
గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఎర్రమల పర్వత శ్రేణిని గండికోట కొండలు అని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్యలో ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300కు మించదు. ఇక్కడ లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. చుట్టూ దట్టమైన అడవులు మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలతో 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో కోట లోపల బలమైన సహజ సిద్ధమైన రక్షణ కవచం ఈ కోట వల్ల ఏర్పడింది.
వృత్తాకారంలో ఉండే ఈ కోట చుట్టుకొలత దాదాపు 5 మైళ్ళు ఉంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు, అలాగే ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులు ఉన్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నపు నిషానపురాలతో నిర్మించబడి ఉంటుంది. కోటపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుంచి 13 మీటర్ల ఎత్తులో ఉంటాయి. చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంలో 40 బురుజులు ఉన్నాయి. గోడ పైభాగాన సైనికుల సంచారం కోసం ఐదు మీటర్ల వెడల్పుతో ఒక బాట ఉంటుంది. కోట కింది భాగంలో మాధవరాయ, రంగనాధాయ ఆలయాలు ఉన్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అయినప్పటికీ అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా, జామా మసీదులను ఈ కోట వద్ద సుందరంగా నిర్మించారు. ఈ కోటలో పెద్ద ధాన్యాగారం, మందు గుండు సామాగ్రిని భద్రపరచుకునే ప్రదేశాలు ఉన్నాయి.
మావురాల గోపురంతో పాటు ఇక్కడ జైలు, రంగ మహల్ కూడా ఉన్నాయి. నీటి వసతుల కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా అనేక చెరువులు, బావులు ఉన్నాయి. గతంలో భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడ ప్రత్యేకత. గతంలో ఈ కోటలో సుందరమైన ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు కోటలో ఉండేవి. బ్రహ్మ సాని నాయకులు గండికోటను జన రంజకంగా పాలించినట్టు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి చిహ్నాలుగా నిలిచాయి. గండికోట భారత ద్వీప కల్పంలోని ఒక ప్రముఖమైన గిరిదుర్గం. దీని చరిత్ర 13వ శతాబ్దం యొక్క రెండవ అర్థ భాగంలో మొదలవుతుంది.
గండికోట కైఫీయత్ లో పశ్చిమ చాళుక్య రాజైన అహో మల్ల సోమేశ్వరచే మలికినాట సేవక సంరక్షణగా నియమించబడిన కాక రాజు ఒక 1044, శుభకృత నామ సంవత్సర, మాఘ శుద్ధ దశమినాడు ఈ కోట కట్టించారని చరిత్ర చెబుతోంది. ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలు లేవు. త్రిపురాంతకం వద్ద గల 1212 నాటి ఒక శాసనం ప్రకారం అంబ దేవా అనే ఒక నాయకుడు తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె వద్ద గల 1236 కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు చుట్టేయలంక కొంక రెడ్డిని గండికోటను పాలించడానికి నియమించాడని తెలుస్తోంది. ఈ గండికోట విజయనగర సామ్రాజ్య కాలంలో ఉదయగిరి మండలంలోని ఒక సేవకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో గండికోటను బ్రహ్మ సాని నాయకులు తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు విజయనగర రాజులు సామంతులుగా పాలించారు.
అనంతరం విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు 17వ శతాబ్దంలో అబ్దుల్లా కుతుబ్షా సేనాని మీర్ జూమ్లా తిమ్మనాయుడికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగం చేయించి ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడు. వీరి పాలనలో గ్రామాలను మూడు విధాలుగా విభజించారు. బండారు వాడ, అమరా, మాన్య విభాగాలుగా విభజించారు. ఇందులో బండార వాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాల, బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. ఇక అమర గ్రామాలు అమరులైన కోట చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. అందమైన లోయలు ఎటు చూసినా అబ్బురపరిచే కొండల దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. కోటలో రాజులు, రాజవంశాల పరక్రమానికి నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దమని చెప్పవచ్చు. గండికోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకొస్తాయి. జమ్మలమడుగు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున వెలసిన గండికోట ప్రాంతాన్ని గిరిదుర్గం అని పిలిచేవారు. క్రీస్తుశకం 1123లో మొదటి సోమేశ్వర మహారాజుకు సామంత రాజుగా ఉన్న కాకరాజు నిర్మించినట్టు గండికోట కైఫియత్ తెలుపుతోంది.
ఈ కోట పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలు ఉన్నాయి. పడమర, ఉత్తర దిక్కులో పెన్నానది ప్రవహిస్తోంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 350 వెడల్పుతో పెన్నా నది కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక్కడున్న జుమ్మా మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. మసీదు ప్రాకారం చుట్టూ లోపల 24 గదులు, బయట 32 గదులు ఉండి ఎంతో ఆకర్షిస్తాయి. గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణి పై 14 నుంచి 49 ఉత్తర అక్షాంశం ,79 నుంచి 17 తూర్పు రేఖాంశాలు మధ్య ఉంది.
పెన్నా నది ప్రవాహం ఇక్కడ రెండు కొండల మధ్యలో గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. రెండు, మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండలు గుండా పెన్నా నది ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవున ఈ గండి ఏర్పడింది. నదికి దక్షిణ తీరాన ఉవ్వెత్తున ఎగిసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలు ఉన్నాయి. అయితే ఈ పరిసరాలలో చూడదగిన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి.
రంగనాథ ఆలయం
ఈ ఆలయం గురించి మొట్టమొదటి ప్రస్తావన 1479 అంటే క్రీస్తుశకం 1557 నాటి ఒక శాసనంలో కనిపిస్తోంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుల గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం నూటికి నూరుపాళ్ళు విజయనగర రాజుల నిర్మాణమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.
మాధవరాయ ఆలయం
మాధవరాయ ఆలయం మొట్టమొదటి ప్రస్తావన క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందినదిగా శాసనాలలో కనిపిస్తోంది. ఆలయంలో మనకు కనిపించే శిల్పకళా లక్షణాలు, ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూసిన ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణాన్ని శిల్పకళారీతులను వాటి లక్షణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 16వ శతాబ్దం తొలినాళ్లలో అంటే దాదాపు 1500, 1524 సంవత్సర మధ్యకాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. మీకు ఈ గండికోట అందాలను చూడాలనిపిస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం. కోట దృశ్యాలను చూసి మైమరచిపోండి. ఈ కోటను చూడడానికి అనేక ప్రదేశాల నుండి పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల నడుమ గండి కోట అందాలు మహా అద్భుతం అని చెప్పవచ్చు.