
దేశంలో పసిడి ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా.. 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు రూ. లక్ష రీచ్ లో ఉంది. ఈ ధరల ప్రభావం, భారం నేరుగా మధ్యతరగతి ప్రజలపై పడింది. సాధారణంగా అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా దేశీయంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అధిక ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ కొనుగోళ్లకు కాస్త దూరంగానే ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దుకాణాలకు కొనుగోలుదారులు వస్తున్నా, కొనుగోళ్లలో భారీగా క్షీణత తప్పదని అంచనా వేసుకుంటున్నారు.
గతేడాది డిసెంబరు నుంచి చూస్తే.. 10 గ్రాముల పసిడి ధర ఇప్పటివరకు దాదాపు రూ. 22,650 (29%)కు పెరిగింది. భారత మహిళల వద్ద దాదాపు 24,000 టన్నుల పసిడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) అంచనా వేస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఆభరణాల రూపంలో ఉన్న పసిడి నిల్వల్లో మన దేశ వాటా 11 శాతంగా ఉంది.
ఇకపోతే ఈ ఏడాది అక్షయ తృతీయకు (ఈ నెల 30) తేలికపాటి ఆభరణాలు, ఇతర వస్తువులకే గిరాకీ పరిమితం అవుతుండొచ్చని విక్రేతలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిడిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. పెట్టుబడికి, అత్యవసరాల్లో ఆదుకునే ఆర్ధిక వనరుగా పరిగణించి.. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs), డిజిటల్ గోల్డ్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం:
గోల్డ్ ఈటీఎఫ్..
గోల్డ్ ETF (Exchange Traded Fund) అనేది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అయ్యే ఒక రకమైన ఫండ్. ఇది ముఖ్యంగా బంగారం (Gold) ధరను బేస్ చేసుకొని ఉంటుంది.
ఒకవేళ మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లో గనుక పెట్టుబడి పెడితే, అసలు బంగారం బదులు దాని వాల్యూ ఆధారంగా ట్రేడింగ్ చేసే యూనిట్లను కొనుగోలు చేసినట్లవుతుంది.
*1 గోల్డ్ ETF యూనిట్ అనేది 1 గ్రాము బంగారం విలువకు సమానం.
*మీరు స్టాక్ మార్కెట్ ఖాతా అయిన Demat Account ద్వారానే వీటిని సులువుగా కొనుగోలు చేయవచ్చు.
ప్రయోజనాలు:
సెక్యూరిటీ సమస్య ఉండదు.. ఫిజికల్ గోల్డ్ (బంగారు ఆభరణాలు లేదా బార్‌లు) విషయంలో తలెత్తే సమస్యలు ఉండవు. మీ పెట్టుబడులు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చబడి ఉంటాయి.
తక్కువ ఖర్చు.. బంగారాన్ని భద్రపరచడం లేదంటే దాన్ని మెయింటెనెన్స్ చేసేందుకు అయ్యే అదనపు చార్జీలు వీటి విషయంలో ఉండవు. ట్రాన్సాక్షన్ ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి.
సౌలభ్యం/ సులువుగా అమ్మేయొచ్చు.. మీకు అవసరమైనప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఈటీఎఫ్‌లను తక్షణమే అమ్మి, డబ్బుగా మార్చుకోవచ్చు.
*గోల్డ్ ఈటీఎఫ్ ధరలు అనేవి బంగారం అంతర్జాతీయ మార్కెట్ వద్ద ఉన్న ధరను అనుసరిస్తాయి. కాబట్టి ఫ్రాడ్ థింగ్స్ కి ఛాన్స్ తక్కువ.
పన్ను ప్రయోజనాలు..
దీర్ఘకాలిక పెట్టుబడిగా అంటే 3 సంవత్సరాలకు మించి లేదా లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (with indexation benefits) వర్తిస్తుంది.
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్.. ఇతర స్టాక్స్ లేదా బాండ్‌లతో పాటు గోల్డ్ ఈటీఎఫ్‌లను కలిపి పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు.
ద్రవ్యోల్బణం నుంచి సేఫ్ అవ్వొచ్చు..
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం విలువ పెరగడం వల్ల, గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబడికి మంచి సెక్యూరిటీని అందిస్తాయి.
*ప్రస్తుత మార్కెట్ లో వీటి స్థితిగతులు, ప్రాఫిట్ లను అంచనా వేసుకొని, ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది.