
ప్రైవేట్ ఉద్యోగులు, పీఎఫ్ చందాదారులకు కేంద్రం మంచి శుభవార్త చెప్పింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆటో సెటిల్మెంట్ ద్వారా విత్‌డ్రా చేసుకునే పరిమితి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచారు.
ఈ నిర్ణయం అత్యవసర ఖర్చులకు సేవింగ్ డబ్బును త్వరగా పొందడానికి తోడ్పడుతుంది. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ మార్పు వల్ల దేశవ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల మందికి మేలు జరుగుతుందని తెలిపారు. EPFO ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్‌లో అమలు చేస్తుంది. దీంతో సభ్యులకు డబ్బు తక్కువ సమయంలోనే వారి ఖాతాల్లో జమ అవుతుంది.
కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఈ ఆటో సెటిల్మెంట్ విధానం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి త్వరగా నగదు అందించేందుకు రూపొందించబడింది. ప్రారంభంలో కేవలం వైద్య అవసరాలకు వర్తించిన ఈ విధానం, తర్వాత విద్య, వివాహం, ఇల్లు నిర్మాణం వంటి అవసరాలకు విస్తరించబడింది.
ఈ విధానం ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇంటి నిర్మాణం వంటి తక్షణ అవసరాలకు ఇది చాలా ఉపయుక్తంగా మారుతుంది.
ఎటువంటి అవసరాలకు విత్‌డ్రా చేయవచ్చు?
వైద్య ఖర్చులు: వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం EPF నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం అవసరం.
వివాహ ఖర్చులు: పిల్లలు లేదా తోబుట్టువుల పెళ్లి కోసం పీఎఫ్ నుంచి డబ్బును ఉపసంహరించవచ్చు. దీనికి ముందు మీరు కనీసం ఏడు సంవత్సరాలు పీఎఫ్ కాంట్రిబ్యూట్ చేసి ఉండాలి. మొత్తం బ్యాలెన్స్‌లో 50% వరకు విత్‌డ్రా చేయవచ్చు. డిక్లరేషన్ ఆన్లైన్లో సమర్పించాలి.
ఇల్లు కొనుగోలు లేదా మరమ్మతులు: కొత్త ఇల్లు కొనుగోలు, నిర్మాణం లేదా ఉన్న ఇంటికి మరమ్మతులు చేసేందుకు కూడా పీఎఫ్ నుండి డబ్బు తీసుకోవచ్చు. దీనికోసం కనీసం ఐదేళ్లు EPFలో సభ్యత్వం ఉండాలి.
EPFO ఆటో క్లెయిమ్ ఎలా అప్లై చేయాలి?
మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) యాక్టివ్‌గా ఉండాలి.
ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి KYC వివరాలు EPFO పోర్టల్‌లో అప్‌డేట్ చేసి ఉండాలి.
EPFO వెబ్సైట్‌కి వెళ్లి, UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
Online Services సెక్షన్‌లో “Claim” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
మీ ఆధార్, బ్యాంక్ వివరాలు ధృవీకరించాలి.
ఫారం-31 ద్వారా క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు ఉంటే అప్లోడ్ చేయాలి.
క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు SMS ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది.
Track Claim Status లో మీ క్లెయిమ్ ప్రాసెస్‌ను చూడవచ్చు.
అర్హత ఉన్నవారికి డబ్బు 72 గంటల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.