Telugu Special Stories

ధర్మబద్ధ పాలనే. శ్రీ ‘రామ’రాజ్యం!

తండ్రి మాటను.. జవదాటని పుత్రుడు… తల్లి కోసం.. రాజ్యాన్నే వదులుకున్న త్యాగశీలుడు…

ధర్మం కోసం.. రావణుడితో పోరాడిన యోధుడు… ప్రజల సంక్షేమానికి విలువనిచ్చిన పాలకుడు… 

పితృవాక్య పరిపాలనకు.. ధర్మాచరణకు.. సత్య దక్షతకు.. ఏకపత్నివ్రత నిష్టకు… 

మారుపేరుగా నిలిచిన శ్రీరాముడు… సర్వలోకాలకు ఆదర్శప్రాయమే!

రాముడి హృదయం, వ్యక్తిత్వం.. అంతా దైవత్వం, ప్రేమ, దాతృత్వం, వినయం, కర్తవ్య భావంతో నిండి ఉంది. అందుకే రాముడ్ని దేవునిగా కొలుస్తున్నాం. 

తండ్రి ఏం చెప్పినా.. గౌరవం, ప్రేమతో పాటించాడు. ఆయన గౌరవ మర్యాదలను నిలబెట్టేందుకు తన సౌకర్యాలన్నీ వదిలి అడవులకు వెళ్లిన గొప్ప తనయుడు.. 

సవతి తల్లి.. రాముడి మీద ఏ కాస్త ప్రేమ చూపించకపోయినా, తన సొంత బిడ్డకు అనుకూలంగా ప్రవర్తించినా.. ఆమెను ఎప్పటికీ సొంత తల్లిలాగే చూశాడు. ఆమె కోరికలను సైతం గౌరవించాడు. 

భార్యను రక్షించుకునేందుకు గొప్ప పోరాటం చేశాడు. ఆమె రక్షణ, స్వేచ్ఛ కోసం రావణుడితో యుద్ధాన్ని జయించాడు.  

ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన మహారాజు రాముడు. సొంత సుఖాలు, ఆనందం, అవసరాల కంటే రాజ్య సంరక్షణే ముఖ్యమని చాటాడు. 

ఇలా కొడుకుగా, భర్తగా, పాలకుడిగా.. ప్రతి పాత్రలో నిదర్శనంగా నిలిచాడు.

అప్పటినుంచి ఇప్పటివరకు రాముడిలాంటి రాజు పుట్టలేదు. కాబట్టే ఇప్పటికీ రామరాజ్యమే గొప్పదని చెప్తుంటారు.

రామవంశానికి సూర్యుడు మూల పురుషుడు. అందుకే వాళ్ల వంశాన్ని రఘుకులం, రఘువంశం అంటారు. ‘రఘు’ అంటే సూర్యుడు అని అర్థం…  రాముడ్ని రఘునాథ, రఘుపతి, రాఘవేంద్ర పేర్లతో సైతం పిలుస్తారు. అందుకే కొన్నిచోట్ల రామనవమి రోజున రాముడి కంటే ముందుగా సూర్యుడికి పూజలు చేస్తారు. 

అయోధ్య ప్రజలు, వారి క్షేమమే తనకు ముఖ్యమనుకున్న ఆదర్శరాజు రాముడు. అందుకే అరణ్యవాసం తర్వాత ఓ అనామకుడు లేవనెత్తిన సందేహాన్ని అనుసరించి కట్టుకున్న భార్యను అగ్ని పరీక్షకు పంపించాడు. ప్రజల మాటకు విలువనిచ్చాడే గానీ ఆ లోకాభిరాముడు ఏనాడూ సాద్వీమణి సీతాదేవిని శంకించలేదు. 

నీతి తప్పని ధర్మబద్ధపాలన అందించడమే రామ రాజ్యమనుకున్నాడు రాముడు. ప్రజలందరికీ సమాన న్యాయం, గౌరవం అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు. 

నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు.

రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు వాటిని కాపాడేందుకు మనకు మార్గాలు చూపిస్తుంది. మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్నదానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడే ప్రతీక. అలాగే సాద్వీమణి సీతమ్మ కూడా ఆడవారికి అసలు మార్గదర్శి. రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెప్తుంది. దైవిక శక్తులతో దుష్టసంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడు. 

దైర్యసాహసాలు, సహనశీలత, దయార్ధగుణం, పితృవాక్యపాలన, ధర్మనిరపేక్షత… ఇలా చెప్పకుంటూపోతే చాలా గుణాలు కలగలిసిన.. సకల గుణాభిరాముడు.. ఆదర్శమూర్తి.. అయిన

మన శ్రీరామచంద్రమూర్తి..

పుణ్యం కొద్దీ పురుషులు అన్నట్టు.. 

ఆయన జన్మ సార్ధకాన్ని ప్రజల్లో చాటిన పావనమూర్తి.

అందరి మేలు కోరే బంధువుగా.. భద్రాచల రాముడయ్యడు.

కోర్కెలు తీర్చే కోదండరామయ్యగా..

పురుషోత్తమరాముడిగా.. వైకుంఠరాముడిగా.. రఘురాముడిగా… చతుర్భుజరాముడిగా.. 

భద్రగిరి నారాయణుడుగా.. ఇలా ఎన్నో రకాలుగా కొలిచే.. రామ చరితను ఈ పర్వదినాన(శ్రీరామనవమి – ఏప్రిల్ 6న) వినడం, రామనామాన్ని జపించడం పుణ్యకార్యంతో సమానం.. 

అట్టి శ్రీరామచంద్రమూర్తి అవతరించిన పర్వదినాన మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

Show More
Back to top button