
హిందూ సాంప్రదాయంలో నెలలవారిగా, తిథుల వారీగా వచ్చే పండుగలు.. పర్వదినాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అలానే పౌర్ణమి తిథి తెలుగువారికి చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే పౌర్ణమినాటి నక్షత్రం ఆధారంగానే మనం నెలలను ఏర్పరుచుకున్నాం. వాటికనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయ, సంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమినాటి చంద్రుడు నిండుగా, ప్రకాశవంతంగా ఉంటాడు. కావున మన మనసు మీద చంద్రుడి ప్రభావం ఆరోజు గణనీయంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటిది నేడు (మే 12న) వైశాఖ పౌర్ణమి.. ఇది మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికీ లేనన్ని ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి. అవేంటో చూద్దాం:
వైశాఖ పౌర్ణమిని బుద్ధజయంతిగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు బుద్ధునికి మహా ప్రీతికరమైన రోజు. ఆయన జననం నుంచి బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం వరకు మూడూ క్రతువులు కూడా ఈ పౌర్ణమినాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకలజీవులకు ఈరోజు పరమపవిత్రమైన రోజు.
ఒక సంవత్సరంలో వచ్చే నాలుగు పూర్ణిమలు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనవి. అవి మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. అందులో ఈ నెల 12న వచ్చిన వైశాఖ పౌర్ణమి విష్ణుభక్తులకూ పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించిందని ప్రతీతి. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మథించే సమయంలో, కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతాన్ని పూజించేందుకు ఆలయాలు మన దగ్గర చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండటం విశేషం. శ్రీకాకుళానికి సమీపంలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడి పదిహేను వందల సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉండటం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణుభక్తులైన ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించాడు.
వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునేనట. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతార రూపం.. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరచి, శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు ప్రత్యేకంగా అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభరూపం మనకు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమైనది.
తెలుగు సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి ముఖ్యమైనది. ఈ రోజును మహావైశాఖిగానూ పిలుస్తారు. ఈరోజున వీలైతే సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ కాలంలో దధ్యోజనం (పెరుగన్నం), గొడుగు, ఉదకుంభం (నీటితో నిండిన కుండ) లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు.
వృక్షాలను దేవతా స్వరూపంగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో భాగం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ సమయంలో పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు భక్తిపూర్వకమైన మనసుతో, సద్బుద్ధితో ఆచరించే పూజ మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెల్లవారుజామునే నిద్ర లేచి తలారా స్నానం చేసి, రావి చెట్టుకు నీళ్లు పోసి, చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే రావి చెట్టులో నివసించే ముక్కోటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంతసించి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అంతేకాదు ఈరోజున రావి చెట్టును పూజిస్తే పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారని శాస్త్రం చెబుతోంది.
సాధారణంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు మొదలు పెట్టే ముందు రావి చెట్టును తప్పక పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత శుభకార్యాలు ప్రారంభిస్తే అట్టి కార్యాలలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయని విశ్వాసం.