
బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా బోన్ చేస్తూ..ఆడి చూడు క్రికెటు టెండుల్కర్ అయ్యేటట్టు అంటూ.. మన చదువుల గురించి ఇరవై ఐదు ఏళ్ల క్రితమే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇలాంటి పాటలు రాశారు (అంటే సచిన్ పది ఫెయిల్ అయినా గొప్పవాడు అయ్యిండు. చదువుకు సంపాదనకు సంబంధం లేదు అని దాని అర్థం). అసలు చదువుకున్న వారి కంటే చాకలి వాళ్లే మేలు అని మన తాత ముత్తాల నుంచి ఈ నానుడిని మనం వింటూనే ఉన్నాం. ఇది అక్షరాల చదువుకున్న..చదువుకుంటున్న..చదువుకోబోతున్న ఈ జనరేషన్ విద్యార్థులకు..నిరుద్యోగులకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే పీహెచ్‌డీలు పూర్తి చేసి ఫ్యూన్ పోస్టులకు పోటీపడుతుంటే నా దేశంలో చదువుకు ఉన్న విలువ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. అసలు చదువుకున్న చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండటం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో ఎవరో రాసిన చెదలు పట్టిన పనికిరాని థియరీలను కుదిరితే అర్థం చేసుకుంటున్నాం.. కుదరకపోతే బట్టీ పట్టి పరీక్షలు రాస్తున్నాం అంతే.
అంతా Empty Mind
అసలు వాటి వల్ల ఇసుమంత అయినా ఉపయోగం లేదని చదువులు చెప్తున్న లెక్చర్స్‌కు తెలుసూ. అయినా సరే వారి జీతం కోసం వాళ్ల ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తీరా ఎంతో కష్టపడి కాలేజీ ఫీజులు కట్టి ల్యాబ్‌లు, సెమిస్టర్లు, మిడ్ ఎక్జామ్లు రాసి డిగ్రీ పట్టాతో బయటికి వస్తే తరువాత ఏం చేయాలో తెలియక..నాలుగేళ్లు చదివిన చదువు ఉపయోగపడకా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఒక్క ముక్క ఇంగ్లీష్ రాక..ఛీ..దీనమ్మ జీవితం నాలుగేళ్ల చదివినా కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా నేర్చుకోలేదు. కాదు కాదు వాళ్ల నేర్పలేదు. ఎంతసేపు చెదలు పట్టిన సెమ్ ఎక్జామ్లు, అర్థం కాని ల్యాబ్‌లు, అవసరంలేని రికార్డులు రాసిస్తు కాలం గడిపేసి కాలేజీ నుంచి పట్టా పుచ్చుకోని బయటికి వస్తే నాలుగేళ్ల క్రితం ఎలా ఉన్నాయో..ఆ తరువాత కూడా అంతే ఉన్నాం. అంతా Empty Mind.
ఇంటికాడ తల్లిదండ్రులు ఓ మావోడు సిటీలో చదువుతుండు..ఇరకదీస్తుండు వాడు గొప్పవాడు అవుతాడు అని తెగ సంబరపడిపోతుంటారు మన అమాయకపు తల్లిదండ్రులు. పాపం వాళ్లకి ఏం తెలుసు ఇవన్నీ కూడు పెట్టని చదువులు అని. వాళ్లు చదువుకోలేదు కాబట్టి చదువు విలువ తెలియకపోయినా.. చదివితే నీడపట్టున ఉండి ఏదో ఒక కొలువు చేసుకుంటాడు సుఖంగా ఉంటాడని అని వాళ్ల గట్టి నమ్మకం. దీని కోసం వాళ్లు కాయా కష్టం చేసి అవసరమైనవి అన్నీ అడకుండానే ఇస్తున్నారు. కానీ మన చదువులే అనవసంరంగా మిగిలిపోతున్నాయి.
చెదలు పట్టిన చదువు.. ఉపాధి లేక బతుకు బరువు
అసలు మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టం చాలా దరిద్రంగా ఉంది. మనం ఎప్పుడో రాసిన థియరీలను చదువుకుంటున్నాం. పరీక్షలు రాస్తున్నాం పేరుకి పాస్ అయ్యి పట్టాలు తీసుకుంటున్నాం అంతే. అసలు అప్ డేట్ వర్షన్ లేదు. అందుకే మనం ఏవైనా కొత్త కొత్త ఇన్ వెన్షన్లు చేయలేకపోతున్నాం. మన కంటే ముందే అమెరికా వాడో…జపాన్ వాడో..చైనా వాడో కొత్తవి కనిపెట్టేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ముందు వరుసల్లో ఉంటున్నారు. విద్యా, ఉద్యోగం, వైద్య రంగంలో వారిదే పై చేయి అవుతుంది. అంత ఎందుకు మనం ఎంబీబీఎస్ చేయాలన్నా..ఎంఎస్ చదవాలన్న ఫారన్ వెళ్తున్నాం. అంటే దీని అర్థం మన చదువులు బాగుండవనే కదా. ఎందుకంటే వాళ్లు ఎడ్యుకేషన్ ఎప్పటికి అప్పుడు స్మార్ట్ ఫోన్ లాగా అప్ డేట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ అంటే గుర్తు వచ్చింది.. మన దేశంలో పీఎం నుండి పచారి కొట్టువాడి వరకు ఇతర దేశాల్లో తయారైన ఫోన్లే వాడుతున్నాం.
ఎందుకంటే వాళ్లవి స్మార్ట్ చదువులు. అందుకే మనం ఇప్పటి వరకు కూడా ఇండియా నుంచి ఒక గొప్ప బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ తయారు చేయలేకపోయం..పోతున్నాం. వాళ్లు డబ్బా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎలాంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయో..వాళ్ల ఎడ్యూకేషన్ కూడా అలాగే అప్ డేట్ అవుతుంది. కానీ మనం ఇంకా డబ్బా ఫోన్ మాదిరి సిలబస్ చదువులే చదువుతున్నాం. డిగ్రీ పట్టా తీసుకోని మార్కెట్లోకి అడుగుపెడితే పో..పో నువ్వు ఇంకా చాలా అప్ డేట్ అవ్వాలి నీ డబ్బా చదువులకు ఇక్కడ ఎప్పుడో కాలం చెల్లింది అని గేటు బయట నుంచే గెంటేస్తున్నారు. చెదలు పట్టిన చదువులతో నేటి పోటీ ప్రపంచంలో పోటీపడలేక చదివిన చదువు ఉపయోగపడగా సరైన సమయంలో ఉద్యోగం రాక..వచ్చినా చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా బతుకులను కొంత మంది భారంగా గడిపేస్తుంటే..మరి కొంత మంది అర్థాంతరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి అంతటికి కారణం మన దేశంలో అప్ డేట్ లేని విద్యే.
మార్కులు తక్కువ వస్తే ఉద్యోగానికి పనికి రామా
మన దేశంలో నియామక ప్రక్రియ గురించి మాట్లాడుకోవాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అభ్యర్థిని మొదట అడిగేది 10వ తరగతి మార్కులు ఎన్ని అని.అంటే పది, ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులు వస్తే చాలా. వారి ఎలాంటి నైపుణ్యాలు అవసరం లేదా. మంచి మార్కులు వస్తే ఉద్యోగాలకు సెట్ అవుతారా.? అంటే కాదు అనే చెప్పాలి. స్కూల్, కాలేజీల్లో మంచి పర్సెంటేజ్ సాధించిన చాలా మంది గ్రాడ్యూయేట్లు ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు. మంచి నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు కూడా మార్కులు తక్కువ వచ్చాని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కంపెనీలు అభ్యర్థి మార్కులపై అస్సలు దృష్టి పెట్టకూడదు. ఒక కంపెనీ వారిని తిరస్కరించడానికి మార్కులు కారణం కాకూడదు.
కంపెనీలో అభ్యర్థి ఎలా రాణిస్తాడనేది మార్కులు ఎలా నిర్ణయిస్తాయి?.కంపెనీలు ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులను కనుగొనడంపై దృష్టి పెట్టాలి. కొన్ని ఐటీ కంపెనీలు 90% మందిని మార్కుల ఆధారంగానే ఫిల్టర్ చేస్తున్నారు.
10వ తరగతిలో 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన వారు మాత్రమే ఉద్యోగానికి అర్హులు. అంటే అంతకన్నా తక్కువ స్కోర్ చేసిన వారు నిరక్షరాస్యులుగా లెక్క కడుతున్నారు. ఇలాంటి ధోరణి మారాలి. అప్పుడే మార్కులతో సంబంధం లేకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ఉద్యోగాలు ఇస్తే కంపెనీలకు కూడా మంచి ఫలితాలు వస్తాయి.
మార్కులు, ర్యాంకుల కోసమే చదవాలా..?
ఎక్కడైన మనం చదువుకున్న చదువు మనకు ఉపాధి కల్పించేలా ఉండాలి. అంతే కాని ఆ చదువు మనకు భారం కాకూడదు. అసలు జీవితంలో ఎందుకు చదువుకున్నానో అని బాధపడే విధంగా ఉండకూడదు.కానీ ఇప్పుడు మన దేశంలో అమలు చేస్తున్న విద్య కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే అన్నట్లు ఉంది. అవి దేనికి పనిరాక.. ఉపాధి కల్పించపోవడంతో నేటి యువత ఈ బోడి చదవులు వేస్టు అని అనుకుంటున్నారు.ఇకా ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే.. ఎంత మంచి ర్యాంకు వస్తే అంత గొప్ప అన్నట్లు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు. అటు టీచర్లు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల వాళ్లు మానసికంగా కుంగిపోయి. వాళ్లకు నచ్చింది చదవలేక.. పేరెంట్స్ చెప్పింది చదవలేక సరైన మార్కులు రాక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి అంతటికి కారణం మార్కులు, ర్యాంకులు. అవి వస్తేనే గొప్ప లేకపోతే అసలు చదువులే వేస్ట్ అన్నట్లు తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. అంత ఎందుకు తమ కుమారుడూ, కుమార్తె ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. వారిని తీవ్రంగా అవమానిస్తున్నారు. దీంతో వాళ్లు ఎవరికి చెప్పకుండా బలవంతంగా తమ ఊపిరి తీసుకుంటున్నారు.
వృతి విద్యా కోర్సులు కావాలి
ఎంత సేపు మార్కులు,ర్యాంకులే కాదు వాటితో పాటు వృతి విద్యా కోర్సులు కూడా ప్రవేశ పెట్టాలి. వాటిని కచ్చితంగా నేర్పించాలి. చదువు అయిపోయాక ఉద్యోగం రాకపోయిన వృతి విద్యా కోర్సుల వల్ల ఎలాగైన బతుకుతా అనే భరోసా ప్రతి విద్యార్థుల్లో రావాలి. వారే సొంతంగా స్టార్టప్స్ పెట్టి ఉద్యోగాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలి. అంతే కాని చదువు కోవాలి అది అయిపోయిన తరువాత ఎవరో ఉద్యోగాల కోసం చెప్పలు ఆగిగేలా తిరిగాలి. ఉద్యోగం రాక తల్లిదండ్రులకు భారంగా మారి..తమ చదువులు ఉపాధి కల్పించడం లేదనే భావన కలిగించకుండా ఉండాలంటే ఈ కోర్సులు ప్రవేశ పెట్టాలి. అప్పుడే ఉపాధి దోరుకుతుంది.నిరుద్యోగం తగ్గుతుంది. ఇవన్నీ జరగాలంటే మన దేశ ఎడ్యుకేషన్ సిస్టంను సమూలంగా మార్చాలి. చెదలు పట్టిన చదువులకు స్వస్తి పలకాలి. కాలానికి అనుగుణంగా ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టాలి. అవి నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఇష్టమైన కోర్సులు, నచ్చిన చదువులు చదవనివ్వాలి. అప్పుడే వాళ్లు అనుకున్న రంగంలో అద్భుతంగా రాణిస్తారు.
ప్రభుత్వ వారి కోసం ప్రత్యేక చట్టం తేవాలి
మన దేశంలో కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలు ఉచిత విద్య గురించి ఎక్కడ లేని గొప్పలు చెప్తున్నారు. కానీ నిజంగా అవి మంచి ఫలితాలే ఇస్తున్నాయ అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే పేరుకే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, సాంఘీక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. కానీ అవి నిజానికి ఎంత వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయే వాటిల్లో చేరే వారి సంఖ్యను భట్టి చూస్తే అర్ధం అవుతుంది. అక్కడ వస్తున్న రిజల్ట్ ని చూస్తే ఎంత దారుణంగా చదువులు చెప్తున్నారో స్పష్టం తెలుస్తుంది. అందుకే చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేవారు, కూలికి పోయేవారు కూడా తమ లాగా తమ పిల్లలు కష్ట పడకూడదని అప్పు అయిన సరే తమ స్థోమతకు మించి ప్రైవేట్ స్కూల్, కాలేజీల్లో అధిక ఫీజులు కట్టి చదివిస్తున్నారు. దీనికి అంతటికి కారణం ప్రభుత్వ మెరుగైన విద్య అందించక పోవడమే. అక్కడే మెరుగైన విద్య అందితే పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఆర్థిక భారం తగ్గుతుంది.
ఇంకా కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా కాదు. ఇలా కాకుండా ఉండాలన్నా.. మంచి విద్య విద్యార్థులకు అందాలంటే ప్రభుత్వాలు ఒక చట్టం తీసుకురావాలి. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువు చెప్తున్న ఉపాధ్యాయుల పిల్లల్ని కచ్చితంగా ఇక్కడే చదివించాలని ఒక చట్టం తేవాలి. అప్పుడే ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య నాణ్యంగా ఉంటుంది. వాస్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నర్సులు, డాక్టర్లు ఏ ఒక్కరు కూడా స్కూల్స్, హాస్పటల్స్ లో చదువు, వైద్యం చేయించుకోరు. ఎందుకంటే అక్కడ సరైన సౌకర్యాలు, వసతులు ఉండవని, అక్కడ చదువుకుంటే చదువు రాదని, వైద్యం చేయించుకుంటే నయం కాదని వారికి గట్టి నమ్మకం. నిజం ఇక్కడ నాణ్యమైన విద్య, వైద్యం అందుతుందని వారే ప్రచారం చేస్తారు కాని వాళ్లు, వారి పిల్లల్ని మాత్రం అక్కడ చేర్చించరు. మరి వాళ్లు చెప్పి, చేసే వైద్యం మీద వారికే నమ్మకం లేకపోతే.. ఇతరులు ఎందుకు చేరుతారు. అందుకే ఆ చట్టం తెస్తే అన్నీ సెట్ అవుతాయి.