
పరశు.. అంటే గండ్రగొడ్డలి. మహేశ్వరుడు ప్రసాదించిన ఆ పరశుతో దుష్టసంహారం చేసేవాడు. అందుకే ఆయన పరశురాముడయ్యాడు. శివకేశవుల శక్తి కలయికతో ఆవతరించిన రూపమే ఈ పరశురాముడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరశురామ అవతారం ఆరోది కాగా విష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియను ‘పరశురామ జయంతి'(ఏప్రిల్ 30న) గా పిలుస్తారు.
క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు.. పరిష్కారం కోసం ‘పరశురామ స్తుతి’ మండలకాలంపాటు పారాయణ చేసినట్లైతే అద్భుత ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
భృగు వంశానికి చెందినవాడు.. పరశురాముడు అందువల్ల ఈయనకు భార్గవ రాముడు అనే పేరుతో కూడా పిలుస్తారు. తండ్రి జమదగ్ని, తల్లి రేణుక. ఈమె క్షత్రియ కాంత. ఒకనాడు పరశురాముడు చిన్నతనంలో.. భృగువు ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ ఇతడి ముత్తాత హిమాలయాలకు వెళ్లి, శివుడి కోసం తపస్సు చేయమని చెప్తాడు. ఆయన చెప్పినట్లుగానే అక్కడికి వెళ్లి, శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అనంతరం శివుడు ప్రత్యక్షమై.. ‘నీవు ఇంకా చిన్నవాడివి, రౌద్రాస్త్రాలు ధరించేంత శక్తి సామర్థ్యాలు నీకు ఇంకా కలగలేదు. కొంతకాలం తీర్థయాత్రలు సాగించి, తిరిగి రావాల్సింది’గా బదులు చెప్తాడు.
అలా యాత్రలు చేసిన తరువాత తిరిగి తపస్సు చేస్తాడు పరశురాముడు. అయితే ఒకపక్క రాక్షస బాధలు ఎక్కువైన ఇంద్రాది దేవతలు శివుని వద్దకు వచ్చి శరణు వేడుకుంటారు. అప్పుడు శివుడు, రాముని పిలిచి పరశువు అనే గండ్రగొడ్డలిని ఆయుధంగా ఇచ్చి, దేవతల మీదకు పంపాడు. ఆ ప్రకారమే ఆయన పరశురాముడయ్యాడు. ఆపై స్వర్గలోకంలో రాక్షసులు లేకుండా చేశాడు.
ఆ తర్వాత పరశురాముడు తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఒకనాడు తల్లి రేణుక, నీటి కోసం ఏటికి వెళ్తుంది. అక్కడ చిత్రరథుడనే గంధర్వరాజు కుమారుడు తన భార్యతో జలవిహారం చేస్తాడు. అది చూసిన రేణుక.. తనకావకాశం లేకుండా పోయిందని మనసులో అనుకుంటుంది. అదే చింతతో ఆశ్రమానికి తిరిగి వస్తుంది. ఆలస్యానికి కారణాన్ని గమనించిన ముని… రేణుకను కళంకితగా భావించి, తనను చంపవల్సిందిగా జమదగ్ని కొడుకులను ఆదేశిస్తాడు. ముగ్గురు కొడుకులు ఆ పని చేసేందుకు ఒప్పుకోరు. నాలుగో కుమారుడైన పరశురాముడు.. వెంటనే ఆమెను ఖండిస్తాడు. ఇది మెచ్చి, తండ్రి ఏదైనా వరం కోరుకోమని అంటాడు. బదులుగా మాతృభిక్ష పెట్టమని వేడుకుంటాడు. దీంతో రేణుక తిరిగి బతుకుతుంది.
ఇక ఈయన తరువాతి అవతారం రామావతారం… కాలంలో, నామంలో ఇద్దరు సారూప్యం పోలి ఉన్నారు. రామాయణంలో పరశురాముడు తొలిసారి సీతా స్వయంవరంలో కనిపిస్తాడు. శివధనుస్సు విరిచినందుకు పరశురాముడు కోపించి, శ్రీరాముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. తుదకు తన మరో అవతారమే ఆ రామచంద్రుడని తెలుసుకుని మహేంద్రగిరిపై తపస్సుకు వెళ్లిపోయాడు. అయితే శివధనస్సు విరిచిన శ్రీరాముడుని ఎదురించినందుకు పరశురాముడు భంగపడతాడు. ఆఖరికి ఆజన్మ క్షత్రియ కులహంతకుడైన పరశురాముడు.. క్షత్రియుడైన రాముని చేతిలో ఓడిపోతాడు. విచిత్రంగా.. ఇద్దరు విష్ణువు అవతరాలే..
పురాణాల ప్రకారం పరశురాముడు విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి పలు విద్యలు నేర్పాడు. సాక్షాత్తూ శ్రీ కృష్ణభగవానుడు ధర్మరాజుకు పరశురాముడి సాహసాల్ని గుర్తుచేశారు. గంగాదేవి అభ్యర్ధన మేరకు భార్గవరాముడు భీష్మునికి అస్త్రవిద్యలు బోధించాడు. కర్ణుడు కూడా శిష్యునిగా చేరాడు. ద్రోణాచార్యుడు ఈ భార్గవరాముడి నుంచి దివ్యాస్త్రాలను గ్రహించాడు.
అశ్వత్థామ, బలి చక్రవర్తి,వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు తదితరులతో పాటు పరశురాముణ్ణి సప్తచిరంజీవుల్లో ఒకనిగా పేర్కొన్నాయి.
అలాంటిది శ్రీకృషుడు, శ్రీరాముని జయంతిలకున్న విశిష్టత పరశురాముడి జయంతికి లేదు. వారిలానే ఈయన విష్ణువు అవతారం.. కాబట్టి అదే విధంగా జరపవలసిందిగా శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. మన దగ్గర ప్రచారంలో లేదు కానీ మధుర, వారణాసిలో మాత్రం ఈయన జయంతి ఘనంగా నిర్వహిస్తుంటారు. కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, గోవా రాష్ట్రాల్లో పరశురాముడికి ఆలయాలు ఉండటం విశేషం!