Telugu News

వెలకట్టలేని మానసిక సంపద ఆనందమే !

ఆనందంగా జీవించడం ఓ అద్భుత కళ. మన అస్తిత్వానికి పునాది సంతోషమే. ఆనందం అంగట్లో దొరికే అగ్గువ సరుకు కాదు. ముఖంలో నవ్వు కీర్తిస్తే అసలైన ఆనందంగా ఉన్నట్లు కాదు, నవ్వని వారు విషాదంలో మునిగినట్లు కాదు. మానసిక సంతోషానికి, ముఖంలో కనిపించే నవ్వులకు సంబంధం లేదు. మానస్ఫూర్తిగా సంతోషించే వారి ముఖాల్లో కోటి దివ్వెల వెలుగులు జనిస్తాయి. అంతరంగ ఆనంద ఊట బాయిలో ఉబికే ఊటయే సంతోషాల మూట. మన అనుమతి లేకుండా మన నుంచి ఎవ్వరూ ఆనందాన్ని దూరం చేయలేరు.

ఆనందం అమూల్య ఆరోగ్యకర మానసిక ఆస్తి. ఆనందాల వేటలో కష్టసుఖాలను అనుభవిస్తూ సాగిపోతున్నాం, కొంత వరకు సఫలం అవుతున్నాం, అధిక శాతం వైఫల్యాలతో సంతోషాలకు దూరం అవుతున్నాం. ఆనందానికి సుఖానికి వ్యత్యాసం మరిచిపోతున్నాం. ఆనందానికి కొలమానం లేదు  ఆనందాన్ని చూడడానికి, వర్ణించడానికి వీలు కాదు. సంతోషాన్ని అనుభవించడమే మనకు తెలుసు, వర్ణించడానికి వాక్యాలు దొరకవు. పడుకోగానే మనసారా నిద్రలోకి జారుకునే వారు అదృష్టవంతులు, అసలైన భాగ్యవంతులు. 

* ఆనందాన్ని ప్రభావితం చేసే అంశాలు

మన జీవనశైలి, ఆర్థిక స్థితిగతులు, ఆలోచనా విధానం, వ్యక్తిగత అలవాట్లు, విద్య వివేకాలు, సంతృప్త ఆధ్యాత్మిక భావనలు, మానవీయ దృక్కోణం, సర్దుకుపోయే గుణం, ఆశావహ దృక్పథం, కుటుంబ నేపథ్యం, సహచర బంధుమిత్రులు, కార్యాలయ లేదా పని ప్రదేశ్ ప్రభావాలు, సామాజిక స్థితిగతులు, సాంస్కృతిక ఆచార వ్యవహారాలు, మానవ సంబంధాలు, భావోద్వేగ నియంత్రణలు, చిన్న చిన్న విషయాల్లో గొప్ప గొప్ప సంతోషాలను వెతుక్కోవడం, ఆహార అలవాట్లు, ఆశ-దురాశలు, ఈర్ష్య అసూయ లాంటి అనేక అంశాలు మన ఆనంద క్షణాలను ప్రభావితం చేస్తాయి. ఒక చిన్న సమస్య మన ఆనందాన్ని లాక్కోవచ్చు. ఒక చిన్న సమస్యను తలుస్తూ వందల సార్లు వగచి, తలచి కుమిలిపోయే వారికి ఆనందం అందని ద్రాక్ష అవుతుంది. మనం చేసే ప్రతి పనికి అంతిమ లక్ష్యం ఆనందం వెతుక్కోవడమే. మానవ ఆరాట పోరాటాల గమ్య స్థానం ఆనంద నిధిని పొందడం మాత్రమే. ఆనందానికి, శ్రేయస్సుకు విడదీయరాని బంధం ఉంటుంది. 

* 2025  అంతర్జాతీయ ఆనంద దినోత్సవం ఇతివృత్తం

నేటి వేగవంతమైన ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగపు మానవుడికి ఆనందం అందని వస్తువే అవుతున్నది. ఆనందమయ జీవితం గడిపే వారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆనందమే ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుసుకుందాం. సిరి సంపదలు, కీర్తి, పరువు ప్రతిష్టలు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. డబ్బుతో విలాసవంతంగా బతకవచ్చు, కాని ఆనందంగా జీవిస్తామనే గ్యారెంటీ లేదు. సంపద పెరిగితే సమస్యలు కూడా పెరుగుతూ మన ఆనంద క్షణాలు హరించుకుపోతాయి.

శారీరక సౌకర్యమే సుఖం, మానసిక ఉత్తమ స్థితి సంతోషం అని తెలుసుకోవాలి.  ఆనందంగా జీవించడం అనే అద్భుత కళను ప్రచారం చేయడానికి 2012లో ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రపంచ దేశాలు ప్రతి ఏట 20 మార్చిన “అంతర్జాతీయ ఆనంద దినోత్సవం లేదా ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హాపీనెస్‌”ను 2013 నుంచి పాటించుట ఆనవాయితీగా మారింది. 2025 అంతర్జాతీయ ఆనంద దినోత్సవం ఇతివృత్తం “షేరింగ్‌ అండ్‌ కేరింగ్‌” అని తెలుసుకొని, దానిని మన జీవన మంత్రంగా చేసుకొని సంతోషంగా జీవితాలను సుసంపన్నం చేసుకుందాం. 

మనం ఇష్టపడే పనిలో సంతోషం దాగి ఉంటుంది. మన పనిని ఇష్టపడడం వల్ల ఆనంద నిధికి చేరువవుతాం. సంతోషంగా జీవించగలగడం ఓ అదృష్టం. బ్రతకడానికి, జీవించడానికి వ్యత్యాసం ఆనందమే. ఆనందంగా లేని వారు బతుకుతారు, సంతోషంగా జీవనయానం చేసే  వారు జీవిస్తారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశం నుంచి మనం ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకోవాలి. ఆనందం ఎవరు ఇచ్చే వస్తువు కాదని, మనం ఆస్వాదించే జీవన విధానమే మనకు సంతోషాలను ఇస్తుంది. ఆనందంగా ఉండడం, సంతోషాలను పంచడం మన జీవిత లక్ష్యం కావాలి. మరొకరి సంతోషానికి మనం కారణం అయినప్పుడు మనకు అద్భుత ఆనంద నిధి దొరుకుతుంది. “బి హ్యాపీ – మేక్‌ అదర్స్‌ హ్యాపీ” అనే సూత్రాన్ని అమలు చేస్తే మన వెంట ఆనంద సుగంధాలు వస్తాయి.

Show More
Back to top button