
కష్టాలు, కన్నీళ్లు, వెట్టిచాకిరి, అవమానాలే ఆ మట్టి మనుషులను తట్టిలేపాయి.
ఆలోచనలే అణచివేసే పునాదులయ్యాయి.. వారి పనిముట్లే ఆయుధాలయ్యాయి.. బాంచన్ దొర నీ కాళ్ళు మొక్కుతా..
అన్న గొంతులే భూస్వాములు, పటేళ్లు, దొరల అరాచాకలపై ఎదురుతిరిగి గర్జించాయి.
సాయుధ పోరాటమే కేంద్రంగా అనేక మహిళా దళాలు సైతం ఏర్పడ్డాయి. ఈ పోరాటం మహనీయులు చేసింది కాదు. మట్టి మనుషులు చేసింది!! నిజాం సర్కార్‌ను నేలమట్టం చేసిన చరిత్ర వారి సొంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన ప్రతిఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.
మన దేశంలో వలసవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు స్వాతంత్రోద్యమ పోరాటం కొనసాగింది. ఇలా ప్రపంచ చరిత్రలో చూసుకుంటే అనేక ఉద్యమాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అలాగే 19వ శతాబ్దంలో ఆధిపత్యానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన ‘తెలంగాణ సాయుధ పోరాటం’ మిగతా పోరాటాల కన్నా భిన్నమైంది.
నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో ఆయా ప్రాంతాలను ఆక్రమించుకోవాలనుకున్న మిలటరీ పాలనకు వ్యతిరేకంగా 4000 మంది కార్యకర్తలు అమరులయ్యారు. ఈ కోవలో అమరుడై, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్నిచ్చి ప్రజలందరికీ స్పూర్తినిచ్చినవారే మన.. ‘దొడ్డి కొమురయ్య’.
ఒకవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమ పోరాటం కొనసాగుతుంటే, మరొకవైపు తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందడానికి నిజాం ఆంధ్ర మహాసభ భిన్న రూపాల్లో ప్రజా ఉద్యమాలను లేవనెత్తింది. ఆ క్రమంలోనే జనగామ బేతవోలు రైతాంగ పోరాటాలు సాగాయి.
1944 భువనగిరి ఆంధ్ర మహాసభ ఏర్పాటు, తెలంగాణ ప్రాంతం అంతా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో గుండెలు మండి గ్రామాల్లో ప్రజలు ఒడిసెల, గుప్తలు మహిళలు కారంపొడి సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ సంఘం అండతో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దు కోసం ఉద్యమాలు చేపట్టారు. పన్నులు ఇక కట్టేది లేదని తిరుగుబాటు చేశారు. ఇది చూసిన దొరలు ఉద్యమాన్ని అణచడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ విఫలమయ్యారు. కడవెండి గ్రామస్తులైన దొడ్డి కొమురయ్య, అన్న దొడ్డి మల్లయ్య గ్రామంలో గొల్ల, కురుమల నాయకుడు కాగా దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వద్దని గొర్ల కాపరులను చైతన్యపరిచారు. దొడ్డి మల్లయ్యతో పాటు అదే గ్రామానికి చెందిన తదితరులు అప్పుడున్న సంఘంలో చేరి గ్రామనాయకులయ్యారు.
దొరసాని ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి నిరసన ప్రదర్శన చేయాలని ఆ సంఘం నిర్ణయించింది. ఇది మింగుడుపడని జానమ్మ దొరసాని వీళ్లను ఎలాగైనా హతమార్చాలని పన్నాగం పన్నింది. 1946 జులై 4న సంఘం పిలుపు అందుకొని కడవెండి గ్రామంలో ప్రజలు అంతా ప్రదర్శన చేశారు. అప్పటికి దొరసానికి అండగా వచ్చిన విసునూరు రామచంద్రారెడ్డి రౌడీలు కోడూరు దొర నరసింహారెడ్డి నాయకత్వం గడి నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దొడ్డి కొమురయ్య కుప్పకూలి వీరమరణం పొందాడు. అతడి అన్న మల్లయ్యకు కూడా తుపాకీ గుళ్ళు తగిలాయి. కొమురయ్య బలిదానానికి స్పందించిన వేలాదిమంది ప్రజానీకం.. నిందితుల మీద కేసు పెట్టించగలిగింది. అనంతరం కదిలిన ఆ ప్రజాశక్తి మహత్తర పోరాట రూపాన్ని సంతరించుకొని ధర్మారం, మొండ్రాయి, పాలకుర్తి ప్రాంతాలకు విస్తరించగలిగింది.
కొమురయ్య బలిదానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసింది. దొరల అరాచకాలకు వ్యతిరేకంగా ఆయుధం పట్టక తప్పదని కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ సాయుధ పోరాటం నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాలకు దేశ్‌ముఖ్‌లు ఉంటూ ప్రజలను రాచి రంపాన పెట్టిన దొరలను, వారి ఆధిపత్యాన్ని కూలదోశారు. ఈ పోరాటంలో 4000 నుంచి 5000 మంది అమరులయ్యారు.
నిజాం సర్కార్ పాలనను అంతమొందించడానికి తెలంగాణ పల్లెలన్నీ అగ్ని గుండాలై 1946 నుంచి 1951 వరకు వీరోచితమైన పోరాటం చేశారు.
దున్నేవానికి భూమి దక్కాలనే డిమాండ్‌తో లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచడంతో పాటు, నిజాం నిరంకుశ పాలన అంతమొందడంతో వెట్టి చాకిరి నుంచి విముక్తి పొంది, వేలాది గ్రామాలు గ్రామ స్వరాజ్యలయ్యాయి.
సాయుధ పోరాట విరమణ అనంతరం..
దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ఇంకా కొనసాగుతూ…
సీమాంధ్రలో అది ముల్కీ రూపంలోనూ, అనంతరం 1969-70లో ప్రారంభమైన నక్సల్బరీ ఉద్యమ రూపంలో వెలిగింది. ఆ త్యాగాల వెలుగులోనే దేశం మొత్తానికి అవసరమైన భూ సంస్కరణ, భూ పరిమితి చట్టాలు ఏర్పాటయ్యాయి.
అలాగే సీమాంధ్ర పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1969 ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ సమాజానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి దారిదీపమై నిలిచింది.
ఆ క్రమంలోనే సూర్యాపేట, భువనగిరి, వరంగల్ డిక్లరేషన్లు తెలంగాణ సమాజం రూపొందించుకొని ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమబాట పట్టింది. ఈ స్ఫూర్తితో ప్రజలు అనేక సందర్భాలలో పాలకవర్గాలను ధిక్కరించి అనేక హక్కులను సాధించుకున్నారు. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఆదివాసి భూ పంపిణీ చట్టాలు, 2013 భూసేకరణ చట్టం, కౌలుదారీ చట్టాలు ఉన్నాయి.