
వేడి వేడి కాఫీ గొంతులోకి జారుతుంటే అబ్బా.. ఆ మజానే వేరు కదా. అందుకే చాలా మంది డైలీ రొటీన్‌ను కాఫీతో ప్రారంభిస్తారు. అయితే, కొద్దిమంది ఖాళీ కడుపుతో తాగేస్తుంటారు. అయితే, ఇలా తాగితే నష్టమే తప్ప లాభాం లేదని మీకు తెలుసా? ముఖ్యంగా పరగడుపున కాఫీ తాగేవారి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అసలు కాఫీ తాగడం ఎందుకు అంత ప్రమాదమో ఇప్పుడు చూద్దాం.
మొదటిగా..
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు దీనివల్ల దీర్ఘకాలికంగా కొనసాగే.. అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దంతాలను కూడా దెబ్బతీసి దంత క్షయానికి కూడా కారణం కావచ్చు.
రెండవది..
సాధారణంగా మన శరీరంలో కార్టిసాల్ స్థాయి అనేది ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది, ఈ టైంలో కాఫీ తాగడం వల్ల శరీరంలో జరిగే సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా కాఫీలోని కెఫెన్ కార్టిసాల్ స్థాయిలను పెంచడం వల్ల మన శరీరంలో కార్టిసాల్ స్థాయులు పెరిగి అధిక బరువు, మొటిమలు, అధిక రక్తపోటు, కండరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే కాఫీని ఎప్పుడు తాగితే మంచిది?
నిద్రలేచిన తర్వాత 1.5 నుంచి 2 గంటల మధ్యలో కాఫీ తాగడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో కార్టిసాల్ సాధారణ స్థాయికి వస్తుంది. ఒకవేళ లేచిన వెంటనే తాగాలనిపిస్తే… ఏదో ఒక చిరితిండి తిని తాగితే మంచిది.