కుర్చీ కోసం కుస్తీ: 2026 అసెంబ్లీ ఎన్నికలు అసలు కథ!
అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలు దేశ రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి
ప్రస్తుత రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా 2026లో జరుగుతున్న అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలనే మార్చేలా ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు వేర్వేరు సంస్కృతులు, వేర్వేరు ఆలోచనలు కలిగినవి అయినప్పటికీ, వీటి రిజల్ట్స్ మాత్రం రాబోయే జాతీయ రాజకీయాలను డిసైడ్ చేస్తాయి. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీలు తమదైన ప్లాన్లతో రెడీ అయ్యాయి. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది. అధికారంలో ఉన్న పార్టీలు తమ సీటు కాపాడుకోవాలని చూస్తుంటే, ప్రతిపక్షాలు ఎలాగైనా గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల రిజల్ట్స్ భవిష్యత్తులో దేశం ఏ దిశగా వెళ్తుందో చెప్పేలా ఉన్నాయి. ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలుసుకోవడానికి జరుగుతున్న సర్వేలు ఇప్పటికే రాజకీయ వేడిని పెంచేశాయి.
తమిళనాడు 2026 ఎన్నికల పోరు..
తమిళనాడులో 2026 ఎన్నికలు ఒక కొత్త అధ్యాయంలా మారాయి. ఏప్రిల్ 23న జరగబోయే ఈ పోరులో అధికార డీఎంకే కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి మధ్య పోటీ చాలా టఫ్ గా ఉంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలే ఏలుతున్న తమిళనాడులో, ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో అన్నది ఉత్కంఠగా మారింది. డీఎంకే తాము ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ జర్నీ, మహిళలకు ఇచ్చే నెలవారీ డబ్బుల వంటి పథకాలపై ఆశలు పెట్టుకుంది. అన్నాడీఎంకే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత తమకు ప్లస్ అవుతుందని నమ్ముతోంది. సర్వేలు చూస్తుంటే ఈ రెండు కూటముల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఏ పార్టీని కూడా తక్కువ అంచనా వేయలేమని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ కూడా అన్నాడీఎంకేతో కలిసి సిటీల్లో, యువతలో తమ పట్టు పెంచుకోవాలని చూస్తోంది. వీటన్నిటి మధ్యలో హీరో విజయ్ పెట్టిన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగడం పెద్ద హైలైట్ అయింది. విజయ్ ఎవరి ఓట్లు చీలుస్తాడో అన్నది ఇప్పుడు మెయిన్ పాయింట్.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల హీట్…
పశ్చిమ బెంగాల్లో కూడా 2026 ఎన్నికలు చాలా కీలకం. అక్కడ ఉన్న 294 సీట్లకు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ తన పట్టు నిలబెట్టుకోవాలని చూస్తుంటే, బీజేపీ ఈసారి ఎలాగైనా అక్కడ జెండా పాతాలని ప్లాన్ చేస్తోంది. టీఎంసీ, బీజేపీ మధ్య పోరు మామూలుగా లేదు. అవినీతి, గొడవలు, నిరుద్యోగం వంటి విషయాల మీద ప్రచారం జోరుగా సాగుతోంది. మమత తన పథకాలను నమ్ముకోగా, బీజేపీ మాత్రం మహిళల రక్షణ కోసం ‘దుర్గా సురక్ష దళం’, ఉద్యోగులకు పెన్షన్ పెంపు వంటి హామీలతో ముందుకెళ్తోంది. మే 4న వచ్చే రిజల్ట్స్ బెంగాల్ తలరాతను ఎలా మారుస్తాయో చూడాలి.
అస్సాం ఎన్నికల ఫలితాల ప్రభావం..
అస్సాంలో అయితే ఇప్పటికే ఏప్రిల్ 9న ఎన్నికలు అయిపోయాయి. అక్కడ 126 సీట్లకు జరిగిన పోలింగ్లో 86 శాతం ఓటింగ్ జరగడం విశేషం. ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో ఓటేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తాము చేసిన డెవలప్మెంట్ పనులు మళ్ళీ తమనే గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ కూడా గట్టిగానే ఫైట్ ఇచ్చారు. కానీ బీజేపీకి ఉన్న గ్రౌండ్ లెవల్ నెట్వర్క్ ఆ పార్టీకి ప్లస్ అయ్యేలా ఉంది. మహిళలు, యువత ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. అస్సాం రిజల్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పవర్ ను మరింత పెంచేలా ఉంది.
మహిళా రిజర్వేషన్ మరియు రాజకీయ సమీకరణాలు
మరోవైపు, లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు మెజారిటీ లేక వీగిపోవడం బీజేపీకి కొంత ఇబ్బందిగా మారింది. ఈ బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం ప్రతిపక్షాలకు నచ్చలేదు. దీనివల్ల మహిళల ఓట్లు తగ్గుతాయేమో అన్న భయం బీజేపీలో ఉంది. అందుకే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం బీజేపీకి చాలా అవసరం. ప్రస్తుతం ఎన్నికల్లో అన్ని పార్టీలు ‘ఉచిత పథకాల’ మీద పడ్డాయి. ఒకరిని మించి ఒకరు డబ్బులు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. మే 4న వచ్చే రిజల్ట్స్ కేవలం ఈ రాష్ట్రాలకే కాదు, దేశం మొత్తానికి ఒక కొత్త పొలిటికల్ సిగ్నల్ ఇవ్వబోతున్నాయి. జాతీయ ఇష్యూస్ గెలుస్తాయా లేక లోకల్ పార్టీలు గెలుస్తాయా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.
మరిన్ని వార్తలు:
ఏపీలో కాంగ్రెస్ ఒక్క సీటుతోనైనా అసెంబ్లీకి వెళ్తుందా..?
దీదీ కోటలో మోదీ వ్యూహం: బెంగాల్ ఓటరు నాడి ఎటువైపు?
బీహార్ ఎన్నికలుపైనే దేశం చూపు..!










