుడి మరో రెండు అవతారాలు అక్కల్‌కోట మహారాజు, శిరిడీ సాయిబాబా. వీరి నుంచే దత్తావతారాలు అవధూత మార్గాన్ని అనుసరించటం మొదలైంది.
అవధూతకు జీవచరాలు, పంచభూతాలు.. ఇలా అన్ని గురువులే!
దత్తాత్రేయుడు తన ఆత్మనే గురువుగా భావించినప్పటికీ తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన 24 చరాచరాలను గురువులుగా భావించాడు. అవి-
1.భూమి, 2.జలం, 3.అగ్ని, 4.వాయువు, 5.ఆకాశం, 6.చంద్రుడు, 7.సూర్యుడు, 8.పావురం, 9.కొండచిలువ, 10.తేనెటీగ, 11.తేనెటీగల పెంపకందారుడు, 12.గద్ద, 13.సముద్రం, 14.చిమ్మట కీటకం, 15.ఏనుగు, 16.జింక, 17. చేప, 18.వేశ్య, 19.శిశువు, 20.కన్య, 21.సర్పం, 22.విలుకాడు, 23.సాలీడు, 24.గొంగళిపురుగు.
దత్తాత్రేయుడి ఆలయాలు:
దేశంలో అనేక ప్రాంతాల్లో దత్తాత్రేయుడి ఆలయాలున్నాయి. పిఠాపురం, శ్రీశైలం, వారణాసి, మాహుర్, నరసింహవాడి, గిరనార్, కారంజా ఔదుంబర్, గాణగాపూర్, కురువపురం మొదలైనవి ప్రముఖ దత్త క్షేత్రాలు. దత్తాత్రేయుడి ఆలయాల్లో వినిపించే ‘దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా’ మంత్రం భక్తుల హృదయాల్లో ప్రశాంతతను చేకూరుస్తుంది.
ఇతరాలు…
◆ దత్తాత్రేయులు.. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు వంటి గ్రంథాలు రచించాడు.
◆ దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది.. వాటిల్లో కొన్ని.. శ్రీపాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్, శ్రీ మాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్, శ్రీ కృష్ణ సరస్వతీ మహరాజ్, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది.
◆ మార్గశిర పౌర్ణమిని దత్తజయంతిగానే కాక నరక పౌర్ణమిగా కూడా భావిస్తారు. దీని వెనుక శాస్త్రీయ కారణం దాగివుంది. కార్తీక పౌర్ణమి మొదలుకొని మార్గశిర పౌర్ణమి వరకు ఉన్న 30 రోజులను యమదంష్ట్రలుగా పిలుస్తారు. దంష్ట్రలు అంటే కోరలు అని అర్థం. యముడు ఈ రోజుల్లో తన కోరలను చాచుకుని మన జీవితాలని హరించేందుకు ఎదురుచూస్తాడట. వాతావరణంలో నెలకొనే విపరీతమైన చలి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల మన శరీరాలలో కఫ, జీర్ణసంబంధమైన వ్యాధులు తలెత్తుతాయి.
ఇంతేకాక, చలికాలంలో మన రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపోటు తీవ్రతను పెంచుతాయి. కాబట్టి మార్గశిరపౌర్ణమి నాటితో ఈ యమదంష్ట్రలు అనేవి ముగిసిపోతాయి. దీంతో చలి స్థిరపడటంతో పాటు, దానికి మన శరీరం కూడా నిదానంగా అలవాటు పడుతుంది. యముడు తన కోరలను విరమించుకునే ఈ పుణ్యదినాన శాశ్వతమైన జ్ఞానాన్నీ ప్రసాదించే ఆ దత్తాత్రేయుల వారినీ మనం మనస్ఫూర్తిగా స్మరించుకుందాం.