
చాలా మంది భార్యాభర్తలు కోరుకునేది ఒకేసారి ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తే ఆ కవలలతో ఇల్లు కళకళలాడాలని. ఒకేసారి ఇద్దరికి జన్మనిచ్చినప్పుడు కవలపిల్లలు అని అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా కవల పిల్లలు పుట్టడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి.
పురుషులలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే వీర్యకణాలు స్త్రీలలోని అండంతో కలిసినప్పుడు పునరుత్పత్తి జరుగుతుంది. అయితే, పలుసార్లు మహిళల్లో ఒకేసారి అండాశయం నుంచి రెండు అండాలు విడుదల అవుతాయి. ఇలా విడుదలైన రెండు అండాలకు రెండు వీర్యకణాలు కలిస్తే రెండూ ఫలదీకరణాలు జరుగుతాయి. ఇలా ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడతారు. ఈ కవల పిల్లలు చూడడానికి ఒకేలా ఉండకపోవచ్చు. అదే ఒక అండం స్పెర్మ్‌తో కలిసి ఫలదీకరణాలు జరిగిన తర్వాత రెండుగా విడిపోతే.. పుట్టే పిల్లలు ఒకేలా ఉంటారు.
మొదటి డెలివరీలో కవలలు జన్మిస్తే.. రెండో డెలివరీలో కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరికి ఈ అవకాశం ఉందట.
కవలలకు జన్మనివ్వడంలో జీన్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వంశంలో ఇంతకు ముందు ఎవరికైన కవల పిల్లలు పుట్టి ఉంటే.. మీకు కూడా అలా కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇలా ‘ట్విన్స్ హిస్టరీ’ ఉన్న మహిళలు.. 30 ఏళ్ల వయసు దాటాక గర్భం ధరిస్తే కవలలు జన్మించే అవకాశం ఇంకాస్త పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక బరువు ఉండే స్త్రీలల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి రెండు అండాలు విడుదలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి, ఇలాంటి వారికి కూడా కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువ.
పిల్లలు పుట్టని మహిళలు IVF వైద్యం వల్ల కూడా గర్భం దాల్చవచ్చు. అయితే, ఈ వైద్యం వల్ల కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువ.










