Telugu News

వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ భారత్‌పై ప్రభావం ఏ మేరకు?

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇప్పుడు భారతీయులకు పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే ఇది అమెరికా సెనేట్ ఆమోదం పొందింది. ఈ బిల్ అమల్లోకి వస్తే, దాని ప్రభావం మనదేశంపై ఎలా ఉంటుంది? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. అయితే నిపుణుల ప్రకారం ఈ బిల్లు వల్ల పరోక్షంగా ప్రభావం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా రెమిటెన్స్ పన్ను, వలస నిబంధనల కఠినత, రూపాయి విలువపై ప్రభావం, భారతీయ ఐటీ నిపుణులకు అవకాశాల తగ్గుదల అన్నీ కలిపి మరింత తీవ్రమవుతాయని నిపుణుల అంచనా.

రెమిటెన్స్ పై పన్ను భారంగా మారేలా

ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. భారతీయులు అమెరికా నుంచి ఇండియాకు పంపే డబ్బుపై ఒక శాతం పన్ను వేయాలని ఇందులో ప్రతిపాదించారు. ప్రస్తుతం అమెరికా నుంచి ఇండియాకు ఏడాదికి దాదాపు ముప్పై రెండు బిలియన్ డాలర్లు వస్తుంటే, ఇది లక్షల మంది కుటుంబాల ఆదాయానికి ఆధారం. ఒక్క శాతం పన్నే అయినా అది కోట్లల్లో భారంగా మారుతుంది. ఇది కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల మధ్యతరగతి జీవనానికి దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

విదేశీ నిల్వలు, రూపాయి విలువపై ప్రభావం

ఈ రెమిటెన్స్ డబ్బే మన విదేశీ మారక నిల్వల్లో పెద్ద శాతం. ఇప్పుడు అందులో 10 నుంచి 15 శాతం తగ్గితే విదేశీ నిల్వలు పడిపోతాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద ఉంటుందన్నది నిపుణుల హెచ్చరిక.

వీసా ఆంక్షలు భారతీయులకు ఝలక్

ఈ బిల్లులో H1B, L1, J1 వీసాల మీద కఠినమైన నియమాలు, సోషల్ మీడియా స్క్రీనింగ్ వంటి కొత్త నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం H1B వీసాల 70 శాతం వరకు భారతీయులే పొందుతున్నారు. ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల వారికే కాదు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులకూ ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఉన్నత విద్య కోరికలు వెనకడుగు వేయవచ్చు.

అమెరికా మార్కెట్ మీద ఆధారపడే కంపెనీలకు దెబ్బ

బిల్ ద్వారా అమెరికా తయారీ రంగానికి మద్దతుగా పన్ను రాయితీలు ఇవ్వబోతున్నారు. దాంతో అక్కడి కంపెనీలు స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తాయి. భారతదేశం నుంచి వచ్చే ఐటీ సేవలు, ఔషధాలు, వస్త్రాలు ఇలా అనేక రంగాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అమెరికన్ క్లయింట్లపై ఆధారపడే భారత ఐటీ కంపెనీలు ఈ ప్రభావాన్ని తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది.

Show More
Back to top button