
ఈ రోజుల్లో అక్షయ తృతీయని కేవలం బంగారం కొనుగోలు చేసేందుకు ఉపయుక్తంగా ఉండే ఓ మంచి రోజుగానే భావిస్తున్నాం. కానీ దీని వెనుక అసలు ఆంతర్యం తెలుసుకోలేకపోతున్నాం.
అసలుకైతే అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ఆరంభమైందట. అందువల్ల ఇది ఒక రకంగా ఉగాదిగా పిలవొచ్చు.
విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు జన్మించింది ఈరోజునేనట.
వైశాఖ మాసంలోని రోహిణి నక్షత్రంనాడు కృష్ణుని సోదరుడైన బలరాముడు జన్మించాడని దక్షిణాదివారి నమ్మకం.
కృష్ణుని చిన్ననాటి చెలికాడైన కుచేలుడు.. గుప్పెడు అటుకులు తీసుకుని అక్షయ తృతీయ రోజునే ద్వారకకు చేరుకున్నాడట.
ఈ రోజున ఎవరైతే కృష్ణుడ్ని ప్రార్థిస్తారో, వారిని కూడా ఆ పరమాత్ముడు కుచేలుని పట్ల చూపిన అనుగ్రహాన్నే ప్రసాదిస్తాడని నమ్మకం.
వేదవ్యాసుడు భారతాన్ని చెబుతుండగా గణేశుడు రాసిన విషయం తెలిసిందే! ఆ ఘట్టం అక్షయ తృతీయ రోజునే మొదలవ్వడం విశేషం! అలా వ్యాసుడు, గణేశుడు ఇద్దరూ కూడా ఈ రోజున మనకి పూజనీయులే!
జైనుల తీర్థంకరుడైన రిషభనాథుడు ఈ రోజునే తన ఉపవాసాన్ని విరమించాడట. ఆ కారణంగా జైనులు కూడా అక్షయ తృతీయను ఘనంగా నిర్వహించుకుంటారు.
లక్ష్మీదేవి కుబేరుడిని సకల సంపదలతో అనుగ్రహించిన రోజు కూడా ఈనాడే.. అందువల్లే అక్షయ తృతీయ రోజున సంపదలను కొనుగోలు చేసే సంప్రదాయం మొదలై ఉంటుందనీ ప్రతీతి.
మన హిందూ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒకోసారి ఆ కారణాన్ని మర్చిపోయి, ఆచరణకే ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాల్సిందే అన్న స్థాయిలో మన ఆలోచన ధోరణి మారిపోయింది. నిజానికి బంగారానికీ, అక్షయ తృతీయకీ సంబంధం ఏంటా అని అడిగితే..
అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ రాసి లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని,
ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితం అక్షయంగా లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు.
ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ దప్పిక కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.
అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది.
జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం… ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మత గ్రంథాలు పేర్కొంటున్నాయి.
ఈరోజున వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని నమ్ముతారు.
అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి, ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే… మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే అప్పుచేసో, తప్పుచేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అదే రీతిన అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.
అక్షయం అంటే క్షయం లేనిది. జీవితంలో అన్నిటినీ అక్షయం చేసేదని అర్థం.. ఈరోజున బంగారం, స్థలం, పొలాలు వంటి విలువైన వాటిని కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. కానీ ఈసారి ఏప్రిల్ నెలలో బంగారం ధర లక్షకు చేరడంతో.. అక్షయ తృతీయ కు బంగారం కొనుగోళ్లు తగ్గొచ్చు.
అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)… సోమవారం లేదంటే బుధవారం వస్తే మరింత శుభసూచకంగా భావిస్తారు. ఈరోజున చేసే దానాలు అక్షయ ఫలాలను ఇస్తాయని పెద్దలు చెబుతుంటారు. దానాలే కాదు, దేవతలు, పితృ దేవతల గురుంచి చేసే పూజలు కూడా అక్షయ ఫలాన్నీ ఇస్తాయని విశ్వాసం. ఈరోజున చేసే ప్రతి చిన్న సహాయం, పుణ్యకార్యాల ఫలం.. అక్షయంగా పెరుగుతూపోతుందట. అందువల్లే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది.
పురాణాల ప్రకారం చూసుకున్నా, సంపద, శ్రేయస్సులనందించే లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా ఈరోజునే.. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, ఈరోజున బంగారం కొనడం ఒక మార్గంగా చెబుతారు. అంతేకాక పసిడి.. అనేక సంస్కృతులలో సంపద, హోదాకు చిహ్నంగా భావించడం.. అందులోనూ ఈరోజునే కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, విజయం ప్రాప్తిస్తుందని నమ్మడం వల్లే, ఏటా ఈరోజున బంగారం కొనుగోలు చేయడమనే ఆచారం ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగని తాహతుకు మించి బంగారం, వెండి వస్తువులను కొనడంవల్ల ఉపయోగం లేదు.