Telugu News

వైసీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామంటారా? ముందు మీరే గెలవాలి కదా..!” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రజలను భయపెట్టి పాలించిందని, అభివృద్ధి కన్నా రౌడీయిజానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు.

జల్ జీవన్ మిషన్‌ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అదే పథకాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. తొలి విడతలో రూ.1,290 కోట్లతో ప్రకాశం జిల్లాలో అతి పెద్ద తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. ఇది దాదాపు 10 లక్షల మందికి మంచినీటిని అందించనుందని వివరించారు. కేంద్ర మంత్రి పాటిల్‌ను కలిసి రూ.84 వేల కోట్ల అవసరాన్ని వివరించినట్లు చెప్పారు.

ఇక ఆలయ భూముల విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “ఆలయ భూములు దోచుకోవాలనుకుంటే అంతే సంగతి” అంటూ హెచ్చరించారు. వైసీపీ హయాంలో ఖాళీ భూములన్ని ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. ఈ భూములను తిరిగి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఆలయ భూములకు రక్షణ కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణను తానే స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారు.

Show More
Back to top button